BigTV English

EV Scam: చిక్కుల్లో బ్లూస్మార్ట్.. ధోని నుండి దీపికా వరకు.. కోట్ల రూపాయలు లూటీ

EV Scam: చిక్కుల్లో బ్లూస్మార్ట్.. ధోని నుండి దీపికా వరకు.. కోట్ల రూపాయలు లూటీ

EV Scam: దేశంలో మరో భారీ కుంభకోణం వెలుగు చూసుంది. పర్యావరణాన్ని పరిరక్షించే పేరుతో కంపెనీలు పెట్టి, ప్రజల డబ్బుతో ఆస్తులు సంపాదించుకునే ప్లాన్ చేశారు జన్సోల్ ఇంజినీరింగ్ ఓనర్లు జగ్గీ బ్రదర్స్. బ్లూస్మార్ట్ అంటూ ఇన్వెస్టర్లను ఆకర్షించి, మొత్తానికే ముంచేశారు. దీపికా పడుకోణే, ఎమ్‌ఎస్ ధోనీలను కూడా ఇరికించేశారు. కంపెనీ షట్ డౌన్.. షేర్లు కట్ డౌన్.. యాప్‌లో వాలెట్‌ మనీ అంతా గోల్ మాల్. తవ్వి చూస్తుంటే.. అన్నాదమ్ముల అసలు రూపాలు బయటపడుతున్నాయి. ఒకటా రెండా.. వందల కోట్ల కుంభకోణంతో స్టార్టప్ కంపెనీల పరుపు తీసారు. ఇంతకీ, ఏం జరిగింది..? ఏంటీ స్మార్ట్ స్కామ్..? ఎవరీ జగ్గీ బ్రదర్స్… వీళ్లు చేసిన మోసమేంటి..? లెట్స్ వాచ్…


జెన్సోల్ ఇంజనీరింగ్ ప్రమోటర్లు అన్మోల్ సింగ్ జగ్గి, పునీత్ సింగ్ జగ్గి

అంతా స్కామ్‌ల మయం.. జగమంతా స్కామ్‌ల మయం అన్నట్లుంది దేశం పరిస్థితి. ఒకప్పుడు, దొంగ లెక్కలతో పోలిస్తే.. ఈ స్మార్ట్ యుగంలో జరిగే స్మార్ట్ స్కామ్‌లు మతిపోగుడుతున్నాయి. కొత్త ఆవిష్కరణలొస్తే… సమాజం మరింత ముందుకెళ్తుందని అనుకుంటుంటే… స్టార్టప్పుల్లో కూడా స్మార్ట్‌గా స్కామ్ చేసేస్తున్నారు కొంతమంది కేటుగాళ్లు. ఇలాంటి వారే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న జగ్గీ బ్రదర్స్. జెన్సోల్ ఇంజనీరింగ్ స్కామ్ సూత్రదారులు, పాత్రదారులు వీళ్లే. జెన్సోల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ ప్రమోటర్లైన అన్మోల్ సింగ్ జగ్గి, పునీత్ సింగ్ జగ్గి చేసిన ఫైనాన్షియల్ ఫ్రాడ్స్… కార్పొరేట్ గవర్నెన్స్ ఫెయిల్యూర్‌కు అద్దం పడుతోంది.


ఏప్రిల్ 15న సెబీ మధ్యంతర ఉత్తర్వులు

దీంతో.. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా-SEBI ఏప్రిల్ 15న మధ్యంతర ఉత్తర్వులో బట్టబయలు చేసింది. ఇందులో భాగంగా.. SEBI… జెన్సోల్ ఇంజనీరింగ్ ప్రమోటర్లు అన్మోల్ సింగ్ జగ్గి, పునీత్ సింగ్ జగ్గిలను కంపెనీలో డైరెక్టర్ల పదవి నుండి తొలగించింది. అలాగే, ఈ ఇద్దరికీ మార్కెట్‌లోకి ఏంట్రీ లేకుండా నిషేధించింది. ఇక, ఇప్పుడు వీళ్లు చేసిన పాపానికి వీళ్ల కంపెనీలో పెట్టుబడులు పెట్టిన బాలీవుడ్ అగ్రనటి దీపికా పడుకోణే, క్రికెట్ ప్రపంచంలో కెప్టెన్ కూల్ అయిన ఎమ్‌ఎస్ ధోనీలకు కూడా టెన్షన్ పట్టుకుంది.

