2026లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు
ఇటీవల కాలంలో దేశంలోని పలు రాష్ట్రాల్లో లిక్కర్ స్కామ్ వ్యవహారాలు వెలుగుచూసాయి. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వాన్ని కోలుకోలేని దెబ్బ కొట్టిన లిక్కర్ స్కామ్.. తర్వాత, చత్తీస్‌ఘడ్‌లో కూడా రాజకీయాలను అతలాకుతలం చేశాయి. ఇక, 2026లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలున్న నేపధ్యంలో.. ప్రస్తుతం తమిళనాడులో మద్యం కుంభకోణం పొలిటికల్ హీట్ పెంచింది. తమిళనాడు ప్రభుత్వానికి చెందిన మద్యం గుత్తాధిపత్య సంస్థ, తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్-TASMAC-టస్మాక్‌పై అవినీతి ఆరోపణల రావడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
రూ.1,000 కోట్లకు పైగా స్వాహా అయ్యాయన్న ఈడీ
గత నాలుగేళ్లుగా అధికారపక్ష నేతలు, అధికారులు, డిస్టిలరీ యజమానుల నెట్‌వర్క్ కలిసి.. టెండర్లను తారుమారు చేయడం, ఖర్చులు పెంచడం, అక్రమ లావాదేవీలు జరపడంతో.. రూ.1,000 కోట్ల రూపాయలకు పైగా స్వాహా అయ్యాయని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది. అయితే, ఈ వివాదం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్నాయి. పాలక DMK ప్రభుత్వాన్ని డిఫెన్స్‌లో పడేసింది. అదే సమయంలో.. భారతీయ జనతా పార్టీ.. AIADMK వంటి ప్రతిపక్ష పార్టీలు కలిసి.. సీఎం స్టాలిన్ ప్రభుత్వంపై మాటల దాడి చేయడానికి అవకాశం దొరికింది.
మార్చి 6న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రైడ్‌లు
ఇంతకీ, ఈ స్కామ్ ఎలా బయటపడింది…? మార్చి 6న తమిళనాడు వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రైడ్‌లు చేసింది. అందులో తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో విస్తృతమైన అవినీతి నెట్‌వర్క్ బయటపడిందని వెల్లడించింది. అధికార పార్టీ పొలిటికల్ లీడర్లు, ప్రభుత్వ అధికారులు, మద్యం తయారీదారులు కలిసి ఈ స్కామ్ చేసినట్లు గుర్తించింది. మద్యం అమ్మకాలు, సేకరణ, టెండర్ కేటాయింపులను తారుమారు చేయడానికి వీళ్లు కుట్ర పన్నారని ఈడీ ఆరోపించింది. అయితే, 1983లో స్థాపించిన TASMAC, తమిళనాడులో మద్యం అమ్మకాలకు బాధ్యత వహించే ఏకైక అధికారిక సంస్థ. ఈ సంస్థ ద్వారా, హోల్‌సేల్, రిటైల్ మద్యం పంపిణీపై రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వమే పూర్తి గుత్తాధిపత్యాన్ని కలిగి ఉంది.
