Street Lights: స్వేచ్ఛ బ్యూరో: కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని స్ట్రీట్ లైట్ల నిర్వహణకు సంబంధించి మెరుగైన అంతర్జాతీయ స్థాయి విధానాన్ని అమలు చేసేందుకు దాదాపు అన్ని అడ్డంకులు తొలగిపోయినట్టే. జీహెచ్ఎంసీ లోకి క్యూర్ సిటీలోని 27 పట్టణ స్థానిక సంస్థల విలీనానికి ముందు నుంచి దాదాపు 18 నెలలుగా చేస్తున్న కసరత్తు ప్రస్తుతం కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. క్యూర్ సిటీ పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సుమారు 7 లక్షల 60 వేల 591 స్ట్రీట్ లైట్ల నిర్వహణ బాధ్యతలను సర్కారు జీహెచ్ఎంసీకే అప్పగించింది.
నిబంధనలను మరింత కఠినతరం..
స్ట్రీట్ లైట్ల నిర్వహణ కోసం ఇప్పటికే జీహెచ్ఎంసీ రూపకల్పన చేసిన మార్గదర్శకాల్లో స్వల్పంగా మార్పులు చేస్తూ, నిబంధనలను మరింత కఠినతరం చేసినట్లు తెల్సింది. వెలిగే లైటుకే కరెంటు బిల్లు అనే ప్రాతిపదికన ఔటర్ రింగ్ రోడ్డు, ఢిల్లీ మహానగరం మాదిరిగా అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన సంస్థలకు నిర్వహణ బాధ్యతలను అప్పగించాలని జీహెచ్ఎంసీ భావిస్తుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే చేపట్టిన టెండర్ల ప్రక్రియలో భాగంగా భూరత్నం కన్ స్ట్రక్షన్ కంపెనీ ప్రైవేటు లిమిటెడ్, బీఏసీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేటు లిమిటెడ్, బజాజ్ ఎలక్ట్రికల్ లిమిటెడ్ అనే నాలుగు అంతర్జాతీయ సంస్థలు టెండర్లను సమర్పించినట్లు తెలిసింది. ఆ సంస్థల ఎవాల్యుయేషన్ ను అధికారులు లెక్కడుతున్నట్లు సమాచారం.
నలుగురు అదనపు కమిషనర్లతో ఏర్పాటు
టెక్నికల్ బిడ్ల కోసం సంస్థలు సమర్పించిన వివరాలను స్క్రూటినీ చేస్తున్నారు. ఆ తర్వాత నాలుగు సంస్థల్లో తక్కువ కోడ్ చేసిన సంస్థను ఎంపిక చేసి, ఆ సంస్థ వివరాలను జీహెచ్ఎంసీలో స్ట్రీట్ లైట్ల నిర్వహణకు సంబంధించి నలుగురు అదనపు కమిషనర్లతో ఏర్పాటు చేసిన కమిటీకి సిఫార్సు చేయనున్నారు. కమిటీ రికమెండ్ తో ప్రతిపాదలను సర్కారుకు పంపించిన తర్వాత వారం రోజుల్లో సర్కారు ఆమోద ముద్ర వేయగానే క్యూర్ సిటీలోని స్ట్రీట్ లైట్ల నిర్వహణ బాధ్యతలను కొత్త ఏజెన్సీ చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
రూ.500 కోట్లు పెరిగిన నిర్వహణ వ్యయం
జీహెచ్ఎంసీ రూపకల్పన చేసి సర్కారు పంపిన మార్గదర్శకాల్లో అయిదేళ్లు నిర్వహణ కాలపరిమితిని సర్కారు పదేళ్లకు పెంచుతూ మార్పులు చేసింది. అంతేగాక, గత సంవత్సరం నవంబర్ మాసంలో చివర్లో కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని మరో 27 పట్టణ స్థానిక సంస్థలు జీహెచ్ఎంసీలో విలీనం కావటంతో కొత్తగా ఏర్పాటవుతున్న కాలనీలు, బస్తీల్లో కూడా అదనంగా మరో 15 వేల స్ట్రీట్ లైట్లను ఏర్పాటు చేయాలని సర్కారు మార్గదర్శకాల్లో మార్పులు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. వాస్తవానికి క్యూర్ సిటీ పరిధిలోని మూడు కార్పొరేషన్ల వారీగా స్ట్రీట్ లైట్ల నిర్వహణ బాధ్యతలను చేపట్టాల్సి ఉండగా, మొత్తం క్యూర్ పరిధిలోని స్ట్రీట్ లైట్ల నిర్వహణ బాధ్యతలను జీహెచ్ఎంసీ నోడల్ ఏజెన్సీగా వ్యవహారించాలని కూడా సూచించింది.
