Telugu Nadu: కేంద్ర క్యాబినెట్ ఎప్పుడైతే కేరళ పేరుని.. కేరళంగా మార్చేందుకు ఆమోదం తెలిపిందో.. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా రాష్ట్రాల పేర్ల మార్పుపై చర్చ మొదలైంది. ఈ క్రమంలోనే.. ఆంధ్రప్రదేశ్ పేరు మార్పు అంశంపైనా ప్రముఖంగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ప్రవచనకర్త, పద్మశ్రీ గరికపాటి నరసింహారావు లాంటి వారు ఆంధ్రప్రదేశ్ పేరుని.. తెలుగునాడుగా మార్చాలనే ప్రస్తావన తేవడంతో.. ఈ చర్చ సాంస్కృతికంగానూ, రాజకీయంగానూ సెగ పుట్టిస్తోంది. మరి నిజంగానే ఆంధ్రప్రదేశ్ పేరు మార్చాల్సిన అవసరముందా? తమిళనాడు మాదిరిగా తెలుగునాడు అనే పేరు వెనుక ఉన్న లాజిక్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ పేరు మార్చాలన్న గరికపాటి నరసింహారావు వాదనపైనే.. ఇప్పడు ఏపీ మొత్తం డిబేట్ నడుస్తోంది. ఏపీని తెలుగునాడుగా మార్చాలని, ఇందుకోసం అప్పట్లో ఎన్టీఆర్ ఎంతో ప్రయత్నించారని చెప్పారు గరికపాటి. ఆంధ్రప్రదేశ్ అనేది తెలుగు పదం కాదని, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదనం లేదని అన్నారు. రాష్ట్రం పేరు విషయంలో కేరళ వాళ్లకున్న పట్టుదల మనకు లేదని చెప్పడం చర్చకు దారితీసింది.
అయితే.. గరికపాటి వ్యాఖ్యలపై భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు కాదా? రామాయణ కాలం నుంచి ఆంధ్ర అనే పదం ఉందన్నారు. గరికపాటి వ్యాఖ్యలపై ఎవరి వాదన, వివరణ ఎలా ఉన్నా.. ఆంధ్రప్రదేశ్ అనే పేరు మార్చాలనే డిమాండ్ సోషల్ మీడియాలోనూ కనిపిస్తోంది. కేరళ పేరుని కేరళంగా మార్చిన తర్వాత.. సోషల్ మీడియాలో ఏపీ ప్రజల నుంచి ఇలాంటి వాదన మొదలైంది. వాస్తవానికి.. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైంది. అయితే ఆంధ్ర అనే పదం ఒక జాతిని, కోస్తాంధ్ర లాంటి నిర్దిష్ట ప్రాంతాన్ని సూచిస్తుందనే భావన చాలా కాలంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ అనే పేరులో భాష కంటే ప్రాంతం ఎక్కువగా ధ్వనిస్తుంది. తమిళనాడులో భాష ఉన్నట్లుగా మన దగ్గర భాషా గుర్తింపు పేరులో లేదనేదే అసలైన వాదన. అందువల్ల.. తెలుగునాడు అనే ప్రతిపాదనపై ఇప్పుడు డిస్కషన్ మొదలైంది. అది కేవలం ఓ ప్రాంతానికో, కులానికో సంబంధించింది కాదు. పూర్తిగా.. భాషకు, అస్తిత్వానికి సంబంధించింది. తెలుగు అనేది అందరిదీ. రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాలను కలిపి ఉంచే ఏకైక సూత్రం తెలుగు భాష. అందువల్ల.. ఆంధ్రప్రదేశ్ పేరుని తెలుగునాడుగా మారిస్తే.. సమైక్య భావన వస్తుందనే చర్చ జరుగుతోంది.
