CM Chandrababu: పట్టణాభివృద్ధి శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా టిడ్కో ఇళ్ల విషయంలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్లకు డబ్బులు చెల్లించి, ఫ్లాట్ కేటాయింపులు జరగని వారికి వాళ్ల దరఖాస్తు సొమ్ము తిరిగి చెల్లించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో మొత్తం 83 వేల 865 మంది దరఖాస్తుదారులకు సంబంధించి 174 కోట్లు వెనక్కి ఇవ్వాలని చెప్పారు. అలాగే రాష్ట్రంలో నిర్మాణం పూర్తైన 1,00,875 టిడ్కో ఇళ్లను త్వరలోనే లబ్దిదారులకు అందించి, గృహప్రవేశాలు చేసేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పీ4ను ఉద్యమంలా నిర్వహించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రణాళికా విభాగం అధికారులతో క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. పీ4 కార్యక్రమం ప్రారంభించి మార్చి 30 నాటికి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో ఆ రోజు రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలని, తిరుపతిలో రాష్ట్రస్థాయి కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. తొలి ఏడాదిలో ఇప్పటివరకు 2.5 లక్షల మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపామని.. బంగారు కుటుంబాలకు చేయూత ఇవ్వడంలో ఆదర్శంగా నిలిచిన మార్గదర్శులకు అవార్డులు, ప్రశంసాపత్రాలు ఇవ్వాలన్నారు. రాష్ట్రస్థాయిలో ఆదర్శ మార్గదర్శి, జ్ఞాన మార్గదర్శి, సామాజిక సహకార మార్గదర్శి పేరిట అవార్డులు ఇవ్వాలన్నారు. జిల్లా స్థాయిలో విశిష్ట మార్గదర్శి పేరిట ఒక అవార్డు, మరో ముగ్గురికి ప్రశంసాపత్రాలు ఇవ్వాలని.. నియోజకవర్గ స్థాయిలో ముగ్గురు మార్గదర్శులకు సరిఫికెట్లు అందించాలని సీఎం సూచించారు.
పోలవరం ప్రాజెక్టు కోసం భూమిని, ఇళ్లను త్యాగం చేసిన నిర్వాసితుల్ని గుండెల్లో పెట్టుకుంటామన్నారు సీఎం చంద్రబాబు. పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితులతో ఆయన సమావేశమయ్యారు. పునరావాస పరిహార ప్యాకేజీ మూడో విడతలో భాగంగా నిర్వాసితులకు 226 కోట్ల చెక్కును సీఎం అందించారు. గత పాలకుల నిర్లక్ష్యంగా వల్ల పోలవరం ప్రాజెక్టులో అతి ముఖ్యమైన డయాఫ్రం వాల్ దెబ్బతిందని, నిపుణులతో అధ్యయనం చేయించి ఇప్పుడు మళ్లీ రూ. వెయ్యి కోట్లతో కొత్తది నిర్మిస్తున్నామన్నారు. అదే విధంగా గత పాలకులు నిర్వాసితులను పట్టించుకోలేదని, వరద నీటిలో ప్రజలు మునిగిపోతున్నా నిర్లక్ష్యంగా వదిలేశారని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టును, నిర్వాసితుల్ని దృష్టిలో ఉంచుకునే రంపచోడవరం నియోజకవర్గాన్ని పోలవరం జిల్లాగా ఏర్పాటు చేశామన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో నిబద్ధతతో ఈ నిర్మాణాన్ని పూర్తి చేస్తోందన్నారు చంద్రబాబు.
Also Read: Powerful Military Drones: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర డ్రోన్.. రెప్ప పాటులో శత్రువు నాశనం
దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించారు సీఎం చంద్రబాబు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. మంగళగిరి బస్టాండ్ నుంచి దివ్యాంగులతో కలిసి సీఎం ప్రయాణించారు. ప్రభుత్వం ఇచ్చిన ఈ కానుకతో సుమారు 12.76 లక్షల మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందనున్నారు. పథకం ప్రారంభం అనంతరం సీఎం క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు ఆత్మీయ విందు ఇచ్చారు.
