BRS Party: తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూది, టీఆర్ఎస్‌లో జవసత్వాలు నింపిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో .. ఆ పార్టీ గత వైభవం కోల్పోతోంది. గత ఎన్నికల ముందు వరకు జిల్లాలో ఏ ఎన్నిక జరిగినా గులాబీపార్టీ హవానే నడిచింది. 2023 నాటి నుంచి ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, పంచాయతీ, మునిసిపల్ .. ఇలా ఏ ఎన్నికలు జరిగినా చేతులెత్తేసే స్థితికి చేరుకుంది. దాంతో జిల్లా గులాబీ శ్రేణుల్లో తీవ్ర నిరాశ కనిపిస్తూ.. పార్టీ నైరాశ్యంలో కొట్టుమిట్టాడాల్సి వస్తోంది. ఆ క్రమంలో కరీంనగర్ జిల్లాలో పార్టీ ఇక కోలుకునే ప్రసక్తే లేదా? క్రమకమంగా కనుమరుగవ్వాల్సిందేనా అన్న సందేహాలు బీఆర్ఎస్ క్యాడర్‌ను పట్టి పీడిస్తున్నాయంట. అసలు ఒకప్పుడు జిల్లాలో రాజసం వెలగబెట్టిన బీఆర్ఎస్ అంత దయనీయంగా ఎందుకు మారింది?
గులాబీ పార్టీకి తెలంగాణ ఉద్యమ సమయం నుండి ఊపిరిలూది.. అండగా నిలించింది ఉమ్మడి కరీంనగర్ జిల్లా … ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ తీవ్రతరమవుతున్న సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కరీంనగర్ జిల్లా నుంచే టీఆర్ఎస్ తరపున ఎక్కువ మంది ఎమ్మెల్యేలను గెలిపించి తమ ప్రత్యేక జిల్లా కాంఛను చాటుకున్నారు జిల్లా ప్రజలు .. అందుకే మాజీ ముఖ్యమంత్రి, గులాబీ బాస్ కేసీఆర్ కరీంనగర్ జిల్లాను సెంటిమెంట్‌గా భావిస్తుంటారు. టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత 2004 ఎన్నికల్లో ఆయన కరీంనగర్ ఎంపీగా గెలిచి యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి అయ్యారు. తర్వాత కాంగ్రెస్ తో విభేదించి 2006,2008 ఉపఎన్నికల్లో కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచే మరో రెండు సార్లు విజయం సాధించగలిగారు. ఉద్యమ పార్టీగా ఉన్న టీఆర్ఎస్‌ను ఆదరించి తనను ఎంపీగా గెలిపించిన కరీంనగర్‌పై తనకున్న సెంటిమెంట్‌ను కేసీఆర్ ఎన్నోసార్లు బహిరంగంగానే చెప్పుకున్నారు.
ఉద్యమం లో కావచ్చు..అధికారం లో ఉన్న సమయంలో కావచ్చు ఏ శుభకార్యం మొదలుపెట్టాలన్నా అది కరీంనగర్ జిల్లా నుంచే మొదలుపెట్టేవారు. దానికి తగ్గట్లే ఉద్యమం సమయంలోనూ, తర్వాత రెండు సార్లు అధికారంలోకి ఉన్నప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా .. కరీంనగర్ జిల్లా వాసులు గులాబిపార్టీకే పట్టం కడుతూ వచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన 2014, 2018 ఎన్నికల్లో కరీంనగర్ జిల్లాలోని 