భారతదేశ రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో పాపులర్

ఒకప్పుడు భారతదేశ రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో వీరిద్దరి పేర్లూ చాలా పాపులర్. స్టార్టప్‌ల కాలంలో రెండు ముఖ్యమైన వెంచర్లతో ముందుకొచ్చిన ఈ పోస్టర్ బాయ్‌లు.. చాలా వేదికలపై స్పెషల్ అట్రాక్షన్‌గా ఉండేవాళ్లు. స్టార్టప్ సమావేశాల్లో, అవార్డు ఫంక్షన్లలో, పలు షోలు, పాడ్‌కాస్ట్‌లలో క్రమం తప్పకుండా కనిపించేవాళ్లు. దీంతో అన్మోల్ సింగ్ జగ్గీ, పునీత్ సింగ్ జగ్గీల పేర్లు మారుమోగాయి. వీళ్లద్దరూ జెన్సోల్ ఇంజనీరింగ్‌తో వాళ్ల జర్నీని ప్రారంభించారు. అందర్నీ ఆకర్షించిన వీళ్ల ఐడియాస్‌ వల్ల పునీత్ గోయల్‌ కూడా వీళ్లతో కలిసారు. తర్వాత, వీళ్లు ముగ్గురూ కలిసి…. ఎలక్ట్రిక్ వెహికిల్‌ క్యాబ్ కంపెనీ ‘బ్లూస్మార్ట్ మొబిలిటీ’ని మొదలుపెట్టారు.

వివిధ సంస్థల నుండి ప్రభుత్వ మద్ధతుతో జెన్సోల్ రుణాలు

ఇక, ఈ బ్లూస్మార్ట్ కంపెనీ… లైట్ మోడల్‌ రవాణాపై పనిచేసింది. పలు డెవలప్‌మెంటల్ ఫైనాన్స్ సంస్థల నుండి ఎలక్ట్రిక్ కార్లను లీజుకు తీసుకుంది. ఈ EV లీజింగ్ కంపెనీలలో జగ్గీ బ్రదర్స్ సొంత కంపెనీ జెన్సోల్ ఇంజనీరింగ్ కూడా ఒకటి. అయితే, బ్లూస్మార్ట్ ఫ్లీట్ కింద వేలాది ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు కోసం జెన్సోల్ ఇంజనీరింగ్ వివిధ సంస్థల నుండి ప్రభుత్వ మద్దతుతో రుణాలను తీసుకుది. అయితే, అంతకుముందు కంటే ఈ రుణాలు మరింత ఎక్కువగా ఉన్నాయి. ఇక, వీళ్ల చేతిక డబ్బు వచ్చిన తర్వాత… అసలు కథ మొదలయ్యింది.

పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్(PFC) నుండి..

జెన్సోల్ ఇంజనీరింగ్ కంపెనీ… ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ-IREDA… పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్-PFC వంటి ప్రభుత్వ రంగ సంస్థల నుండి సుమారు రూ.9 వందల 77.75 కోట్ల రూపాయల రుణాలను తీసుకుంది. ఈ డబ్బులన్నీ… బ్లూస్మార్ట్‌కు లీజుకు ఇవ్వడానికి 6,400 ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఉద్దేశించినవి. అయితే, సెబీ నివేదిక ప్రకారం… ఇందులో కేవలం 4 వేల 704 EVలను మాత్రమే కొనుగోలు చేసినట్లు తెలిసింది. దీనివల్ల… తీసుకున్న అప్పులో రూ.200 కోట్లకు పైగా డబ్బులు లెక్కల్లోకి రాలేదు. తీగ లాగిన తర్వాత తెలిసింది ఏంటంటే… కంపెనీకి సంబంధం లేని ఖర్చుల కోసం…. వ్యక్తిగత ఆస్తులు కూడబెట్టుకోవడం కోసం ఈ నిధులను మళ్లించినట్లు తెలిసింది.

