Anakapalli RTC: ఇది అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ పరిస్థితి. బస్సులు రావాల్సిన ప్రాంగణం.. ఇప్పుడు నీటి మడుగుగా మారింది. మూడు రోజుల వర్షం కురిస్తే చాలు.. కాంప్లెక్స్ రూపమే మారిపోతోంది. అడుగు వేస్తే నీరు అడుగు తీస్తే బురద.. ఇదీ అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ దుస్థితి. బస్సులు ఆగే చోటే నీరు నిలిచిపోవడంతో ప్రయాణికుల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. చేతిలో లగేజీ పక్కన పిల్లలు వయసు మీద పడిన వారు.. అందరికీ ఈ నీటి తిప్పలు తప్పడం లేదు.
ఒకవైపు స్వచ్ఛ ఆంధ్ర.. స్వచ్ఛ ఆర్టీసీ అంటూ పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాలు.. మరోవైపు ఆర్టీసీ కాంప్లెక్స్‌లోనే నిలిచిన వర్షపు నీరు. మాటలు బాగానే ఉన్నాయి.. కానీ సమస్య మాత్రం అక్కడే ఉంది అంటున్నారు ప్రయాణికులు. ఏళ్లుగా వెంటాడుతున్న సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు.
జిల్లా కేంద్రానికి కీలకమైన అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్.. ప్రతి వర్షాకాలంలో ప్రయాణికులకు చుక్కలు చూపిస్తోంది. సమస్య పాతదే.. వర్షం కూడా కొత్తదేం కాదు.. కానీ పరిష్కారం మాత్రం ఇంకా కనిపించడం లేదు. మరి ఇప్పటికైనా అధికారులు ప్రయాణికుల సమస్యకు ఫుల్ స్టాప్ పెడతారా లేదా అనేది చూడాలి.