India-China Thaw: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు అంటూ ఉండరంటారు కదా.. అయితే ఇది కొన్ని సందర్భాల్లో దేశాలకూ వర్తిస్తుంటుంది. ప్రత్యర్థిగా భావిస్తున్న దేశాలతోనే జట్టుకట్టే పరిస్థితి ఉండొచ్చు. ఇప్పుడు భారత్ – చైనా బంధం చూస్తుంటే ఇదే నిజమనిపిస్తోంది. ఓవైపు ట్రంప్ దూకుడు భారత్, చైనాకు చాలానే కలిసి వస్తోంది. జియోపొలిటికల్ షిఫ్ట్ అనేది ఒకటి ఉంటుంది. ట్రంప్ కారణంగా ఇది వర్కవుట్ అవుతోంది. ఈ రెండు దేశాల మధ్య ఏం జరుగుతోంది? సంబంధాల్లో ముందడుగు సాధ్యపడిందా?
భారత్ చైనా మధ్య స్నేహబంధం
ఒక నమ్మకం సరికొత్త బంధానికి పునాది వేస్తుంది. ఒక అవకాశం.. సత్సంబంధాలను పెంచుతుంది. ఒక అవసరం కలిసి నడిచేలా చేస్తుంది. ఇది ఇప్పుడు భారత్ చైనాకు వర్తిస్తుంది. ఎందుకంటే 2020లో గాల్వన్ లోయలో ఘర్షణ తర్వాత కథ అంతా మారిపోయింది. దూరం పెరిగింది. అయితే ఆ దూరం ఎప్పుడూ అలాగే ఉండదు కదా. ఇటీవలి పరిస్థితులు కలిసి వచ్చాయి. రెండు దేశాల మధ్య మళ్లీ కొత్తబంధం చిగురించేలా చేశాయి. భారత ఉత్పత్తులపై ట్రంప్ 50 శాతం టారిఫ్ లు విధించిన తర్వాత ఈ రెండు దేశాలు దగ్గరవుతున్నాయని ఇప్పుడు అనుకుంటున్నారు. అయితే మార్చిలో చైనాపై 20 శాతం ట్రంప్ టారిఫ్ లు విధించినప్పుడే చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ కలిసి నడుద్దామని పిలుపునిచ్చారు. అమెరికా ఓవరాక్షన్ కు చెక్ పెట్టేందుకు, పవర్ పాలిటిక్స్ ను అడ్డుకునేందుకు కలిసి పని చేద్దామన్నారు. అప్పటి నుంచే భారత్ – చైనా మధ్య పరిస్థితులు అనుకూలించడం మొదలైంది. చెప్పాలంటే మొదట ఒక మెట్టు చైనానే దిగింది.
ఆగస్ట్ 18న చైనా విదేశాంగ మంత్రి రాక
ఆగస్ట్ 18న చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఢిల్లీకి వస్తున్నారు. జాతీయ భద్రతా సలహాదారు దోవల్ తో భేటీ అవుతారు. ఈనెల 31న ప్రధాని మోడీ చైనా పర్యటన కంటే ముందుగానే ఈ పరిణామం చోటు చేసుకుంటుండడం ఆసక్తికరంగా మారుతోంది. ఎందుకంటే మాట్లాడుకునేవి చాలా ఉన్నాయి. పరిష్కరించుకునేవీ ఉన్నాయి. సో ఇటీవలి కాలంలో భారత్ చైనా ప్రతినిధులు, ప్రభుత్వ వర్గాల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు నడుస్తున్నాయి. రాజకీయంగా పరస్పర విశ్వాసం పెంచుకోవడం, సహకారాన్ని విస్తరించడం ఇవన్నీ రెండు దేశాల మధ్య బంధాన్ని మరో లెవెల్ కు తీసుకెళ్లేలా కనిపిస్తున్నాయి. భారత్ – చైనా మధ్య సంబంధాల్లో పురోగతి ఉందడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం.. ట్రంప్ టారిఫ్ లకు చెక్ పెడుదామని చైనా ముందుకు రావడం, ప్రధాని మోడీ ఏడేళ్ల తర్వాత చైనాకు వెళ్లాలని డిసైడ్ అవడం, సరిహద్దు వాణిజ్యం మళ్లీ ప్రారంభించాలని అనుకోవడం, బార్డర్ లో పెట్రోలింగ్ విధానాన్ని పునరుద్ధరించడం, డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసులు తిరిగి ప్రారంభించాలనుకోవడం, చైనీస్ పౌరులకు టూరిస్టుల వీసాల మంజూరుపై ముందడుగు పడడం, చైనా కంపెనీల పెట్టుబడుల నిబంధనలను సడలించాలనుకోవడం ఇవన్నీ కీలక పరిణామాలుగా కనిపిస్తున్నాయ్.