DLFకు చెందినది కామెల్లియాస్‌తో సహా…

జగ్గీ బ్రదర్స్ లెక్కల్లో గోల్ మాల్ చేసి.. DLFకు చెందినది కామెల్లియాస్‌తో సహా.. గురుగ్రామ్‌లో లగ్జరీ అపార్ట్‌మెంట్ కొనుగోలు కోసం ₹42.94 కోట్లు ఖర్చు చేశారు. అలాగే, ఒక గోల్ఫ్ సెట్ కోసం రూ.26 లక్షలు వెచ్చించారు. ఇక, విదేశీ ప్రయాణాలు, క్రెడిట్ కార్డ్ చెల్లింపులు, ఇతర లగ్జరీ ఖర్చుల కోసం కంపెనీ నిధులను నీళ్లలా ఖర్చేచేసేశారు. ఇందు, తమ తల్లి పేరుతో తీసుకున్న రూ.6.2 కోట్ల అపార్ట్‌మెంట్‌తో పాటు.. ఇంకొన్ని డబ్బులు సంబంధిత ఇతర సంస్థలకు కూడా బదిలీ చేశారు. వీటిలో.. గో-ఆటో ప్రైవేట్ లిమిటెడ్, వెల్రే సోలార్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి సంస్థలు కూడా ఉన్నాయి. ఇవి కూడా జగ్గీ బ్రదర్స్‌కు వాటాలున్న కంపెనీలుగా గుర్తించారు. ఇలా అప్పు తీసుకున్న నిధులను సొంత ప్రయోజనాల కోసం మళ్లించారు.

దీపిక పడుకోణె 2019లో రూ.25.62 కోట్ల రౌండ్‌లో పెట్టుబడి

అయితే, ఇంత మోసం చేసిన జగ్గీ బ్రదర్స్ కంపెనీ జెన్సోల్ ఇంజనీరింగ్‌లో కొందరు పాపులర్ పర్సనాలిటీలు కూడా పెట్టుబడులు పెట్టడం ఇప్పుడు ఈ మోసంలో కొత్త ట్విస్ట్‌లను తెచ్చేటట్లు కనిపిస్తోంది. క్రికెట్ ప్రపంచంలో కెప్టెన్ కూల్‌గా పేరున్న ఎంఎస్ ధోనితో పాటు… బాలీవుడ్ అగ్రనటి దీపికా పదుకొణేలకు కూడా జగ్గీ బ్రదర్స్ కంపెనీ జెన్సోల్ ఇంజినీరింగ్‌లో వాటాలున్నాయి. దీపిక 2019లో రూ.25.62 కోట్ల రౌండ్‌లో పెట్టుబడి పెట్టింది. ఇందులో బజాజ్ ఫిన్‌సర్వ్ ఎండీ సంజీవ్ బజాజ్ కూడా ఉన్నారు.

న్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రాయ్‌పూర్‌కూ జెన్సోల్‌లో వాటాలు

ఇక, ధోని ఏకంగా రూ.200 కోట్ల రౌండ్‌లో పెట్టుబడి పెట్టారు. అంతెందుకు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రాయ్‌పూర్ ఆఫీస్‌కు కూడా జెన్సోల్‌లో వాటాలు ఉన్నాయి. ఇప్పుడు వీటన్నింటిపైన సెబీ దర్యాప్తు చేస్తోంది. ప్రస్తుతం అయితే… నిధులను మళ్లించిన అంశంలోనే మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ దర్యాప్తు ప్రారంభించింది. ఇక, లోతుకు వెళితే ఏమేం దొరుకుతాయన్నది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది.