ఏటా దాదాపు రూ.45 వేల కోట్ల ఆదాయం
అంటే, TASMAC రాష్ట్రంలోని అతిపెద్ద ఆదాయ వనరులలో ఒకటిగా ఉంది. ఇది కార్పొరేషన్ డిస్టిలరీల నుండి మద్యం సేకరించి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న రిటైల్ అవుట్‌లెట్లకు పంపిణీ చేస్తుంది. 4 వేల 700కి పైగా ఉన్న రిటైల్ అవుట్‌లెట్‌లతో… TASMAC తమిళనాడు ఆర్థిక వ్యవస్థకు ఏటా దాదాపు రూ. 45 వేల కోట్ల రూపాయలను అందిస్తుంది. అందుకే, మద్యం అమ్మకాలు రాష్ట్ర ఆదాయంలో కీలకమైన భాగంగా ఉన్నాయి. అయితే, TASMAC భారీగా ఆదాయాన్ని అందిస్తున్నప్పటికీ, పారదర్శకత లేకపోవడం, అవినీతి ఆరోపణలు, రాష్ట్రంలో మద్యపానాన్ని పెంచడంలో దాని పాత్రకు సంబంధించి తరచుగా విమర్శలకు గురవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దీనిపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
డిస్టిలరీలు కొనుగోలు రికార్డుల్లో అవకతవకలు
అయితే, ఈ స్కామ్ ఎలా బయటపడింది..? మొత్తంగా ఈ కుంభకోణంలో ఈడీ చేసిన కీలక ఆరోపణలు చూస్తే.. మద్యం వ్యవహారంలో నకిలీ కొనుగోలు రికార్డులతో పాటు ఖర్చులు భారీగా పెంచినట్లు గుర్తించారు. ఈడీ ప్రకారం.. తమిళనాడులోని డిస్టిలరీలు కొనుగోలు రికార్డుల్లో అవకతవకలు దొర్లాయని అంటున్నారు. ఖర్చులను పెంచి, షెల్ కంపెనీల ద్వారా నిధులను మళ్లించాయని ఆరోపించారు.
మద్యం తయారీదారులు టస్మాక్ అధికారులకు లంచాలు
దేవీ బాటిల్స్, క్రిస్టల్ బాటిల్స్, జిఎల్ఆర్ హోల్డింగ్ వంటి బాటిల్ తయారీ కంపెనీలు కలిసి, బ్లాక్ మనీని వైట్‌గా మార్చేందుకు బోగస్ ఇన్‌వాయిస్‌లను సృష్టించడంలో కీలక పాత్ర పోషించాయని ఆరోపణలు ఉన్నాయి. అలాగే, పెంచిన మద్యం సరఫరా ఆర్డర్‌లను పొందేందుకు మద్యం తయారీదారులు టస్మాక్ అధికారులకు లంచాలు చెల్లించారని అంటున్నారు. ఇందులో భాగంగా… SNJ, కాల్స్, అకార్డ్, SAIFL, శివ డిస్టిలరీ వంటి డిస్టిలరీలు ముడుపుల నిధుల సేకరణలో పాల్గొన్నాయని ఈడీ ఆరోపించింది.
బార్ లైసెన్స్‌లు, రవాణా కాంట్రాక్టులలో టెండర్లు తారుమారు
ఇక, బార్ లైసెన్స్‌లు, రవాణా కాంట్రాక్టులలో టెండర్ తారుమారు అయినట్లు గుర్తించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ చెప్పినదాన్ని బట్టి.. బార్ లైసెన్స్ టెండర్‌లను సరైన డాక్యుమెంటేషన్ లేకుండా.. అంటే GST, PAN, KYC వివరాలు లేని దరఖాస్తుదారులకు టెంటర్లను ఇచ్చినట్ల ఆరోపణలు ఉన్నాయి. అలాగే, రవాణా టెండర్లను నిర్దిష్ట కంపెనీలకు అనుకూలంగా మార్చారని.. అక్రమాలు జరిగినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ టస్మాక్.. రవాణాదారులకు ఏటా రూ.100 కోట్లు చెల్లిస్తోందని ఆరోపించారు.
అక్రమ నిధులలో ఎక్కువ భాగం నగదుగా మార్చి…
ఇక లెక్కల్లో చూపని నగదు లావాదేవీలు, మనీలాండరింగ్ వ్యవహారంలో కూడా ఆరోపణలు ఉన్నాయి. అక్రమ నిధులలో ఎక్కువ భాగం నగదుగా మార్చి, వాటిని తిరిగి రాజకీయ వ్యవస్థలోకి తిరిగి మళ్లించినట్లు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి, డిస్టిలరీ ఎగ్జిక్యూటివ్‌లు, సీనియర్ టస్మాక్ అధికారుల మధ్య ప్రత్యక్ష డీలింగ్ష్ జరిగాయని దర్యాప్తు అధికారులు కనుగొన్నారు. దీంతో అనవసరమైన ప్రయోజనాలను పొందే ప్రయత్నాలు జరిగినట్లు ఈడీ వెల్లడించింది.
