AP Capital Amaravati: ఆంధ్రుల కలల రాజధాని అమరావతి పునరుజ్జీవానికి వేళైంది. సరికొత్తగా, సగర్వంగా నిలబడేందుకు సిద్ధమంటోంది. ఫ్యూచర్ విజన్ తో అజరామరంగా ఉండేలా ఊపిరి పోసుకుంటోంది. ఆగిపోయిన పనులు ప్రధాని చేతుల మీదుగా పునఃప్రారంభానికి సిద్ధమయ్యాయి. మే 2న అమరావతి తలెత్తుకునేలా ఇక నాన్ స్టాప్ గా పనులు జరగబోతున్నాయి. ప్రణాళికాబద్దంగా.. భవిష్యత్ అవసరాలు తీరేలా.. గ్రీన్ అండ్ బ్లూ కాన్సెప్ట్ తో, అంతా అడ్వాన్స్ డ్ టెక్నాలజీతో కథ మార్చబోతున్నారు.
ప్రధాని చేతుల మీదుగా అమరావతి రీ లాంఛ్
అవును ఆంధ్రుల కలల రాజధాని సరికొత్త ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసేందుకు సిద్ధమైంది. ఆగిన పనులకు ఊపిరి పోసేలా, ప్రధాని చేతుల మీదుగా పీపుల్స్ క్యాపిటల్ పనులు పునఃప్రారంభ ముహూర్తం ఖరారైంది. మే 2న అమరావతి పనులను రీలాంఛ్ చేయబోతున్నారు ప్రధాని. ఇక నాన్ స్టాప్ గా పనులు జరగబోతున్నాయి. అమరావతిని సగర్వంగా ప్రపంచం ముందు నిలబెట్టేలా కార్యాచరణ రెడీ అయింది. రాజధాని కథ మారబోతోంది.
ఏపీ తలరాతను మార్చేలా పీపుల్స్ క్యాపిటల్
సరికొత్త భవిష్యత్ ను సాక్షాత్కరించేలా అమరావతి ముందడుగు వేస్తోంది. ఇది పీపుల్స్ క్యాపిటల్. ఏపీ తలరాతను మార్చే రాజధాని. 8603 చదరపు కిలోమీటర్లు రాజధాని ప్రాంతం. ఇందులో 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని నగర నిర్మాణం, 16.9 చదరపు కిలోమీటర్ల పరిధిలో కోర్ క్యాపిటల్ ఉండబోతోంది. చేపట్టిన పనులు మూడేళ్లలో పూర్తి చేసేలా ప్రభుత్వం సంకల్పం తీసుకుంది. అందుకే ప్రధాని మోడీ చేతుల మీదుగా పునఃప్రారంభానికి సిద్ధమైంది.
34281 ఎకరాలు లాండ్ పూలింగ్
రైతులు స్వచ్ఛందంగా ప్రభుత్వానికి వేల ఎకరాలు ఇచ్చిన దేశంలోనే ఒకే ఒక ప్రాజెక్ట్ ఇది. 58 రోజుల్లో ల్యాండ్ పూలింగ్ ద్వారా సమీకరణ చేపట్టడం ఒక సక్సెస్ మోడల్. మొత్తం 34281 ఎకరాలు లాండ్ పూలింగ్ ద్వారా ఇచ్చారు. 4300 ఎకరాలు భూసేకరణ ద్వారా తీసుకున్నారు. మిగిలిన 15,167 ఎకరాలు ప్రభుత్వ, అటవీ భూములే. ప్రజల, ప్రభుత్వ భూమి కలిపి 54 వేల ఎకరాలు సేకరించారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా 29,881 మంది రైతులు స్వచ్ఛందంగా భూములు రాజధాని కోసం ఇచ్చారు. 2015 అక్టోబర్ 22న రాజధాని అమరావతికి ఉద్దండరాయునిపాలెంలో ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. ఆ తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం దీన్ని ఆపేయడంతో కథ మళ్లీ మొదటికే వచ్చినట్లయింది.