FY 2017లో జెన్సోల్ అమ్మకాలు రూ.61 కోట్లు

నిజానికి, బ్లూస్మార్ట్ వ్యాపారంలో లోతైన భాగస్వామ్యం ఉన్న జెన్సోల్ ఇంజినీరింగ్ మొదట్లో బాగా పనిచేసింది. 2017 ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు రూ.61 కోట్లు ఉండగా… 2024 ఆర్థిక సంవత్సరం వచ్చేసరికి రూ.11 వందల 52 కోట్లకు చేరుకుంది. దీని షేర్ ధరలు దాదాపు రూ.4 వేల 300 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో.. ఒక్కో షేరుకు రూ.11 వందల 26 రూపాయలకు గరిష్టంగా ఉంది.

2025లో “D”కి చేరుకున్న జెన్సోల్ క్రెడిట్ రేటింగ్

అయితే, షేర్ ధరలను తారుమారు చేయడం, జెన్సోల్ నుండి నిధుల మళ్లింపు గురించి సెబీకి ఫిర్యాదు అందినప్పటికి పరిస్థితులు మారిపోయాయి. దీంతో సెబీ తన దర్యాప్తును ప్రారంభించింది. ఇది జరిగిన వెంటనే కంపెనీలో మరిన్ని సమస్యలు బయటపడ్డాయి. మార్చి, 2025లో CARE రేటింగ్స్, ICRAలు.. జెన్సోల్ క్రెడిట్ రేటింగ్‌లను “D”కి తగ్గించాయి. ఇది రుణాలు తిరిగి చెల్లించడంలో జాప్యం చేసే కంపెనీలకు ఉపయోగించే రేటింగ్. దీంతో కంపెనీ పరిస్థితి దిగజారింది.

దర్యాప్తులో “కండక్ట్ లెటర్స్” మాత్రమే పంచుకున్న జెన్సోల్

సెబీ తన దర్యాప్తు ప్రకారం.. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు.. జెన్సోల్‌ను తన కంపెనీకి ఇచ్చిన అన్ని రుణదాతలకు సంబంధించిన టర్మ్ లోన్ స్టేట్‌మెంట్‌లను పంచుకోవాలని అడిగింది. అప్పుడు, IREDA, PFC మినహా చాలా మంది రుణదాతలకు జెన్సోల్ పత్రాలను పంచుకుంది. అయితే, ఇక్కడే జగ్గీ బ్రదర్స్ ట్విస్ట్ ఇచ్చారు. సకాలంలో రుణ చెల్లింపులను క్లెయిమ్ చేస్తూ “కండక్ట్ లెటర్స్” మాత్రమే పంచుకున్నట్లు గమనించారు. క్రెడిట్ రేటింగ్‌లను ఉపసంహరించుకోవడానికి సాధారణంగా ఉపయోగించే NOCలను మాత్రమే కంపెనీ సమర్పించింది.

జెన్సోల్ ఇంజనీరింగ్… తప్పుడు రుణ సేవల ట్రాక్ రికార్డ్ పత్రాలను పంచుకుందని ICRA కూడా పేర్కొంది. అయితే, తమ కంపెనీ తప్పుడు పత్రాలను రూపొందించలేదని జగ్గీ బ్రదర్స్ వాదించారు. కట్ చేస్తే లెక్కలన్నీ దానికి భిన్నంగా కనిపించాయి. ఇప్పుడు, కంపెనీ చేసిన మోసంతో రుణాలు చెల్లించలేని జగ్గీ బ్రదర్స్ రేపటి రోజున… కంపెనీని షట్ డౌన్ చేసి, రుణాలను ఎగ్గొట్టి, చెక్కేస్తే… పరిస్థితి ఏంటనే ప్రశ్న వచ్చింది.

ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది అన్నట్లు.. జగ్గీ సోదర్ల నిర్వాకం యావత్ స్టార్టప్ రంగంపై చెడు ముద్ర వేసినట్లే కనిపిస్తోంది. ఇటీవల కాలంలో కొత్త కొత్త ఆవిష్కరణలతో ముందుకు దూసుకుపోతున్న భారత స్టార్టప్ రంగం ఇకపై కొత్త సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రభుత్వ సంస్థల నిఘాతో పాటు స్టార్టప్ కంపెనీలకు రుణాలిచ్చే విధానాల్లోనూ మార్పులు వచ్చే అవకావం లేకపోలేదు. అలాగే, జెన్సోల్‌లో పెట్టుబడులు పెట్టిన ధోనీ, దీపిక లాంటి పెట్టుబడీదారులు కూడా ఆచితూచి అడుగేయాలనే అభిప్రాయంతో.. కొత్త ఆవిష్కరణలకు ఆసరా కూడా తగ్గే ఛాన్స్ ఉంది.

వాలెట్‌లో నిధులు డ్రా చేసుకోవడానికి యూజర్ల కష్టాలు

తాజా ఆరోపణల నేపథ్యంలో.. బ్లూస్మార్ట్ తన క్యాబ్ సేవలను ఢిల్లీ-ఎన్‌సీఆర్, బెంగళూరు, ముంబైలలో తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రస్తుతం, యూజర్లు.. బ్లూస్మార్ట్ యాప్‌లో రైడ్‌లను బుక్ చేయలేకపోతున్నారు. అలాగే, బ్లూ వాలెట్‌లో ఉన్న నిధులు డ్రా చేసుకోడానికి యూజర్లంతా కష్టపడుతున్నారు. ఇప్పటికైతే, కంపెనీ యాప్ ద్వారా రీఫండ్ ఇస్తామని ప్రకటించినప్పటికీ.. అందులో జాప్యం జరుగుతూనే ఉంది. కాగా, ఈ కుంభకోణం కారణంగా జెన్సోల్ ఇంజనీరింగ్ షేర్లు 15 రోజుల్లో 50% కంటే ఎక్కువ పడిపోయాయి. దీనివల్ల, పెట్టుబడిదారులు భారీ నష్టాలను చవిచూశారు. ఇక, పర్యావరణ అనుకూలమైన సేవలకు ప్రసిద్ధి చెందిన బ్లూస్మార్ట్..

బ్లూస్మా్ర్ట్ సేవలు పూర్తిగా ఆగిపోతాయనే అనుమానాలు

ఈ కుంభకోణం కారణంగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. దాని భవిష్యత్తు అనిశ్చితిని ఎదుర్కుంటోంది. కొన్ని నివేదికల ప్రకారం.. బ్లూస్మార్ట్ తన సేవలను పూర్తిగా మూసేయొచ్చనే అనుమానాలు ఉన్నాయి. మొత్తంగా చూస్తే.. ఈ కుంభకోణం భారతదేశంలో స్టార్టప్ రంగంలో లోపిస్తున్న పారదర్శకత, జవాబుదారీతనాన్ని హైలైట్ చేస్తుంది. ప్రస్తుతం, సెబీ విచారణ ఇంకా కొనసాగుతుండగా.. ఈ కేసులో తదుపరి పరిణామాలు బ్లూస్మార్ట్, జెన్సోల్ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చాయి.

