BRS Warangal Meeting: బీఆర్ఎస్‌కు పూర్వ వైభవం తీసుకొచ్చేలా నిర్వహించాలనుకుంటున్న రజతోత్సవ సభ చుట్టూ పెద్ద సవాళ్లే ఎదురవుతున్నాయి. ఓవైపు పార్టీలో అంతర్గత నాయకత్వ సమస్యలు, శ్రేణుల నిరుత్సాహం, ఆర్థిక భారం మోసేందుకు నేతలు పెద్దగా ముందుకు రాకపోవడం, ప్రత్యర్థుల విమర్శలు, సంస్థాగత బలహీనతలు ఇవన్నీ పెద్ద సవాల్ గా మారుతున్నాయంట. ఈ సభకు 5 లక్షల మందిని సమీకరించి, క్యాడర్లో మళ్లీ జోష్ నింపాలని పట్టుదలగా ఉన్నారు బీఆర్ఎస్ పెద్దలు. అయితే ఇన్ని సవాళ్ల మధ్య కారు పార్టీ టార్గెట్ రీచ్ అవుతుందా?
కేసీఆర్ ఏం చెపుతారా అని బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆసక్తి
వరంగల్‌లో బీఆర్ఎస్ 25వ ఆవిర్భావ దినోత్సవ సభను అత్యంత ఘనంగా, చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారు . ఈ సభ బీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించడంలో కీలకంగా ఉండబోతోందని, కేసీఆర్ ఏం చెబుతారో వినాలని బీఆర్ఎస్ శ్రేణులు ఎదురు చూస్తున్నాయి. కాంగ్రెస్ సర్కారుపై వ్యతిరేకత పెరిగిపోతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చాలా నెలల క్రితం నుంచే ఊదరగొడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై జనంలో వ్యతిరేకత పెరిగిందని, ప్రతి సమస్య పరిష్కారం కోసం ప్రజలు తెలంగాణ భవన్ కు వస్తున్నారని, అదో జనతా గ్యారేజ్ లా మారిందని ప్రచారం చేసుకుంటున్నారు.
మూడో సారి అధికారం నిలబెట్టుకోలేక చతికిలపడ్డ బీఆర్ఎస్
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చిన గులాబీ పార్టీ… మూడో సారి దాన్ని నిలబెట్టుకోలేక చతికిలపడింది. ఓటమి తర్వాత ఆ పార్టీ నుంచి కీలక నేతల వలసలు పెరిగిపోయాయి. పది మంది ఎమ్మెల్యేలు కూడా కారు దిగి హస్తం నీడకి చేరిపోయారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గులాబీబాస్ కేసీఆర్ పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టలేదు. ఆ ఎఫెక్ట్ గత ఎన్నికల్లో, ఫలితాల తర్వాత కనిపిస్తూనే ఉంది.
చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహిస్తామంటున్న బీఆర్ఎస్
ఇక మాజీ సీఎం కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యేగా గెలిచి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా చేపట్టాక.. అసెంబ్లీకి రెండుసార్లే వచ్చారు. జస్ట్ అటెండెన్స్ వేసుకుని వెళ్లారు. ప్రధాన ప్రతిపక్ష నేత పాత్ర పోషించట్లేదని, మళ్లీ ఫాంహౌజ్ దాటి బయటకు రావడం లేదని ప్రత్యర్థి పార్టీలు విమర్శిలు గుప్పిస్తున్నాయి. ఆ క్రమంలో గులాబీ క్యాడర్‌లో స్తబ్దత నెలకుంటోంది. అందుకే తిరిగి పార్టీ బలోపేతంపై దృష్టి పెడుతున్న పార్టీ పెద్దలు చరిత్రలో నిలిచిపోయేలా పార్టీ సిల్వర్ జుబ్లీ సభను నిర్వహిస్తామంటున్నారు.
