దశల వారిగా మెజారిటీ భారతీయుల్ని తరిమేసే ప్లాన్
ఏ ముహుర్తాన డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు రెండో దఫా ప్రెసిడెంట్ అయ్యారో.. అప్పటి నుండీ లక్షల మంది భారతీయులకు నిద్ర కరువయ్యింది. ఇన్నాళ్లూ, ‘అమెరికాలోనే మా ఇల్లు.. అమెరికాలోనే మా జీవితం…’ అనుకున్నవారికి వాళ్ల అమెరికన్ డ్రీమ్ ఒక కలగానే మిగిలేలా ఉంది. ‘నిజంలో మీరంతా అమెరికాలో ఉండటానికి అర్హులు కాదంటూ’ ప్రెసిడెంట్ ట్రంప్.. దశల వారిగా మెజారిటీ భారతీయుల్ని తరిమేసే ప్లాన్లు చేస్తున్నారు. ఒకవైపు, అమెరికాలో అక్రమ వలసదారుల్ని బహిష్కరిస్తున్న ట్రంప్.. ఇప్పుడు తల్లిదండ్రులపై ఆధారపడి జీవిస్తున్న వారినీ అక్రమంగా జీవిస్తున్న వారిగానే పరిగణించి.. వారిని కూడా తరిమేయడానికి కఠిన చర్యలు చేపట్టారు.
కోర్టు కేసుల్లో ఈ నిబంధనను తొలగించే అవకాశం
H1-B వీసాదారులైన తల్లిదండ్రులపై ఆధారపడి.. మైనర్లుగా అమెరికాకు వలస వెళ్లిన కొందరికి ఇప్పుడు 21 ఏళ్లు నిండబోతున్నాయి. అయితే, వీళ్లంతా ఇప్పుడు మేజర్లు అయ్యారనీ.. వాళ్ల తల్లిదండ్రులపై ఆధారపడాల్సిన అవసరం లేదనీ.. వారికి, పౌరసత్వం లేదు గనుక దేశం విడిచి వెళ్లిపోవాలని అంటున్నారు. H-4 వీసాదారులైన వీళ్లను ఇకపై NRI తల్లిదండ్రులపై ఆధారపడిన వారిగా పరిగణించలేమని చెబుతున్నారు. అయితే, ఇప్పటి వరకు ఉన్న అమెరికా విధానంలో.. ‘ఏజింగ్’ తర్వాత.. అంటే, మైనారిటీ దాటి 21 ఏళ్లు వచ్చిన తర్వాత.. పౌరసత్వం కోసం కొత్త వీసా హోదాను ఎంచుకోవడానికి వారికి రెండు సంవత్సరాల సమయం ఉండేది… కానీ, ఇటీవలి ట్రంప్ వచ్చిన తర్వాత మార్చిన కొత్త ఇమ్మిగ్రేషన్ నియమాల వల్ల.. కోర్టు కేసుల్లో ఈ నిబంధనను తొలగించే అవకాశం ఉండటంతో వీళ్లలో ఆందోళన పెరిగింది.
తల్లిదండ్రులు అమెరికా పౌరులు.. పిల్లలు బయటివారు
ఊహ వచ్చినప్పటి నుండీ అమెరికాలోనే పెరిగి, పెద్దై.. చదువు, ఫ్రెండ్స్, కెరీర్.. అంతా అమెరికాలోనే అనుకున్న వీళ్లకు ఇప్పుడు తమ భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. తమకు అంతగా పరిచయం లేని దేశమైన భారతదేశానికి ‘సెల్ఫ్ డిపోర్టేషన్’ కావాల్సి ఉంది. అక్రమ వలసదారుల్ని బలవంతంగా మిలటరీ విమానాలు పెట్టి, తరిమేస్తుంటే.. వీళ్ల విషయంలో.. తమంతట తామే తమ స్వదేశమైన భారతదేశాలనికి రావాల్సి ఉంది. ఒక వేళ, భారత్ రాకపోతే.. ఎన్నాళ్లు ఉన్నా.. అమెరికాలో ‘బయటి వ్యక్తులు’గానే జీవించాల్సి ఉంటుంది. అంటే, తమ తల్లిదండ్రులు అమెరికా పౌరులు కాగా.. తాము మాత్రం బయటివారిగా బతకాలి.
