AP Politics: ఐదుగురు ఎమ్మెల్యేలు. ఐదు నియోజకవర్గాలు. కూటమి నాయకత్వం ముందు ఒకటే సవాలు. టీడీపీ, జనసేనకు చెందిన కొందరు ఎమ్మెల్యేల వ్యవహారశైలి ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చకు దారితీసింది. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు చట్టూ వివాదాలు, విభేదాలు, విమర్శలు, ఆరోపణలు తెరపైకి వస్తున్నాయ్. వీరి తీరుతో.. రెండు పార్టీల నాయకత్వానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయనే ప్రచారం జరుగుతోంది.
తిరువూరులో ఎమ్మెల్యే కొలికపూడి వ్యవహారశైలి, సొంత పార్టీ నేతలతో విభేదాలతో వార్తల్లో నిలిచారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎమ్మెల్యేలకు సమాన గౌరవం ఇవ్వడం లేదంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం చర్చకు దారితీసింది. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌పై తాజాగా భూలావాదేవీ వివాదం ముదిరింది. 60 లక్షల భూ సమస్యలో వేధింపులకు పాల్పడ్డారని ఓ మహిళ అనంతపురం డీఐజీ, ఎస్పీలకు ఫిర్యాదు చేశారు. గతంలో జూనియర్ ఎన్టీఆర్‌పై వివాదాస్పద ఆడియో వ్యవహారంలోనూ ఈయన పేరు వినిపించింది. దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. వివిధ సందర్భాల్లో ఆయన వ్యవహారశైలి రాజకీయ చర్చకు కారణమవుతోంది.
Also read: వాషింగ్ మెషీన్లపై అమెజాన్ సంచలన ఆఫర్లు.. రూ.27 వేలకే బ్రాండెడ్ మోడల్!
కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చుట్టూ స్థానిక వివాదాలు రాజకీయ చర్చకు కారణమవుతున్నాయి. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు సంబంధించి ఆ మధ్య మట్టి, ఇసుక సెటిల్‌మెంట్ వీడియో లీక్ అవడం, నియోజకవర్గ రాజకీయ పరిణామాలు కూటమి నేతల మధ్య సమన్వయంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ప్రతి అంశంలోనూ సంబంధిత ఎమ్మెల్యేల వివరణలు, వాస్తవాలు ఏమిటన్నది కూడా కీలకంగా మారింది. అయితే, టీడీపీ, జనసేన మధ్య సమన్వయంపై ఇవి ప్రభావం చూపుతాయా అన్నదే రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్.
నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలదే పెత్తనమే నడవాలా? స్థానిక నాయకులు, పార్టీ శ్రేణులతో సమన్వయంతో మెలగాలా? అన్న అంశం చర్చకు వస్తోంది. ఇది.. కూటమి సమన్వయానికి పరీక్ష! వ్యక్తిగత వివాదాలు, రాజకీయ విభేదాలు పార్టీ సంబంధాలపై ప్రభావం చూపకుండా నాయకత్వం ఎలా వ్యవహరిస్తుందన్నది ఆసక్తి రేపుతోంది. అధినాయకత్వం హెచ్చరికలతో సరిపెడుతుందా? స్పష్టమైన నియంత్రణ చర్యలకు దిగుతుందా? అన్నది కూడా ఇప్పుడు చర్చకు వస్తోంది. ఎందుకంటే ప్రజాప్రతినిధుల వ్యవహారశైలి కూడా పార్టీ ప్రతిష్ఠకు కీలకమే. కూటమి పెద్దల నెక్ట్స్ స్టెప్ ఏంటన్నదే ఇప్పుడు ఇంట్రస్టింగ్ ఎలిమెంట్.
Also read: గోవాలో హోరెత్తిన ‘గోయ్ రాఖోన్న్ యాత్ర’.. ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి!