Telangana Politics: తెలంగాణ బీజేపీలో బీఆర్ఎస్‌తో ఫెవికాల్ బంధం పంచాయితీ హాట్ టాపిక్‌గా మారింది. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య నడుస్తున్న రహస్య ఒప్పందాలు, అంతర్గత సంబంధాలపై జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టలేక కమలనాథులు ఇప్పటికే సతమతమవుతున్నారు. పొత్తులు, ఒప్పందాలపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడితో పాటు కొందరు ముఖ్యనేతలు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. కుటుంబ పెత్తనం చేసే బీఆర్ఎస్‌తో పొత్తు ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. కొందరు బీజేపీ నేతలు పొత్తుంటే తప్పేంటి? అన్నట్లు మాట్లాడుతున్నారు. ఆ క్రమంలో ఆ పార్టీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బీజేపీ, బీఆర్ఎస్ ఫెవికాల్ బంధం ఆరోపణలకు బలం చేకూరుస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
కాషాయ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీ ఒక చేదలా పట్టిందని, ఆ చేదను వదిలించుకోలేకపోతున్నామని ఆ పార్టీ నికార్సైన కార్యకర్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తూ.. తెగ చికాకు పడిపోతున్నారంట. పదేపదే పొత్తులు, రహస్య ఒప్పందాలు, లోపాయికారీ సంబంధాలంటూ.. బీఆర్ఎస్‌తో బీజేపీది ఫెవికాల్ బంధం అని వినిపిస్తున్న ఆరోపణలు కాషాయ శ్రేణులకు తలనొప్పిగా మారుతున్నాయంట. ఆ పార్టీ వర్గాల వాదన ఎలా ఉన్నా.. అసలు ఫెఫికాల్ బంధం విమర్శలు పదేపదే ఎందుకు వినిపిస్తున్నాయి? నిజంగానే బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పొత్తులు, ఒప్పందాలు అంతర్గతంగ నడుస్తున్నాయా..? అన్న సందేహాలు సామాన్య ప్రజల్లో సైతం వ్యక్తం అవుతున్న పరిస్థితి ఉంది.
దానికి తగ్గట్లే బీజేపీ నేతలే బీఆర్ఎస్ తో సంబందాలు పెట్టుకుంటే తప్పేముందని? ప్రశ్నిస్తుండటం ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోందంట. తాజాగా బీజేపీ నుంచి గెలిచిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అగ్గికి ఆజ్యం పోసినట్లు తయారయ్యాయంటున్నారు. అసెంబ్లీ లాబీల్లో మీడియాతో ముచ్చటించిన రాకేశ్‌రెడ్డి బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటే తప్పేంటని బాంబ్ పేల్చారు. అదే ఇప్పుడు బీజేపీతో పాటు, యావత్ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
Also Read: Jeevan Reddy Quits Congress: అక్కడ ఇమడగలవా జీవన్ రెడ్డి?
ఢిల్లీ వేదికగా ఓ న్యూస్ చానెల్ ఇంటర్వ్యూలో బీజేపీ, బీఆర్ఎస్‌లది ఫెవికాల్ బంధమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పునరుద్ఘాటించారు. వచ్చే ఎన్నికల్లో రెండు కలిసి వస్తాయని, తమ చేతుల్లో ఓటమి పాలవుతాయని సీఎం ధీమాగా చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి వాఖ్యలకు, పైడి రాకేష్ రెడ్డి చేసిన కామెంట్స్ బలం చేకూర్చినట్లు అయిందన్న చర్చ జరుగుతోంది. ముందునుంచి కూడా బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఫెవికాల్ బంధం ఉందని, రెండు పార్టీల మధ్య పొత్తులు, ఒప్పందాలు, రహస్య సంబంధాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.
ఆ ఆరోపణలను తిప్పికొట్టడానికే కాషాయ నేతలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న రాకేష్ రెడ్డి బీఆర్ఎస్ పట్ల పాజిటివ్‌గా చేసిన వాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. టీడీపీతో పొత్తు పెట్టుకుని ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన విషయాన్ని ప్రస్తావిస్థూ… తెలంగాణలో కూడా అవసరమైతే బీఆర్ఎస్ పార్టీ సహాకారంతో అధికారంలోకి రావడంలో తప్పులేదని రాకేష్‌రెడ్డి వ్యాఖ్యానించారు. దానిపై పార్టీ నాయకత్వం రాకేష్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహంతో ఉందంట.
