Station Bail Scam: స్వేచ్ఛ బ్యూరో: స్టేషన్ బెయిల్ కొందరు పోలీస్ అధికారుల అక్రమ సంపాదనలకు రాచ మార్గంగా మారింది. ఫిర్యాదులు రాగానే నేరారోపణలు ఎదుర్కొంటున్న వారిని లైన్ లోకి తీసుకుంటున్న అధికారులు కొందరు బేరసారాలు చేస్తున్నారు. ఇంత డబ్బు ఇస్తే స్టేషన్ బెయిల్ ఇస్తాం.. లేకపోతే కఠినమైన సెక్షన్ల ప్రకారం కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని చెబుతూ వేలు.. లక్షలు వసూలు చేస్తున్నారు. ఇలాంటి వారిలో కొందరిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేస్తున్నా ఆమ్యామ్యాలకు మరిగిన అధికారులు దొరికినపుడు చూసుకుందాంలే అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు.
పోలీస్ స్టేషన్ నుంచే బెయిల్ ఇచ్చేలా నిబంధనలు..
స్టేషన్ బెయిల్ కు సంబంధించిన మార్గదర్శకాలను సుప్రీం కోర్టు ప్రధానంగా నిందితుల ప్రాథమిక హక్కులను రక్షించడానికి, పోలీసుల ఏకపక్ష అధికారాలకు అడ్డుకట్ట వేయడానికి తీసుకువచ్చింది. మన రాజ్యాంగం ప్రకారం ‘బెయిల్ అనేది ఒక నియమం, జైలు అనేది మినహాయింపు’ అన్న సూత్రం ఆధారంగా 7 సంవత్సరాల కంటే తక్కువ శిక్ష పడే కేసుల్లో నిందితులను అరెస్ట్ చేయకుండా పోలీస్ స్టేషన్ నుంచే బెయిల్ ఇచ్చేలా నిబంధనలను ప్రవేశ పెట్టింది. దీని వెనక ఉన్న ప్రధాన కారణాల్లో ఒకటి రాజ్యాంగం కల్పించిన వ్యక్తిగత స్వేచ్ఛను రక్షించడం. రెండోది బెయిలబుల్ నేరాల్లో స్టేషన్ బెయిల్ పొందడం నిందితుడికి చట్టపరమైన హక్కు కావటం.
జైళ్లలో రద్దీని..
మరో ప్రధాన కారణం జైళ్లల్లో రద్దీని తగ్గించటం. మన జైళ్లలో శిక్ష పడిన వారి కంటే విచారణ ఎదుర్కొంటున్న అండర్ ట్రయల్ ఖైదీల సంఖ్యే చాలా ఎక్కువగా ఉంది. చిన్న చిన్న కేసుల్లో కూడా అరెస్టులు చేయడం వల్ల జైళ్లు నిండిపోతున్నాయి. జైళ్ల శాఖలో సిబ్బంది కొరత ఉండటంతో పలు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇంకో కారణం న్యాయ వ్యవస్థపై భారాన్ని తగ్గించడం. ప్రతి చిన్న నేరానికి నిందితుడు కోర్టు చుట్టూ తిరిగి బెయిల్ తెచ్చుకోవాల్సి వస్తుండటంతో న్యాయస్థానాలపై కోర్టులపై విపరీతమైన భారం పడుతోంది. పోలీసులు అరెస్ట్ చేస్తామని నిందితులను బెదిరించడం, అవినీతికి పాల్పడటం వంటి చర్యలను అరికట్టడానికి సుప్రీం కోర్టు ఈ మార్గదర్శకాలను ఇచ్చింది. బెయిలబుల్ కేసుల్లో బెయిల్ ఇవ్వడం పోలీసుల బాధ్యత అని, దానిని నిరాకరించే హక్కు వారికి లేదని స్పష్టం చేసింది.
అక్రమ సంపాదనలకు..
ఇలా మంచి ఉద్దేశ్యంతో తెచ్చిన ఈ మార్గదర్శకాలను కొందరు అధికారులు అక్రమ సంపాదనలకు ఉపయోగించుకుంటున్నారు. పోలీస్ రికార్డుల ప్రకారమే రాష్ట్రంలో గత ఏడాది 2,28,695 కేసులు నమోదయ్యాయి. వీటిలో ఐపీసీ/బీఎన్ఎస్ ప్రకారం 1,67,018 కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతీ కేసులో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తే ప్రస్తుతం ఉన్న జైళ్లు ఏమాత్రం సరిపోవు. ఈ పరిస్థితిని అవకాశంగా చేసుకుంటూ కొందరు అధికారులు దందాలు చేస్తున్నారు. స్టేషన్ బెయిళ్ల పేరుతో వేలు.. లక్షలు దండుకుంటున్నారు. దీనికోసం ఏకంగా సెక్షన్లనే మార్చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఇవిగో నిదర్శనాలు..