భవిష్యత్ అవసరాలకు తగ్గట్లుగా రాజధాని నిర్మాణం
ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ రాజధాని పనులు ఊపందుకున్నాయి. సరిగ్గా మూడేళ్లలో పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. హైదరాబాద్ విజన్ నే అమరావతికి అప్లై చేస్తున్నారు చంద్రబాబు. ఒక దశలో హైటెక్ సిటీ, సైబరాబాద్ ను విజన్ తో అభివృద్ధి చేయడంతో మంచి ఫలితం వచ్చింది. రాత్రికి రాత్రే అద్భుతాలు జరగవు కదా. ఇప్పుడు అమరావతి విషయంలోనూ అదే చెబుతున్నారు. అడ్వాన్స్ డ్ టెక్నాలజీ, భవిష్యత్ అవసరాలకు తగ్గట్లుగా రాజధానిని నిర్మిస్తే ఉపాధి, పెట్టుబడులు వాటంతట అవే వస్తాయన్న నమ్మకంతో ఉన్నారు.
బ్లూ అండ్ గ్రీన్ కాన్సెప్ట్‌తో ఆహ్లాదకరమైన వాతావరణం
విశాలమైన రోడ్లు, అండర్ గ్రౌండ్ పవర్ లైన్స్, నీటి వసతి, బ్లూ అండ్ గ్రీన్ కాన్సెప్ట్ తో ఆహ్లాదకరమైన, ప్రపంచ స్థాయి నగరంగా రాజధాని ప్రణాళిక గతంలోనే రెడీ అయింది. 131 కేంద్ర ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు రాజధాని ప్రాంతంలో 1277 ఎకరాలు ఇప్పటికే కేటాయించారు. అయితే గత ఐదేళ్లలో అమరావతి బ్రాండ్ దెబ్బతీసేలా వ్యవహారాలు జరగడంతో కొంత వరకు నష్టం ఏర్పడింది. పర్యావరణ విధ్వంసం, ఆహార భద్రతకు ముప్పు అని, వరద, భూకంపాల ఎఫెక్ట్ ఉంటుందన్న ప్రచారాలను తట్టుకుని ఇప్పుడు సగర్వంగా నిలబడుతోంది అమరావతి.
సంపద సృష్టికి కేంద్రంగా అమరావతి
అమరావతి లాంటి రాజధాని పూర్తయితే.. రాష్ట్రానికే పేరు, గుర్తింపు వస్తుంది. ఇదొక ఆర్థిక శక్తిగా మారి రాష్ట్రాన్ని నడిపిస్తుంది. ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్. సంపద సృష్టికి కేంద్రంగా అమరావతి ఉండబోతోందన్న నమ్మకంతో ప్రభుత్వం ఉంది. జంగిల్ క్లియరెన్స్ తో మొదలైన రెండోదశ పనులు ఊపందుకుంటున్నాయి. కేంద్రం హామీతో ప్రపంచ బ్యాంక్, ఎడిబి ద్వారా 15 వేల కోట్లు ఆర్థిక సాయం అందించింది. హడ్కో 11 వేల కోట్లు రుణం మంజూరు చేసింది. అమరావతికి 2245 కోట్ల రూపాయలతో 57 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ మంజూరైంది. రాజధానిలో రతన్ టాటా ఇన్నో వేషన్ హబ్, లా స్కూల్, XLRI వర్సిటీ, క్వాంటమ్ వ్యాలీ వంటివి రాబోతున్నాయి. అంతే కాదు.. అమరావతిని AI సిటీగా మార్చేందుకు అవసరమైన అన్ని ప్రణాళికలు వర్కవుట్ చేయబోతున్నారు. రాష్ట్ర ప్రజలు గర్వంగా చెప్పుకునేలా, ప్రపంచ స్థాయి నగరంగా రాజధాని అమరావతిని నిర్మిస్తామని కూటమి ప్రభుత్వం నమ్మకంతో ఉంది. అందులో తొలి అడుగు మే 2 నుంచి ప్రధాని మోడీ చేతుల మీదుగా పడబోతోంది. 2027 నాటికి కలల రాజధాని సాక్షాత్కరించేలా పనులు జరగబోతున్నాయి. అదే జరిగితే ఆంధ్రుల స్వప్నం ఫలించినట్లే.
