CM Chandrababu on Action Over Peddireddy Ramachandra Reddy Lands Scam: అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఇష్టానుసారం భూకబ్జాలకు పాల్పడ్డారు. ప్రభుత్వ, ప్రైవేటు భూములని లేకుండా అన్ని లాక్కోవాలని చూశారు. మళ్లీ తమదే అధికారం అన్న ధీమాతో దౌర్జన్యాలకు పాల్పడిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి టీమ్‌కి ఎన్నికల ఫలితాలు ఊహించని షాక్ ఇచ్చాయి. అంతే తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మళ్లీ కుతంత్రాలకు తెరలేపారు. మదనపల్లెలో ఏకంగా ప్రభుత్వ రికార్డులు తగలపెట్టడానికి తెగబడ్డారు. దానిపై సీఎం చంద్రబాబు సీరియస్‌గా ఫోకస్ పెట్టడంతో పెద్దిరెడ్డికి ఉచ్చు బిగుస్తున్నట్లు కనిపిస్తుంది.
అన్నమయ్య జిల్లా, మదనపల్లె ఫైళ్ల దగ్ధం ఘటనకు సంబంధించి వైసీపీ నేతలకు ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసుకు సంబంధించి నలుగురు నిందితులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు. వీరంతా వైసీపీ నేతలే కావడం, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులే కావడం గమనార్హం.
మదలపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం వెనుక వైసీపీ నేతల హస్తం ఉందని ముందు నుంచీ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు వైసీపీ నేతలపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు కావడంతో ఆ ఆరోపణలకు బలం చేకూరింది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా, మునిసిపల్ వైస్ ఛైర్మన్ జింకా వెంకటాచలపతి, పెద్దిరెడ్డి ప్రధాన అనుచరులు మాధవరెడ్డి, రామకృష్ణారెడ్డిలపై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. కేసు వివరాలను మదనపల్లె ఏడీజే కోర్టులో సమర్పించారు.
మొత్తం 8 కేసులు నమోదు చేసినట్లు గతంలో కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ప్రకటించారు. ఇప్పుడు తాజాగా వైసీపీ నేతలు నాలుగురిపై ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు. నిందితుల ఇళ్లల్లో పోలీసులు సోదాలు నిర్వహించగా వారి దగ్గర భూముల పత్రాలు లభించాయి. మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా ఇంటి నుంచి 8 ఫైళ్లు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో కోటి రూపాయల పైబడి భూముల క్రయవిక్రయాలకు సంబంధించిన దస్తావేజులు ఉన్నట్లు పోలీసులు ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు.
Also Read: జగన్ కు ఆ ఎంపీలు షాక్ ? కేసీఆర్ సీన్ రిపీట్
మరో నేత ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న 10 దస్త్రాల్లో మదనపల్లె తహసీల్దార్ కార్యాలయంలో ఉండాల్సిన ప్రొసీడింగ్స్ కు సంబంధించిన ఫైళ్ల జిరాక్స్ లు లభ్యమయ్యాయంట. ఇక పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు మాధవరెడ్డి నివాసంలో 59, రామకృష్ణారెడ్డి నివాసం నుంచి 124 ఫైళ్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఈ వివరాలన్నీ ఎఫ్ఐఆర్ లో నమోదు చేసిన పోలీసులు నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. నిందితులపై ఫోర్జరీ, ప్రభుత్వ రికార్డుల ట్యాంపరింగ్, దొంగతనం, చోరీ సొత్తు కలిగి ఉండటంతో పాటు సాక్ష్యాలు మాయం చేయడం, నిందితులకు సహకరించడం వంటి ఆరోపణలపై ఆయా సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
నాన్ బెయిలబుల్ కేసులు నమోదైన వైసీపీ నేతలు ముందస్తు బెయిలు కోసం కర్నూలు కోర్టును ఆశ్రయించారు. తమపై నమోదు చేసిన కేసుల వివరాలను తెలపాలని, అలాగే తమపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కర్నూలు కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అదలా ఉంటే సదరు వైసీపీ నేతల నివాసాలలో పోలీసులు స్వాధీనం చేసుకున్న ఫైళ్లే సబ్ కలెక్టరేట్ కార్యాలయం దగ్ధం కేసులో కీలకమని పోలీసులు చెబుతున్నారు. మొత్తమ్మీద మాజీ మంత్రి పెద్దిరెడ్డికి ఉచ్చు బిగుస్తున్నట్లే కనిపిస్తోంది.