5 లక్షల మందిని సమీకరించాలని టార్గెట్
ఈ నెల 27న వరంగల్‌లో నిర్వహించనున్న బహిరంగ సభ నేతలకు సవాల్ గా మారింది. కనీసం 5 లక్షల మందిని సమీకరించి సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ టార్గెట్ పెట్టుకుంది. దాన్ని గ్రాండ్ సక్సెస్ చేసేందుకు ఓవైపు కేసీఆర్ ఫాంహౌజ్ లో జిల్లాల నేతలతో వరుస మీటింగ్ లు పెడుతున్నారు. అటు కేటీఆర్, ఇటు కవిత అన్ని చోట్లకూ తిరుగుతున్నారు. పెద్ద సంఖ్యలో తరలి రావాలని కోరుతున్నారు. అయితే జనసమీకరణకు సంబంధించి చాలా సవాళ్లే ఎదురవుతున్నాయంట. భారీ బహిరంగ సభ అంటే మాటలు కాదు. చాలా నిధులు అవసరం. అందుకే కొందరు స్థానిక కీలక నేతలు ఆర్థిక భారం భరించలేక వెనక్కు తగ్గారన్న ప్రచారం జరుగుతోంది. అయితే నేతలపై భారం మోపబోమని, పార్టీనే అన్ని ఖర్చులు భరిస్తుందని వారికి పార్టీ పెద్దలు భరోసా ఇస్తున్నారంట.
బీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌పై స్పందించని బీఆర్ఎస్
గులాబీ జెండానే తెలంగాణకు భరోసా అని కేటీఆర్ అంటుంటే.. పార్టీ పేరులో నుంచి తెలంగాణను తీసేయడం వారికి సెంటిమెంట్‌గా మైనస్ అయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదీకాక సొంత పార్టీలోనే పరిష్కరించుకోవాల్సిన సమస్యలు చాలానే ఉన్నాయంటున్నారు. కొందరు నేతలు పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనక పోవడం తలనొప్పిగా మారిందంట. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, ఎంపీ ఎన్నికల్లో సున్నా సీట్లతో శ్రేణుల్లో పూర్తిగా నిరుత్సాహం ఆవరించిన పరిస్థితి. అదీకాక ప్రస్తుతం తెలంగాణలో కులగణన జరిగింది. బీసీలకు అన్ని పార్టీలు ప్రాధాన్యాన్ని పెంచాయి. అయితే బీఆర్ఎస్ లో అధ్యక్ష పదవి లేదంటే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని బీసీలు ఇచ్చే ధైర్యం ఉందా అని హస్తం నేతలు సవాల్ చేస్తున్నా.. అటువైపు నుంచి రియాక్షన్ రావట్లేదు.
Also Read: ఈ ఎమ్మెల్యేలకు ఏమైంది? పబ్లిక్ రివర్స్..
మహిళలకు సముచిత ప్రాధాన్యమివ్వని బీఆర్ఎస్
అక్టోబర్ లో పార్టీ అధ్యక్ష ఎన్నిక జరగాల్సి ఉంది. మరి రజతోత్సవ సభలో బీసీ స్లోగన్ దిశగా ఏమైనా ప్రకటన ఉంటుందా అన్నది కీలకంగా మారింది. అలాగే గతంలో టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చి పక్క రాష్ట్రాల్లో పార్టీని విస్తరించాలని చూసిన కేసీఆర్‌కు సొంత రాష్ట్రంలోనే చావుదెబ్బ తగిలింది. జాతీయ పార్టీ అనిపించుకోవడం ఏమో? కాని అధికార పక్షం కాస్తా ప్రధాన ప్రతిపక్ష పాత్రకు పరిమితమ్వాల్సి వచ్చింది. దాంతో ప్రస్తుతం తెలంగాణలో పార్టీ మనుగడ కాపాడుకోవడం ఆయనకు సవాల్‌గా మారింది. గులాబీ పార్టీలో మహిళలకు భాగస్వామ్యం ఎప్పుడూ నామ్‌కే వాస్తే గానే ఉంటూ వస్తుంది. ఈ సభ తర్వాత వారికి ప్రాధాన్యాన్ని పెంచుతారా లేదా అన్నది కీలకంగా మారింది.
కేటీఆర్, కవిత మధ్య వార్ నడుస్తోందని ప్రచారం
ఇటీవల పార్టీలో ఆధిపత్యం కోసం కేటీఆర్, కవిత మధ్య వార్ నడుస్తోందన్న ప్రచారం ఊపందుకుంటోంది. ఇలా పార్టీలోనే అంతర్గతంగా నాయకత్వ సమస్యలు, ఆధిపత్య పోరు, పార్టీ శ్రేణుల్లో నిరాశ, కేసీఆర్ ఏడాదిన్నర నుంచి ఫాంహౌజ్ కే పరిమితమవడం వంటి వాటితో … వరంగల్ సభ విషయంలో గులాబీపార్టీ అనుకున్న టార్గెట్ రీచ్ అవుతుందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.