ఇటీవల కీసర పోలీసులు పేదలకు చేరాల్సిన బియ్యాన్ని స్మగ్లింగ్ చేస్తున్న ఓ వ్యక్తిని పట్టుకున్నారు. ఆ తర్వాత సీఐ ఆంజనేయులు, ఎస్ఐ జ్ఞానేందర్ రెడ్డిలు బేరం మొదలు పెట్టారు. కఠినమైనవి కాకుండా 7ఏళ్లలోపు శిక్ష పడే సెక్షన్లు పెట్టి 41సీఆర్పీసీ ప్రకారం విచారణ చేసి స్టేషన్ బెయిల్ ఇస్తామని చెప్పారు. అయితే, ఈ పని చేసి పెట్టటానికి 10 లక్షలు డిమాండ్ చేశారు. 5లక్షలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. అంతకుముందు బేగంపేట ఎస్ఐ సాయి కుమార్, కానిస్టేబుల్ నరేష్ ఈ విధంగానే ఓ వ్యక్తికి స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు12 వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయారు. కామారెడ్డి జిల్లా రాజంపేట ఎస్ఐ ఆంజనేయులు ఇలాగే 30 వేల లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఇలా చెబుతూ పొతే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.
కొన్నిసార్లు కేసులు పెట్టక ముందే..
మరికొన్ని సార్లు కేసులు పెట్టక ముందే కొందరు అధికారులు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారితో డీల్ మాట్లాడుకుంటున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. మీపై ఫలానా ఫిర్యాదు వచ్చింది.. మేం చెప్పినట్టు చేస్తే స్టేషన్ బెయిల్ వచ్చే సెక్షన్ల ప్రకారం కేసులు పెడతామని కేసునుబట్టి పెద్దమొత్తాల్లో డబ్బు ఇచ్చేలా బేరాలు కుదుర్చుకుంటున్నారని పోలీస్ వర్గాలే చెబుతున్నాయి. దీనికోసం కేసుల తీవ్రతను తగ్గించి కేసులు రిజిస్టర్ చేస్తున్నారని అంటున్నాయి. సికింద్రాబాద్ ఇస్కాన్ టెంపుల్ వద్ద మెట్రో రైలు పిల్లర్ల వద్ద తవ్విన గోతులకు సంబంధించిన కేసులో ఇలాంటి ఆరోపణలే వినిపించాయి. వేలాదిమంది ప్రయాణీకుల భద్రతను గాలికి వదిలేసి జ్రెనీ సొల్యూషన్స్ సంస్థ మేనేజంగ్ పార్ట్ నర్ రమణారెడ్డి 1192, 1193 నెంబర్ల పిల్లర్ల వద్ద పది అడుగులకు పైగా లోతుతో గోతులు తవ్వించాడు. పిల్లర్ల పటిష్టత కోసం కట్టించిన బెడ్ లను సైతం పగులగొట్టించాడు. జనం ప్రాణాలతో చెలగాటాలాడుతూ తవ్విన ఈ గోతుల వ్యవహారాన్ని ‘స్వేచ్ఛ’..’బిగ్ టీవీ’ వెలుగులోకి తెచ్చాయి. దాంతో తప్పనిసరై మెట్రో అధికారులు గోపాలాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే వేలాదిమంది ప్రజల భద్రతను పట్టించుకోకుండా గోతులు తవ్వించిన రమణారెడ్డిపై పోలీసులు 7ఏళ్లలోపు శిక్షలు పడే బీఎన్ఎస్ చట్టం 125, 324(3) సెక్షన్ల ప్రకారం మాత్రమే కేసులు పెట్టటం. ముందస్తు అవగాహన మేరకే పోలీసులు ఇలాంటి సెక్షన్ల ప్రకారం కేసులు పెట్టారన్నా ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
మార్చాలి..
స్టేషన్ బెయిల్ మంజూరు విషయంలో నిబంధనలను కఠినం చెయ్యాలన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. సాధారణంగా స్టేషన్లకు వచ్చే ఫిర్యాదులపై కేసులు నమోదు చేసి విచారణ జరిపే బాధ్యతలను ఎస్ఐ స్థాయి అధికారులు సీఐ స్థాయి అధికారుల పర్యవేక్షణలో చేస్తారు. ఈ ఇద్దరు కలిసిపోతే తిమ్మిని బమ్మి చేసినట్టుగా కేసులను నీరుగార్చటం సులువే. ఈ పరిస్థితి పోవాలంటే ఏసీపీ.. వీలైతే డీసీపీ స్థాయి అధికారుల పరిశీలన తర్వాతే స్టేషన్ బెయిల్ ఇచ్చే విధానాన్ని అమల్లోకి తేవాలని పోలీస్ వర్గాలే చెబుతున్నాయి. ఈ దిశగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారా? లేదా? అన్నది వేచి చూడాల్సిందే.
Also Read: దిశ ఘటన జరిగిన చోటే మళ్లీ దారుణం.. శంషాబాద్‌లో మహిళపై క్యాబ్ డ్రైవర్ లైంగికదాడి యత్నం!