Big Stories

B Forms for TDP Candidates: ఆర్ఆర్ఆర్ కి లైన్ క్లియర్.. అనపర్తి, దెందులూరు లో హై టెన్షన్..!

- Advertisement -

ఉండి నుంచి రఘురామకు ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించడంతో అక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న మంతెన రామరాజును నరసాపురం పార్లమెంట్‌ సెగ్మెంట్ టీడీపీ అధ్యక్షుడిగా నియమించారు. ఇప్పటి వరకు అక్కడ పార్లమెంట్‌ అధ్యక్షురాలిగా కొనసాగిన మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మిని పొలిట్‌బ్యూరోలోకి తీసుకున్నారు.

- Advertisement -

పెందుర్తి స్థానం జనసేనకు కేటాయించడంతో అక్కడ మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తికి అవకాశం లభించలేదు. దాంతో మాడుగుల స్థానాన్ని ఆయనకు కేటాయించారు. పాడేరు టికెట్‌ను గతంలో వెంకట రమేశ్‌ నాయుడుకు కేటాయించగా మార్పుల్లో భాగంగా మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి ఛాన్స్ దక్కింది. వెంకటగిరి అభ్యర్ధిగా మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కుమార్తె లక్ష్మీప్రియను ప్రకటించారు చంద్రబాబు. అయితే అక్కడి పరిస్థితుల దృష్ట్యా కూతుర్ని కాదని రామకృష్ణకే బీఫాం అందజేశారు.

Also Read: కడప రాజకీయం.. వివేకా చుట్టే బూమరాంగ్.

నరసాపురం ఎంపీ స్థానం పొత్తులో బీజేపీకి వెళ్లింది. రఘురామరాజు కోసం ఆ సీటును తమకివ్వాలని చంద్రబాబు కోరినా బీజేపీ నాయకత్వం సమ్మతించలేదు. తమ అభ్యర్థి శ్రీనివాస వర్మకు బీజేపీ బీ-ఫాం కూడా అందజేసింది. దాంతో రఘురామను ఉండి అసెంబ్లీ స్థానంలో పోటీ చేయించాలని చంద్రబాబు నిర్ణయించారు. అక్కడ టీడీపీ తమ అభ్యర్థిగా సిటింగ్‌ ఎమ్మెల్యే మంతెన రామరాజును ఇదివరకే ప్రకటించింది. నరసాపురం సీటు గల్లంతైనా తాను పోటీలో ఉండటం ఖాయమని ముందు నుంచి చెప్తునే ఉన్నారు రఘురామరాజు అదే జరిగింది.

అనకాపల్లి జిల్లాలోని మాడుగులలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణని రీప్లేస్ చేశారు. అంతకు ముందు మాడుగుల అభ్యర్ధిగా ఎన్‌ఆర్ఐ పైలా ప్రసాదరావును ప్రకటించారు. కానీ ఆయన క్షేత్ర స్థాయిలో ప్రచారంలో వెనుకబడ్డారని అధినాయకత్వానికి నివేదికలు అందాయి. దాంతో పొత్తుల లెక్కలతో సీటు దక్కని పెందుర్తికి చెందిన సీనియర్‌ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని మాడుగుల బరిలో దించారు.

Also Read: ‘మా అన్నయ్య అజాత శత్రువు.. ఆయన జోలికొస్తే సహించేది లేదు’.. సజ్జలకు పవన్ కళ్యాణ్ మాస్ వార్నింగ్

శ్రీసత్యసాయి జిల్లా ఎస్సీ నియోజకవర్గమైన మడకశిరలో ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థి అనిల్‌ కుమార్‌ను మార్చారు.ఆయన అభ్యర్థిత్వాన్ని మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి వర్గం గట్టిగా వ్యతిరేకిస్తోంది. ఈ సీటును పార్టీ దళిత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్‌ రాజుకు ఇచ్చారు. దళిత వర్గంలో మంచి పట్టున్న రాజుది అనంతపురం జిల్లానే బాపట్ల లోక్‌సభ అభ్యర్థిగా కూడా రాజు పేరు పరిశీలించినప్పటికీ చివరికి ఆయనకి మడకశిర టికెట్ దక్కింది.

దెందులూరు, తంబళ్లపల్లె అభ్యర్థుల బీ ఫారాలను పెండింగులో ఉంచినట్లు తెలుస్తోంది. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె అభ్యర్థిగా ప్రకటించిన జయచంద్రారెడ్డి కూడా ప్రచారంలో వెనుకబడిపోయారని టీడీపీ అధిష్టానానికి రిపోర్టులు అందాయి. అదీకాక ఆయన అభ్యర్ధిత్వాన్ని టీడీపీ, జనసేన శ్రేణులు ముందు నుంచి వ్యతిరేకిస్తున్నాయి. పైగా వైసీపీ నేతలతో ఆయనకు వ్యాపార సంబంధాలున్నాయన్న ప్రచారం విస్తృతంగా జరిగింది. ఆయన వైసీపీ కోవర్ట్ అని కూటమి శ్రేణులు తీవ్ర ఆరోపణలు చేశాయి. దాంతో తంబళ్లపల్లె అభ్యర్థిని మార్చడం ఖాయమైందంటున్నారు. ఆయన స్థానంలో మదనపల్లె మాజీ ఎమ్మెల్యే దొమ్మాలపాటి రమేశ్‌ సతీమణి సరళారెడ్డి అభ్యర్ధిత్వం ఖరారైందంట.

Also Read: CM Jagan declared assets: ఆస్తుల చిట్టా, 41శాతం పెరుగుదల.. రిలయన్స్, జియోలో పెట్టుబడులు, 26 పైగానే

ఏలూరు జిల్లా దెందులూరు అసెంబ్లీ స్థానంపై కూడా ఉత్కంఠ నెలకొంది. తమకు ఇచ్చిన అనపర్తి సీటును టీడీపీకి తిరిగి ఇవ్వాలంటే తమకు దెందులూరు ఇవ్వాలని బీజేపీ నాయకత్వం షరతు విధించింది. అయితే ఇక్కడ టీడీపీ ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. ఆ క్రమంలో అక్కడి పార్టీ నేతలు కూడా ఆయనకే గట్టిగా మద్దతిస్తున్నారు. ఏలూరు లోక్‌సభ అభ్యర్థి పుట్టా మహేశ్‌ యాదవ్‌ సైతం చింతమనేనిని మార్చడాన్ని వ్యతిరేకిస్తున్నారు.

అనపర్తి టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అక్కడ టికెట్ కోసం పట్టుపట్టారు. ఆ సీటు బీజేపీకి కేటాయించినప్పటికీ టీడీపీ అభ్యర్ధిగానే పోటీలో ఉంటానని ప్రకటించారు. అయితే ఇప్పుడా చిక్కుముడి వీడింది. నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేయించడానికి టీడీపీ, బీజేపీ నేతలు ఒప్పించారు. చంద్రబాబు, బుచ్చయ్యచౌదరి, బీజేపీ నేతలతో చర్చల తర్వాత బీజేపీ నుంచి పోటీకి నల్లమిల్లి అంగీకారించారు. ఆయన ఇవాలో రేపో బీజేపీలో చేరడం ఖాయమవ్వడంతో చింతమనేనికి లైన్ క్లియర్ అయింది. మొత్తానికి మార్పుల ప్రక్రియ కొలిక్కి రావడంతో చంద్రబాబు తమ అభ్యర్థులకు బీ ఫారాలు అందజేశారు. అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థులకు బీఫారాలు అందజేసి ప్రతిజ్ఞ చేయించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News