CM Chandrababu: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో క్వాంటం వ్యాలీ భవనాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ప్రపంచంలోనే అత్యాధునిక క్వాంటమ్ హబ్‌ల సరసన అమరావతిని నిలపాలనే సంకల్పంతో సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్టును తలపెట్టారు. దీని ద్వారా దేశంలో క్వాంటమ్ విప్లవానికి నాయకత్వం వహించే అవకాశం ఏపీకి రానుంది. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్‌తో కలిసి.. తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెం గ్రామంలో క్వాంటమ్ వ్యాలీ భవన నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. దీని కోసం ప్రభుత్వం 50 ఎకరాలు కేటాయించింది. భారతదేశపు తొలి 133 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్‌ను అమరావతికి తీసుకురావడానికి ఐబీఎం, టీసీఎస్, ఎల్‌అండ్‌టీ సంస్థలు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్స్, క్వాంటమ్ సెన్సర్స్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ, డిఫెన్స్, హెల్త్‌కేర్, ఫైనాన్స్ లాంటి కీలక రంగాల్లో పరిశోధనలు, ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధికి ఇక్కడ చోటు దక్కనుంది. ఆగస్టు నాటికి క్వాంటమ్ వ్యాలీ బిల్డింగ్ రెడీ చేసి, డిసెంబరు కల్లా క్వాంటమ్ కంప్యూటర్‌ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుతో ప్రపంచ స్థాయి పరిశోధన కేంద్రాలు, గ్లోబల్ టెక్నాలజీ సంస్థల పెట్టుబడులు, స్టార్టప్ ఎకో సిస్టం విస్తరణ, లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణ, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని సీఎం ఆశిస్తున్నారు. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటం సైన్స్ అండ్ టెక్నాలజీ, నేషనల్ క్వాంటం మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా అమరావతి క్వాంటం వ్యాలీ హ్యాకథాన్ 2025లో విజేతలుగా నిలిచిన బృందాలకు సర్టిఫికెట్లతో సహా నగదు బహుమతుల చెక్కులను చంద్రబాబు అందించారు.
కర్నూలు జిల్లా కలుగట్లలో ఈవారం మీ భూమి- మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను అందించారు. రైతుల జీవనాధారమైన భూమికి ఎవరి కారణంగా ఇబ్బందులు రాకుండా, పూర్తి భద్రతతో పాసుపుస్తకాలు తయారు చేశామని తెలిపారు. ట్యాంపరింగ్‌కు వీల్లేకుండా రాజముద్రతో అందిస్తున్నామని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. వివాదాల్లేని భూ సరిహద్దులు, ప్రతి ఎకరాకూ సాగునీరు, లాభదాయకమైన సేద్యం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. రెవెన్యూ శాఖలో గత ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని చక్కదిద్దే చర్యల్లో భాగంగా.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేశామని, మరెన్నో సంస్కరణలు తెచ్చామని తెలిపారు సీఎం చంద్రబాబు. ప్రధాని మోడీ, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌తో కలిసి సూపర్ సిక్స్ హామీలను సూపర్ హిట్ చేశామన్నారు. రాయలసీమ సమగ్ర అభివృద్ధికి తమ ప్రభుత్వం నీటిపారుదల, పారిశ్రామిక, రవాణా ప్రాజెక్టులను చేపడుతోందని తెలిపారు.
కార్మిక శాఖ సంబంధిత అంశాలపై ఈ వారం ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పరిశ్రమలకు అవసరమైన ఆధునిక నైపుణ్యాలను కార్మికుల్లో పెంచే అంశంపై దిశానిర్దేశం చేశారు. జిల్లాల వారీగా, రంగాల వారీగా కార్మికుల డేటా బేస్‌కు రూపకల్పన చేయాలని సూచించారు. గిగ్ వర్కర్లు, నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికుల ఆదాయాలు పెరిగేలా కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆధునిక నైపుణ్య శిక్షణ ద్వారా ఏపీలోని కార్మికులు విదేశాలకు వెళ్లి ఆదాయాలు ఆర్జించేలా చూడాలని స్పష్టం చేశారు.
నీరు-ప్రగతి-జలహారతి సాగునీటి సంఘాల భాగస్వామ్యం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఈ వారం పాల్గొన్నారు. వ్యవసాయంలో ఉపయోగించే డ్రోన్లు, రిమోట్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ చేసే వ్యవసాయ మోటార్లను పరిశీలించారు. నీటి వినియోగదారుల సంఘాలను ఉద్దేశించి కీలక విషయాలు వివరించారు.