చెదిరిన స్వప్నం సాకారమవుతోంది. భవిష్యత్ ఆశలకు ఊపిరిపోసేలా నిర్మాణాలు పునఃప్రారంభం కాబోతున్నాయి. అమరావతి 2.0 సరికొత్తగా రీ లాంఛ్ అవుతోంది. ప్రధాని మోడీ చేతుల మీదుగా పనులు తిరిగి మొదలు కాబోతున్నాయి. సరిగ్గా మూడంటే మూడేళ్లలో భవనాలు, రోడ్లు, డ్రైనేజీలు, మౌలిక వసతుల కల్పన, ఉపాధి కేంద్రంగా, పాలనా వ్యవహారాలు నడిచేలా కథ మారబోతోంది. ఆర్థికంగా సహకారం అందుతుండడంతో పనులు ఇక నాన్ స్టాప్ గా జరగబోతున్నాయి.
54 వేల ఎకరాల్లో అమరావతి నిర్మాణం
ఇప్పుడు ఏర్పాటవుతున్న రాజధాని.. ఏపీ మొత్తానికి ఆర్థికంగా ఆయువుపట్టుగా ఉండాలని భావించిన చంద్రబాబు.. దాదాపు 54 వేల ఎకరాల్లో అమరావతి నిర్మాణానికి ప్లాన్ చేశారు. భవిష్యత్ అవసరాల కోసం అదనపు భూసేకరణకూ నిర్ణయం తీసుకున్నారు. గవర్నమెంట్ సిటీ, న్యాయం, వైద్యం, టూరిజం, నాలెడ్జ్, ఫైనాన్స్, స్పోర్ట్స్, మీడియా ఇలా తొమ్మిది రకాల కార్యకలాపాలపై దృష్టి సారించి 9 థీమ్‌లలో 9 సబ్ సిటీలకు ప్లాన్ చేశారు. ప్రపంచ ప్రఖ్యాత డిజైనింగ్ సంస్థ నార్మన్ పోస్టర్ తో ముఖ్య కార్యాలయాల డిజైన్లు చేయించారు. బ్లూ అండ్ గ్రీన్ కాన్సెప్ట్ ప్రపంచాన్ని ఇప్పటికే ఆకట్టుకుంది.
అమరావతిలో క్యాంటమ్ కంప్యూటింగ్ విలేజ్
అడ్వాన్స్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు క్వాంటమ్ కంప్యూటింగ్ విలేజీని అమరావతిలో ఏర్పాటు చేయబోతున్నారు. అమరావతిని ప్రపంచంలోని టాప్ 5 నగరాల్లో ఒకటిగా మార్చాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పని చేస్తోంది. ఇది సుస్థిర, ఎన్విరాన్ మెంట్ ఫ్రెండ్లీ, ఆర్థికంగా పవర్ ఫుల్ సిటీగా రూపు దిద్దుకోబోతోంది. వరల్డ్ బ్యాంక్, ఇతర సంస్థల సహాయంతో పనులు ముందుకెళ్తున్నాయి. ఉపాధి అవకాశాలను సృష్టించేలా, మహిళలు, యువత సహా అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చే ఆర్థిక కేంద్రంగా అమరావతిని అభివృద్ధి చేయడం టార్గెట్ గా పెట్టుకున్నారు.