కొత్త దరఖాస్తుదారులకు వర్కింగ్ వీసా నిరోధించే ప్రయత్నం
మార్చి 2023 నాటి డేటా ప్రకారం, ఇలాంటి భారతీయ యువత దాదాపు 1.34 లక్షల మంది ఉన్నారు. వీరంతా వారి కుటుంబాలు గ్రీన్ కార్డులు పొందే ముందు.. వారు డిపెండెంట్ వీసా హోదా నుండి అనర్హులుగా మారతారు. అంటే, 21 ఏళ్లు దాటిన ఇలాంటి వారు తమ తల్లిదండ్రులను వదిలి.. భారతదేశం వచ్చి బతకాల్సిందే. డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్ హుడ్ అరైవల్-DACA కింద కొత్త దరఖాస్తుదారులకు వర్కింగ్ వీసా నిరోధించే విధంగా.. ఇటీవల టెక్సాస్‌లో కోర్టు ఇచ్చిన తీర్పుతో మరింత గందరగోళం ఏర్పడింది. DACA ప్రకారం.. 21 ఏళ్లు నిండిన తర్వాత, వారి తల్లిదండ్రులపై ఆధారపడిన డిపెండెంట్ వీసా రద్దు అవుతుంది. దీనితో, వీళ్లు బహిష్కరణ ఎదుర్కోవాల్సి వస్తుంది.
డిపెండెంట్ వీసా ముగిస్తే విద్యను కొనసాగించడానికి F-1 విద్యార్థి వీసా
ఇక, ఇప్పటికే, కొందరు తల్లిదండ్రులు దశాబ్ధాల నుండి శతాబ్ధాల వరకూ.. గ్రీన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకొని, దాని కోసం వేచి చూస్తున్నారు. ఇది సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. అటు తల్లిదండ్రులు.. ఇటు వారి డిపెండెంట్లు కూడా ఏం చేయాలో తెలియక గందరగోళంలో ఉన్నారు. రెండుమూడేళ్ల వయస్సు నుండి అమెరికాలో నివసిస్తున్న వ్యక్తికి.. తన డిపెండెంట్ వీసా ముగిస్తే.. తన విద్యను కొనసాగించడానికి వీసాను F-1 విద్యార్థి వీసాగా మార్చుకోవడానికి అర్హత ఉంటుంది. అయినప్పటికీ.. ఈ ప్రక్రియ సవాళ్లతో కూడుకున్నది. దీని వల్ల, చిన్నప్పటి నుండీ తల్లిదండ్రులతో అక్కడే నివశిస్తున్న వ్యక్తి.. ఇకపై అంతర్జాతీయ విద్యార్థిగా పరిగణించబడతారు.
విదేశీ విద్యార్థులుగా విద్యను అభ్యసిస్తుంటే రూ. 39 లక్షల ఫీజు
దీనితో అమెరికా ప్రభుత్వం ఇచ్చే ట్యూషన్ ఫీజులు, ఫెడర్ ఆర్థిక సహాయం, స్కాలర్‌షిప్‌లకు వీళ్లు అనర్హులుగా మారతారు. అంతే కాకుండా, ఇలాంటి వారి కుటుంబాలపై ఈ పరిస్థితి భారీ ఆర్థిక భారాన్ని మోపుతుంది. ఇప్పటికే, ఇలాంటి వారిలో చాలా మంది అమెరికాలోని అధిక జీవన వ్యయంతో ఇబ్బంది పడుతున్నారు. వీళ్లు ఇప్పుడు ట్యూషన్ చెల్లించలేరు. అలాగే, తమను తాము పోషించుకోడానికి క్యాంపస్ బయట పని చేయలేరు కూడా. ఎందుకంటే, ట్రంప్ తాజా విధానాలు.. విద్యార్థులకు పనిచేసే వెసులుబాటులను తొలగించాయి. సో ఇలాంటి యువత తాము చేయని తప్పుకు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో.. పౌరసత్వం ఉన్న యువత కాలేజ్ ఫీజు సుమారు రూ. 8 లక్షలు చెల్లిస్తుంటే.. వీళ్లు ఏకంగా రూ. 39 లక్షల వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
2018లో 24%… 2020లో 30% H1B వీసాల తగ్గింపు
డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్‌గా తన మొదటి పాలనలోనే ఇలాంటి పరిస్థితిని తీసుకొచ్చే ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగా.. 2018లో 24%.. 2020లో ఏకంగా 30% H1B వీసాలను తిరస్కరించారు. డెమొక్రాట్ల హయాంలో అది భారీగా తగ్గింది. కాస్త ఉదారంగానే వ్యవహరించారు. అయితే, ట్రంప్ ఇప్పుడు రెండోసారి గద్దెనెక్కిన తర్వాత.. H1B వీసాలను రద్దు చేసే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ప్రస్తుతం అమెరికా ఏటా 85 వేల H1B వీసాలు ఇస్తోంది. అందులో 20వేలు అక్కడ గ్రాడ్యుయేషన్ చేసిన వారికి కేటాయిస్తున్నారు. H1B వీసాల కోసం ఇప్పటికే అప్లికేషన్లు భారీగా ఉన్నాయి. ఈ వీసాల కోసం ఎక్కువగా దరఖాస్తు చేస్తున్న వారిలో భారతీయులే అధికం.
