Mitra Mandali Review : ‘ట్రోలింగ్ చేసి మా సినిమాని తొక్కేయాలని చూస్తున్నారు’ అనే సింపతీ కార్డు వాడుకుని ‘మిత్రమండలి’ని వార్తల్లో నిలిపాడు నిర్మాతల్లో ఒకరైన బన్నీ వాస్. మరి అతను బాధపడినంత విషయం సినిమాలో ఉందా? లేదా? ఈ రివ్యూలో చూద్దాం..
జంగ్లీపట్నం అనే ఆ ఊరు. ఆ ఊర్లో అగ్ర కులానికి చెందిన పెద్ద నారాయణ (విటివి గణేష్). అతని కూతురు స్వేచ్ఛ (నిహారిక ఎన్.ఏం) ఇంట్లో నుండి పారిపోతుంది. ఈ సంగతి బయటకి తెలిస్తే పరువు పోతుందని భావించిన నారాయణ… ఎస్ ఐ అయినటువంటి సాగర్ (వెన్నెల కిషోర్) సాయం కోరతాడు. ఎలాగైనా నారాయణ కూతుర్ని తీసుకొచ్చి అప్పగిస్తాను అని సాగర్ కూడా అతనికి మాట ఇస్తాడు. స్వేచ్ఛ మిస్ అవ్వడం వెనుక నలుగురి హస్తం ఉందని తెలుస్తుంది.
ఆ నలుగురు స్నేహితులు (ప్రియదర్శి, రాగ మయూర్, విష్ణు, ప్రశాంత్ బెరహా) అని కూడా తెలుసుకుంటాడు సాగర్. వాళ్లకి స్వేచ్ఛకు ఉన్న సంబంధం ఏంటి? అసలు ఆ నలుగురు స్నేహితులు ఎవరు? చివరికి సాగర్.. స్వేచ్ఛని ఆమె తండ్రి అయిన నారాయణ వద్దకు చేర్చాడా? అసలు ఆమె ఇంట్లో నుండి ఎందుకు వెళ్ళిపోయింది? నారాయణ స్వేచ్చని తీసుకెళ్లిన ఆ నలుగురిని ఏం చేశాడు? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగిలిన సినిమా.
ట్రైలర్ చూసిన వారికెవ్వరికైనా ఈ సినిమా కథ గురించి పెద్దగా క్వశ్చన్స్ ఏమీ ఉండవు. కథ చాలా వరకు అందులోని ఉంది. ఇంకొంచెం పచ్చిగా చెప్పాలంటే.. సినిమాలో కథ లేదు అని కూడా ట్రైలర్ చూసిన వాళ్లకి క్లారిటీ వచ్చేస్తుంది. అయినా సరే దర్శకుడు సినిమా స్టార్టింగ్లో ‘మా సినిమాలో కథేమీ లేదు’ అని మళ్ళీ గుర్తుచేశాడు. అది సేఫ్ గేమ్ అనుకోవాలి. ‘కామెడీ సినిమాల్లో కథ ఆశించడం తప్పు’ అనే కామన్ సెన్స్ ఆడియన్స్ కి ఉంది. జంధ్యాల, ఈవీవీ వంటి వాళ్ళు ఈ పాఠాన్ని ఆడియన్స్ కి నేర్పారు. సో దర్శకుడు కథ గురించి ఆడియన్స్ ని ప్రిపేర్ చేయనవసరం లేదు. అయినా సరే కథ లేదు అని రివ్యూల్లో దెప్పిపొడుస్తారు అనే ఉద్దేశంతో డిఫెండ్ చేసుకోవడానికి అలా చెప్పి ఉండొచ్చు.
