Big Stories

Botsa Family Politics: అన్న పైనే తమ్ముడి గెలుపు భారం..

Botsa Family Politics Latest News: విజయనగరం జిల్లా రాజకీయాల్లో బొత్స సత్యనారాయణ రూటే సెపరేటు.. కాంగ్రెస్‌లో ఉన్నా వైసీపీలోకి వచ్చినా జిల్లాలో పార్టీ రాజకీయం అంతా ఆయన కనుసన్ననల్లోనే నడుస్తుంటుంది. ఆయన ఫ్యామిలీ నుంచే ఒకరికి నలుగురు ప్రజాప్రతినిధులు ఉన్నారంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ ఎన్నికల్లో కూడా చీపురుపల్లి నుంచి బొత్స పోటీలో ఉంటే ఆయన భార్య ఝాన్సీ విశాఖ ఎంపీగా బరిలో ఉన్నారు. ఇక గజపతినగరం ఎమ్మెల్యేగా ఉన్న బొత్స తమ్ముడు అప్పలనర్సయ్య మరోసారి పోటీకి దిగారు. అయితే ఈ సారి ఆయన గట్టెక్కడం కష్టమే అన్న టాక్ వినిపిస్తుంది.

- Advertisement -

దాంతో తమ్ముడ్ని గెలిపించుకోవడానికి ఆ అన్నగారి వ్యూహాలు ఎలా ఉంటాయనేది ఆసక్తకరంగా మారింది. అన్నపై నమ్మకం ఉమ్మడి విజయనగరం జిల్లాలో బొత్స కుటుంబం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలలో గజపతినగరం ఒకటి స్వయానా మంత్రి బొత్స సత్యనారాయణ సోదరుడు బొత్స అప్పలనరసయ్య అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్న దత్తిరాజేరు, బొండపల్లి మండలాల్లో రెండుసార్లు జడ్పీటీసీ గా పని చేసిన ఈయన 2009, 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు . అంతకముందు ప్రభుత్వ ఉద్యోగిగా పని చేసిన అప్పలనర్సయ్య.. అన్న ప్రోత్సాహంతో ఉద్యోగానికి రాజీనామా చేసి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు.

- Advertisement -

ఇక అక్కడి నుండి వెనక్కి తిరిగి చూసుకోలేదు. ప్రభుత్వ ఉద్యోగిగా, జడ్పీటీసీగా, ఎమ్మెల్యేగా ఇలా వివిధ హోదాల్లో పని చేయడంతో నిధులు, వనరులపై మంచి పట్టు సాధించారు. ఆ క్రమంలో ఎందులో ఎంతోస్తుందో? ఎంత మిగులుతుందో ? అన్న లెక్కలు ఔపాసన పట్టేశారన్న విమర్శలున్నాయి. ఓ వైపు అన్న మంత్రిగా పని చేయడం జిల్లా మొత్తం తమ కుటుంబ సభ్యుల కనుసన్నల్లోనే ఉండడంతో బొత్స అప్పలనరసయ్యకు తిరుగులేకుండా పోయింది. 2009 లో రాష్ట్రంలోనే కాకుండా , కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండడం, అన్న కాంగ్రెస్ లో తిరుగులేని నాయకుడుగా ఉండడంతో అప్పలనరసయ్యకి కూడా ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్లు సాగిందన్న అభిప్రాయం ఉంది. అన్ని ప్రభుత్వ కాంట్రాక్టులతో పాటు అటు రైల్వే కాంట్రాక్టులు దక్కించుకున్నారు. ఆయా వర్క్స్‌లో విపరీతమిన అవినీతికి పాల్పడ్డారని గజపతినగరం ప్రజలు ఓపెన్‌గానే చెప్తుంటారు. ఆ తరువాత వైసీపీ హయాంలో 2019 లో ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత కూడా ఆయన అదే వైఖరి కొనసాగించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Also Read: కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో విడుదల.. పాంచ్ పటాకా..!