మద్యంలో విషయంలో ఎటువంటి అవకతవకలు లేవన్న డీఎంకే
అయితే, ఈ ఆరోపణల తర్వాత తమిళనాడు రాజకీయాల్లో మాటల యుద్ధం మొదలయ్యింది. టస్మాక్ కుంభకోణం ప్రధాన రాజకీయ ఘర్షణలకు దారితీసింది. ప్రతిపక్ష పార్టీలు ఎమ్‌కె స్టాలిన్ నేతృత్వంలోని DMK ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలను చేసింది. తమిళనాడు బిజెపి చీఫ్, కె అన్నామలై… తమిళనాడు ఎక్సైజ్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీని అవినీతి నెట్‌వర్క్‌కు “కింగ్‌పిన్” అని పేర్కొన్నారు. అయితే, మంత్రి సెంథిల్.. ఈ ఆరోపణలను నిరాధారమైనవిగా తోసిపుచ్చారు. మద్యంలో విషయంలో ఎటువంటి అవకతవకలు లేవని అన్నారు. ఈడీ దీనిపై ఒక ఇమేజ్‌ను సృష్టించడానికి ప్రత్నిస్తుందని అన్నారు. అయితే, “టస్మాక్ కుంభకోణం ఢిల్లీ మద్యం కుంభకోణం కంటే కూడా పెద్దది” అని అన్నామలై విమర్శనాస్త్రాలు సంధించారు.
కుంభకోణం వెయ్యి కోట్లు కాదు, రూ.40 వేల కోట్లన్న AIADMK
తమిళనాడు బిజెపి ఈ అవినీతిపై పోరాటాన్ని ఉధృతం చేసే దిశగా పలు కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. మార్చి 17న ఈ కుంభకోణానికి వ్యతిరేకంగా టస్మాక్ ప్రధాన కార్యాలయం దగ్గర నిరసనకు దిగారు. అయితే, నిరసనలో పాల్గొన సీనియర్ బిజెపి నాయకురాలు తమిళిసై సౌందరరాజన్‌ను తమిళనాడు పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో రాజకీయాలు మరింత వేడక్కాయి. మరోవైపు, ప్రతిపక్ష అన్నాడీఎంకే సభ్యుడు ఎడప్పాడి కె పళనిస్వామి మరో అడుగు ముందుకేస్తూ.. అసలు కుంభకోణం వెయ్యి కోట్లు కాదనీ.. మొత్తం, రూ.40 వేల కోట్ల వరకు అవినీతి జరిగిందని.. కాబట్టి, దీనిపైన ఉన్నత స్థాయి దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు.
టస్మాక్ పారదర్శకంగా పనిచేస్తుందన్న DMK
ఇక, అధికార DMK దీనిపై మండిపడింది. ఏమీ లేని చోట కుంభకోణం జరిగిందని చెప్పడం కుట్రలో భాగమని అన్నారు. రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి సెంథిల్ బాలాజీ, ఇతర డిఎంకె నాయకులు ఈ ఆరోపణలు రాజకీయంగా ప్రేరేపించబడ్డాయని వాదిస్తున్నారు. “టస్మాక్ పారదర్శకంగా పనిచేస్తుందనీ.. రూ.1,000 కోట్ల అవకతవకలు జరిగాయనే వాదనకు ఎటువంటి ఆధారం లేదు” అని మంత్రి సెంథిల్ అంటున్నారు. టస్మాక్‌లో అవినీతి జరిగేందుకు ఎలాంటి ఆస్కారం లేదని చెప్పారు. సోదాల పేరుతో ఈడీ దాడులు చేసిందని.. కానీ ఏ ఏడాదిలో ఎఫ్ఐఆర్ నమోదు చేసిందో పేర్కొనలేదని తెలిపారు.