అయితే దర్శకుడు గమనించాల్సింది ఏంటంటే.. కామెడీ సినిమాలో కనీసం సబ్ ప్లాట్స్ అనేవి ఉంటాయి. ‘జాతి రత్నాలు’ ‘మ్యాడ్’ వంటి సినిమాల్లో దాన్ని ఫాలో అయ్యారు. అవి హిట్ అవ్వడానికి కారణం అదే. ‘మిత్రమండలి’ విషయంలో అది పూర్తిగా లోపించింది. సబ్ ప్లాట్ అనేది లేదు అంటే ఆడియన్స్ కనెక్ట్ అవ్వరు. పోనీ స్క్రీన్ ప్లే.. అందులో భాగంగా వచ్చే కామెడీ ఏమైనా బాగుందా? అంటే ఆ విషయంలో పూర్తిగా జీరో.
‘నేను జోక్ చెబుతున్నాను అని చెప్పి.. ఆ జోక్ పూర్తయ్యాక ఎదుటి వ్యక్తి నవ్వలేదు’ అంటే హాస్యం అపహాస్యం అవుతుంది. ‘మిత్రమండలి’ కి ఆ ఎగ్జామ్పుల్ కరెక్ట్ గా సెట్ అవుతుంది. ‘మేము కామెడీ సినిమా తీస్తున్నాం.. కేవలం థియేటర్లకు నవ్వుకుని ఎంజాయ్ చేయడానికి రండి’ అంటూ నిర్మాత బన్నీ వాస్ చెప్పడంతో ఆడియన్స్ కూడా ప్రిపేర్ అయ్యే వెళ్తారు. కానీ ఒక్క సీన్ కూడా నవ్వుకునేలా సినిమాలో లేదు.
ఓపెనింగ్ సీన్ నుండి ఆడియన్స్ మైండ్లో ఒక్కటే రన్ అవుతుంది. ‘ఏంట్రా ఈ సోది.. ఎప్పటికి అవుతుంది రా’ అని! కథ, కథనం, కామెడీ తేలిపోయినప్పుడు.. టెక్నికల్ టీం మాత్రం ఏం చేస్తారు. నిర్మాణ విలువలు ఏమీ ఆకర్షించేలా ఉండవు. వేరే సినిమాల షూటింగ్ సెట్లలో ఒక గంట పర్మిషన్ తీసుకుని తీసేసినట్టు విజువల్స్ ఉంటాయి. సినిమాటోగ్రఫీ కూడా అలానే ఉంటుంది. మ్యూజిక్ కొంత బెటర్ అంతే. అది కూడా సూపర్ అని చెప్పలేం.
నటీనటుల విషయానికి వస్తే.. చెప్పుకోవడానికి ఇందులో మంచి క్యాస్టింగ్ ఉంది. ప్రియదర్శి, విష్ణు, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా అందరూ మంచి కామెడీ టైమింగ్ ఉన్నవాళ్లే. కానీ వీళ్ళు కూడా కామెడీ పండించలేకపోయారు అంటే అది పూర్తిగా డైరెక్షన్, రైటింగ్ లోపాలే. సత్య, వెన్నెల కిషోర్ వంటి వాళ్ళు కూడా కామెడీ పండించలేకపోయారు. పైగా వాళ్ళ నటన కూడా అతిగా అనిపిస్తుంది. నిహారిక ఎన్ ఎం హీరోయిన్ గా ఏమాత్రం ఫిట్ అవ్వలేదు. క్లోజప్ షాట్స్ ఆమె లుక్స్ సైడ్ క్యారెక్టర్ ను తలపిస్తాయి. బిగ్ స్క్రీన్లో ఆమెను హీరోయిన్ గా చూడటానికి కూడా ఆడియన్స్ ఇబ్బంది పడతారు అనడంలో సందేహం లేదు. తర్వాత సినిమాలకి ఆమె సైడ్ క్యారెక్టర్ అయిపోతుంది అనడంలో కూడా డౌట్ లేదు.
మంచి క్యాస్టింగ్
మ్యూజిక్(కొంత వరకు)
డైరెక్షన్
రైటింగ్
నిర్మాణ విలువలు
మొత్తంగా… ‘మిత్రమండలి’ చూసివాడు శత్రు మండలి అంటాడు