దాదాపు లక్షా పదివేలకు పెరిగిన పబ్లిక్ షేర్ హోల్డింగ్

కంపెనీలో ప్రమోటర్లైన జగ్గీ బ్రదర్స్ షేర్ విలువ ఇప్పుడు ఘోరంగా పడిపోయింది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ దాదాపు లక్షా పదివేలకు పెరిగింది. అంటే, దాదాపు 65 శాతానికి పెరిగింది. ప్రమోటర్ యాజమాన్యం దాదాపు 35 శాతానికి పడిపోయింది. ఇక, IREDA, PFC వంటి రుణదాతలు… జగ్గీ బ్రదర్స్ తాకట్టు పెట్టిన షేర్లను లోన్ కొలేటరల్‌గా విక్రయించడంతో… ప్రమోటర్ హోల్డింగ్ అతితక్కువ స్థాయికి పడిపోయి ఉండవచ్చని సెబీ గుర్తించింది. ఇప్పటి వరకూ ఒక వెలుగు వెలిగిన కంపెనీ ఇంతగా దిగజారడానికి… జగ్గీ బ్రదర్స్ చేసిన నిర్వాకమే కారణమన్నది స్పష్టం. స్టాక్ పట్ల పెట్టుబడిదారులను ఆకర్షించడానికి జగ్గీ సోదరులు స్టాక్ ఎక్స్ఛేంజీలకు అనేక తప్పుడు ప్రకటనలు చేసినట్లు సెబీ ఆర్డర్ పేర్కొంది.

జనవరి 28, 2025న, జెన్సోల్… 30వేల ఎలక్ట్రిక్ వాహనాలకు ముందస్తు ఆర్డర్‌లను పొందినట్లు ప్రకటించింది. తర్వాత రెండు రోజుల్లో… స్టాక్ ధర 15 శాతం పెరిగింది. నిజానికి, ఎటువంటి ధర, డెలివరీ షెడ్యూల్‌లు లేకుండానే 29 వేల వాహనాలకు తొమ్మిది MTTలతో సంబంధం లేని అవగాహన ఒప్పందాలు మాత్రమే జరిగాయి. పూణేలోని జెన్సోల్ EV ప్లాంట్‌లో ఎక్స్ఛేంజ్ అధికారులు నిర్వహించిన ఆన్-సైట్ తనిఖీలో… ఇద్దరు ముగ్గురు కార్మికులు మాత్రమే ఉన్నట్లు తేలింది. అలాగే, డిసెంబర్ 2024కి 1.6 లక్షల విద్యుత్ బిల్లు యాక్టివ్‌గా ఉన్న వాహన ఉత్పత్తికి సరిపోలేదని తేలింది. మరోవైపు, లీజుకు తీసుకున్న ప్లాంట్ సైట్‌లో ఎలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ జరగలేదని తెలిసింది. ఇవన్నీ జగ్గీ బ్రదర్స్ స్మార్ట్‌గా ప్లాన్ చేసి స్కామ్ చేసిన విధానాన్ని బట్టబయలు చేసాయి.

కేవలం పెట్టుబడిదారులుగానే దీపిక, ధోనీలు

ఇక, జెన్సోల్ ఇంజనీరింగ్, బ్లూస్మార్ట్ మొబిలిటీతో సంబంధం ఉన్న ఆర్థిక కుంభకోణంలో బాలీవుడ్ నటి దీపికా పడుకోణె, ప్రఖ్యాత క్రికెటర్ ఎమ్.ఎస్. ధోనీ పాత్ర గురించి కూడా పలు పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే, ఈ కంపెనీలు వీళ్లు కేవలం పెట్టుబడిదారులుగానే ఉన్నారు. బ్లూస్మార్ట్ మొబిలిటీలో పెట్టుబడి పెట్టిన ప్రముఖ వ్యక్తుల్లో వీళ్లు కూడా ఒక భాగం అంతే. ఎలక్ట్రిక్ వాహన రైడ్-హైలింగ్ స్టార్టప్‌గా 2018లో ప్రారంభమైన బ్లూస్మార్ట్… అప్పటికే ఉన్న ఉబర్, ఓలాతో పోటీపడే లక్ష్యంతో స్థాపించబడింది. ప్రారంభంలోనే ఇందులో రూ. 4 వేల 100 కోట్లకు పైగా నిధులు వచ్చాయి. ఈ క్రమంలోనే ధోనీ, దీపికాతో పాటు సంజీవ్ బజాజ్, అశ్నీర్ గ్రోవర్ వంటి ఇతర ప్రముఖులు కూడా పెట్టుబడి పెట్టారు.

