BigTV English

Karimnagar: బీజేపీ, కాంగ్రెస్ ఫెవికాల్ బంధం

Karimnagar: బీజేపీ, కాంగ్రెస్ ఫెవికాల్ బంధం

Karimnagar: నాకు నువ్వు నీకు నేను ఒకరికొకరం నువ్వూనేను అని ఆ రెండు జాతీయపార్టీల నేతలిప్పుడు కరీంనగర్ జిల్లాలో చెట్టపట్టాలు వేసుకుంటుండటం చర్చనీయాంశంగా మారింది.సైద్ధాంతికంగా ఉప్పునిప్పులా విమర్శలు చేసుకునే కాంగ్రెస్, బీజేపీ నేతలు తెలంగాణా రాష్ట్రంలో.. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రాణస్నేహితుల్లా విహరిస్తున్న తీరు ముచ్చటగానే ఉన్నప్పటికీ అది పలు ముచ్చట్లకు తావిస్తోంది. ఇంతకీ జిల్లాల్లో నడుస్తున్న ఆ 2025 ఏక్ లవ్ స్టోరీ ఏంటో మీరూ చూడండి
నేతల కొత్త బంధం


అభివృద్ధి పేరిట కలిసిపోతున్న బీజేపీ, కాంగ్రెస్ నేతలు

కరీంనగర్ జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో ఈమధ్య జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చూస్తున్నప్పుడు బీజేపీ, కాంగ్రెస్ కలిసిపోయాయా?.. రెండు జాతీయపార్టీలొకటై కొత్త చరిత్ర సృష్టించబోతున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఢీల్లీలో ఢీ అంటే ఢీ అంటూ ఆడిపోసుకుంటూ కోడిగుడ్డు మీద కూడా ఈకలు పీకే పార్టీలు.. గల్లీ కొచ్చేసరికి అభివృద్ధి పేరిట ఒక్కటిగా కలిసిపోతుండటం స్వాగతించదగ్గ పరిణామమే. అయితే, దాని వెనుక కారణాలేంటన్న ముచ్చట్లకూ తెరలేగుస్తోంది. ఇద్దరు సన్నిహితుల మధ్య ఎలాగైతే గిల్లికజ్జాలుంటాయో.. ఆ తరహా కలహాలు, చిర్రుబుర్రులు కూడా పైపైకి కనిపించినా… రెండుపార్టీల నేతల రాజకీయ సంసారంలో మాత్రం ఫెవికాల్ బంధం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.


బండి సంజయ్ ప్రోగ్రాంకి టైమ్‌కి రాలేకపోయిన పొన్నం

వ్యక్తిగతంగా కేంద్ర, రాష్ట్రమంత్రుల మధ్య కొన్ని ఇగో ప్రాబ్లమ్స్ మాత్రమే ఆధిపత్యపోరులో భాగంగా కనిపిస్తుండగా.. మిగిలిన అభివృద్ధి పనుల సమయంలో మాత్రం అంతా ఒక్క తాను ముక్కలేనన్నట్టుగా కనిపిస్తున్న కొత్త పొలిటికల్ సర్కస్ రకరకాల గుసగుసలకు తావిస్తోంది. చిగురుమామిడి మండలం ముదిమాణిక్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రారంభించాల్సిన రోడ్ల అభివృద్ధి కార్యక్రమానికి రావల్సిన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ టైమ్‌కి రాలేకపోయారు. అదే హుస్నాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతు మహోత్సవం కార్యక్రమానికి బండి సంజయ్ హాజరు కాకపోవడంతో.. ఇద్దరు మంత్రుల మధ్య ఆధిపత్యపోరు చర్చనీయాంశంగా మారింది.