సాంస్కృతిక మూలాలపరంగా చూస్తే.. ప్రాచీన సాహిత్యంలో.. తెలుగు పదానికి ఉన్న ప్రాముఖ్యత ఎక్కువ. ఆంధ్ర అనేది సంస్కృత పదం కాగా, తెలుగు అనేది అచ్చమైన దేశీ పదం. రాష్ట్రంలోని ప్రతి పౌరుడు.. తనని తాను తెలుగువాడని చెప్పుకునేందుకు గర్వపడతాడు. ఆంధ్రుడు అనే పదం కంటే తెలుగువాడు అన్నది. ఎక్కువ కలుపుగోలుతనంతో ఉంటుంది. పైగా.. ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాషకు గుర్తింపు ఉంది. రాష్ట్రం పేరులో ఆ భాషా ముద్ర ఉండటం వల్ల.. ఆంధ్రులకు ప్రత్యేక అస్తిత్వం వస్తుంది. కేరళ తన మూలాలను వెతుక్కుంటూ.. కేరళంగా పేరు మార్చుకున్నప్పుడు, తెలుగు వారు కూడా తమ అస్తిత్వం కోసం తెలుగునాడు అని పిలుచుకోవడంలో ఏమాత్రం తప్పులేదనేది భాషా ప్రేమికుల వాదన. అయితే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, రాజధాని సమస్యల నేపథ్యంలో ఇది సరైన సమయమా? కాదా? అనేది కూడా చర్చకు వస్తోంది. అయినా పేరులో ఏముంది? అనే వాళ్లున్నా ఆ పేరులోనే మా ఆత్మగౌరవం ఉందని చెప్పే సంస్కృతి తెలుగు ప్రజలది. ఏపీ పేరు మార్పుపై గరికపాటి నరసింహారావు తెచ్చిన ప్రస్తావన.. కేవలం చర్చగా మిగిలిపోతుందో.. లేక భవిష్యత్తులో ఉద్యమంగా మారుతుందోననే డిబేట్ కూడా మొదలైంది.
Also Read: Free Bus Scheme: దివ్యాంగులకు గుడ్ న్యూస్.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
ఆంధ్రప్రదేశ్ పేరుని తెలుగునాడుగా మార్చాలనే ప్రతిపాదన.. 3వ ప్రపంచ తెలుగు మహాసభ నుంచి వచ్చింది. తమిళం మాట్లాడే రాష్ట్రాన్ని తమిళనాడుగా ఏర్పాటు చేశారు కాబట్టి.. తెలుగు మాట్లాడేవారి రాష్ట్రమైన ఏపీని కూడా తెలుగునాడుగా మార్చాలంటున్నారు. అయితే.. రాష్ట్రం పేరు మార్పు అనేది.. కేవలం అక్షరాల మార్పు కాదు. ఒక ప్రాంత ప్రజల ఆత్మగౌరవం, సాంస్కృతిక వారసత్వానికి సంబంధించిన అంశం. అందువల్లే.. తెలుగు భాష పేరు మన రాష్ట్రం పేరులోనూ ఉండాలనే చర్చ మొదలైంది. ఎందుకంటే.. ఈ దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు పునాది వేసింది తెలుగువారే. పొట్టి శ్రీరాములు గారి ప్రాణత్యాగం ఫలితంగా.. 1953లో ఆంధ్ర రాష్ట్రం, 1956లో ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడ్డాయ్. అప్పుడే.. కొందరు మేధావులు తెలుగునాడు పేరుని సూచించినా, ఆనాడు ఆంధ్ర అనే పదానికే మొగ్గు చూపారు. 1969లో మద్రాసు రాష్ట్రం తమిళనాడుగా మారింది. ఇటీవలే.. ఒరిస్సా ఒడిశాగా, పాండిచ్చేరి పుదుచ్చేరిగా మారాయి. ఇప్పుడు కేరళని.. కేరళంగా మార్చేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ క్రమంలో.. తెలుగు అస్తిత్వం కోసం ఆంధ్రప్రదేశ్ పేరు మార్పు వాదన తెరమీదికొచ్చింది.
మలయాళంలో కేరళని.. కేరళం అని పిలుస్తారు. అందువల్ల.. అధికారికంగానూ అదే పేరు ఉండాలని వారు కోరుకున్నారు. అదే రీతిలో.. తెలుగు భాషాభిమానులు, భాషా కోవిదులు.. ఆంధ్రప్రదేశ్ కంటే తెలుగునాడు అనే పేరు మన మూలాలకు దగ్గరగా ఉంటాయని భావిస్తున్నారు. దక్షిణాదిలో 3 రాష్ట్రాలు తమ భాషా గుర్తింపుని.. పేర్లలో నిలుపుకున్నాయ్. ఆంధ్రప్రదేశ్ విషయంలోనూ అలాంటి మార్పు కావాలనే డిమాండ్ ఇప్పుడు బలపడుతోంది. అయినా.. రాష్ట్రం పేరు మార్పుపై చర్చ నిన్న,మొన్నటిదేమీ కాదు. చాలా ఏళ్లుగా.. ఆంధ్రప్రదేశ్ అనేది ఒక కృత్రిమమైన పేరు అని, అది కేవలం పాలనా సౌలభ్యం కోసం పెట్టిందే తప్ప.. సాంస్కృతికమైనది కాదనే వాదనలు ఉన్నాయి. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత.. నవ్యాంధ్రకు కొత్త పేరు పెట్టాలనే ప్రతిపాదనలు వచ్చాయి. అయితే.. ఆంధ్రప్రదేశ్ అనే పేరుని కొనసాగించడం వల్ల పాత చారిత్రక గుర్తింపు ఉంటుందని అప్పట్లో భావించారు. ఎందుకంటే.. శాతవాహనులను ఆంధ్రులని పిలిచేవారని చరిత్ర చెబుతోంది. ఆంధ్ర అనే పదానికి దాదాపు 2 వేల ఏళ్ల చరిత్ర ఉంది. అందువల్ల.. దీనిని మార్చడమంటే.. చరిత్రని చెరిపేయడమేననేది ఇంకొందరి వాదన. కానీ, కేరళ పేరు మార్పు నిర్ణయంతో.. మరోసారి ఏపీ పేరు మార్చాలనే చర్చ తెరపైకి వచ్చింది. భాషా ప్రయుక్త రాష్ట్రంలో.. భాష పేరే ఉండాలనే వాదన వినిపిస్తోంది.