ఈ కుంభకోణంలో వీళ్లు కేవలం బాధితులు

అయితే, వీళ్ల పెట్టుబడికి సంబంధించిన ఖచ్చితమైన మొత్తం, వాటా వివరాలు పబ్లిక్ డొమైన్‌లో స్పష్టంగా అందుబాటులో లేవు. జగ్గీ బ్రదర్స్ కంపెనీ రుణాలను దుర్వినియోగం చేసినందు వల్ల బ్లూస్మార్ట్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకొని, దాని సేవలను నిలిపివేసింది. షేర్ విలువలు భారీగా పడిపోయిన తర్వాత.. ధోనీ, దీపికా వంటి పెట్టుబడిదారులు ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి, ఈ కుంభకోణంలో వీళ్లు “బాధితులు”గానే ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే, ధోనీ, దీపికాలు ఈ కుంభకోణంలో నేరుగా నిధుల దుర్వినియోగంలో భాగం కాలేదు. కేవలం బ్లూస్మార్ట్‌లో పెట్టుబడి పెట్టిన వ్యక్తులుగా మాత్రమే ఉన్నారు.

నిధుల బదిలీ వంటి అంశాలపై లోతుగా విచారణ

ఇక, ఈ స్కామ్‌లో తదుపరి చట్టపరమైన చర్యల చూస్తే.. సెబీ ఇప్పటివరకు తీసుకున్న చర్యలతో పాటు.. జెన్సోల్ ఇంజనీరింగ్ ఆర్థిక రికార్డులను వివరంగా పరిశీలించడానికి ఫోరెన్సిక్ ఆడిటర్ నియామకాన్ని సెబీ ఆదేశించింది. ఈ ఆడిట్.. నిధుల దుర్వినియోగం, నకిలీ డాక్యుమెంట్లు, సంబంధిత సంస్థలకు నిధుల బదిలీ వంటి అంశాలను లోతుగా విచారించనుంది. అలాగే, మార్కెట్ మానిపులేషన్‌ను నిరోధించడంలో భాగంగా.. జెన్సోల్ ప్రతిపాదిత స్టాక్ స్ప్లిట్‌ను సెబీ నిలిపివేసింది. ఇక, ఫోరెన్సిక్ ఆడిట్ పూర్తయిన తర్వాత.. సెబీకి సమగ్ర నివేదిక అందుతుంది. ఫలితాల ఆధారంగా, సెబీ.. జగ్గీ బ్రదర్స్‌పై అదనపు జరిమానాలు విధించవచ్చు, లేదంటే, క్రిమినల్ చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది.

జగ్గీ సోదరులతో పాటు సంస్థలపై కఠినమైన చర్యలు

జగ్గీ సోదరులతో పాటు సంబంధిత సంస్థలపై కూడా మరింత కఠినమైన చర్యలు తీసుకోవచ్చు. ఇందులో, వారి ఆస్తుల జప్తు నుండీ జరిమానాలు భారీగా ఉండే అవకాశం ఉంది. అలాగే, మోసం, నిధుల దుర్వినియోగం, నకిలీ డాక్యుమెంట్ల ఆరోపణలపై క్రిమినల్ కేసులు నడుస్తాయి. సెబీ ఈ కేసును ఎకనామిక్ ఆఫెన్సెస్ విభాగం, లేదంటే, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వంటి ఏజెన్సీలకు రిఫర్ చేయొచ్చు.

