BigTV English

CM Chandrababu: ఏపీ పేదరికానికి చెక్..! సీఎం చంద్రబాబు ప్లాన్ ఏంటంటే?

CM Chandrababu: ఏపీ పేదరికానికి చెక్..! సీఎం చంద్రబాబు ప్లాన్ ఏంటంటే?

CM Chandrababu: ఈ వారం ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు బిజీబిజీగా గడిపారు. కేంద్రమంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, మన్సుక్ మాండవీయని కలిసి.. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, కేంద్రం సహకారంతో ఏపీలో చేపట్టాల్సిన కీలక ప్రాజెక్టులపై చర్చించారు. ముఖ్యంగా.. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలపై.. కేంద్ర జలశక్తి శాఖ నిర్వహించిన సమావేశంలో.. కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు తనకు ముఖ్యమేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.


జులై 14, సోమవారం ( రివ్యూ డే )
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైబర్ నెట్ కార్యకలాపాలపై గౌరవ సీఎం చంద్రబాబు సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అదేవిధంగా.. అబ్కారీ శాఖ సంబంధిత అంశాలపైనా.. సీఎం రివ్యూ చేశారు. ఏపీలో డ్రోన్ మార్ట్ పోర్టల్‌ని కూడా ఈ వారం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, విపత్తు నిర్వహణ అంశాల్లో.. ఏపీ డ్రోన్స్ కార్పొరేషన్ అందించే డ్రోన్ సేవలను ఈ పోర్టల్ ద్వారా పొందేందుకు వీలుంది.

జులై 15, మంగళవారం ( మహనీయుడు పీవీ )
ఢిల్లీలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సంస్మరణ సభ.. ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. పీఎం మ్యూజియంలో జరిగిన ది లైఫ్ అండ్ లెగసీ ఆఫ్ పీవీ నరసింహారావు అనే కార్యక్రమంలో పాల్గొని.. దేశానికి అనేక రంగాల్లో అమూల్యమైన సేవలందించిన మహనీయుడు పీవీ నరసింహారావు అని కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఆయన పాత్ర గుర్తుండిపోయే విధంగా ఉందన్నారు. 1991 ఆర్థిక సంక్షోభ సమయంలో తీసుకొచ్చిన సంస్కరణలే.. దేశ ఆర్థిక పునరుజ్జీవనానికి బలమయ్యాయని చెప్పారు సీఎం చంద్రబాబు. ఆయన ఆర్థిక విధానాల వల్ల ఐటీ విప్లవానికి బీజం పడిందని గుర్తుచేశారు. ప్రస్తుతం మనం అనుభవిస్తున్న అభివృద్ధికి.. పీవీ తీసుకున్న నిర్ణయాలే కారణమని తెలిపారు. పీవీ 17 భాషల్లో మాట్లాడగలిగేవారని, అలాంటి మహానేతను మరచిపోవద్దని చెప్పారు.


జులై 15, మంగళవారం ( మరింత సహకరించండి )
ఢిల్లీ టూర్‌లో భాగంగా సీఎం చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఏపీకి సంబంధించిన కీలక అంశాలను.. ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా.. రాష్ట్రానికి ఆర్థికసాయం, ప్రాజెక్టులు, రాష్ట్ర అభివృద్ధి అంశాలపై చర్చించారు. వైసీపీ హయాంలో దెబ్బతిన్న ఏపీ ఆర్థిక పరిస్థితిని.. కేంద్ర ప్రభుత్వం సహకారంతో మళ్లీ గాడిలో పెడుతున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రానికి మరింత మెరుగైన సహకారం అందించాలని.. అమిత్ షాని కోరారు. 82 వేల కోట్లతో ప్రతిపాదించిన బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను తెలిపారు. గోదావరి మిగులు జలాలపై ఏపీకి హక్కు ఉందన్నారు. ఇక.. అశోక్ గజపతిరాజును గోవా గవర్నర్‌గా నియమించినందుకు సీఎం చంద్రబాబు అమిత్ షాకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

జులై 16, బుధవారం ( జల వివాదాల పరిష్కారానికి కమిటీ )
తెలుగు రాష్ట్రాల జల సంబంధిత అంశాలపై చర్చించేందుకు.. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన సమావేశానికి.. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ముఖ్యమంత్రుల సమావేశంలో.. ఇరు రాష్ట్రాలు ప్రతిపాదించిన 10 ఎజెండా అంశాలపై చర్చించి.. కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రెండు రాష్ట్రాల్లో గోదావరి, కృష్ణా జలాలకు సంబంధించిన.. వివాదాల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో పాటు మరో 3 అంశాలపైనా ఏకాభిప్రాయం కుదిరింది. సీఎం చంద్రబాబు.. తనకు రెండు తెలుగు రాష్ట్రాలు ముఖ్యమేనని స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. తెలంగాణలో ప్రాజెక్టులు ఎలా చేపట్టిందన్నది వివరించారు.