సరిహద్దు వాణిజ్యం మళ్లీ మొదలు పెట్టేలా చర్చలు
ఓవరాల్ గా చూస్తే భారత్ చైనా మధ్య సరిహద్దు వాణిజ్యం, ద్వైపాక్షిక సంబంధాల్లో మెరుగుదల కనిపిస్తోంది. ముఖ్యంగా 2020 గల్వాన్ ఘర్షణ తర్వాత ఏర్పడిన ఉద్రిక్తతల నుంచి రిలీఫ్ కనిపిస్తోంది. ఈ సంబంధాలు పెరగడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య విధానాలు, భారత్‌పై విధించిన అధిక టారిఫ్ లు కీలకంగా మారాయి. ఫస్ట్.. 2020లో గల్వాన్ ఘర్షణ తర్వాత నిలిపేసిన సరిహద్దు వాణిజ్యాన్ని పునఃప్రారంభించేందుకు చర్చలు జరుగుతున్నాయి. ఈ ట్రేడ్ ఉత్తరాఖండ్ లిపులేఖ్ పాస్, హిమాచల్ ప్రదేశ్ షిప్కీ లా పాస్, అలాగే సిక్కిం నాథు లా పాస్ ఇలా మూడు హిమాలయన్ సరిహద్దుల ద్వారా జరుగుతుంది. ఈ సరిహద్దు వాణిజ్యం విలువలో చిన్నదైనప్పటికీ రెండు దేశాల మధ్య సామాజిక ఆర్థిక సంబంధాలను మెరుగుపరచడంలో కీ సిగ్నల్ గా ఉంది. సో ఇది త్వరలో ప్రారంభించాలనుకోవడంపై చైనా రియాక్ట్ అయింది. ఈ వాణిజ్యంతో సరిహద్దు ప్రాంత వాసుల లైఫ్ క్వాలిటీని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నది చైనా.
2020కి ముందున్న పెట్రోలింగ్ విధానం పునరుద్ధరణ
భారత్ చైనా మధ్య దౌత్యపరమైన పురోగతి కూడా కనిపిస్తోంది. 2024 అక్టోబర్‌లో కుదిరిన ఒప్పందంతో 2020కి ముందు ఉన్న పెట్రోలింగ్ విధానాన్ని పునరుద్ధరించారు. ఐదేళ్ల తర్వాత ఇదొక కీలక ముందడుగుగా మారింది. అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆగస్టు 31న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ – SCO సమ్మిట్ కోసం చైనాకు వెళ్లనున్నారు. ఏడేళ్ల తర్వాత చైనా పర్యటనకు మోడీ వెళ్తుండడం ఇదే తొలిసారి. ఈ టైంలో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో భేటీ జరగనుంది. అటు 2020 నుండి నిలిపేసిన డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసులు తిరిగి ప్రారంభం కానున్నాయి. రెడీగా ఉండాలని విమానయాన సంస్థలకు కేంద్రం సూచించింది కూడా.
చైనాతో భారత్‌కు 85 బి. డాలర్ల వాణిజ్య లోటు
సో ఈ ప్రయత్నాలన్నీ ఆర్థిక దౌత్య సంబంధాలను బలోపేతం చేయడంలో కీలక ముందడుగుగా మారుతాయి. వాణిజ్యం, చర్చలను తిరిగి ప్రారంభించడం ద్వారా రెండు దేశాలు ఉద్రిక్తతలను తగ్గించడానికి సహకారాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడనున్నాయి. అటు వాణిజ్య బంధంపైనా ఫోకస్ పెడుతున్నాయి. 2023-24లో భారత్‌కు చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. ద్వైపాక్షిక వాణిజ్యం 118.4 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అయితే ఇండియా 85 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటును ఎదుర్కొంటోంది. దీనిని తగ్గించేందుకు చైనాలో మన మెడిసిన్స్, అలాగే వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ యాక్సెస్‌ను పెంచాలని భారత్ కోరుతోంది. సో రాబోయే రోజుల్లో అన్నీ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా అమెరికాను ఎదుర్కోవడం చైనాకు కీలకం. అందుకు భారత్ సపోర్ట్ కావాలి. అదే సమయంలో మన ప్రాధాన్యతలకు మనకు ఉన్నాయి. అయితే చైనాను పూర్తిగా నమ్మకుండా జాగ్రత్తగా వ్యవహరించడమే కీలకమైన విషయం.