గత 4 ఏళ్లుగా బార్ల టెండర్లను ఆన్‌లైన్‌లోనే ప్రాసెస్
టస్మాక్ రిక్రూట్‌మెంట్‌లో అవకతవకల పేరిట కేసు నమోదు చేసిన ఈడీ.. ఏదో చేయాలని ప్రయత్నిస్తుందనీ.. గత 4 ఏళ్లుగా బార్ల టెండర్లను ఆన్‌లైన్‌లోనే ప్రాసెస్ చేస్తున్నామని.. ఎలాంటి ఆధారాలు లేకుండా రూ.1000 కోట్ల స్కామ్ జరిగిందని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి సెంథిల్ బాలాజీ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని డీఎంకే నేతలు ఆరోపిస్తున్నారు.
తమిళనాడు ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మధ్య కోల్డ్ వార్
తమిళనాడు ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మధ్య కొంత కాలంగా నడుస్తున్న కోల్డ్ వార్ నేపధ్యంలో.. ఈ దాడులు సరైన సమయం చూసి కొట్టిన దెబ్బలా అనిపిస్తోందనడంలో సందేహం లేదు. గత అనుభవాలు చూస్తుంటే.. దీన్ని మోడీ పెట్టిన టార్గెట్‌గా అనుకున్నప్పటికీ.. తమిళనాడులోని మరో వర్గం ఈ కేసులో కొత్త కోణాన్ని వెదుకుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అంతమందిని అరెస్ట్ చేసారు కానీ.. తమిళనాడులో మాత్రం ఇప్పటి వరకూ ఎలాంటి అరెస్ట్‌లు లేకపోగా.. భారీ మోసాన్ని కుదించి చూపిస్తున్నారని ఆరోపిస్తున్నారు. డిఎంకే, బిజెపీల మధ్య లోపాయికారి ఒప్పందం ఏదో ఉందనే విచిత్ర వాదన తీసుకొస్తున్నారు.
మనీలాండరింగ్ నిరోధక చట్టం-2002 కింద ఈడీ దాడులు
టస్మాక్‌పై మనీలాండరింగ్ నిరోధక చట్టం-2002 కింద ఈడీ దాడులు నిర్వహించింది. ఆ తర్వాత… లంచం, టెండర్ల తారుమారు, అక్రమ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన నేరారోపణ పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ తెలిపింది. రిటైల్ అవుట్‌లెట్‌లు MRP కంటే బాటిల్ మీద రూ.10 రూపాయల నుండి రూ. 30 రూపాయల వరకూ ఎక్కువ వసూలు చేస్తున్నాయని.. ఇందులో టస్మాక్ అధికారుల ప్రమేయం ఉందని ఆరోపించింది. ఇక, డిస్టిలరీలు నిర్దేశించిన పరిమాణం కంటే ఎక్కువ ఆల్కహాలిక్ పానీయాలను ఉత్పత్తి చేస్తున్నాయనీ.. అదనపు సీసాలు అవసరం కాబట్టి, నకిలీ సీసాలు, మూతలు మరియు హోలోగ్రామ్ స్టిక్కర్లను తయారు చేయడం వలన అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వచ్చాయి.
ఆధారాలు బయటపడిన తర్వాత తదుపరి చర్యలు
దీనిపై ఈడీ పెద్ద ఎత్తున దర్యాప్తు ప్రారంభించింది. టస్మాక్ ప్రధాన కార్యాలయం, కుంభకోణంతో సంబంధం ఉన్న ప్రైవేట్ డిస్టిలరీలు, ప్రభుత్వ అధికారుల కార్యాలయాల్లో మల్టీ రైడ్స్ నిర్వహించిన ఈడీ… మరిన్ని ఆధారాలు బయటపడిన తర్వాత తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. అయితే, దీనికి సంబంధించి.. త్వరలో అధికార డీఎంకే పార్టీ నాయకుల ప్రమేయంపై మరిన్ని అరెస్టులు జరిగే అవకాశముందని పొలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తుంది.