అమరావతిలో 51 శాతం గ్రీనరీ, 10 శాతం జలవనరులు
అమరావతిలో 51 శాతం గ్రీనరీ, 10 శాతం వాటర్ బాడీస్ ఉంటాయి. ఈవీలు, వాటర్ ట్యాక్సీలు, సైక్లింగ్ కు వీలుగా ఏర్పాట్లు ఉండబోతున్నాయి. ఇప్పటికే వరల్డ్ బ్యాంక్, ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్, హడ్కో రుణాలు రెడీ అయ్యాయి. అటు కేంద్ర ప్రభుత్వం 15 వేల కోట్ల గ్రాంట్ సహా అదనంగా మరో 4,200 కోట్లు విడుదల చేసింది. మొత్తంగా 64,912 కోట్లతో 92 ప్రాజెక్టుల్ని రెడీ చేస్తున్నారు. వీటిలో ,725 కోట్ల విలువైన 42 పనుల టెండర్లు పూర్తయ్యాయి. క్యాపిటల్ సిటీలో 360 కిలోమీటర్ల పొడవైన ట్రంక్ రోడ్ల నిర్మాణానికి 2,498 కోట్లు కేటాయించారు. ఇవి 2026 నాటికి పూర్తవుతాయి.
103 ఎకరాల్లో రూ.1,048 కోట్లతో అసెంబ్లీ
ఇక శాసనాలు చేసే ఏపీ అసెంబ్లీ భవనం ఒక ఐకానిక్ గా ఉండబోతోంది. 250 మీటర్ల ఎత్తులో 103 ఎకరాల్లో 1,048 కోట్లతో నిర్మించబోతున్నారు. 47 అంతస్తుల జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్‌మెంట్ భవనం, 42 ఎకరాల్లో హైకోర్టు భవనం 2028 నాటికి పూర్తవుతాయి. అలాగే క్యాపిటల్ సిటీలో వాటర్ మేనేజ్ మెంట్ కోసం పాల వాగు, కొండవీటి వాగు వద్ద రిజర్వాయర్లు, గ్రావిటీ కెనాల్స్ నిర్మాణానికి 1,585 కోట్లు కేటాయించారు. నెదర్లాండ్స్ నిపుణుల సహాయంతో ఫ్లడ్ కంట్రోల్ చర్యలు చేపడుతున్నారు. కృష్ణా జిల్లాలో ఇటీవలి వరదలు సవాలుగా మారాయి. అందుకే 25 లక్షల క్యూసెక్స్ వరద వచ్చినా తట్టుకునేలా డిజైన్ చేయిస్తున్నారు. అంతేకాదు.. గెజిటెడ్, నాన్-గెజిటెడ్ అధికారులు, నాలుగో ఉద్యోగుల కోసం 3,523 కోట్లతో రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లు కూడా రెడీ అవుతున్నాయ్.
2026 నాటికి రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు పూర్తికి ప్లాన్
సో ఏ పని ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలి అన్న ప్రణాళిక ఇప్పటికే సిద్ధమైంది. ఆ ప్రకారంగానే పకడ్బందీగా రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయబోతున్నారు. 2026 నాటికి రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు పూర్తవుతాయి. 2027-2028 నాటికి CRDA హెడ్‌క్వార్టర్స్, అసెంబ్లీ, హైకోర్టు, ఇతర ఐకానిక్ టవర్లు పూర్తి చేస్తారు. ఈ మొత్తం ప్రాజెక్టు మూడేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది కూటమి ప్రభుత్వం. సో రాజధాని నిర్మాణం పూర్తవడంతోనే ఉపాధి అవకాశాలు పెంచేలా చర్యలు తీసుకుంటున్నారు. వచ్చే ఐదేళ్లలో నిర్మాణ రంగం, ఆగ్రో-ప్రాసెసింగ్, క్లీన్ మాన్యుఫ్యాక్చరింగ్, సర్వీసెస్ రంగాల్లో 50 వేల ఉద్యోగాల సృష్టికి ఆస్కారం ఉందంటున్నారు.