ట్రంప్ టారిఫ్‌లతో మారిన కథ
కొన్ని అవకాశాలు ఆటోమేటిక్ గా కలిసి వస్తాయి. ఇప్పుడు భారత్ చైనా సంబంధాల మెరుగువడంలో కూడా చాలానే కలిసి వచ్చాయి. ఈ రెండు దేశాల దౌత్య సంబంధాలకు ఈ ఏప్రిల్ లో 75 ఏళ్లు పూర్తయ్యాయి. ఆ సందర్భంగా చైనా అధ్యక్షుడు, భారత రాష్ట్రపతి పరస్పర అభినందనలు తెలుపుకోవడం దగ్గర్నుంచి ఇప్పుడు స్ట్రాటజిక్ రీ సెట్ దాకా చాలా పరిణామాలు జరుగుతున్నాయ్. రష్యా నుంచి ఆయిల్, ఆయుధాలు కొనడం ఆపకపోతే భారత్ పై 50 శాతం టారిఫ్ లు వేస్తానని ట్రంప్ ప్రకటించిన తర్వాత కథ మారింది. ఇది భారత్ అమెరికా సంబంధాలపై చాలా ఎఫెక్ట్ చూపింది. ఓవైపు పాకిస్తాన్ ను అమెరికా దగ్గర తీస్తోంది. ఇటు భారత్ చైనా మధ్య పొలిటికల్ షిఫ్ట్ కనిపిస్తోంది. చైనాపై 20 శాతం సుంకాలు, భారత్ పై 50 శాతం సుంకాలు విధించారు ట్రంప్. దీంతో ఈ రెండు దేశాలు అమెరికా ఆధిపత్యానికి చెక్ పెట్టే దిశగా కదులుతున్నాయి. తాజాగా ప్రధాని మోడీ ఇండిపెండెన్స్ డే స్పీచ్ లోనూ మనం ప్రపంచ మార్కెట్లలో మన సత్తా చాటుకోవాల్సిన టైం వచ్చిందని గుర్తు చేశారు.
భారత్ – చైనా వాణిజ్య సంబంధాల మెరుగుదల
ట్రంప్ అమెరికా ఫస్ట్ అన్న విధానం అలాగే అధిక సుంకాలు భారత్ – చైనా మధ్య వాణిజ్య సంబంధాలు పెరగడంలో కీలక పాత్ర పోషించింది. సో తమ ఉత్పత్తులకు అమెరికా చెక్ పెడితే.. భారత్ మాత్రం అన్ని ప్రత్యామ్నాయ ఆప్షన్లు చూస్తోంది. అందుకే డైవర్సిఫికేషన్ రూల్ ఫాలో అవుతోంది. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి ఉత్పత్తుల్ని షిఫ్ట్ చేసే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందులో భాగంగానే చైనాతో వాణిజ్య బంధంపై ముందడుగు వేస్తోంది. చైనీస్ పెట్టుబడులపై ఆంక్షలను సడలించడం, వాణిజ్య మార్గాలను తెలవడం వంటి చర్యలకు ఓకే చెబుతోంది. క్లియర్ గా చెప్పాలంటే ట్రంప్ విధానాలు భారత్-చైనా సంబంధాలను స్ట్రాటజిక్ రీసెట్ వైపు నడిపిస్తున్నాయి. భారత్ అమెరికాతో బలమైన సంబంధాలను కొనసాగిస్తూనే, చైనాతో ఆర్థిక సహకారాన్ని పెంచడం ద్వారా ప్రపంచంలో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవాలని చూస్తోంది. అందుకే ఇవన్నీ జరుగుతున్నాయి. అంతకు ముందు కైలాస శిఖర దర్శన, మానస సరోవర యాత్రకు అడ్డంకులు తొలగించారు. సో స్నేహబంధంతో ముందుకు నడవాలని భారత్ చైనా అనుకుంటున్నా ఇందులో కొన్ని లిటిగేషన్స్ ఉంటాయి. ఎందుకంటే చైనాను పూర్తిగా నమ్మడానికి లేదు.