హిందూ దేవాలయాలు, తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన అన్యాయంపై సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడకంపై సిట్ ఇచ్చిన వివరాలపై.. ఈ వారం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో కలిసి.. సీఎం చంద్రబాబు క్యాంపు కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమలతో పాటు హిందూ ఆలయాలపై జరిగిన దాడుల గురించి ప్రస్తావిస్తూ.. వారి తీరుపై విరుచుకుపడ్డారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి.. కేవలం డబ్బు విషయమే కాదని, భక్తుల మనోభావాలు, హిందువుల నమ్మకంపై దాడి అని విమర్శించారు. తప్పులను కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ నేతలు ఎదురుదాడి చేస్తూ, ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. దేవుడితో పెట్టుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, ఇది భగవంతుడికి చేసిన మహాపాపమని హెచ్చరించారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన ఈ సున్నితమైన అంశంపై.. తప్పు చేసినవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
డ్వాక్రా మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు బ్రాండింగ్ కల్పించే అంశంపై ఈ వారం సీఎం చంద్రబాబు సమీక్షించారు. డ్వాక్రా ఉత్పత్తులకు బ్రాండింగ్ కోసం స్వయం అనే పేరుని సీఎం చంద్రబాబు ఎంపిక చేశారు. అధికారులు ప్రతిపాదించిన వివిధ పేర్లు, లోగోలను పరిశీలించి, ప్రజాభిప్రాయం మేరకు స్వయం పేరుని ఖరారు చేశారు. డ్వాక్రా మహిళలు అద్భుతమైన ఉత్పత్తులు తయారు చేస్తున్నారని, వారికి మంచి మార్కెటింగ్ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. స్థానిక మార్కెట్లే కాకుండా జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లను కూడా ఆకర్షించేలా, బ్రాండింగ్ ఆకర్షణీయంగా ఉండాలన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వారం బీసీ సంక్షేమ శాఖపైనా సమీక్ష నిర్వహించారు. హాస్టళ్లలో శానిటేషన్, ఆహార పదార్థాల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని.. సీఎం ఆదేశించారు. రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్ల నిర్మాణంతో పాటు సురక్షిత తాగు నీటి కోసం ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 814 హాస్టళ్లలో 17 కోట్ల వ్యయంతో మార్చి లోగా ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. 60 కోట్ల సాస్కి నిధులతో.. రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్ల నిర్మాణం చేపట్టాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ పురోగతిపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కేంద్ర స్టీల్ సెక్రటరీ, వైజాగ్ స్టీల్ ప్లాంట్ సీఎండీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. విశాఖ ఉక్కు ఉత్పత్తిని పెంచేందుకు సహకరించిన యాజమాన్యం, కార్మికులు, ప్రభుత్వ అధికారులకు సీఎం అభినందనలు తెలిపారు. 2024-25 సెకండ్ క్వార్టర్‌లో కేవలం రోజుకు 9,215 టన్నులు మాత్రమే ఉత్పత్తి చేసిన విశాఖ ఉక్కు.. మూడు బ్లాస్ట్ ఫర్నేస్‌లు పనిచేస్తుండడంతో హాట్ మెటల్ ప్రొడక్షన్‌లో రోజుకు 19,401 టన్నుల ఉక్కు ఉత్పత్తికి చేరుకుంది. ఆర్థికంగా నష్టాల నుంచి లాభాల వైపు విశాఖ స్టీల్ ఉత్పత్తి సాధిస్తోంది. అన్ని విభాగాల్లో.. కొత్త విధానాలు ప్రవేశపెట్టి ప్లాంట్‌ని మరింత బలోపేతం చేయాలని సీఎం సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి విశాఖ ఉక్కుకు పూర్తి స్థాయి సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు.
ఏపీని అతిపెద్ద ప్రకృతి వ్యవసాయ క్షేత్రంగా మార్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18 లక్షల మంది రైతులు, 20 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేసేందుకు ముందుకు వచ్చారన్నారు. దీనిని సమర్థవంతగా అమలు చేస్తూ 2030 నాటికి 40 లక్షల మంది రైతులు, 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి సాగు చేపట్టేలా చూడాలని స్పష్టం చేశారు. వ్యవసాయం, అనుబంధ శాఖలపై అధికారులతో ఈవారం సమీక్ష నిర్వహించారు. రసాయన ఎరువుల వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలని, దాంతో.. రైతులకు పెట్టుబడి వ్యయం తగ్గి, పంట ఉత్పత్తులకు అధిక ధర లభిస్తుందన్నారు. ప్రకృతి సాగు ఉత్పత్తుల నాణ్యత తెలిసేలా సర్టిఫికేషన్, ట్రేసబిలిటీ సదుపాయం కల్పించాలన్నారు. సుభాష్ పాలేకర్‌తో రాష్ట్రమంతటా ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ తరగతులు నిర్వహిస్తామని చెప్పారు. ఏఐ ఆధారిత క్రాప్ అడ్వయిజరీ భారత్ విస్తార్ వంటి వాటిని రాష్ట్రంలోనూ వినియోగించుకోవాలన్నారు. అమెరికా, ఈయూతో ట్రేడ్ డీల్ కుదిరిన క్రమంలో.. ఏపీ నుంచి రొయ్యలు, ఎండుమిర్చి, మామిడి, వరి, ప్రాసెస్డ్ ఫుడ్ ఎగుమతులు పెంచుకునేందుకు మరింత అవకాశం కలిగిందని అధికారులు తెలిపారు. అయితే నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించేలా చూడాలని సీఎం అన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు సంబంధించి కేంద్ర పాలసీలకు అనుగుణంగా రాష్ట్ర పాలసీలు ఉండాలని చెప్పారు. అదేవిధంగా.. డిజి రైతు బజార్ యాప్‌ను సీఎం ఆవిష్కరించారు.
తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంపై.. ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. అసలు సూత్రధారులను తేల్చేందుకు విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. క్యాబినెట్ భేటీలో సిట్ రిపోర్ట్‌పైనా చర్చ జరిగింది. ఆ నివేదికలో పాత్రధారులపైనే చర్యలకు సిట్ సిఫార్సు చేసిందని మంత్రివర్గం అభిప్రాయపడింది.
సిట్ విచారణ, ఛార్జ్‌షీట్, ప్రభుత్వానికి సమర్పించిన అంశాల్లో తేడాలను మంత్రివర్గం గుర్తించింది. ఈ మూడింటిపై రీసెర్చ్ చేసి, వాస్తవాల సమర్పణకు కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. విచారణలో ఉన్న వాస్తవాలు ఛార్జ్‌షీట్‌లో ఎందుకు నమోదు చేయలేదనే దానిపైనా చర్చించారు. తప్పు చేసిన వారికి శిక్షపడేలా చర్యలు తీసుకోనున్నారు.
Also Read: అమీన్‌పూర్‌లో హైడ్రా వేట.. రూ. 7 కోట్ల విలువైన భూమి స్వాధీనం!
Story by: Anup, Big Tv