ఇసుక మాఫియా నుండి భూ కబ్జాల వరకు ఎక్కడ చూసినా అప్పలనరసయ్య పేరు తప్ప మరొక పేరు వినిపించడం లేదని విపక్షాలు టార్గెట్ చేస్తుంటాయి. వందల ఎకరాల ప్రభుత్వ భూముల కబ్జా చేయడంతో పాటు , ఇతరాత్రా భూములను మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు దక్కించుకోవడం వంటివి ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అన్న విమర్శలున్నాయి.. ఖాళీ భూములు కనిపిస్తే అప్పలనరసయ్యకి నిద్ర పట్టదని స్థానికులు సెటైర్లు విసురుతుంటారు. మరోవైపు నియోజకవర్గాన్ని కనీసం అభివృద్ది చేయలేదనే విమర్శలు గట్టిగానే ఉన్నాయి. నియోజకవర్గంలో కనీసం రోడ్లు కూడా వేయించలేదని అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ, ఉపాధి రంగాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అన్నట్లు ఉంది పరిస్థితి. ఈ నియోజకవర్గ పరిధిలో కనీసం చిన్న తరహా పరిశ్రమలు కూడా లేకపోవడం అక్కడివారిని మరింత వేధిస్తోంది. జామి మండలంలో ఉన్న భీమసింగి షుగర్ ఫ్యాక్టరీని కూడా మూసేయడంతో.. నియోజకవర్గ ప్రజలు ఉపాధి కోసం వలసబాట పట్టాల్సి వస్తుందంట.

ఇక పాదయాత్ర సమయంలో జగన్ ఇచ్చిన గజపతినగరం సామాజిక ఆసుపత్రి ఆధునీకరణ హామీ నెరవేరలేదు సరికదా. ఉన్న సౌకర్యాలే దయనీయంగా తయారయ్యాయి. గిరిజన ప్రాంతాలైన సాలూరు, పార్వతీపురం, కురుపాం వంటి ప్రాంతాలకు ముఖ ద్వారంలా ఉండే ఈ నియోజకవర్గ కేంద్రంలో కనీసం ఆర్టీసీ కాంప్లెక్స్ కూడా సరిగా లేకపోవడం మరిన్ని విమర్శలకు తావిస్తోంది. నిత్యం పదుల సంఖ్యలో బస్సులు ఈ కాంప్లెక్స్‌ను టచ్ చేస్తూ వెళ్తుంటాయి. కానీ ఇప్పటికీ దానిని అభివృద్ధి చేయకపోవడంతో ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మౌలిక సదుపాయాల మాట అటుంచితే కనీసం ఏ బస్ ఎపుడు వస్తుందో చెప్పే ఉద్యోగి కూడా అందుబాటులో లేక ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. పోలవరం ఎడమ కాలువ విషయంలో కూడా స్థానిక రైతులకు అప్పలనర్సయ్య తీరని అన్యాయం చేశారన్న ఆరోపణలున్నాయి.

Also Read: Sharmila, Sunitha shocking comment: జగన్‌పై ఆగ్రహం, గొడ్డలితో నరికి చంపినప్పుడు..!

తన రియల్ ఎస్టేట్ వెంచర్లు, భూముల మధ్యలో నుండి వెళ్తున్న డిజైన్‌ను మార్చి , స్థానిక రైతుల వ్యవసాయ భూముల నుండి వెళ్ళేలా చేశారంట సదరు ఎమ్మెల్యే. దానిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలుమార్లు ఆందోళన బాట పట్టినా ప్రయోజనం లేకుండా పోయింది. మరోవైపు తోటపల్లి బ్రాంచ్ కెనాల్ నుండి ఈ నియోజకవర్గానికి సాగు నీరు తీసుకురావడానికి గత ప్రభుత్వ హయాంలో సుమారు 50 శాతం పనులు పూర్తి చేసినా , ప్రస్తుత హయాంలో తట్టెడు మట్టి కూడా తీయలేదన్న అక్కడి వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇలా ఎన్ని ఆరోపణలు, విమర్శలు ఉన్న బొత్స అప్పలనరసయ్య మాత్రం ఈ ఎన్నికల్లో విజయంపై ధీమా గానే ఉన్నారట. ప్రభుత్వ సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని అనుయాయుల వద్ద చెప్పుకొస్తున్నారట. మరోవైపు టీడీపీ అభ్యర్ధి కొండపల్లి శ్రీనివాస్ రాజకీయాలకు కొత్తకావడం, నియోజకవర్గంపై పెద్దగా అవగాహన లేదు కాబట్టి తనకు ఢోకా లేదని లెక్కలు వేసుకుంటున్నారట. అన్నిటికీ మించి పోల్ మేనేజ్మెంట్ లో తన అన్నకు తిరుగులేదనే కాన్ఫిడెన్స్ కూడా గట్టిగానే ఉందట. చూడాలి ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ కుందేలు, తాబేలు కధను గుర్తు చేస్తుందో? లేకపోతే అప్పలనర్సయ్యను మరోసారి అందలమెక్కిస్తుందో.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News