రూ. 1341 కోట్లకు పెంపు..
క్యూర్ పరిధిలోని 7 లక్షల 60 వేల 591 స్ట్రీట్ లైట్ల నిర్వహణకు రూ. 841 కోట్ల వ్యయ ప్రతిపాదనను జీహెచ్ఎంసీ సర్కారుకు పంపగా, నిర్వహణలో పారదర్శకత, అదనంగా 15 వేల స్ట్రీట్ లైట్ల ఏర్పాటు వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్న సర్కారు అంచనా వ్యయాన్ని రూ.1341 కోట్లకు పెంచుతున్నట్లు తాజాగా ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో క్యూ పరిధిలోని స్ట్రీట్ లైట్ల నిర్వహణ వ్యయం రూ. 500 కోట్లు అదనంగా పెరిగింది. జీహెచ్ఎంసీతో పాటు సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని స్ట్రీట్ లైట్ల నిర్వహణకు అయ్యే వ్యయాన్ని కొత్తగా ఏర్పడిన రెండు మున్సిపల్ కార్పొరేషన్లు జీహెచ్ఎంసీకి చెల్లించాక, జీహెచ్ఎంసీ ద్వారా నిర్వహణ బాధ్యతలు చేపట్టనున్న సంస్థలకు చెల్లించేలా నోడవ్ ఏజెన్సీ బాధ్యతలను కూడా కూడా సర్కారు జీహెచ్ఎంసీకి కేటాయించింది.
18 నెలలుగా నిర్వహణ అస్తవ్యస్తం
జీహెచ్ఎంసీ పరిధిలోని స్ట్రీట్ లైట్ల నిర్వహణ బాధ్యతలకు సంబంధించి ఈఈఎస్ఎల్ ఒప్పంద గడువు ముగిసిన 17 నెలల గడువులో స్ట్రీట్ లైట్ల నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వంద స్ట్రీట్ లైట్లున్న ఒక్కో స్ట్రెచ్ లో రాత్రి పూట కనీసం అయిదు శాతం లైట్లు కూడా వెలగటం లేదన్న ఫిర్యాదులున్నాయి. క్యూర్ లో విలీనమైన 27 పట్టణ స్థానిక సంస్థల్లోని పలు ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉన్నట్లు కూడా ఫిర్యాదలందాయి. ముఖ్యంగా ఈఈఎస్ఎల్ నిర్వహణ గడువు ముగిసిన తర్వాత లైట్ల నిర్వహణ బాధ్యతలను జోనల్ స్థాయిలో అప్పగించటంతో మరమ్మతుల సామాగ్రి సమకూర్చుకోవటం, మరమ్మతులు టెక్నికల్ గా జరగకపోవటం వంటి సమస్యల కారణంగా స్ట్రీట్ లైట్ల నిర్వహణ కొంత మేరకు స్తంభించిందన్న వాదనలున్నాయి. ఏడాదిన్నర నుంచి అస్తవ్యస్తంగా మారిన స్ట్రీట్ లైట్ల మెయింటనెన్స్ సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం సమకూరింది.
కార్పొరేషన్ల సొంత మరమ్మతులు
వెలిగే లైటుకే కరెంటు బిల్లు అనే ప్రాతిపదికన అమలు చేయనున్న ఈ మెరుగైన అంతర్జాతీయ స్థాయి నిర్వహణ విధానాన్ని ఏజెన్సీల ద్వారా అమల్లోకి తెచ్చేందుకు జీహెచ్ఎంసీకి మరింత సమయం పట్టే అవకాశమున్నందున గత జూన్ నెల మొదటి వారం నుంచే మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ తన పరిదిలోని స్ట్రీట్ లైట్లకు మరమ్మతులను చేపట్టింది. ఈ సారి వర్షాలు కూడా దంచి కొట్టే అవకాశమున్నందున వాహనదారుల సౌకర్యార్థం, వర్షం కురుస్తున్నపుడు అంధకారం నెలకొనకుండా, ప్రమాదాల నివారణ కోసం మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ తన పరిధిలోని స్ట్రీట్ లైట్లకు సొంతగా మరమ్మతులు చేపట్టింది. నిర్వహణకు సంబంధించిన సామాగ్రిని కార్పొరేషన్ కొనుగోలు చేసి, మరమ్మతులు చేస్తున్నట్లు తెలిసింది. సీఎంసీలో కూడా ఇదే పద్దతి కొనసాగుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా సీఎంసీలో ఐటీ కారిడార్ ఉండటం, తరుచూ ఐటీ నిపుణలు రాకపోకలు సాగించే రహదార్లు ఎక్కువగా ఉండటంతో వర్షం కురిసినపుడు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సొంతగా మరమ్మతులు చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, గడిచిన కొద్ది రోజులుగా చిరు జల్లులు నగరవాసులను పలకరిస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ల ద్వారా స్ట్రీట్ లైట్ల నిర్వహణపై ఫోకస్ పెట్టినట్లు తెలిసింది. నిత్యం రద్దీగా ఉండే బిజీ రూట్లలోని స్ట్రీట్ లైట్లకు ఇప్పటికే మరమ్మతులను ప్రారంభించింది.