సీఎంల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గోదావరి, కృష్ణా జలాల వివాదాల పరిష్కారానికి ఏర్పాటు చేసే కమిటీలో.. రెండు రాష్ట్రాల సాంకేతిక నిపుణులు, ఇంజనీర్లు, ఐఏఎస్‌లతో పాటు జలశక్తి శాఖ నుంచి సభ్యులు ఉంటారు. ఈ కమిటీ నెలరోజుల్లో రోడ్ మ్యాప్ ఇవ్వనుంది. పోలవరం-బనకచర్ల లింక్ అంశాన్ని కూడా ఈ కమిటీ పరిశీలిస్తుందని.. ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు తెలియజేశారు. జల సంబంధిత అంశాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్న వాటిని.. కమిటీకి అప్పజెప్పనున్నారు. టెక్నికల్, ఇతర అంశాలపై ఆ కమిటీ చర్చించి అభిప్రాయాలు, నిర్ణయాలు తెలియజేస్తుంది. అక్కడ పరిష్కారం కాని అంశాలపై మళ్లీ.. ఇద్దరు సీఎంలు చర్చించి.. పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. ఇక.. కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు ఆఫీసును.. అమరావతికి తరలించనున్నారు. కృష్ణా, గోదావరి నదుల నుంచి కాలువలకు నీళ్లు తీసుకునే అవుట్‌లెట్‌ల దగ్గర టెలిమెట్రీల ఏర్పాటు చేయనున్నారు. కేవలం.. ఆయనా నదులకు సంబంధించిన రిజర్వాయర్ల నుంచి నీటిని తీసుకునేచోట మాత్రమే టెలిమెట్రీలు ఏర్పాటు చేయాలని.. ఇంటర్నల్ అవుట్‌లెట్‌ల దగ్గర అవసరం లేదని ఆంధ్రప్రదేశ్‌ తెలిపింది. ఇక.. శ్రీశైలం ప్లంజ్ పూల్ సహా ప్రాజెక్టుకు అవసరమైన మరమ్మత్తు పనులన్నీ ఏపీ ప్రభుత్వమే చేపట్టనుంది.

జులై 16, బుధవారం ( స్వర్ణాంధ్ర విజన్ -2047 )
స్వర్ణాంధ్ర విజన్-2047పై ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ నివేదికను.. ఢిల్లీలో సీఐఐ నిర్వహించిన సమావేశంలో సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. మొత్తం 17 రంగాలకు సంబధించి అమలు చేయాల్సిన 120 సిఫారసులను.. టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్ నేతృత్వంలోని టాస్క్ ఫోర్స్ టీమ్ నివేదించింది. ఏపీ ఆర్థిక, పారిశ్రామికాభివృద్ధి నివేదికను రూపొందించిన టాస్క్ ఫోర్స్ సభ్యుల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. ఏపీలో వచ్చే పెట్టుబడులకు.. ప్రభుత్వం ఎస్కార్ట్ సర్వీసులు అందిస్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెట్టిన పెట్టుబడులను రాష్ట్ర ప్రాజెక్టుగా భావించి.. ప్రభుత్వం చేయూత అందిస్తుందని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలోని మూడు ఆర్థిక కారిడార్లలో ఆయా రంగాలకు చెందిన పరిశ్రమల్ని ప్రోత్సహించేందుకు అనుకూలంగా విధానాలు రూపొందించామన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో.. వేగంగా అనుమతులు జారీ చేస్తున్నామని స్పష్టం చేశారు. ఏపీకి వచ్చి పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను కోరారు. విజన్-2020 పేరిట తాను ఆవిష్కరించిన అభివృద్ధి ప్రణాళిక వాస్తవ రూపం దాల్చి ఇస్తున్న అద్భుత ఫలితాలను చూస్తున్నామని చెప్పారు. ఇప్పుడు కూడా.. స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్‌ని రూపొందించి.. ఏపీ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు.

