AP CM Progress Report: రాష్ట్ర రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఈ వారం పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ మూడో విడత నిధులను విడుదల చేశారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. స్థానిక రైతులు సాగు చేస్తున్న పంటలను పరిశీలించారు. టమోటా, వంగ పంటలను సాగు చేస్తున్న రైతు కుటుంబంతో మాట్లాడారు. పంటకు అయ్యే పెట్టుబడి, వచ్చే దిగుబడి గురించి అడిగి తెలుసుకున్నారు.
మరో యువ రైతుని కలిసి.. పంటల్లో డ్రోన్ వినియోగం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకున్నారు. సంప్రదాయ పిచికారీకి, డ్రోన్‌తో స్ప్రే చేసే దానికి మధ్య సమయం, శ్రమలో ఉన్న వ్యత్యాసాన్ని అడిగారు. రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. గోదావరి పుష్కరాలు ప్రారంభమయ్యే నాటికే.. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి చూపిస్తామన్నారు. రాష్ట్రంలో రైతుల అభివృద్ధి, సాగునీటి భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఈ దిశగా అనేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
బైట్.. సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఈ వారం కీలక నిర్ణయాలు తీసుకుంది. అమరావతి నిర్మాణం నుంచి సాగునీటి ప్రాజెక్టుల వరకు అనేక అంశాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజధానిలో ప్రతిష్ఠాత్మకమైన సచివాలయం, HOD టవర్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ భవనాల్లో మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనుల కోసం 2 వేల 316 కోట్ల పరిపాలన అనుమతులను మంజూరు చేసింది. రాజధానిలో తెలుగు సంస్కృతిని చాటిచెప్పేలా 119 కోట్లతో తెలుగు కల్చరల్ సెంటర్ నిర్మాణానికి ఆమోదం తెలిపారు.
అమరావతిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చిన్నతరహా పరిశ్రమలను ప్రోత్సహిస్తూ.. 17 వేల మందికి కొత్తగా ఉపాధి కల్పించాలని నిర్ణయించారు. దీనికోసం 3,500 సూక్ష్మ పరిశ్రమలకు 300 కోట్ల ఆర్థిక సాయం అందించనున్నారు. మహిళా ఉద్యోగుల కోసం సఖీ నివాస్ పేరుతో పిల్లల సంరక్షణ సౌకర్యాలు కలిగిన హాస్టళ్లను ఏర్పాటు చేయనున్నారు. పోలీసు శాఖలో.. 300 మంది హెడ్ కానిస్టేబుల్ పోస్టులను రిజర్వ్ సబ్ ఇన్ స్పెక్టర్ పోస్టులుగా అప్‌గ్రేడ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
పోలవరం ప్రాజెక్టులో కీలకమైన పనుల కోసం 48 కోట్లను అదనంగా కేటాయించారు. మే 15 నాటికి సాగునీరు విడుదల చేయాలని, ఆ లోపు కాలువలు, డ్రెయిన్ల మరమ్మతుల కోసం జలధార కార్యక్రమాన్ని ఏప్రిల్ 2 నుంచి 90 రోజుల పాటు చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అదేవిధంగా.. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని పరుగులు పెట్టించే దిశగా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 66 వేల 157 ఎకరాల ఏపీఐఐసీ భూములను 22ఏ నిషేధిత జాబితా నుండి తొలగించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మరో 51 వేల 603 ఎకరాలను నేరుగా ఏపీఐఐసీ పేరుతో మ్యుటేషన్ చేసేందుకు అనుమతించింది. ఏప్రిల్ 2న ప్రభుత్వ శాఖల పనితీరుపై రిపోర్టులు రిలీజ్ చేస్తానని.. వాటి ఆధారంగా మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేశారు.
Also Read: వెల్‌కమ్ నెట్‌ఫ్లిక్స్.. హైదరాబాద్‌లో అతిపెద్ద ఐలైన్ స్టూడియో షురూ!
story by: Anup, Big Tv