BigTV English

Kakani Govardhan Reddy: మాజీ మంత్రి కాకాణి కేసుల్లో.. సరికొత్త ట్విస్ట్

Kakani Govardhan Reddy: మాజీ మంత్రి కాకాణి కేసుల్లో.. సరికొత్త ట్విస్ట్

Kakani Govardhan Reddy: కేసుల మీద కేసులు.. రిమాండ్ల మీద రిమాండ్లతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు ఆ మాజీ మంత్రి. బెయిల్ కోసం ఎదురుచూస్తూ జైలు గోడల మధ్య భారంగా కాలాన్ని వెళ్లదీస్తున్నారాయన. ఏపీలోని కూటమి ప్రభుత్వం కావాలని తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆ మాజీ మంత్రి ఆరోపిస్తున్నారు కూడా. కానీ, ట్విస్టు ఏంటంటే.. సొంత పార్టీ నేతలే ఆయన్ను ఇరికించారన్న చర్చ లేటెస్ట్‌గా జిల్లాలో మొదలైందట. అసలు ఎందుకీ పరిస్థితి..? సొంత పార్టీ వాళ్లే ఆయన్ను కేసుల్లో ఇరికించడం వెనుక కారణమేంటి..?


వైసీపీ హయాంలో ఓ వెలుగు వెలిగిన కాకాణి

కాకాణి గోవర్థన్ రెడ్డి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో.. ఆ మాటకు వస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్దగా పరిచయం అక్కర్లేని నేత. వైసీపీ హయంలో మంత్రిగా ఓ వెలుగు వెలిగిన నేత. అలాంటి కాకాణికి అధికారం పోయాక చాలా కష్టాలే వచ్చాయి.


వరుస కేసులతో మాజీ మంత్రి కాకాణి ఉక్కిరిబిక్కిరి

ఈ మాజీ మంత్రి ప్రస్తుతం కేసుల మీద కేసులు, రిమాండ్ల మీద రిమాండ్‌లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారట. అయితే.. కూటమి ప్రభుత్వం కావాలనే తనపై కేసులు బనాయిస్తోందని.. కావాలనే ఇదంతా చేస్తోందని ఆరోపిస్తున్నారు మాజీ మంత్రి కాకాణి. ఆయన అనుచరులది సైతం ఇదే మాట.

పవర్ పోయాక వరుస కేసులతో ఇబ్బందులు

వైసీపీ పవర్‌లో ఉన్నప్పుడు..అధికారం అడ్డుపెట్టుకొని కాకాణి చేసిన అవినీతి, అక్రమాలు అంతా ఇంతా కాదనే విమర్శలు ఉన్నాయి. అధికార దాహంతో అమాయకులను, అభాగ్యులను అన్ని రకాలుగా ఇబ్బందులకు గురిచేశారని మాజీ మంత్రి కాకాణిపై ఎన్నో ఆరోపణలు చేశాయి నాటి విపక్షాలు. అవే ఇప్పుడు శాపాల్లా వెంటాడుతున్నాయని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పలుమార్లు విమర్శలు గుప్పించారు.

కాకాణి కేసుల్లో సరికొత్త ట్విస్ట్

ఇలాంటి వేళ.. మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి కేసుల ఎపిసోడ్‌లో సరికొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఇప్పటి వరకు కూటమి పార్టీలు కావాలని, కక్ష్యతో కాకాణిని టార్గెట్‌గా చేసుకొని కేసులు పెట్టిస్తున్నాయని విమర్శించారు వైసీపీ నేతలు. కానీ, కాకాణిని సొంత పార్టీ నేతలే కేసుల్లో ఇరికించారన్న అంశం ఉమ్మడి నెల్లూరు జిల్లా రాజకీయాల్లోనే కాదు..ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇంకా చెప్పాలంటే వైసీపీ జమానాలో నమోదైన ఓ కేసు కారణంగానే మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ఇప్పుడు రిమాండ్‌లో ఉన్నారట.

రుస్తుం, భారత్‌మైన్స్‌లో అక్రమ మైనింగ్ వ్యవహారం

కాకాణిపై ఉన్న కేసులను ఓసారి పరిశీలిస్తే.. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం వరదాపురం సమీపంలోని రుస్తుం, భారత్ మైన్స్ లలో లీజు ముగిసినా అక్రమంగా మైనింగ్ చేసి.. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 250 కోట్ల రూపాయల మేర క్వార్ట్జ్‌ను కొల్లగొట్టారని పొదలకూరు పోలీస్ స్టేషన్‌ కేసు నమోదైంది. ఇందులో విచారణకు హాజరు కావాలని కాకాణికి మూడుసార్లు నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ నోటీసులకు మాజీ మంత్రి స్పందించలేదు. చివరకు బెంగళూరులో ఆయన్ను అరెస్ట్ చేయగా మే 26న వెంకటగిరి కోర్టు ఆయన్ను రిమాండ్‌కు తరలించాలని ఆదేశించింది. ఇక అప్పటి నుంచి కాకాణి జైలు గోడల మధ్యే ఉంటున్నారు.