రాష్ట్రంలో గ్యాస్ సరఫరా అంశంపై ఆర్టీజీఎస్ నుంచి సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఎల్పీజీ సరఫరాకు ఇబ్బందులు లేవన్నారు ఆయన. మరో 15 రోజులకు అవసరమైన 14 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ నిల్వలు అందుబాటులో ఉన్నాయన్నారు. మరికొన్ని మెట్రిక్ టన్నుల గ్యాస్ అందుబాటులోకి రాబోతోందన్నారు. ఆస్పత్రులకు, హాస్టళ్లు, దేవాలయాలకు ఎలాంటి కొరతా లేకుండా చర్యలు తీసుకోవాలని… ఈకేవైసీ, ఓటీపీల ద్వారా గ్యాస్ సిలిండర్ల డైవర్షన్ లేకుండా, ప్రజలు ప్యానిక్ కాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
అమరావతి శాఖమూరు పార్కులో ఏర్పాటు చేసిన 58 అడుగుల అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. 125 జయంతి సందర్భంగా ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ విగ్రహానికి స్ట్యాచూ ఆఫ్ శాక్రిఫైజ్ నామకరణం చేశామన్నారు. అమరావతి పూర్తయితే ఈ విగ్రహం మరింత అందంగా కనిపిస్తుందని అన్నారు చంద్రబాబు. పొట్టి శ్రీరాములు త్యాగం ఈ తరం వాళ్ళు తెలుసుకోవాలని అన్నారు.
Also Read: Romantic Drama OTT: తండ్రి కర్మకాండలో కలిసిన స్నేహం… ఎమోషన్స్ తో ఆకట్టుకుంటున్న మరాఠి ప్రేమకథ
గృహ వినియోగానికి వంట గ్యాస్ సిలిండర్ల సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలన్నారు సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. హాస్పిటల్స్, స్కూళ్లు, దేవాలయాలకు నిరంతర సరఫరా ఉండాలని ఆదేశించారు. ఆర్టీజీఎస్ నుంచి రాష్ట్రంలోని ఎల్పీజీ నిల్వలు, బుకింగ్, సరఫరా వంటి అంశాలపై సీఎం సమీక్షించారు. ఓఎన్జీసీతోపాటు భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ సహా గ్యాస్ సరఫరా కంపెనీల ప్రతినిధులు కూడా ఇందులో పాల్గొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 17 వేల 209 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ స్టాక్ అందుబాటులో ఉందని, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన హెచ్ పీసీఎల్,బీపీసీఎల్, ఐఓసీఎల్ లకు చెందిన 1154 ఏజెన్సీల నుంచి గ్యాస్ సరఫరా అవుతోందని ఉన్నతాధికారులు వివరించారు. ఎల్పీజీ సిలిండర్లు బ్లాక్ మార్కెట్ కు తరలి పోకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.
రాష్ట్రాన్ని ఈస్ట్ -వెస్ట్ కార్గో కారిడార్‌గా అభివృద్ధి చేయాలన్నారు సీఎం చంద్రబాబు. మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల్లో త్వరితగతిన కార్గో హ్యాండ్లింగ్ ఆపరేషన్లు ప్రారంభం కావాలని నిర్దేశించారు. పోర్టులు, ఫిషింగ్ హార్బర్లపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ మూడు పోర్టుల నుంచి ఒడిశా, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణా, కర్ణాటకల హింటర్ ల్యాండ్ నుంచి కార్గో రవాణా జరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు. రామాయపట్నం నుంచి కడప స్టీల్ ప్లాంట్ వరకూ ప్రత్యేక మార్గాన్ని వేసేందుకు కూడా రైల్వే శాఖ ఆమోదం తెలిపిందని సీఎం తెలిపారు. రెండో దశలో బుడిగట్లపాలెం, పూడిమడక, కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్లను కూడా వేగంగా చేపట్టాలని ఆదేశించారు. విజయవాడలో ముస్లింలకు ప్రభుత్వం ఇచ్చిన ఇఫ్తార్ విందులకు హాజరయ్యారు సీఎం చంద్రబాబు. ఈ సందర్బంగా ప్రార్ధనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైనారిటీల కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ఆయన వివరించారు.
Story by: Apparao, Big Tv