మిషనరీ, మ్యాన్ పవర్ నిబంధనలు
స్ట్రీట్ లైట్లకు బిడ్లు సమర్పిస్తున్న ఏజెన్సీలకు లైట్లకు మరమ్మతులు చేపట్టే,దుకు వీలుగా మొత్తం 60 హైడ్రాలిక్ క్రేన్లను సమకూర్చే బాధ్యతలను కూడా ఏజెన్సీలకే అప్పగించారు. పాడైన స్ట్రీట్ లైట్లకు వీలైనంత త్వరగా మరమ్మతులు చేపట్టేందుకు వీలుగా తొలుత ఒక్కో సర్కిల్ కు ఒకటి చొప్పున హైడ్రాలిక్ క్రేన్లను సమకూర్చి, ఆ తర్వాత జీహెచ్ఎంసీ అభ్యర్తిసే మరో 30 హైడ్రాలిక్ క్రేన్లను సమకూర్చాలని కూడా జీహెచ్ఎంసీ సూచించింది. సర్కిల్ కు ఇద్దరు టెక్నిషియన్లను కేవలం సీసీఎంఎస్ నిర్వహణకు కేటాయించాలని సూచించింది. మొత్తం స్ట్రీట్ లైట్లు 7 లక్షల 61 వేలలో కనీసం 98 శాతం లైట్లు వెలిగేలా సర్వీసు లెవెల్ అగ్రిమెంట్ చేసుకునేందుకు సిద్దంగా ఉన్న ఏజెన్సీలే బిడ్లను సమర్పించాలని జీహెచ్ఎంసీ స్పష్టం చేసింది.
పదేళ్లకు మొత్తం వ్యయం రూ.1341.60 కోట్లు
గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం ఉన్నతమైన ప్రమాణాలతో, అంతర్జాతీయ స్థాయి సంస్థలకు స్ట్రీట్ లైట్ల నిర్వహణ బాధ్యతలను అప్పగించేందుకు సిద్దమైన జీహెచ్ఎంసీ ఏజెన్సీలతో కాంప్రహెన్సివ్ ఆపరేషనల్ అండ్ మెయింటనెన్స్ ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది. ఈ కాంట్రాక్టు కింద పదేళ్ల నిర్వహణకు రూ. 1341.60 కోట్లు వెచ్చించాల్సి ఉంది. ఈ మొత్తాన్ని జీహెచ్ఎంసీ ద్వారా ఏటా పదిశాతం చొప్పున చెల్లించనున్నారు. ఈ మొత్తం బిల్లులను నోడల్ ఏజెన్సీ అయిన జీహెచ్ఎంసీ ద్వారా చెల్లింపులు జరగనున్నాయి. సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్లు తమ పరిధిలోనున్న స్ట్రీట్ లైట్లను లెక్కకట్టి నిర్వహణ వ్యయాన్ని జీహెచ్ఎంసీకి చెల్లించేలా విధి విధానాలను సిద్దం చేశారు. నిర్వహణ బాధ్యతలు చేపట్టనున్న సంస్థ చేపట్టే మరమ్మతులు, ప్రస్తుతమున్న లైట్లను ఎల్ఈడీ లైట్ల కిందకు మార్చే పనులు, బఫర్ కోటా వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని నెలసరి మెయింటనెన్స్ బిల్లులు చెల్లించనున్నట్లు అధికారులు తెలిపారు.
Also Read: ఆగస్టు 15న అలజడికి పాక్ కుట్ర.. దేశ రాజధానిలో రక్షణ బలగాల ‘ఆపరేషన్ అలర్ట్’!