ఐదు కేసుల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న కాకాణి

సోమిరెడ్డిపై ఇతరులు చేసిన అసభ్యకరమైన పోస్టులు.. మార్ఫింగ్ చేసిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన కేసులోనూ సీఐడీ కేసు నమోదు చేసింది. మొత్తంగా చూస్తే మొత్తం 5 కేసుల్లో నెల్లూరు సెంట్రల్ జైల్లో కాకాణి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇందులో ఒక్క కేసులో మాత్రమే బెయిల్ మంజూరైంది. ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేసి గ్రావెల్ తరలించిన కేసులో 2వ అదనపు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మిగిలిన నాలుగు కేసుల్లో ఆయన తరపు న్యాయవాదులు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు.

కృష్ణపట్నం పోర్టులో అనధికార టోల్‌గేట్ ఏర్పాటు కేసు

కృష్ణపట్నం పోర్టులో అనధికార టోల్‌ గేటు ఏర్పాటు చేసి కోట్లు వసూలు చేశారన్న కేసుతో పాటు కనుపూరు చెరువులో మట్టి అక్రమంగా తరలించారనే కేసులు కాకాణికి సంబంధించి కీలకమైనవి. ఇందులో భాగంగానే ఈనెల 30, జులై ఒకటో తేదీన ముత్తుకూరు పోలీసులు కాకాణిని.. కృష్ణపట్నం పోర్టు వద్ద టోల్‌గేట్ ఏర్పాటు కేసు అంశంపై విచారించనున్నారు. టోల్‌ ఏర్పాటు చేయడంలో ఎవరెవరి ప్రమేయం ఉంది.. ఎలాంటి వసూళ్లకు పాల్పడ్డారు.. ఏ స్థాయిలో లావాదేవీలు జరిగాయి.. అనే అంశంపై ప్రశ్నల వర్షం కురిపించనున్నారు ఖాకీలు.

ఓ మాజీ మంత్రికి, కాకాణికి మధ్య వచ్చిన తేడా ఎఫెక్ట్

ఇవన్నీ ఒక ఎత్తైతే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీ ముఖ్య నేతలు పెట్టిన ఓ కేసులోనే ఇప్పుడు కాకాణి ఊచలు లెక్కపెడుతున్నారన్న విషయం లేటెస్ట్‌గా వెలుగులోకి వచ్చింది. వైసీపీ పాలనలో ఓ మాజీ మంత్రికి, కాకాణికి మధ్య లెక్కల్లో తేడా రావడంతో ఇద్దరి‌ మద్య విభేదాలు తలెత్తాయిట. దాంతో ఆ ముఖ్య నేతలే కాకాణిపై వేరే మార్గంలో కేసు పెట్టించారని ప్రచారం జోరుగా సాగుతుంది. 2021 సమయంలో కాకాణిపై పెట్టిన అక్రమ గ్రావెల్స్ తరలింపు కేసు ఇందులో భాగమేనన్న టాక్ ఇప్పుడు విన్పించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే..అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండడంతో ఎవరూ దీనిని పెద్దగా పట్టించుకోలేదట. కానీ, కూటమి సర్కారు రావడం, వరుసగా కేసులు నమోదు కావడంతో ఈ విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చిందని చెబుతున్నారు నేతలు.

అక్రమ గ్రావెల్స్ తరలింపు కేసులో చిక్కుకున్న కాకాణి

కేవలం ఇదే కాదు.. వైసీపీలో కీలక పాత్ర పోషించిన, మాజీ మంత్రిగా పనిచేసిన కాకాణి ఇన్ని రోజులుగా జైలులో ఉంటున్నా ముఖ్యమైన నేతలు, కుటుంబ సభ్యులు సైతం ఎవరూ పరామర్శించేందుకు రాకపోవడం పైనా జిల్లాలో పెద్ద చర్చే నడుస్తోందట. మొత్తంగా కాకాణి ఎపిసోడ్‌లో రోజులు గడిచే కొద్దీ కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తుండడం సంచలనంగా మారుతోంది.

Story By Rajashekar, Bigtv Live

 

Related News

BJP Leaders Fights: డీకే అరుణ Vs శాంతి కుమార్.. పాలమూరు బీజేపీలో పంచాయితీ

TG Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం.. కేసీఆర్ మైండ్ గేమ్

Tirupati TDP: తిరుపతిలో టీడీపీకి దిక్కెవరు?

India-China Thaw: భారత్‌‌‌‌తో చైనా దోస్తీకి సై.. రెండు దేశాల మధ్య ఏం జరుగుతోంది?

Giddalur Politics: గిద్దలూరు వైసీపీలో అయోమయం.. నాగార్జున ఫ్యూచర్ ఏంటి?

Pakistan Army: పాక్ పరేషాన్ ఫోర్స్..! చైనా సపోర్ట్‌‌తో మునీర్ కొత్త ప్లాన్..?

Big Stories

×