గులాబీ ఇలాకాలో కాంగ్రెస్ పాగా వేయడానికి పావులు కదుపుతోందా? అధికార పార్టీ ఆ మున్సిపల్ పీఠాన్ని టార్గెట్ చేసిందా..? ఆ మున్సిపాలిటీని కైవసం చేసుకుని విపక్ష నేతకు గట్టి షాక్ ఇవ్వాలని స్కెచ్ గీస్తుందా? అసలు ఆ మున్సిపాలిటీపై కాంగ్రెస్ ఎందుకంత ఫోకస్ పెడుతుంది? రెండు సార్లు అక్కడ రెండు డివిజన్లు కూడా గెలవని కాంగ్రెస్ ఈ సారి ఏకంగా మున్సిపల్ పీఠమే కావాలంటే అయ్యే పనేనా..? అసలు ఏదా మున్సిపాలిటీ దాని వెనుక ఉన్న కథేంటి..?
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుంచే కేసీఆర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి సీఎం అయ్యారు. 2014, 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నుంచి వరుసగా మూడు సార్లు గెలిచి రికార్డు క్రియేట్ చేశారు . అంతకు ముందు 2004లో మాజీ మంత్రి గీతారెడ్డి, 2009లో తూంకుంట నర్సారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా గెలిచారు. అయితే గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కేసీఆర్ గెలిచినా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడకపోవడంతో గజ్వేల్ లో రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి.
గత అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్‌లో బీఆర్ఎస్ నుంచి కేసీఆర్, బీజేపీ నుంచి ఈటల రాజేందర్, కాంగ్రెస్ పార్టీ నుంచి నర్సారెడ్డి పోటీ చేయగా కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితమయ్యింది . అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో బీఆర్ఎస్, బీజేపీల నుంచి కాంగ్రెస్ లోకి వలసలు పెరిగాయి. ఆ తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచింది. లోక్ సభ ఎన్నికల తర్వాత కేసీఆర్ తన కంచుకోటగా మలుచుకున్న గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి మరికొంత ఊపు వచ్చింది.
ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉండటం నియోజకవర్గంలో పార్టీ కొంత పుంజుకోవడంతో ఇప్పడు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పీఠంపై కన్నేసింది అధికారపక్షం. మేజర్ గ్రామపంచాయితీగా ఉన్న గజ్వేల్ పట్టణాన్ని అప్పటి కాంగ్రెస్ పార్టీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి హాయంలో మున్సిపాలిటీ చేశారు. చుట్టు పక్కల ఉన్న కొన్ని గ్రామలతో కలిపి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీగా పేరు మార్చారు. మేజర్ పంచాయతీని మున్సిపాలిటీగా మార్చిన కాంగ్రెస్సే ఇక్కడ గెలుస్తుందని అందరు అనుకున్నారు. కానీ మున్సిపాలిటీ ఏర్పడి పదేళ్లయినా ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకోలేకపోయింది.
2014లో మున్సిపాలిటీకి ఎన్నికలు జరగ్గా మొత్తం 20 వార్డుల్లో కేవలం ఓకే స్థానంతో సరిపెట్టుకుంది కాంగ్రెస్.గెలిచిన ఒక్కగానొక్క అభ్యర్థి కూడా గులాబీ గూటికి వెళ్లిపోయారు. ఇక రెండోసారి జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఒకే సీటుకి పరిమితమైంది. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ఇప్పటికే బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ పై అసమ్మతి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ కొత్తలోనే సొంత పార్టీ కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్ రాజమోళిపై అవిశ్వాసం పెట్టారు. అయితే కాంగ్రెస్ పార్టీకి తగినంత బలం లేకపోవడంతో ఏం చేయలేకపోయింది. మరో వైపు అవిశ్వాసంపై కోర్టు కూడా స్టే ఇవ్వడంతో ఆగిపోయింది.
ఇంకో నెల రోజుల్లో మున్సిపల్ కౌన్సిల్లో సభ్యుల పదవీకాలం అయిపోతుంది. దీంతో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ బలంగా కనిపిస్తుండటంతో ఈ సారి జరిగే మున్సిపల్ ఎన్నికలపై పార్టీ కన్నేసింది. ఎక్కడ పొగుట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అనే విధంగా చైర్మన్ సీటు కైవసం చేసుకోవడానికి పావులు కదుపుతుందట. మాజీ సీఎం నియోజకవర్గంలో ఎంపీ ఎన్నికల్లో బలం నిరూపించుకున్నట్టు మున్సిపల్ లో గెలిస్తే పట్టు నిరూపించుకోవచ్చు అనే ధీమాలో కాంగ్రెస్ కనిపిస్తుంది. మరి గజ్వేల్ ని మున్సిపాలిటీ చేసిన చేతి పార్టీకి ఇప్పడైనా మున్సిపల్ చైర్మన్ సీటు చిక్కుతుందో లేదో వేచి చూడాలి.