MLC Elections: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణలో వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలపై బీజేపీ అధిష్ఠానం ప్రత్యేక దృష్టి సారించింది. వచ్చే ఎన్నికలకు పార్టీకి మరింత ఊపు తీసుకొచ్చేలా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటాలని రాష్ట్ర నాయకత్వానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ స్పష్టమైన దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీలో తెలంగాణ బీజేపీకి చెందిన కీలక నేతలతో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికల అంశం ప్రధానంగా చర్చకు వచ్చినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించాలని నితిన్ నబీన్ రాష్ట్ర నేతలకు స్పష్టం చేసినట్లు సమాచారం. కేవలం ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకోవడమే కాకుండా.. ఆ ఫలితాలు భవిష్యత్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలపై ప్రభావం చూపేలా ఉండాలని ఆయన సూచించినట్లు తెలిసింది. గతంలో పార్టీ రెండు ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకున్న విషయాన్ని ప్రస్తావించిన అధిష్ఠానం.. అదే జోరును కొనసాగిస్తూ మరిన్ని స్థానాల్లో విజయానికి వ్యూహాలు రచించాలని ఆదేశించినట్లు సమాచారం.
ఎమ్మెల్సీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్..
కాషాయ పార్టీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందడి అప్పుడే మొదలైంది. వచ్చే ఏడాది ఉమ్మడి హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్, ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్గొండ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది. ఈ స్థానాలకు ఫిబ్రవరి లేదా మార్చిలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో బీజేపీ రాష్ర్ట నాయకత్వం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ రెండు స్థానాలను కైవసం చేసుకునేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ఎమ్మెల్సీ టికెట్‌ను దక్కించుకునేందుకు రాష్ర్ట బీజేపీ నేతలు నిమగ్నమయ్యారు. ఎవరికీ వారు రాష్ర్ట, ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ మొదలుపెట్టినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అభ్యర్థుల ఎంపికపై కసరత్తు..
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్, ఉమ్మడి వరంగల్-నల్లగొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి అనుకూల వాతావరణం ఉందన్న ధీమాతో రాష్ట్ర నాయకత్వం అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గంపై పార్టీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ స్థానం నుంచి బరిలో బీజేపీ రాష్ట్ర ప్రధాన అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్, సీనియర్ నేత ప్రకాశ్ రెడ్డి, డోకూర్ పవన్‌కుమార్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధులు అమర్‌నాథ్ సారంగుల, పోరెడ్డి కిశోర్ రెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు గంగాపురం వెంకట్ రెడ్డి, శ్రీవర్ధన్ రెడ్డి, ఓఎస్ రెడ్డి, మల్లారెడ్డి తదితర నేతలు కూడా ఎమ్మెల్సీ టికెట్ కోసం ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.
ఎమ్మెల్సీ స్థానంపైనా బీజేపీ దృష్టి
దీంతో ఆయా స్థానాల్లో పార్టీ అభ్యర్థిగా ఎవరిని బరిలోకి దించాలనే అంశంపై రాష్ట్ర నాయకత్వం విస్తృతంగా సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణాలు, వ్యక్తిగత బలగం, పట్టభద్రుల్లో ఉన్న పరిచయాలు, గత ఎన్నికల్లో వారి పనితీరు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంపైనా బీజేపీ దృష్టి సారించింది. ఈ స్థానం నుంచి బరిలో ప్రకాశ్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, పోరెడ్డి కిశోర్ రెడ్డి తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ప్రకాశ్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు తమ తొలి ప్రియారిటీ హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ కే ఇస్తున్నట్లు చెబుతున్నారు. అనివార్య కారణాల వల్ల లేదా సామాజిక, రాజకీయ కారణాల వల్ల అక్కడి నుంచి అవకాశం ఇవ్వకుంటే ఉమ్మడి వరంగల్-నల్లగొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగేందుకైనా సిద్ధమనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ స్థానంలో పార్టీకి అనుకూలంగా ఉన్న ఓటర్లను సమీకరించడంతో పాటు బలమైన అభ్యర్థిని రంగంలోకి దించేందుకు నాయకత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
వైఫల్యాలపై పోరాటానికి సిద్ధం..?
పట్టభద్రుల ఎన్నికలు కావడంతో వారంతా తమవైపే ఉంటారని పార్టీ భావిస్తోంది. దానికి తోడు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు తమకు అడ్వాంటేజీగా మారుతాయని ధీమాగా ఉన్నాయి. త్వరలో ఈ వైఫల్యాలపై పోరాటాన్ని చేపట్టేందుకు కమలదళం సిద్ధమవుతోంది. పట్టభద్రుల నియోజకవర్గాల్లో బీజేపీకి సంప్రదాయంగా ఉన్న మద్దతును మరింత పెంచుకోవాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత, నిరుద్యోగం, ఉద్యోగ అవకాశాలు, యువత సమస్యలు వంటి అంశాలను ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తూ పట్టభద్రులను ఆకట్టుకునేలా కార్యాచరణ రూపొందించే అవకాశం ఉంది. మొత్తంగా ఎమ్మెల్సీ ఎన్నికలను భవిష్యత్ ఎన్నికలను ప్రభావితం చేసేలా గెలుపు ఉండాలని అభ్యర్థుల ఎంపిక నుంచే పకడ్బందీ వ్యూహంతో ముందుకెళ్లాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
Also Read: క్యూర్ సిటీ స్ట్రీట్ లైట్ల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్.. రంగంలోకి 4 అంతర్జాతీయ సంస్థలు!