Big Shock to YS Jagan: శాసనసభలో బలం లేకపోవడంతో అసెంబ్లీకి డుమ్మా కొట్టిన వైసిపి.. శాసనమండలిలో బలం ఉండడంతో అక్కడ హడావుడి చేయాలని చూసింది. అయితే బడ్జెట్ సమావేశాల్లో అక్కడ కూడా ఆ పార్టీ ప్రభావం చూపించలేకపోయింది. మరోవైపు మండలిలో తన టీమ్‌ని నమ్ముకున్న జగన్‌కి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. అక్కడ కూడా రోజురోజుకీ ఆ పార్టీ బలం తగ్గుతూ వస్తుంది.. దాంతో శాసనమండలిలో కూడా జగన్‌కు చిక్కులు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.
ఓటమితో కుంగి పోతున్న వైసీపీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే పలువురు ముఖ్యనేతలు ఆ పార్టీని వీడగా.. తాజాగా ఏలూరు జిల్లా కైకలూరుకు చెందిన జయమంగళ వెంకటరమణ ఎమ్మెల్సీ పదవికి, వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి జగన్‌కి షాక్ ఇచ్చారు. తనను నమ్ముకున్న కొల్లేరు ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నానని ఆ మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. కొల్లేరు సమస్య పరిష్కారానికి అధికారంలో ఉండగా అనేకసార్లు జగన్‌ను కలుద్దామని ప్రయత్నించినా.. కనీసం అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ దృష్టికి ఏదైనా సమస్యలు తీసుకెళ్తే, సజ్జల, అప్పిరెడ్డి, ధనుంజయరెడ్డిలతో చెప్పుకోమనే వారని విమర్శించారు
తన అభిమానులను వైసీపీ నాయకులే కొట్టి.. బాధితులపైనే కేసులు నమోదు చేసినా, ఏం చేయలేకపోయామని జయమంగళ వెంకటరమణ వాపోయారు. తాను ఎమ్మెల్సీగా ఉన్నా, అధికారం లేదని.. పోలీసులు, రెవెన్యు అధికారులు కనీసం స్పందించలేదన్నారు. కొల్లేరు వాసులకు జరుగుతున్న అన్యాయాన్ని సహించలేక పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్లు వివరించారు. ఇకపై కొల్లేరు ప్రజల కోసం పోరాడతానని ప్రకటించారు.
త్వరలో తన అభిమానులతో సమావేశం నిర్వహించి, భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని వెంకటరమణ తెలిపారు. తన రాజీనామా పత్రాలను శాసనమండలి అధ్యక్షుడికి, పార్టీ కార్యాలయానికి పంపినట్లు వెల్లడించారు. జయమంగళ వెంకటరమణ 2009లో టీడీపీ నుంచి పోటీ చేసి కైకలూరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో పొత్తుల్లో భాగంగా ఆ సీటు బీజేపీకి దక్కడంతో పోటీ చేయలేకపోయారు. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి మూటగట్టుకున్నారు. తర్వాత 2023లో వైసీపీలో చేరిన ఆయన ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ అయ్యారు.
తాజాగా జయమమంగళ రాజీనామాతో మండలిలో వైసీపీ నుంచి మరో వికెట్ పడినట్లైంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీ కోలుకోలేక పోతుంది. 11 మంది శాసనసభ్యులు ఉన్న వైసీపీ ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం పట్టుబడుతూ అసెంబ్లీ బడ్జెట్ సమాశాలకు డుమ్మా కొట్టింది. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే సభకు వస్తానని ప్రకటించిన జగన్.. పార్టీ ఎమ్మెల్యేలను కూడా కట్టడి చేస్తున్నారు . శాసనమండలిలో మంచి మెజార్టీ ఉండటంతో అక్కడ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ఆ పార్టీ భావించింది.
Also Read: టీడీఅర్ బాండ్స్ కుంభకోణం నీరు గారినట్టేనా..?
58 మంది సభ్యులు గల శాసనమండలిలో 40 పైగా స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది.. టిడిపి జనసేన కలిపి పది స్థానాలు ఉండగా.. ఇండిపెండెంట్‌లు, పీడీఎఫ్ సభ్యుల కలిపి ఆరుగురు ఉన్నారు. ఇప్పటికే వైసీపీకి పోతుల సునీత, పద్మశ్రీ, కళ్యాణ్ చక్రవర్తి లు రాజీనామా చేయగా వారి రాజీనామాలు ఇంకా ఆమోదించలేదు. తాజాగా జయ మంగళ వెంకటరమణతో ఆ పార్టీకి మరో దెబ్బ తగిలింది. అంత మంది సభ్యులు ఉన్నా శాసనమండలిలో తమ గళాన్ని వినిపించడంలో వైసీపీ సభ్యులు పూర్తిగా విఫలమయ్యారు. బొత్స సత్యనారాయణ, వరుదుల కళ్యాణి తప్ప మండలిలో ఇంకెవరూ నోరెత్తే ప్రయత్నం చేయలేదు.
శాసన మండలిలో కూడా బిల్లులు పాస్ అవ్వాల్సి ఉండటంతో.. అక్కడ వైసీపీ బలం తగ్గించడం కూటమి సర్కారుకి అవసరం. ఎన్నికల ముందు నలుగురు ఎన్నికల తర్వాత నలుగురు శాసనమండలి సభ్యత్వానికి పార్టీకి, వైసీపీకి చేశారు. త్వరలో మరికొందరు రాజీనామా చేస్తారని మండలిలో చర్చ జరుగుతుంది. సమీప కాలంలో మండలిలో కూడా వైసీపీని నామమాత్రం చేయడానికి ప్రభుత్వం స్కెచ్ గీస్తుంది. ఎమ్మెల్సీ పదవుల్లో ఉన్న ఎవరినీ కూటమి పార్టీలు దగ్గరకు రానీయడం లేదు. పదవులకు రాజీనామా చేస్తేనే గేట్లు తెరుస్తున్నారు. ఎన్నికల ముందు తమ రాజీనామాలు ఆమోదం పొందిన వైసీపీ మాజీలు కూటమి విజయానికి ప్రచారం చేశారు.
శాసన మండలి సభ్యులను రాజీనామా చేయించి తర్వాత ఎన్నికకు వెళ్లి బలం పెంచుకోవాలని కూటమి ప్రభుత్వం చూస్తుంది. మార్చిలో జరగనున్న బడ్జెట్ సమావేశాలు ప్రభుత్వానికి కీలకమైనవి. అప్పుడు పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టే సమయంలో మండలిలో ఇబ్బందులు ఎదురుకాకుండా ప్రభుత్వం జాగ్రత్త పడాలని చూస్తుంది. అందులో భాగంగా ఉగాది నాటికి వైసీపీ బలం మండలిలో పూర్తిగా తగ్గించాలని భావిస్తున్నారంట. ముఖ్యమంత్రి చంద్రబాబు సదరు బాధ్యతలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నిమ్మల రామానాయుడులకు అప్పగించినట్లు తెలుస్తుంది. ఆ క్రమంలో తాజాగా రాజీనామా చేసిన జయమంగళ వెంకటరమణ రాజీనామా ఆమోదం పొందాక జనసేనలో చేరతారన్న ప్రచారం జరుగుతుంది.