సిటీ నిర్మాణంలో సింగపూర్ నిపుణుల సలహాలు
సిటీ నిర్మాణంలో సింగపూర్ నిపుణుల సలహాలు తీసుకోబోతున్నారు. ఏఐ హబ్ గా, డ్రోన్ టెక్నాలజీ హబ్ గా అమరావతిని తీర్చిదిద్దబోతున్నారు. ప్రస్తుతం రాజధాని నిర్మాణానికి ఆర్థిక సహాయం అందుతోంది. అంతర్జాతీయ సహకారం ఉంది. సుస్థిర డిజైన్‌లతో వరల్డ్ క్లాస్ సిటీ సాక్షాత్కరించబోతోంది. రైతులకు న్యాయం చేయడం, వరద నిరోధంపై మరింత ఫోకస్, ఆర్థిక సవాళ్లను అధిగమిస్తూ అమరావతి ముందుకు సాగుతోంది. అటు అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదనలు రెడీ చేసేందుకు ఏపీ ఏవియేషన్ కార్పొరేషన్ టెక్నో ఫీజిబిలిటీ రిపోర్ట్ ను రెడీ చేసేందుకు టెండర్లను ఆహ్వానించింది. ఈ నివేదికను వెంటనే రూపొందించి కేంద్రానికి పంపుతారు. కేంద్ర పౌర విమానయాన శాఖ నుంచి దీనిపై గ్రీన్ సిగ్నల్ వచ్చాక ప్రభుత్వం తదుపరి కార్యాచరణ చేపట్టనుంది.
Also Read: అందని ద్రాక్ష కోసం.. బీజేపీ సరికొత్త వ్యూహాలు
రాజధానిలో 30 వేల ఎకరాలకు పైగా అదనపు భూ సమీకణ
కొత్తగా మరో 30 వేల ఎకరాలకు పైగా సమీకరణ చేసుకునేందుకు వీలుగా ప్రభుత్వం కార్యాచరణ మొదలు పెట్టింది. అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాజెక్టుతో పాటు అవుటర్, ఇన్నర్ రింగ్ రోడ్లతో పాటు ఇతర ప్రాజెక్టుల కోసం ఈ స్థాయిలో భూ సమీకరణ అవసరం అని సీఆర్డీఏ భావిస్తోంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే ఫోకస్ పెడుతున్నారు. పాలవాగు, కొండవీటి వాగు వద్ద రిజర్వాయర్లు, కెనాల్స్, రిటైనింగ్ వాల్స్ నిర్మాణానికి అదనపు భూమి అవసరం. ఇటీవలి వరదల తర్వాత, ఫ్లడ్ మేనేజ్ మెంట్ కీలకంగా మారింది. నీటి సరఫరా, డ్రైనేజీ, విద్యుత్ సబ్‌స్టేషన్లు, ఫైబర్ ఆప్టిక్ నెట్‌వర్క్‌ల కోసం అదనపు స్థలం అవసరం అనుకుంటున్నారు.
రాజధాని నిర్మాణం పూర్తయ్యాక జనాభా పెరిగే ఛాన్స్
రాజధాని నిర్మాణం పూర్తయ్యాక జనాభా పెరగడం సహజమే. ఇక్కడ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. దీంతో జనాభా అన్ని ప్రాంతాల నుంచి స్థిరపడేందుకు వస్తారు. దీంతో ఇనిషియల్ గా 50 లక్షల జనాభా ఉండే ఛాన్స్ ఉందన్న అంచనాలు ఉన్నాయి. అదే జరిగితే ఈ జనాభా కోసం ఇండ్లు, విద్యా సంస్థలు, హాస్పిటల్స్, వాణిజ్య సముదాయాల కోసం అదనపు భూమి అవసరం. ఈ సమస్యలను అధిగమించేందుకు ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతున్నారు. సో అమరావతి ప్లాన్స్ అన్నీ ఓపెనప్ అయ్యాయి. త్వరలోనే కలల రాజధాని కళ్ల ముందు సాక్షాత్కరించబోతోంది.