Dharmapuri Aravind: తెలంగాణ లో బీజేపీ బలపడుతూందో లేదో తెలీదు కానీ నిజామాబాద్ జిల్లాలో అత్యంత బలంగా ఉందని చాటడానికి ఎంపీ ధర్మపురి అరవింద్ టీమ్ పెద్ద కసరత్తే చేస్తోందంట. జిల్లాలో బీజేపీ ఆంటే అరవింద్, అరవింద్ ఆంటే బీజేపీ అన్నట్లు తయారు చేసుకోవడానికి వారు మొదలుపెట్టిన కార్యాచరణ ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో బీజేపీ ఏ స్థాయిలో ఉందో తెలీదు కానీ నిజామాబాద్ జిల్లాలో మాత్రం వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో గణనీయమైన సీట్లు సాధించి.. జిల్లాలో బీజేపీ ఇమేజ్ పెంచుతానంటున్నారంట అరవింద్..
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం నేతల మాటలకే పరిమితమవుతోంది. రాష్ట్ర విభజన తర్వాత కాషాయపార్టీ ప్రతి ఎన్నికల్లో సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతోంది. అయితే రాష్ట్రంలో గులాబీ పార్టీ హవా నడుస్తున్న టైమ్‌లోనూ .. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన 2019 లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్‌లో కేసీఆర్ కుమార్తె కవితను ఓడించిన బీజేపీ ఎంపీ ధర్మపురి ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చారు. తర్వాత రెండో సారి కూడా గెలిచి ఎంపీగా కొనసాగుతున్నారు.
ఇక ఇప్పుడు వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ఆ తరువాత జరగబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో సత్తా చాటుకుని… జిల్లా పరిషత్ చైర్మన్ తో పాటు నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్ పీఠందక్కించుకోవాలన్న పట్టుదలతో ధర్మపురి అరవింద్ కసరత్తు చేస్తున్నారంట. తన పార్లమెంట్ సెగ్మెంట్‌లో పార్టీని మరింత బలోపేతం చేసేలా ఎంపీ అరవింద్ అడుగులు పడుతున్నాయన్న టాక్ గట్టిగానే వినిపిస్తోంది.
వచ్చే నెలలో మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ తరుణంలో తన సెగ్మెంట్‌లో మెజార్టీ స్థానాలు దక్కించుకోవడానికి ఎంపీ అరవింద్ కాషాయ శ్రేణులను సమాయత్తం చేస్తూ గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారంట. పార్టీ నుంచి డైరెక్షన్ రాకముందు నుంచే ఆయన ఎన్నికల కసరత్తు మొదలుపెట్టడం గమనార్హం. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్ధుల ఎంపికపై స్క్రూటినీ మొదలుపెట్టేశారంట. అభ్యర్థుల ఎంపికపై ఎంపీ అరవింద్ ప్రత్యేక సర్వేలు నిర్వహిస్తున్నారట.
ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని 36 మండలాల జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు, నిజామాబాద్ కార్పొరేషన్ తో పాటు ఆర్మూర్, బోధన్, బీంగల్ మున్సిపాలిటీలలో బరిలో నిలుస్తాం అంటున్న ఆశావహులపై రెండు సర్వేలు పూర్తి చేశారట. ఆశావహుల్లో చాలామంది బీజేపీ, లేదా ఎంపీ అరవింద్ చరిష్మాతో గెలవగలం అనుకుంటున్నారంట. అలాగే ఓటర్లను ఆకట్టుకోవడానికి అన్ని రకాలుగా వారిని ప్రలోభపెట్టడానికి కూడా సన్నాహాలు చేసుకుంటున్నారంట. కొందరైతే ఆస్తులు అమ్మి నగదు రెడీగా పెట్టుకుని అప్పుడే ప్రజల్లో తిరిగేస్తున్నారంట. ఆ దిశగా ఎంపీ అరవింద్ కూడా సంకేతాలు ఇస్తూ ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి.
అయితే టికెట్ ఆశావహుల్లో ఎంపీ అరవింద్ చేయిస్తున్న సర్వేలు గుబులు రేపుతున్నాయంట. రెండోసారి ఎంపీగా గెలిచన ధర్మపురి అరవింద్ రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవిని గట్టిగానే ఆశించారు. అయితే పార్టీలో పాత, కొత్త నేతల పంచాయితీలతో అది దక్కకపోవడంతో… పార్టీలో సీనియర్లు అయిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లతో పాటు… రాష్ట్ర పార్టీ పగ్గాలు చేపట్టిన రామచంద్రరావు లాంటి వారిపై డైరెక్ట్ గానే కౌంటర్ ఎటాక్ మొదలుపెట్టారు.
ఒకానొక ఒక సమయంలో తనపై కంప్లైంట్స్ చేయొద్దు అంటూ రామచంద్రరావుకి వార్నింగ్ ఇచ్చినంత పనిచేశారు. బీజేపీలోని సీనియర్లపై గుర్రుగా ఉన్న అరవింద్ తన నియోజకవర్గం స్థానిక సంస్ధల ఎన్నికల్లో మెజార్టీ సీట్లు దక్కించుకుని సత్తా చాటాలని పట్టుదలతో ఉన్నారంట. అప్పుడు బీజేపీ పెద్దలు కూడా ఎవరు బలమైన నేతలో గుర్తిస్తుందని ఆయన తన అనుచరులతో చెప్తున్నారంట.
అదలా ఉంటే నిజామాబాద్ పేరును ఇందూరుగా మారుస్తామని అరవింద్ గతంలోనే ప్రకటించారు. ఆ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తమ జిల్లా పేరు నిజామాబాద్ గా పెట్టడం వల్లే దురదృష్టం వచ్చిందని, ఆ పేరులోనే నష్టం ఉందని ఆయన పేర్కొన్నారు. అరవింద్ వ్యాఖ్యలకు తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచంద్రరావు కూడా అప్పట్లో మద్దతు తెలపడం విశేషం. బీజేపీ అధికారంలోకి వస్తే నిజామాబాద్ పేరును ఖచ్చితంగా ‘ఇందూరు’గా మారుస్తామని ఆయన స్పష్టం చేశారు. మరి చూడాలి నిజామాబాద్ పేరు మరుస్తాను అంటున్న ఎంపీ అరవింద్ ఆశలు ఎప్పటికి సక్సెస్ అవుతాయో? లోకల్ బాడీ ఎన్నికల్లో ఆయన ఏ మేరకు సత్తా చాటుకుంటారో?
Story by: Apparao, Big TV