2023లో అమెరికా H1B వీసాలు పొందినవారిలో…
2023లో అమెరికా H1B వీసాలు పొందినవారిలో 72.3శాతం మంది భారతీయులు. అయితే గతేడాది అమెరికా కంపెనీలు ఈ వీసాల కోసం స్పాన్సర్ చేయడం తగ్గించేశాయి. ఈ వీసాలు పొందినవారు అమెరికన్ల కంటే ఎక్కువ జీతాలు పొందుతున్నారనే వాదన కూడా ఉంది. ఇక, తమకంటే విదేశీయులకు భారీగా వేతనాలు ఉండటం ట్రంప్‌కు ఏ మాత్రం ఇష్టం లేదు. అందుకే, F1వీసాపై ఉన్నా… అది ఎప్పుడు మారిపోతుందో కూడా అర్థం కావట్లేదు. చదువు పూర్తయ్యాక తమకు H1B వీసా వస్తుందో రాదో కూడా తెలియదు. ఇక అప్లికేషన్లు పరిశీలనలో ఉన్న వారికి ఇప్పటికే టెన్షన్ ఉంది. తమ అప్లికేషన్ పరిశీలనకు వచ్చేలోపే… ఎక్కడ తమను బహిష్కరిస్తారోనని భయంతో ఉన్నారు.
కెనడా, యూకే వంటి ఇతర దేశాలకు వెళ్లాలనే ఆలోచన
ఇప్పుడు, ఇలాంటి యువతలో కొందరు కెనడా లేదంటే యూకే వంటి ఇతర దేశాలకు వెళ్లాలని కూడా ఆలోచిస్తున్నారు. ఇక్కడ వలస విధానాలు అమెరికా అంతటి కఠినంగా లేవు. అందుకే, ఇలాంటి సవాళ్లు ఎదుర్కుంటున్న యువతను తమ తల్లిదండ్రులు కూడా ఇతర దేశాలకు పంపించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక, తమ తల్లిదండ్రులు రిటైర్‌మెంట్ తర్వాత తిరిగా భారతదేశానికి వెళ్లాలని యోచిస్తున్నారు కాబట్టి… ఈ యువత తమ చదువు తర్వాత అమెరికాలో ఉండలేరు. అలాగని ఇండియాకి తిరిగి వెళ్లినా.. అది వారికి మరొక విదేశంలా అనిపిస్తుందనడంలో సందేహం లేదు. ఈ పరిస్థితిని వాళ్లు ఊహించుకోలేకపోతున్నారు. చిన్నప్పుడే అమెరికాను వదిలి వెళ్లిన వీళ్లు.. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ఇక్కడకు వచ్చి కొత్తగా జీవితం ప్రారంభించాల్సి ఉంటుంది.
ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT)లో H-1Bని స్పాన్సర్ కోసం..