13 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ నుండి ఒక్క ఎమ్మెల్యే నే గెలిచారంటే ఆ పార్టీ హవా ఎలా కొనసాగిందో అర్థమవుతుంది. ఇక 2018 వరకు జిల్లాలోని మూడు ఎంపి స్థానాలు వారివే.. కాని ఇప్పుడు పరిస్థితి ఒక్కసారిగా రివర్స్ అవుతూ వస్తోంది. ఆయువుపట్టు అనుకున్న కరీంనగర్ జిల్లాలో 2023 ఎనికల్లో సిరిసిల్ల, జగిత్యాల, హుజురాబాద్, కోరుట్ల, కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్లలో తప్ప మిగతా అన్ని స్థానాలలో బీఅర్ఎస్‌కి భంగపాటు తప్పలేదు..ఇప్పుడు జగిత్యాల ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో వారి బలం నాలుగు మాత్రమే. ఇక ఎంపి ఎన్నికలలో కరీంనగర్‌లో బీజేపీ నుండి బండి సంజయ్ గెలవగా…బీఅర్ఎస్ మూడవస్థానానికి పరిమితం అయింది. కాంగ్రెస్ గెలుచుకున్న పెద్దపల్లి లోక్‌సభ స్థానంలో కూడా బీఅర్ఎస్ ది మూడో స్థానామే. పక్కనున్న నిజామాబాద్ లోక్‌సభ సెగ్మెంట్లో సైతం థర్డ్ ప్లేస్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఇక చాలా కాలం తరువాత సర్పంచి ఎన్నికలు జరగ్గా, కరీంనగర్ జిల్లాలో ఒక్క కేటిఅర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో తప్ప ఎక్కడ కూడా బీఅర్ఎస్ ప్రభావం చూపలేక పోయింది. ఇటీవలి మున్సిపల్ ఎన్నికలలో కూడా సిరిసిల్ల, హుజురాబాద్ నియోజకవర్గాలు మినహా మిగిలిన సెగ్మెంట్ల మున్సిపాల్టీల్లో కనీసం పోటీ ఇవ్వలేక కారు మూలనపడింది. కరీంనగర్, కోరుట్ల, హుజురాబాద్, సిరిసిల్ల లలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లు గెలచినా…ఒక్క సిరిసిల్ల లో తప్ప మిగతా నియోజకవర్గాల్లో ఎదురీత తప్పలేదు. ఉద్యమ సమయం నుంచి జిల్లాలో ఒక వెలుగు వెలిగిన గులాబీ పార్టీ ఇప్పుడు కనీస పోటీ ఇవ్వలేకపోతుండటం వారి స్వయంకృతాపరాధమే అంటున్నారు. సర్పంచి, మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికారంలో లేకపోవడంతో బీఆర్ఎస్ ముందే చేతులెత్తిసింది. కేటీఆర్ ఎమ్మెల్యేగా ఉన్న ఒక్క సిరిసిల్ల నియోజకవర్గం లో తప్ప ఎక్కడా కుడా గులాబీ శ్రేణుల్లో సీరియస్ నెస్ కనబడలేదు. సిరిసిల్ల లో నెలరోజుల ముందు నుండే సమీక్షలు,సమావేశాలు నిర్వహించారు కేటిఅర్… సిరిసిల్ల మునిసిపాల్టీని ఎలాగైనా తమ ఖాతాలో వేసుకోవాలని వాడవాడలా తిరిగారు. ఎప్పుడూ లేనిది ఇంటిఇంటికి తిరిగి ఓటు అడిగారు. ప్రచార సమయంలో కేటీఆర్‌కి కొన్ని సందర్భాలలో ప్రతికూల పరిస్థితులు ఎదురైనా, అభివృద్ధి చేసింది ఆయనే కదా అని మరోసారి సిరిసిల్ల ఓటరు బీఅర్ఎస్‌ను కరుణించాడంట.
సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం లో మునిసిపల్ ఎన్నికలు జరుగుతున్నా కూడా తన సిరిసిల్ల మున్సిపాల్లీకే పరిమితం అయిన కేటీఆర్ విస్తృత ప్రచారం చేశారు. గతంలో తనవల్ల తప్పులు జరిగినా… తాను పట్టించుకోని సమస్యల విషయంలో పట్టించుకోలేక పోయినా క్షమించండని వేడుకుంటూ.. ఇకపై సిరిసిల్ల ప్రజాక్షేత్రంలొ ఉంటానని గట్టిగా నమ్మకం కలిగించడంలో కేటీఆర్ సక్సెస్ అవ్వడంతో సిరిసిల్ల లో మంచి మెజారిటీతో మునిసిపల్ పీఠం దక్కింది. ఇక హుజురాబాద్‌లో ఆ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఉండి, క్యాడర్ స్ట్రాంగ్‌గా ఉన్నా కౌశిక్ రెడ్డి యాటిట్యూడ్, సమ్మక్క సారాలమ్న జాతర సందర్భంగా పోలీసులు, ముస్లీం లపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర ప్రభావం చూపాయి. దాంతో హుజురాబాద్ మున్సిపాల్టీలో బీఆర్ఎస్ పోటీ ఇవ్వలేక పోయింది . జమ్మికుంట మున్సిపాల్టీలో ఇండిపెండెంట్ సహాయంతో బీఆర్ఎస్ మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోగలిగింది. స్థానిక ఎమ్మెల్యే అయి ఉండీ కౌశిక్‌రెడ్డి ఎక్కడా ప్రచారం చెయ్యకపోవడం తో బీఅర్ఎస్ జమ్మికుంటలో చచ్చీచెడి పరువు దక్కించుకోగలిగిందంట.. కరీంనగర్ కార్పొరేషన్ లో వరుసగా రెండు సార్లు మేయర్ పీఠం దక్కించుకున్న కారు పార్టీ ఈ సారి మూడో స్థానానికి పరిమితమైంది. అది కూడా కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇమేజ్ కారణంగా నే కరీంనగర్ లో బీఆర్ఎస్ ఉనికి చాటుకోగలిందంటున్నారు. గత ఎన్నికల్లో కరీంనగర్‌లో బీజేపీ, కాంగ్రెస్‌లకు సింగిల్ డిజిట్ కార్పొరేటర్లు ఉంటే .. ఈ సారి బీఆర్ఎస్ సింగిల్ డిజిట్‌కి పరిమితమవ్వాల్సి వచ్చిందంటే ఆ పార్టీ ఎలాంటి స్థితిలో ఉందో అర్థమవుతుంది.
జగిత్యాల లో బీఅర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చెరడంతో సర్పంచి, మునిసిపల్ ఎన్నికలో బీఆర్ఎస్ కనీస పోటీ ఇవ్వలేక పోయింది. కొరుట్ల నియోజకవర్గం లో కోరుట్ల, మెట్‌పల్లి రెండు మునిసిపాలిటి లు కూడా కాంగ్రెస్ ఖాతాలోకే వెళ్ళిపోయాయి. కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కల్వకుంట్ల సంజయ్ ఉన్నా, మున్సిపాల్టీ ఓటర్లు కాంగ్రెస్‌కే పట్టంకట్టారు. ఇక అక్కడ బిజేపీ కూడా పుంజుకోవడం బీఅర్ఎస్ భవిష్యత్తుని ప్రశ్నార్ధకంగా మార్చింది… ఇక ధర్మపురి మునిసిపాలిటీలో బీఆర్ఎస్ కనీసం ఒక్క స్థానం కూడా గెలవలేకపోయింది…పెద్దపల్లి జిల్లాలో ఒక్క బీఅర్ఎస్ ఎమ్మెల్యే కూడా లేకపోవడంతో.. పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాల్టలతో పాటు రామగుండం కార్పొరేషన్లో గులాబీ పార్టీ నామ్ కే వాస్తేగా మిగిలింది. మొత్తానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగిని మునిసిపల్ ఎన్నికలలో బీఅర్ఎస్ పూర్తిగా చేతులేత్తేసింది. ఇప్పటికీ అన్ని నియోజకవర్గాలో కేసిఅర్ అభిమానులు, ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో ఉన్నా… ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వలసనేతలకు ప్రాధాన్యత ఇచ్చింది. అలాంటి వారంతా అధికారం పోయాక కారు దిగి హస్తం నీడకు చేరిపోయారు. గులాబీ పార్టీలో నికార్సైన ఉద్యమకారులు మిగిలిపోయారు. వారిని అధికారంలో భాగస్వాముల్ని చేయకపోవడం, ఎలాంటి పదవులు వారికి దక్కకపోవడంతో వారు తీవ్ర అసహనంతో కనిపిస్తున్నారు. మరిలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్‌కు పూర్వ వైభవం సంగతేమో కాని… కనీసం మనుగడ కొనసాగించాలంటే చాలా విషయాల్లో మార్పు రావాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Story By Apparao Big Tv
Also Read: MLC Malka Komaraiah: ఉపాధ్యాయుల భద్రత, సంక్షేమం సర్కార్ కు పట్టదా? : ఎమ్మెల్సీ మల్క కొమురయ్య