జులై 16, బుధవారం ( రూ.10 వేల కోట్ల గ్రాంట్ )
రాజధాని అమరావతికి రెండో విడత నిధులను గ్రాంటుగా విడుదల చేయాలని.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ని కోరారు సీఎం చంద్రబాబు. ఏపీకి చెందిన వివిధ అంశాలను.. కేంద్రమంత్రి దగ్గర ప్రస్తావించారు. సాస్కి కింద అదనంగా రూ.10వేల కోట్లు కేటాయించాలని సీఎం కోరారు. రెవెన్యూ లోటు భర్తీకి 16వ ఆర్థిక సంఘానికి ఇచ్చిన వినతిని అంగీకరించాలని విజ్ఞప్తి చేశారు. విభజన కారణంగా రాష్ట్రం ఇప్పటికీ ఆర్థిక లోటును ఎదుర్కొంటోందని.. నిర్మల దృష్టికి తీసుకెళ్లారు చంద్రబాబు. అమరావతి, పోలవరం నిర్మాణానికి కేంద్రం సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.

జులై 16, బుధవారం ( ఖేలో ఏపీ )
ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీలో స్టేడియాల నిర్మాణం, క్రీడా ప్రాంగణాల అభివృద్ధికి 341 కోట్లు కేటాయించాలని కోరారు. అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో బ్యాడ్మింటన్ శిక్షణా కేంద్రం ఏర్పాటుకు సహకారం అందించాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో క్రీడాభివృద్ధి కోసం చేపట్టాల్సిన ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల కల్పనపై చర్చించారు. అమరావతిలో కృష్ణా నది తీరంలో వాటర్ స్పోర్ట్స్ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు విస్తృత అవకాశాలున్నాయని సీఎం చంద్రబాబు వివరించారు. క్రీడలకు సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి ప్రాజెక్టులపై.. ఇప్పటికే వివిధ ప్రతిపాదనలను కేంద్రానికి పంపినట్టు మన్సుఖ్ మాండవీయకు తెలిపారు. ఖేలో ఇండియా కింద మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులను పూర్తి చేయాలని కోరారు. అదేవిధంగా.. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం అభివృద్ధికి 27 కోట్లు, గుంటూరు బీఆర్ స్టేడియంలో మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటుకు 170 కోట్లు మంజూరు చేయాలని సీఎం చంద్రబాబు కోరారు. జిల్లాల్లో ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించేందుకు.. అదనంగా ఖేలో ఇండియా కేంద్రాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

జులై 17, గురువారం ( ఉద్యోగాల సృష్టి )
ఏపీ ప్రభుత్వం పారిశ్రామిక ప్రాజెక్టులు, ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులో భాగంగా.. సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్యాంపు ఆఫీసులో 8వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశమైంది. ఈ మీటింగ్‌కు నారా లోకేశ్‌తో సహా మిగతా మంత్రులు హాజరయ్యారు. ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధన, టూరిజం రంగాలకు సంబంధించి.. 39 వేల 473 కోట్ల విలువైన పెట్టుబడులకు బోర్డు ఆమోదం లభించింది. 22 ప్రాజెక్టుల ద్వారా 30 వేల 899 ఉద్యోగాలు సృష్టించేందుకు ప్రణాళిక రూపొందించారు. వీటిలో పరిశ్రమలు-వాణిజ్య రంగానికి చెందిన 11 ప్రాజెక్టులు, ఇంధన రంగంలో 7, పర్యాటక రంగంలో 3, ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో ఒక్కోటి చొప్పున మొత్తం 22 ప్రాజెక్టులు SIPB ఆమోదం పొందిన లిస్టులో ఉన్నాయి. ఏపీకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్న సంస్థలు, పెట్టుబడులపై చర్చించి.. ప్రోత్సాహకాలు, ఇతర ఇన్సెంటివ్స్‌లపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీలో ఏర్పాటయ్యే పారిశ్రామిక ప్రాజెక్టుల చుట్టూ సంబంధిత ఎకో సిస్టం వచ్చేలా చూడాలని సీఎం ఆదేశించారు. ఆయా ప్రాజెక్టులతో స్థానికులు, అనుబంధ సంస్థలకు లబ్ధి కలుగుతుందన్నారు. పారిశ్రామిక ప్రాజెక్టులకు సమీపంలో రహదారులు, పోర్టులు, ఎయిర్ పోర్టులు లాంటి మౌలిక సదుపాయాలతో పాటు ఆయా ప్రాంతాల్లో ఎకనామిక్ యాక్టివిటీ పెరిగేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. కూటమి ప్రభుత్వంలో ఇప్పటివరకు జరిగిన SIPB సమావేశాల్లో 109 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది.