మార్చి 6న ఎగ్మోర్‌లో మొదటిసారి ఈడీఅధికారులు దాడులు
ఈ నెల, మార్చి 6న ఎగ్మోర్‌లోని పలు ప్రాంతాల్లో మొదటిసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. వాటిలో టస్మాక్ ప్రధాన కార్యాలయం, DMK ఎంపీ ఎస్. జగద్రక్షకన్‌కు చెందిన మద్యం కంపెనీ అకార్డ్ డిస్టిలర్స్ అండ్ బ్రూవర్స్ కార్యాలయం ఉన్నాయి. అయితే, అదే రోజు, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఎక్స్ వేదికగా..ముఖ్యమంత్రి స్టాలిన్‌ను విమర్శిస్తూ, “తమిళనాడును అవినీతి దేశంగా మార్చి, ప్రభుత్వ సంస్థలను కమిషన్ కేంద్రాలుగా నడపడం వల్లే ఈరోజు టస్మాక్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహించింది” అని విమర్శించారు.
తమిళనాడు ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకోస్తుందనే ఈ దాడులు
దీనిపై ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ స్పందిస్తూ, “త్రిభాషా విధానం విధించడం, నిధుల పంపిణీలో వివక్షత చూపిస్తున్నారని తమిళనాడు ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకోస్తుందని… దాని నుండి దృష్టిని మళ్లించడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ద్వారా టస్మాక్ ప్రధాన కార్యాలయంలో దాడులు నిర్వహిస్తోంది” అని అన్నారు.
మార్చి 14న రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో కుంభకోణంపై నిరసనలు
అయితే, మద్యం కుంభకోణం అంశం వెలుగుచూసిన తర్వాత తమిళనాడు రాజకీయ పరిణామాలు మారాయి. మార్చి 14వ తేదీ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో.. ఈ కుంభకోణంపై రాజకీయ నిరసనలు చెలరేగాయి. తమిళనాడు ఆర్థిక శాఖ మంత్రి తంగమ్ తెనరసు అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న సమయంలోనే ప్రతిపక్ష అన్నాడీఎంకే సభను అడ్డుకుంది. లిక్కర్ స్కామ్‌పై డీఎంకే ప్రభుత్వం వివరణ ఇవ్వాలని.. దానిపై సభలో చర్చ జరగాలని పట్టుబట్టింది. అందుకు స్పీకర్ ఒప్పుకోకపోవడంతో.. అన్నాడీఎంకే సభ నుంచి వాకౌట్ చేసింది.
ముఖ్యమంత్రి పదవికి స్టాలిన్ రాజీనామా చేయాలని డిమాండ్
లిక్కర్ స్కామ్, ఇతర అవినీతి ఆరోపణలపై డీఎంకే ప్రభుత్వం నైతిక బాధ్యత వహించి.. ముఖ్యమంత్రి పదవికి స్టాలిన్ రాజీనామా చేయాలని ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి డిమాండ్ చేశారు. తమిళనాడు బడ్జెట్‌లో సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఇతర ప్రాజెక్టులకు భారీగా నిధులను కేటాయించారు. మరీ ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉద్యోగకల్పన, ఇతర మౌలిక వసతుల ప్రాజెక్టులు అందులో ఉన్నాయి. అయితే, డిఎంకె ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతోందని ఆరోపిస్తూ బిజెపి శాసనసభ్యులు వాకౌట్ చేశారు.
