పేనుకు పెత్తనమిస్తే నెత్తంతా కొరిగినట్టు.. మేము ఎమ్మెల్యేను నెత్తికెత్తుకుంటే మా కొంపముంచారని అన్నాడు కేటీఆర్. కేసీఆర్ చేసిన అది పెద్ద తప్పిదం ఇదేనని కూడా చెప్పుకొచ్చాడు. ఎమ్మెల్యేనే సుప్రీం.. ఆయన ఇలాఖాలో ఎవరూ వేలు పెట్టొద్దు.. అతనే ఆ నియోజకవర్గానికి సీఎం.. ! ఇలాంటి మాటలన్నీ చెప్పి కేసీఆర్ వారిని నెత్తికెత్తుకున్నాడని అన్నాడు కేటీఆర్. అదే మా కొంపముంచిందన్నాడు.
బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతులతో తెలంగాణ భవన్‌లో సమావేశమయ్యాడు కేటీఆర్. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల గురించి ఇలా ప్రస్తావించాడు. అన్ని బాధ్యతలు వారికే అప్పగించడం.. వారు చెప్పిందే వినడం వల్ల పార్టీ తీవ్రంగా నష్టపోయిందని, రైతులు, పేదలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని, నష్టపోయారని అన్నాడు. కేటీఆర్ మాటలను బట్టి చూస్తే.. ఇకపై ఇలా ఉండబోదనే విధంగానే సంకేతాలిచ్చినట్టుగా అనిపించింది.
పెద్ద తప్పు చేశాం.. అన్నింటికన్నా పెద్ద తప్పు ఇదే…! అని నొక్కి మరీ చెప్పడం వెనుక.. రాబోయే కాలంలో ఎమ్మెల్యేలనే సుప్రీం అనే తప్పును చేయబోమని ఇలా పరోక్షంగా ఖరాకండిగా చెప్పేశాడన్నమాట. అధికారంలోకి రావడం పక్కా.. అని ఏ వేదికనెక్కినా ఇదే మాట చెబుతూ వస్తున్న కేటీఆర్.. తాజాగా ఎమ్మెల్యేలపై చేసిన కామెంట్స్‌పై ఆ పార్టీలోనే ఇప్పుడు తీవ్ర చర్చకు తెరలేచింది.
కేసీఆర్ వరుసగా మూడు సార్లు సిట్టింగులకే టికెట్లిచ్చాడు. ఇదే పెద్ద బూమరాంగైందని తరువాత తెలుసుకున్నారు. ఈ విషయంపై పలు సర్వేలు కేసీఆర్‌ను ముందే హెచ్చరించాయి. సిట్టింగులకే పదే పదే టికెట్లిస్తే.. మెజారిటీ స్థానాల్లో వారి పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందని డేంజర్ సిగ్నల్స్ అందాయి కేసీఆర్‌కు. కానీ ఏం చేయలేని నిస్సహాయస్థితికి వచ్చేశాడు కేసీఆర్ అప్పటికే.
సుప్రీం సుప్రీం …. అని ఎమ్మెల్యేలను నెత్తికెత్తుకోవడంతో ఆల్టర్నేట్‌గా ఇంకో లీడర్‌ను ఎదిగనీయలేదు వారంతా. దీంతో మేము తప్ప మీకు వేరే దిక్కు లేదనే విధంగా తయారయ్యారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. కేసీఆర్‌కు కొరకరాని కొయ్యల్లా తయారయ్యారు ఎమ్మెల్యేలంతా. వరుసగా రెండు పర్యాయాలు వారే ఎమ్మెల్యేలుగా ఉండటంతో అవినీతి, పెత్తనం పెరిగిపోయింది. అరాచకాలు పెరిగాయి. జనం చీదరించుకోవడం ప్రారంభించారు.
ఈసారి కూడా టికెట్ ఇస్తే.. వీరిని ఓడగొట్టడమే లక్ష్యంగా పెట్టుకుని కసి మీదున్నారు జనం. అయినా మళ్లీ మూడోసారీ వీరికే టికెట్లిచ్చారు. కేసీఆర్ వ్యూహం మొత్తం బెడిసి కొట్టింది. ఇంత జరిగినా.. మళ్లీ వీళ్లే దిక్కయ్యారు కేసీఆర్‌కు. ఇప్పుడు ఏ ఆందోళన చేపట్టాలన్నా.. వీరే హైదరాబాద్ నుంచి వెళ్లి అక్కడ కార్యక్రమాలు చేసి మళ్లీ హైదరాబాద్‌కు వచ్చేస్తున్నారు.
అక్కడ క్యాడర్, లీడర్లంతా దిక్కులేని పక్షులైనా.. పార్టీలో మార్పు లేదు. పదేండ్ల కాలంలో ప్రభుత్వ పదవుల్లేవు. ఇన్నాళ్లైనా పార్టీ పదవులూ లేవు. ఇప్పుడు మళ్లీ మా మీద ఈ మాజీల పెత్తనమేనా? అని తీవ్ర నైరాశ్యంలో ఉన్నారు జిల్లాల్లో. ఇప్పుడు కేటీఆర్ మాటలను బట్టి చూస్తే.. పాతకాపులకు భారీగానే చెక్ పడనున్నట్టు తెలుస్తోంది.