జులై 17, గురువారం ( కృష్ణమ్మకు జలహారతి )
హంద్రీనీవా ఫేజ్‌-1 కాల్వల విస్తరణ పనులు పూర్తవడంతో.. ముఖ్యమంత్రి చంద్రబాబు నీరు విడుదల చేశారు. కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి.. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్యాల పంపింగ్‌ స్టేషన్‌లో రెండు మోటార్లను ఆన్‌ చేశారు. నీటి విడుదలతో రాయలసీమకు తాగు, సాగునీటి కష్టాలు తీరనున్నాయి. 12 ఏళ్ల తర్వాత సీమకు 40 టీఎంసీల నీరు అందుబాటులోకి వచ్చింది. HNSS పంపింగ్ స్టేషన్ దగ్గర జలవనరులశాఖ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌కు సీఎం తిలకించారు. ప్రాజెక్టు అలైన్‌ మెంట్‌, ఆయకట్టు, కృష్ణా రివర్‌ బేసిన్‌ మ్యాప్‌లను పరిశీలించారు. పంపింగ్‌ స్టేషన్‌ వ్యూ పాయింట్‌ నుంచి నీటి విడుదలని వీక్షించారు. ముందుగా ప్రకటించినట్లుగానే.. వంద రోజుల్లోనే.. కాలువ విస్తరణ పనుల్ని కూటమి ప్రభుత్వం పూర్తి చేసింది. 696 కోట్లతో చేపట్టిన విస్తరణ పనులతో హంద్రీనీవా ఫేజ్-1 కాలువ ప్రవాహ సామర్థ్యం.. 3,850 క్యూసెక్కులకు పెరిగింది. కాలువ విస్తరణ పనులతో అదనంగా 1600 క్యూసెక్కుల మేర నీటిని తరలించేందుకు అవకాశం కలిగింది. దీంతో.. జీడిపల్లి రిజర్వాయర్‌ని పూర్తి సామర్థ్యంతో నింపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఆయకట్టుకు సాగునీటితో పాటు 33 లక్షల మంది ప్రజల దాహార్తిని తీర్చేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

జులై 18, శుక్రవారం ( వీ ఫర్ పీ4 )
2029 నాటికి ఏపీలో పేదరికం లేకుండా చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. పీ-4 ప్రోగ్రాం ఆ దిశగా చేపట్టిందేనని చెప్పారు. ఇప్పటిదాకా 5 లక్షల బంగారు కుటుంబాలను గుర్తించామని.. వారికి చేయూతనిచ్చేందుకు 47 వేల మంది మార్గదర్శులుగా నమోదు చేసుకున్నారని తెలిపారు. సీఎంగా ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టినా.. పీ-4 తన మనసుకు దగ్గరగా ఉన్న కార్యక్రమం అన్నారు. పీ4లో భాగంగా పేదలకు సాయం చేసేందుకు ముందుకొచ్చిన మార్గదర్శులకు శుక్రవారం ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో.. సీఎం విందు ఇచ్చారు. పీ-4 లక్ష్యాలు, దానిపై తన ఆలోచనలను పంచుకున్నారు. మార్గదర్శుల అభిప్రాయాలనూ అడిగి తెలుసుకున్నారు. ఆగస్టు 15 కల్లా 15 లక్షల బంగారు కుటుంబాలను.. మార్గదర్శులు దత్తత తీసుకునేలా చూడాలనేది తన సంకల్పమని.. ఇందుకు సంపన్నులు, కార్పొరేట్‌ సంస్థలు, పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి రావాలని సీఎం కోరారు. గేట్స్‌ ఫౌండేషన్‌ ఈ విషయంలో స్ఫూర్తిగా నిలుస్తోందని తెలిపారు.