Also Read: Crime drama OTT: 47 అవార్డులతో ప్రశంసలు… అప్పు ఇచ్చిన బ్యాంకుకే కన్నం… చూసే కొద్దీ చూడాలనిపించే మూవీ
తెలుగు అనేది కేవలం ఓ భాష కాదు. మన సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్ర, సాహిత్యం, కళలు, ఉనికికి ప్రతీక. మన మాతృభాష.. మన గౌరవం, ఐక్యతకు ఆధారం. ప్రతి తెలుగు వ్యక్తి.. తెలుగు భాష పరిరక్షణ, అభివృద్ధిని తమ వ్యక్తిగత బాధ్యతగా భావించాలని.. భాషా కోవిదులు, భాషా పండితులు చెబుతుంటారు. పొరుగు రాష్ట్రాలకు ఉన్న భాషాభిమానం మనకు కూడా ఉండాలంటారు. ఆంధ్రప్రదేశ్ పేరుని తెలుగునాడుగా మార్చాలనే ఆలోచన ఇప్పటిది కాదు. దీనికి దశాబ్దాల చరిత్ర ఉంది. 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు.. ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరం అనే నినాదాన్ని ఎత్తుకున్నారు. ఆయన హయాంలోనే.. రాష్ట్రాన్ని తెలుగునాడుగా మార్చాలనే బలమైన ప్రతిపాదన వచ్చింది. కానీ.. అప్పట్లో ఉన్న రాజకీయ పరిణామాలు, రాజ్యాంగపరమైన ఇబ్బందుల వల్ల.. అది కార్యరూపం దాల్చలేదు. అయితే.. ఇప్పుడు ఏపీకి తెలుగునాడు అనే పేరే అత్యంత సముచితం అనే వాదన బలపడుతోంది. పేరు మార్పు వల్ల స్టేట్ బ్రాండ్ ఇమేజ్ మారుతుందని, గ్లోబల్ స్థాయిలో తెలుగుకు కొత్త గుర్తింపు వస్తుందని ఇంకొందరు ఆశిస్తున్నారు. పేరు మార్పు వల్ల కలిగే పరిపాలనాపరమైన ఖర్చు, డాక్యుమెంట్ల మార్పు లాంటి ఇబ్బందుల కంటే.. అభివృద్ధి ముఖ్యం అని భావించే వారు కూడా ఉన్నారు.
ఒక రాష్ట్రం పేరు మార్చడమనేది.. రాజ్యాంగపరమైన ప్రక్రియ. రాష్ట్ర అసెంబ్లీలో పేరు మార్పుపై తీర్మానం చేసి కేంద్రానికి పంపాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం.. పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాలి. ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదముద్ర పడితే.. రాష్ట్రం పేరు అధికారికంగా మారుతుంది. ఆంధ్రప్రదేశ్ పేరు మార్పు అనేది కేవలం భావోద్వేగపూరితమైన అంశం ఒక్కటే కాదు. తెలుగు వారి అస్తిత్వానికి సంబంధించిన వ్యవహారం. ఒకవైపు పురాణ కాలం నాటి ఆంధ్ర పదాన్ని గౌరవించే వారు, మరోవైపు భాషా గుర్తింపు కోసం తెలుగునాడు కావాలనే వారి మధ్య జరుగుతున్న ఈ పోరు.. ఏపీ రాజకీయ, సాంస్కృతిక వర్గాల్లో కాక రేపుతోంది. ఏపీ ప్రభుత్వం ఈ విషయంలో ఎలా వ్యవహరిస్తుందనేది కూడా ఇప్పుడు ఆసక్తిగా మారింది.
Story by: anup
Also Read: Thriller movie OTT: మహిళలకు నరకం చూపించే వింత సైకో… సూదులు గుచ్చి వెర్రి వేషాలు… చూస్తే బుర్ర పాడే