ట్రంప్ వచ్చిన తర్వాత అమెరికా వీసా విధానాల్లో చేస్తున్న మార్పుల వల్ల చాలా మంది భారతీయులు ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. ఇటీవల.. అనేక అమెరికన్ కంపెనీలు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్-OPTలో ఉన్నవారు తమ H-1Bని స్పాన్సర్ చేయాలంటే.. కనీసం ఒక సంవత్సరం పాటు తమ కంపెనీలోనే పనిచేయాడాన్ని తప్పనిసరి చేశాయి. దీని వల్ల.. ఈ మార్చిలో H-1B వీసా లాటరీలో పాల్గొనాలని ఆశించిన చాలా మందికి చుక్కెదురయ్యింది. ఇటీవల, కొత్త ఉద్యోగాల కోసం కంపెనీ మారిన చాలా మంది భారతీయ గ్రాడ్యుయేట్లు.. ఇప్పుడు H-1B వీసా ప్రక్రియకు అనర్హులుగా మారారు. అయితే, కంపెనీలో ఎక్కువ కాలం పాటు నిబద్ధత కలిగి ఉండే ఉద్యోగులను ఫిల్టర్ చేయడం లక్ష్యంగా ఈ విధాన మార్పు జరిగిందని నిపుణులు అంటున్నరు.
ప్రస్తుతం 12 లక్షల మంది EB-1, EB-2, EB-3 కేటగిరీల్లో..
సాధారణంగా.. F1లో విద్యార్థులు తమ విద్య పూర్తయిన తర్వాత ఒక సంవత్సరం పాటు పనిచేయడానికి OPT అవకాశం ఉంటుంది. అయితే, ఒక సంవత్సరం అనే రూల్ నుండి తప్పించుకోడానికి చాలా మంది ఈ రూల్ పెట్టని కంపెనీలకు వెళ్దామని అనుకుంటున్నప్పటికీ.. అది అంత సులభం కాదని వాళ్లే అంటున్నారు. OPT నియమం లేని కంపెనీలోకి మారితే మార్చి లాటరీకి అర్హత ఉంటుందని తెలిసినప్పటికీ… ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొత్త ఉద్యోగం దొరకడమే కష్టంగా మారింది. అందుకే, నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. ప్రస్తుతం 12 లక్షల మంది EB-1, EB-2, EB-3 కేటగిరీల్లో గ్రీన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు.
అమెరికాలో మరింత ఎక్కువ కాలం పనిచేయడానికి ప్లాన్
ఇలాంటి అనిశ్చితి మధ్య.. చాలా మంది భారతీయ యువత, కష్టమైన ఛాయిస్‌లకు వెళ్తున్నారు. తక్కువ జీతం, జూనియర్ ప్రొఫైల్‌లతో స్థిరపడినా ఫర్వాలేదని అనుకుంటున్నారు. అలాగే, అమెరికాలో మరింత ఎక్కువ కాలం పని చేయడానికి ప్లాన్ వేసుకుంటున్నారు. కొందరు, H-1B స్పాన్సర్‌షిప్ కోసం కంపెనీలు మార్చుకుంటూ.. గత కంపెనీలు అందిస్తున్న దానితో పోలిస్తే జీతం దాదాపు 20% తక్కువకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. H-1Bని వెంటనే స్పాన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్న కంపెనీలో ఉద్యోగం దొరికినా.. ఒక సంవత్సరం తర్వాత వాళ్లు స్పాన్సర్ చేస్తారనే హామీ ఏంటి? అనే సందేహం లేకపోలేదు.
కెరీర్ వృద్ధి, ఉద్యోగ స్థిరత్వం, స్పాన్సర్‌షిప్ అవకాశాల అంచనా
ఒకవేళ, కంపెనీ స్పాన్సర్ చేయకపోతే, వీళ్ల పరిస్థితి ఏంటీ..? వీళ్లు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ బతకాల్సి ఉంటుంది. ఇక, స్పాన్సర్‌షిప్‌పై ఇంటర్నల్ విధానాలను నిర్ణయించే హక్కు.. కంపెనీ యజమానులకు ఉన్నప్పటికీ.. ఇప్పటికే సంక్లిష్టమైన వీసా ప్రక్రియను ఎదుర్కుంటున్న వలసదారులకు ఇది అదనంగా అనిశ్చితిని పెంచుతోంది. అలాగే, H-1B వీసా లాటరీలో పాల్గొనడానికి ఉద్యోగాలను మార్చడం ఎప్పుడూ ఉత్తమ వ్యూహం కాదన్నది నిపుణులు అభిప్రాయం. అందుకే, కెరీర్ వృద్ధి, ఉద్యోగ స్థిరత్వం, స్పాన్సర్‌షిప్ అవకాశాలను అంచనా వేయడం చాలా అవసరమని అంటున్నారు. ఇప్పుడు, 21 ఏళ్లు దాటిన భారతీయ యువత ఇలాంటి ప్రయత్నాల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది.