జులై 18, శుక్రవారం ( గేమ్ ఛేంజర్ హైడ్రోజన్ వ్యాలీ )
అమరావతి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో జరిగిన గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్‌కు.. ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇంధన రంగానికి చెందిన సీఈఓలు, ఎండీలు, నిపుణులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సంస్థలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. అమరావతిలో హైడ్రోజన్‌ వ్యాలీ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. నిపుణుల సూచనలతో అమరావతి గ్రీన్‌ హైడ్రోజన్‌ డిక్లరేషన్‌-2025 ప్రకటిస్తామని తెలిపారు. సరిగ్గా ఏడాది తర్వాత మళ్లీ సమావేశమై.. సంవత్సరంలో సాధించిన లక్ష్యాలపై రివ్యూ చేద్దామన్నారు. గ్రీన్‌ హైడ్రోజన్‌ వ్యాలీ.. ఏపీకి గేమ్‌ ఛేంజర్‌ కాబోతోందన్నారు. దీనిని.. పూర్తి సామర్థ్యంతో, తక్కువ ఖర్చుతో ఎలా అందుబాటులోకి తేవాలన్నదే ఇప్పుడు కీలకమైన సవాల్ అని.. దీనిపై వినూత్న ఆలోచనలు చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పైలట్‌ ప్రాజెక్టు కింద పరిశీలించిన ఫలితాలు.. ప్రపంచానికి ఓ మోడల్‌గా నిలవాలన్నారు సీఎం. ఇందుకోసం.. ప్రపంచంలో ఉన్న టెక్నాలజీ, నిపుణుల సూచనల ఆధారంగా వాల్యూ యాడెడ్ అంశాలను పరిశీలించాలని.. చెప్పారు. సర్క్యులర్‌ ఎకానమీలో భాగంగా వాటర్ రీసైక్లింగ్‌తో పాటు ఇతర అవకాశాలపై నిపుణులు చర్చించాల్సిందిగా చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

జులై 19, శనివారం ( స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర )
ముఖ్యమంత్రి చంద్రబాబు.. తిరుపతి జిల్లాలో పర్యటించారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సీఎంకు.. రేణిగుంట ఎయిర్‌పోర్టులో ప్రజాప్రతినిధులు, అధికారులు స్వాగతం పలికారు. తూకివాకంలోని ఇంటిగ్రేటెడ్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంటును ముఖ్యమంత్రి పరిశీలించారు. ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. అదేవిధంగా.. తిరుపతి కపిలతీర్థంలోని శ్రీ కపిలేశ్వరస్వామిని దర్శించుకొని.. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత.. పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు. తర్వాత.. వారితో కాసేపు ముచ్చటించారు. స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా.. పోలీస్ పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.

Also Read: నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. కేంద్రాన్ని నిలదీసేలా విపక్షాల ప్లాన్

నేరచరితులు రాజకీయాల్లోకి వచ్చి కలుషితం చేశారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఇంట్లోని చెత్తను శుభ్రం చేస్తున్నట్లే రాజకీయాల్లోని మలినాలనూ తొలగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. హత్యా రాజకీయాలు చేసే వ్యక్తుల గుండెల్లో నిద్రపోతానని హెచ్చరించారు. ఎన్నికల్లో వైసీపీ గెలిచిన తర్వాత ప్రజలంతా మోసపోయారన్నారు.

తిరుపతి పర్యటనలో భాగంగా.. ముఖ్యమంత్రి చంద్రబాబు కంచి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామీజీని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.

Related News

GST 2.0: ప్రజల డబ్బు బయటకు తెచ్చేందుకు.. జీఎస్టీ 2.0తో మోదీ భారీ ప్లాన్

Meeting Fight: ఎమ్మెల్యే Vs కమిషనర్.. హీటెక్కిన గుంటూరు కార్పొరేషన్ కౌన్సిల్

Congress: గుత్తా లేఖల వెనక సీక్రెట్ ఏంటి?

AP Politics: టీడీపీలో సంస్థాగత మార్పులపై రచ్చ!

Bigg Boss Agnipariksha: బిగ్ బాస్ అగ్ని పరీక్ష మొత్తం స్క్రిప్టా… మరీ ఇంత మోసమా?

AP Politics: జనసేన మీటింగ్ సక్సెస్ అయ్యిందా?

Big Stories

×