జెన్సోల్ షేర్లు 2025లో 83% నుండి 90% వరకు క్షీణత

అయితే, జగ్గీ బ్రదర్స్ నిర్వాకం కారణంగా.. జెన్సోల్ షేర్లు 2025లో 83% నుండి 90% వరకు క్షీణించాయి. దీనివల్ల, పెట్టుబడిదారులు భారీ నష్టాలను చవిచూశారు. కాబట్టి, దీపికా పడుకోణె, ధోనీ లాంటి ప్రముఖ పెట్టుబడిదారులంతా కలిసి సెబీ ద్వారా, లేదంటే, కోర్టుల ద్వారా నష్టపరిహారం కోరే అవకాశం ఉంది. ఇది క్లాస్ యాక్షన్ సూట్‌లకు కూడా దారితీయవచ్చు. మరోవైపు, EV ప్రోత్సాహాన్ని మరింతగా పెంచాలనే ఉబెర్ ప్రణాళికలకు ఇది పెద్ద ఎదురుదెబ్బగా చెప్పాలి. ఒక సమయంలో బ్లూస్మార్ట్‌ను కొనుగోలు చేయాలని భావించిన ఉబెర్.. ఇప్పుడు ఆ కంపెనీతో చేసిన ప్లాన్స్‌ను నిలిపివేస్తోంది.

Also Read: మళ్లీ కరోనా.. ఆ నెలలోనే భూమి అంతం! వణుకు పుట్టిస్తున్న బాబా వంగా జోస్యం

సందిగ్ధంలో బ్లూస్మార్ట్ డ్రైవర్ల జీతాల చెల్లింపులు

బ్లూస్మార్ట్ డ్రైవర్లకు జీతాల చెల్లింపులు కూడా సందిగ్ధంలో పడ్డాయి. దీని వల్ల, 10 వేల మందికి పైగా డ్రైవర్ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఇకపోతే.. ఈ స్కామ్‌లో ఇండియన్ రిన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుండి రూ. 9 వందల 77.75 కోట్ల రుణాలు దుర్వినియోగం అయ్యాయి. కాబట్టి, ఈ సంస్థలు తమ రుణాలను తిరిగి పొందడానికి చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు.

స్టార్టప్‌లలో కార్పొరేట్ గవర్నెన్స్ లోపాలు బహిర్గతం

ఈ స్కామ్.. దేశంలోని స్టార్టప్‌ వ్యాపారాల్లో కార్పొరేట్ గవర్నెన్స్ లోపాలను బహిర్గతం చేసింది. కాబట్టి, భవిష్యత్తులో స్టార్టప్ కంపెనీలు ప్రభుత్వ సంస్థల నుండి మరిన్ని తనిఖీలను ఎదుర్కోవచ్చు. స్టార్టప్‌ల కోసం తప్పనిసరి త్రైమాసిక ఆడిట్‌లు, స్వతంత్ర ఆడిట్ నివేదికలు, వెంచర్ క్యాపిటల్‌లకు జవాబుదారీతనం వంటి ప్రతిపాదిత సంస్కరణలు మరింత వేగంగా అమలవ్వడానికి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ సంఘటన రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌ను బలోపేతం చేయడానికి ఒత్తిడి తెస్తుంది. ముఖ్యంగా పబ్లిక్ ఫండ్స్‌ను ఉపయోగించే స్టార్టప్‌లకు ఇది సవాలుగా మారుతుంది. మొత్తంగా.. ఈ కేసు భారతదేశ స్మాల్-క్యాప్ మార్కెట్‌లోని వ్యవస్థాగత సమస్యలను మరింత హైలైట్ చేసిందన్నది స్పష్టం.

Related News

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

AP BJP: ఏపీలో బీజేపీకి అన్యాయం జరుగుతుందా?

AP Liquor Scam Case: జగన్‌ను ఇరికించిన చెవిరెడ్డి?

BIG Shock To Donald Trump: ట్రంప్‌కు మోదీ దెబ్బ.. అమెరికా పని ఖతమేనా

Big Stories

×