వెయ్యి కోట్లు ఎవరెవరికి అందిందో సీఎం చెప్పాలని డిమాండ్
డిఎంకె పార్టీ తమ లిక్కర్ స్కామ్‌ను కనిపించకుండా చేయడం కోసం.. భాషా రాజకీయాలపై దృష్టి మరల్చేందుకు ప్రయత్నిస్తుందని బిజెపి నేతలు విమర్శిస్తున్నారు. ఈడీ దాడులు, లిక్కర్ స్కామ్ లాంటి అంశాల నుంచి తమిళనాడు ప్రజల దృష్టి మరల్చేందుకు ముఖ్యమంత్రి స్టాలిన్ త్రిభాషా విధానం, కొత్త విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ.. వాటిపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్ఈపీ, డీలిమిటేషన్, బడ్జెట్ పత్రాల నుంచి.. రూపాయి గుర్తును తొలగించడం వంటి అంశాల వరకూ.. లిక్కర్ స్కామ్‌ను తప్పుదోవ పట్టించడానికి స్టాలిన్ ప్రయత్నిస్తున్నారని బీజేపీ నేతలు నిప్పులు చెరుగుతున్నారు.
లిక్కర్ స్కామ్ 1000 కోట్లు..?
ఈ క్రమంలో.. తమిళనాడులో డిస్టిలరీ కంపెనీలు.. దాదాపు రూ.1000 కోట్లు లంచాలను కొంత మంది వ్యక్తులకు చెల్లించినట్లు తెలిసిందని భారతీయ జనతా పార్టీ ఐటీ సెల్ జాతీయ కన్వీనర్ అమిత్ మాల్వియా సామాజిక మాధ్యమాల వేదికగా తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ రూ.వెయ్యి కోట్ల డబ్బు ఎవరెవరికి అందిందో సీఎం స్టాలిన్ తెలియజేయాలని డిమాండ్ చేశారు.
ఛత్తీస్‌గఢ్ కుంభకోణంలో ఈ విధంగానే ఛార్జిషీట్
ఇక, ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన మద్యం కుంభకోణంలో కూడా ఈ విధంగానే ఛార్జిషీట్ దాఖలు అయ్యిందని బిజెపి నేతలు చెబుతున్నారు. ఇక్కడ కూడా అవినీతి జరిగినందువల్లే బిజెపి ధైర్యంగా మాట్లాడుతోందని అంటున్నారు. ఛత్తీస్‌గఢ్‌ను మించిన అతిపెద్ద అవినీతి తమిళనాడులో జరిగిందనీ.. వీళ్ళు ఎక్కడికీ పారిపోలేరనీ.. ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ఈ దర్యాప్తును నిష్పాక్షికంగా నిర్వహించాలని అంటున్నారు. ఇక, ఈ అవినీతిలో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ అరెస్టు చేసి జైలులో పెట్టాల్సిందిగా విపక్షాలు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా, ఎక్సైజ్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ బెయిల్‌ను రద్దు చేయడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ వస్తోంది.
రవాణా రంగంలో అవినీతి కేసులో బెయిల్‌పై ఉన్న మంత్రి సెంథిల్
రవాణా రంగంలో అవినీతికి పాల్పడి బెయిల్‌పై బయటకు వచ్చిన మంత్రి సెంథిల్ బాలాజీకి సంబంధించిన మరో శాఖలో కూడా అవినీతి బయటపడటంపై పలు అనుమానాలు కూడా వస్తున్నాయి. ఇక, సీఎం స్టాలిన్‌కు తెలియకుండా ఇంత పెద్ద కుంభకోణం జరిగే అవకాశం లేదనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. అందుకే, ఈ వ్యవహారంలో అసలు ఆరోపణలకు సంబంధించిన అన్ని కేసులను తమిళనాడు ప్రభుత్వం వెంటనే CBI దర్యాప్తుకు బదిలీ చేయాలని విపక్ష నేతలు పట్టుపడుతున్నారు.
