ఆయన స్వయనా రాష్ట్ర ముఖ్యమంత్రి. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఓటర్ల సమగ్ర సవరణ జాబితా (సర్)పై ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చకు తెరలేపాయి. సర్ ప్రక్రియపై ఎన్నో అనుమానాలకు బీజం వేసినట్టయ్యింది సీఎం రేవంత్ మాటలతో. అవును.. ఏకంగా సీఎంకే ఈ పరిస్థితి ఉంట.. సాధారణంగా ఇతర చోట్ల ఎలా ఉంది ఓటర్ల సవరణ ప్రక్రియ? అనే అనుమానాలు అందరిలో నాటుకున్నాయిప్పుడు.
తన సొంత గడ్డ కొడంగల్ నుంచే సీఎం ఈ ఆరోపణలు చేశారు. సర్ విధాన ఉద్దేశ్యం, దాని టార్గెట్‌పై ఓపెన్‌గా చర్చించడం ఇప్పుడు కలకలం రేపుతోంది. గతంలో పశ్చిమ బెంగాల్, బీహార్ తదితర రాష్ట్రాల్లో సర్ వల్లే బీజేపీ గెలిచిందనే వాదన బలంగా ఉంది. దీన్ని బాహాటంగానే బీజేపీ కూడా ఒప్పుకుంటున్నది. చెప్పుకుంటున్నది. ఈ సెగ ఇప్పుడు తెలంగాణను తాకుతున్నది.
దీని ప్రభావం ఎలా ఉంటుందో.. ఏకంగా సీఎం తన ప్రసంగం ద్వారా తెలంగాణ సమజానికి చెప్పడం ప్రాధాన్యత సంతరించుకున్నది. చర్చకు తెర లేపింది. ఎక్కడి వారినక్కడ అలర్ట్ చేసింది. ఇంకా సమయం ఉన్న తరుణంలో ఎవరికి వారు జాగ్రత్త పడకపోతే.. ఓటును పీకేయడమే పనిగా బీజేపీ పెట్టుకున్నదని ఆయన ఇచ్చిన ఓపెన్ స్టేట్‌మెంట్ రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు తెరలేపుతోంది.
ఓటు పోవడం ఎంత ప్రమాదకరమో.. దాని వల్ల ఓ పేద వాడికి జరిగే నష్టమేమిటో కూడా సీఎం వివరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ తీసేస్తారని, బతికుండీ చచ్చిన శవం మాదిరిగా చేసే ఓ ప్రమాదకరమైన ప్రక్రియ ఇదన్నారు. ఇంకో ముచ్చట కూడా చెప్పారు సీఎం. మామూలుగా ఈ సర్ ప్రక్రియతో ముస్లిం మైనార్టీల ఓట్లే టార్గెట్‌గా పెట్టుకుంటుందని అంతా అనుకుంటారని, కానీ తెలంగాణలో మాత్రం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఓట్లకు గండి పెట్టేందుకు కేంద్రం సిద్దమైందన్నారు.
ఈ వర్గాల్లోని పేదలంతా కాంగ్రెస్ వైపున ఉన్నారని, వారంతా ఓట్లేయడంతోనే కాంగ్రెస్ మొన్న అధికారంలోకి రాగలిగిందని చెప్పిన రేవంత్.. ఈ ఓట్లన్నీ పోయినా.. బీజేపీకి వచ్చే నష్టమేమీ లేదని, ఎందుకంటే ఆ పార్టీకి ఇక్కడ ఉనికే లేదన్నారు. అంటే రాష్ట్రం మొత్తం మీద 90 శాతంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలే టార్గెట్గా ఓట్లన్నీ గంప గుత్తగా తీసేసే పనిని ఈ సర్ ద్వారా నిర్విగ్నంగా చేయడానికి రెడీ అయ్యిందని సీఎం మాటల ద్వారా అర్థమైపోయింది జనాలకు.
అయితే ఈ సర్ ప్రక్రియ ద్వారా బీజేపీ, బీఆరెస్‌లు రెండూ లాభపడనున్నాయని కూడా ఆయన ఆరోపించారు. ఇద్దరూ భవిష్యత్తులో కలవబోతున్నారని, అందుకే బీజేపీ చేసే ఏ చర్యకూ బీఆరెస్ అడ్డుపడదని, ఇద్దరి లక్ష్యం.. రాష్ట్రంలో కాంగ్రెస్ రానీయకుండా చేయాలని, ఈ ఇద్దరు మిత్రులు ఇప్పుడు సర్ ద్వారా కాంగ్రెస్‌ను దెబ్బకొట్టేందుకు బోగస్ ఓట్ల పేరుతో డ్రామాలు చేస్తున్నారని కూడా సీఎం ప్రజలను అలర్ట్ చేశారు. వారిలో చైతన్యం కలిగించే పని చేశారు. మొత్తానికి ఏకంగా సీఎం రేవంతే ఈ విధమైన కామెంట్లు చేయడంతో ఈ సర్ ప్రక్రియపై జనాల్లో విపరీతమైన అనుమానాలు నెలకొని ఉన్నాయి ప్రస్తుతం.