రేర్ ఎర్త్ మినరల్స్ కోసం చైనాపై ఆధారం
రెండు దేశాల మధ్య స్నేహబంధానికి అడుగులు పడుతున్నా సవాళ్లు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. భారత రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి చైనా. భారత్ ముఖ్యంగా రేర్ ఎర్త్ మినరల్స్ కోసం చైనాపై ఆధారపడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక సంబంధాలను పెంపొందించుకోవడానికి సరిహద్దులో శాంతి చాలా అవసరం. అదే సమయంలో భారత్ తో వాణిజ్యాన్ని పెంచుకోవాలని, ఎక్కువ పెట్టుబడులు పెట్టాలని, తమ కార్మికులు, ఇంజినీర్లపై వీసా నిషేధాలను ఎత్తివేయాలని చైనా ఆశిస్తోంది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండో టర్మ్ ప్రారంభమైన తర్వాత భౌగోళిక రాజకీయ మార్పులు కూడా ఇండియా, చైనా దగ్గరయ్యేలా చేశాయి. అమెరికాకు వ్యూహాత్మక మిత్రదేశంగా ఉంటామని భారత్ అనుకుంది. కానీ అక్కడి నుంచి సపోర్ట్ లేదు. ట్రంప్ 50 శాతం టారిఫ్ లు విధించడమే ఇందుకు రీజన్. దీంతో సహజంగానే భారత్ తనకు ఏది బెటరో ఆ పని చేస్తుంది. అటు ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియాతో కూడిన క్వాడ్ గ్రూప్ లో కూడా అంత చురుగ్గా లేదు. అదే సమయంలో SCO, బ్రిక్స్ వంటి ఇతర కూటముల్లో చైనా అందరితో బాండింగ్ పెంచుకుంటోంది. సో భారత్ తన సంబంధాలను బ్యాలన్స్ చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది, అదే సమయంలో చైనాకు ఎక్కువగా లొంగిపోయే పరిస్థితి కూడా లేదు.
చైనాతో భాగస్వామ్యంలో అలర్ట్ అవసరం
ట్రంప్ ఒత్తిడి భారత్‌ను ఒక బహుముఖ విధానాన్ని ఫాలో అయ్యేలా చేస్తోంది. అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తూనే.. చైనాతో సంబంధాలను మెరుగుపరచడం, రష్యాతో వాణిజ్య సంబంధాలను కొనసాగించడం ఉన్నాయి. చైనీస్ పెట్టుబడులపై ఆంక్షలను సడలించడం విషయంలో భారత్ జాతీయ భద్రతను పరిగణలోకి తీసుకోవాలి. AI, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి సున్నితమైన రంగాలలో చైనా భాగస్వామ్యాన్ని జాగ్రత్తగా డీల్ చేయాలి. భారత్, చైనా మధ్య ప్రధాన సమస్య వారి 3,440 కిలోమీటర్ల సరిహద్దు. కొన్ని ప్రాంతాలు మావే అని చైనా అప్పుడప్పుడు వాదిస్తుంటుంది. భారత్ తో స్నేహం కోరుకుంటే.. ఇలాంటి మాటలు ఆపేయాలి. అప్పుడే నమ్మకం పెరుగుతుంది. ఆ దిశగా చైనా కదులుతున్నట్లే కనిపిస్తోంది. భారత్- చైనా దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఇరుదేశాలు మరింత సన్నిహితంగా కలిసి పనిచేయాలని కోరుకున్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలు ఏనుగు డ్రాగన్‌లా అభివృద్ధి చెందాలన్నారు. కీలకమైన అంతర్జాతీయ వ్యవహారాల్లో సంప్రదింపులు, సమన్వయాన్ని మరింతగా పెంచుకొనేందుకు, సరిహద్దు ప్రాంతాల్లో శాంతిని సంయుక్తంగా కాపాడేందుకు సిద్ధంగా ఉన్నామని జిన్ పింగ్ సిగ్నల్స్ పంపారు. SCO సమ్మిట్ కోసం మోడీ చైనా వెళ్లాక అక్కడ జరిగే భేటీ మరో కొత్త చరిత్ర లిఖిస్తుందా అన్నది చూడాలి.
Story By Vidya Sagar, Bigtv