బైడెన్ పాలనలో ద్వి-పక్షపాత బిల్లు, అమెరికాస్ చిల్డ్రన్ బిల్లు
అమెరికాలో పెరిగి, చదువుకున్న యువత ఇలా దేశం నుంచి బయటకు వెళ్లాల్సిన పరిస్థితిపై గతంలోనూ ఆందోళన వ్యక్తం అయ్యింది. ఈ డాక్యుమెంటెడ్ డ్రీమర్స్ సమస్యలను పరిష్కరించడానికి అమెరికాలో గత బైడెన్ ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసింది. బైడెన్ పాలనలో ద్వి-పక్షపాత బిల్లు, అమెరికాస్ చిల్డ్రన్ బిల్లుతో సహా వివిధ బిల్లులు ప్రవేశపెట్టారు. కానీ, ఇందులో ఏ బిల్లు కూడా కార్యరూపం దాల్చలేదు. ఉదాహరణకు.. అమెరికాస్ చిల్డ్రన్స్ బిల్లు డాక్యుమెంట్ చేసిన డ్రీమర్‌లకు శాశ్వత నివాసానికి మార్గం సడలించింది.
మార్చి 2023 నాటికి, భారత్ నుంచి ఉపాధి ఆధారిత..
వీళ్లంతా అమెరికాలో పదేళ్లపాటు చట్టపరమైన హోదాను కలిగి ఉన్నారు. ఉన్నత విద్యా సంస్థ నుంచి పట్టభద్రులు కూడా అయ్యారు. కొందరి విశ్లేషకుల అభిప్రాయాల ప్రకారం… మార్చి 2023 నాటికి, భారత్ నుంచి ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డ్ బ్యాక్‌లాగ్… అంటే, EB-2, EB-3 స్కిల్డ్ కేటగిరీ కింద ఉన్నవారి సంఖ్య 10.7 లక్షలకు చేరుకుంది. దాదాపు 1.34 లక్షల మంది పిల్లలు గ్రీన్ కార్డ్ పొందకముందే వయస్సు దాటిపోతారని అంచనాలు ఉన్నాయి. వీరిలో బ్యాక్‌లాగ్‌లో భారతీయులే అధికంగా ఉన్నారు.
గ్రీన్ కార్డ్ రాకముందే వయస్సు దాటిపోతారని అంచనా
ప్రస్తుతం, డాక్యుమెంటెడ్ డ్రీమర్స్‌కు సంబంధించిన డేటా కూడా స్పష్టంగా అందుబాటులో లేదు. వారి అస్థిర, సామాజిక పరిస్థితి వల్ల, నమోదుకాని వలసదారులు తమను తాము గుర్తించడానికి వెనుకాడుతున్నారు. అంతేగాక, గణాంకాలను అంచనా వేయడం, తీర్మానాలు చేసే ప్రక్రియ సుదీర్ఘమైనది, అలాగే గజిబిజిగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ… చిన్న వయసులోనే అమెరికాకు తీసుకురాబడినప్పటికీ, చాలా మంది పత్రాలు లేని విద్యార్థులకు DACA హోదా లేదు. ఎక్కువ మంది 10 సంవత్సరాల కంటే ముందు లేదా 10-16 సంవత్సరాల మధ్య వయస్సులో అమెరికాకు వచ్చారు. వీళ్లందరికీ DACA హోదా పొందడానికి అడ్డంకులు లేకపోలేదు. వ్యక్తులు 2007కి ముందు అమెరికాకి వచ్చి ఉండాలి. ఈ కటాఫ్ తేదీ తర్వాత తీసుకువచ్చిన కొంతమంది అర్హత కలిగిన విద్యార్థులను మినహాయిస్తే… భారీ స్థాయిలో ‘ఏజింగ్ ఔట్’ బాధితులు కనిపిస్తున్నారు. మరి వీళ్ళ భవిష్యత్ ఏంటన్నది వేచి చూడాలి.