కరీంనగర్- తిరుపతి రైలు ప్రారంభంపై పొన్నం ప్రెస్ నోట్

తాజాగా పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తితో కరీంనగర్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైలు ప్రారంభం అయిందని మంత్రి పేషి నుంచి ప్రెస్‌నోట్ రిలీజ్ అయింది. దానికి కౌంటర్‌గా ఆ క్రెడిట్ ఎవరిదో మీడియా మిత్రులే గుర్తించాలంటూ కేంద్రమంత్రి బండి సంజయ్ నుంచీ ఓ చిన్న నోటి మాటే తప్ప.. కనీసం ప్రెస్ నోట్ కూడా విడుదల కాకపోవడంతో.. వారిద్దరి మధ్యా వ్యక్తిగతంగా ఆధిపత్యపోరు కొంతవరకూ ఉన్నా సర్దుకుపోయే వైఖరి కూడా కనిపించడం మళ్లీ చర్చనీయాంశంగా మారింది.

బీజేపీ విమర్శలకు కౌంటర్ ఇవ్వని కాంగ్రెస్ నేతలు

ఈమధ్య కేంద్రమంత్రి బండి సంజయ్, రాష్ట్రమంత్రి పొన్నం మధ్య తలెత్తిన చిన్న చిన్న గిల్లికజ్జాలు మినహా.. ఇక మిగిలినదంతా ఏక్ దూజే కేలియే తరహాలోనే ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ నేతల ప్రేమప్రయాణం కొనసాగుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోడీ మధ్య అండర్ స్టాండింగ్ ఎఫెక్టో.. లేక పోతే ఒకే జిల్లా నేతలుగా ..నీదీ బరంపురం, నాదీ బరంపురం, నీకు నేను, నాకు నువ్వనే భావనోగానీ.. మిగిలిన ఎక్కడా కూడా బీజేపీ నేతలు ముఖ్యమంత్రిపైనా, కాంగ్రెస్ ప్రభుత్వంపైనా చేస్తున్న విమర్శలకు కాంగ్రెస్ కీలకనేతల నుంచి కూడా కౌంటర్ అటాక్‌లు వినిపించడం లేదు.

ఖట్టర్ వచ్చినప్పుడు రెండు పార్టీల నేతల చెట్టపట్టాల్

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో గతంలో కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వచ్చినప్పుడు కేంద్రమంత్రితో పాటు.. రాష్ట్రమంత్రులంతా చట్టాపట్టాలేసుకోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈమధ్య చొప్పదండి, మానకొండూరు ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ కూడా.. కేంద్రమంత్రి బండి సంజయ్ తో వాళ్ల పార్టీకి చెందిన జిల్లా మంత్రులతో కంటే సఖ్యంగా ఉంటున్నారన్న టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో, గతంలో ఉప్పునిప్పులా వ్యవహరించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, నిజామాబాద్ ఎంపీ అరవింద్ మధ్య కూడా ఇలాంటి బంధమే పలు సమావేశాల్లో కనిపిస్తుండటం కొత్త చర్చకు తెరలేపుతోంది.

Also Read: అన్న, చెల్లెలు.. మధ్యలో బాబాయ్

ఆదిలాబాద్ బీజేపీ ఎంపిపై వినిపించని విమర్శలు

దేశవ్యాప్తంగా హమ్ ఆప్కే హై కౌన్ అని ప్రశ్నించుకుంటున్న రెండు పార్టీల వైఖరి… రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకొచ్చేసరికీ మైనే ప్యార్ కియా అన్నట్టుగా సాగుతుండటమే చర్చలకు తావిస్తోంది. ఈ పరిస్థితి ఒక కరీంనగర్ జిల్లాకు మాత్రమే పరిమితమై కనిపించడం లేదు. ఆదిలాబాద్ లోనూ బీజేపీ ఎంపీ ఉండగా.. అక్కడా ఎలాంటి కౌంటర్ ఎటాక్ కాంగ్రెస్ నుంచి లేదు. అలాగే, నిజామాబాద్, మెదక్, మల్కాజీగిరి, సికింద్రాబాద్, చేవెళ్ల, మహబూబ్ నగర్ ఇలా ఎక్కడ చూసినా బీజేపీ ఎంపీలకు, నేతలకు కాంగ్రెస్ నుంచి కౌంటర్ అటాక్ అంతగా లేకపోవడం.. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో మునుపెన్నడూ లేనంత చురుకుగా, సంతోషంగా పాల్గొంటుండటం చర్చనీయాంశంగా మారింది.

Story By Apparao, Bigtv

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×