ఇప్పటికే బీఆర్ఎస్‌తో ఎలాంటి పొత్తు ఉండదని స్పష్టం చేస్తూ వస్తున్న బీజేపీ నాయకత్వానికి, రాకేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టాయట. పార్టీ లైన్‌కు విరుద్ధంగా వ్యక్తిగత అభిప్రాయాలు వ్యక్తం చేయడం వల్ల ఇటు పార్టాకి డ్యామేజ్ జరగడంతో పాటు, అటు కేడర్‌లో గందరగోళం మరింత పెరిగిపోతోందని రాష్ట్ర పార్టీ పెద్దలు తలలు పట్టుకోవాల్సి వస్తోందంట. మరోవైపు కాంగ్రెస్ మాత్రం ఈ వ్యవహారాన్ని బలమైన అస్త్రంగా వాడుకుంటోంది. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనన్న తమ ఆరోపణలకు పైడి రాకేశ్‌రెడ్డి వ్యాఖ్యలే సాక్ష్యమని కాంగ్రెస్ నేతలు ఫోకస్ చేస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందాలు ఉన్నాయని, బయటకు మాత్రం ప్రజలను మోసం చేసే రాజకీయాలతో పబ్బం గడుపుకుంటున్నాయని ఆరోపిస్తున్నారు.
Also Read: Jupally Krishna Rao: పండగ వేళ చల్లటి వార్త చెప్పిన మంత్రి జూపల్లి..?
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పైడి రాకేష్ రెడ్డి వాఖ్యలు రాజకీయంగా బీజేపీపై ఎంతటి ప్రభావం చూపిస్తాయో ? అన్న ఆందోళనతో రాష్ట్ర నాయకత్వం సతమతమవుతోందంట. ఒకవైపు తాము రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా నిలవాలని ప్రయత్నిస్తుంటే.. సొంత పార్టీ ఎమ్మెల్యే వ్యాఖ్యలతో డిఫెన్స్‌లో పడాల్సి వస్తోందని బీజేపీ పెద్దలు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
అదలా ఉంటే ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ రాష్ట్ర పొలిటికల్ వ్యవహారాల ఇంచార్జ్ అభయ్ పాటిల్ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారంట. రాకేశ్ రెడ్డికి అధిష్టాన పెద్దలు సైతం మొట్టికాయలు వేసినట్టుగా తెలుస్తోంది. ఎంతటి నేతలైన అధికార, ప్రతిపక్ష పార్టీలతో సెటిల్మెంట్, లాలూచీ రాజకీయాలు చేస్తే నిర్దాక్షిణ్యంగా పార్టీ నుంచి గెంటి వేస్తామని పాటిల్ సదరు ఎమ్మెల్యేకి హెచ్చరికలు పంపారంటున్నారు.
అంతేకాదు సుదీర్ఘ కాలంగా బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే, రెండు పార్టీల మధ్య ఫెవికాల్ బంధం ఉంది అన్న ప్రచారం ఎందుకు వస్తుంది? దానికి కారణం ఎవరు..? సొంత పార్టీ వారే అధికార, ప్రతిపక్ష పార్టీలతో లాలూచీ పడి అలాంటి ప్రచారానికి ఊతమిస్తున్నారా? అన్న అంశాలపై బీజేపీ పెద్దలు ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం అధికార, ప్రతిపక్ష పార్టీలతో మెతక వైఖరి ప్రదర్శిస్తున్న బీజేపీ నేతల లిస్ట్ అధిష్టానానికి పంపినట్టుగా తెలుస్తోంది. దీంతో పార్టీలో నేతలంతా రాకేష్ రెడ్డి ఎంత పని చేశావయ్యా? అని చిర్రుబుర్రులాడుతున్నారు. మొత్తానికి పైడి రాకేశ్ రెడ్డి వ్యాఖ్యలతో డిఫెన్స్‌లో పడ్డ బీజేపీకి డ్యామేజ్ కంట్రోల్ పనులు పెద్ద టాస్క్‌గా మారాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.