నామ్ తమిళ్ పార్టీ సమన్వయకర్త సీమాన్ కొత్త వాదన
అయితే, నామ్ తమిళ్ పార్టీ సమన్వయకర్త సీమాన్ ఇక్కడ సరికొత్త వాదనను తీసుకొచ్చారు. తమిళనాడులో మద్యం కుంభకోణం లక్ష కోట్ల రూపాయలకు పైగా ఉండగా… డీఎంకే ప్రభుత్వాన్ని రక్షించే లక్ష్యంతో, బీజేపీ ప్రభుత్వ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును రూ.1,000 కోట్లకు తగ్గించిందని సంచలన కామెంట్లు చేసారు. DMK ప్రభుత్వ అగ్ర మంత్రులలో ఒకరైన పళనివేల్ త్యాగరాజన్ ఒక ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో..”టస్మాక్ మద్యం అమ్మకాల్లో 50% కంటే ఎక్కువ లెక్కలు లేకుండా, చట్టవిరుద్ధంగా అమ్ముడవుతున్నాయని ప్రకటించారనీ.. ఇదే DMK ప్రభుత్వ మద్యం అవినీతికి తిరుగులేని సాక్ష్యం” సిమాన్ వాదిస్తున్నారు.
ఈడీ రూ.1,000 కోట్లకు తగ్గించిందని సంచలన కామెంట్లు
ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం చేపట్టిన మద్యం కుంభకోణంలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాని, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసి జైలులో పెట్టింది. చాలా నెలల పాటు విచారించింది. అదేవిధంగా, తెలంగాణ రాష్ట్ర మద్యం కుంభకోణంలో అధికార కేంద్రంగా ఉన్న అప్పటి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కుమార్తె కవితను కూడా అరెస్టు చేసి ప్రశ్నించారు. కానీ, నాలుగేళ్ల DMK పాలనలో జరిగిన మద్యం కుంభకోణంపై దర్యాప్తును విస్తరించడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎందుకు ఎటువంటి చర్య తీసుకోవట్లేదని నామ్ తమిళ్ల పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
ఈడీని బిజెపి కేవలం రాజకీయ లబ్ది కోసం ఉపయోగిస్తుందా?
ఇక, ప్రతిపక్ష పార్టీలు చేసిన అవినీతి, అక్రమాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బహిర్గతం చేయడాన్ని బిజెపి ప్రభుత్వం కేవలం రాజకీయ లబ్ది కోసం ఉపయోగిస్తుందా? అనే వాదనలు కూడా వస్తున్నాయి. అందుకే డీఎంకే ప్రభుత్వం చేసిన అవినీతిని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ద్వారా తక్కువ చేసి కప్పిపుచ్చడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని.. ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం డిఎంకె ప్రభుత్వం పట్ల మాత్రమే అంత ఉదాసీనంగా ఉందనీ.. పూర్తి దర్యాప్తు జరపకుండానే రూ.1,000 కోట్లు మాత్రమే అవినీతి కేసును పెట్టి, హడావిడి చేస్తుందని ఒక వర్గం వాదిస్తోంది.
దర్యాప్తు జరపకుండానే రూ.1,000 కోట్లు మాత్రమేనని ఎలా చెప్పారు?
అలాగే, ప్రజలు కట్టే ట్యాక్స్‌ల గురించి ఈడీకి నిజంగా ఆందోళన ఉంటే.. ఇతర రాష్ట్రాల మద్యం కుంభకోణాలలో చూపిన వేగం, తీవ్రతను డిఎంకె ప్రభుత్వ మద్యం కుంభకోణ దర్యాప్తులో చూపించడానికి ఎందుకు వెనుకాడుతోందనే ప్రశ్నలు వస్తున్నాయి. అయితే, దీన్ని బిజెపి, డిఎంకె మధ్య రహస్య సంబంధం అంటూ విచిత్ర వాదనను తీసుకొస్తున్నారు. అయితే, ఇన్ని వాదోపవాదల మధ్య నిజమేంటో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాలి. అయితే, ఇది తమిళనాడు ఎన్నికలకు ముందే ఒక కొలిక్కి వస్తుందా లేదా అన్నది ఆసక్తిని రేపుతుంది.