రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొలి ఏడాదిలో ఎన్నో అద్భుతాలకు వేదికైంది. అదే ఉత్సాహంతో 2025లోనూ భారీ వరాలు కురిపించేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా రైతులు, నిరుద్యోగులకు తొలి ఏడాది రేవంత్ ప్రభుత్వం చాలా మేలు చేసింది. ఓవైపు రైతు రుణమాఫీ చేసిన సర్కారు రైతు భరోసా వేసేందుకు సిద్ధమవుతోంది. అటు తొలి ఏడాదిలో 60 వేల ఉద్యోగాలు భర్తీ చేసిన ప్రభుత్వం ఈ ఏడాదిలోనూ జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఇంతకీ 2025లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేయబోయే కీలకమైన పథకాలేంటి? ఎలాంటి వరాలు కురిపించబోతున్నారు?
కొత్త ఏడాదిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారీ వరాల జల్లు కురిపించేందుకు సిద్ధమైంది. తొలి ఏడాదిలో చేసిన పనులు.. ఇచ్చిన హామీల అమలు దిశగా పని చేసిన ప్రభుత్వం 2025లో అత్యంత కీలకమైన హామీల అమలు దిశగా అడుగులు వేస్తోంది. తొలి ఏడాదిలో 60 వేల ఉద్యోగాలు ఇవ్వడం, రైతు రుణమాఫీ చేయడం వంటి భారీ చర్యలతో ఆకట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం… ఈ ఏడాది జనవరి నుంచే కీలకమైన కార్యక్రమాలు అమలు చేసేందుకు రంగం రెడీ చేసింది. అందులో అత్యంత కీలకమైంది రేషన్ కార్డుల జారీ. గత ప్రభుత్వ హయాంలో పదేళ్లలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేకపోయారు. దీంతో ఎన్నికల్లో ప్రజాగ్రహం స్పష్టంగా కనిపించింది. అందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అర్హులైన పేదలకు రేషన్ కార్డులు అందించేందుకు సిద్ధమవుతోంది. ఎవరికి రేషన్ కార్డులు ఇవ్వాలి… ఎవరు అర్హులు.. ఎవరు అనర్హులు అన్న విషయాలపై గైడ్ లైన్స్ రెడీ చేసేందుకు ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఆ సబ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చేందుకు కూడా సిద్ధమైంది. నిజానికి రేషన్ కార్డులో గల్లంతై పేర్లు, కొత్తగా జన్మించిన వారి పేర్లు, పెళ్లి చేసుకున్న వారి పేర్లు నమోదు చేసుకోవడానికి అవకాశం లేకపోవడంతో ప్రజలు సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారు. అయితే ఇటీవల ప్రజా పాలనలో భాగంగా సంక్షేమ పథకాల లబ్ధి కోసం.. రేషన్ కార్డుల దరఖాస్తుల కూడా స్వీకరించారు.
తెలంగాణ సచివాలయంలో జనవరి 4న సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. రైతు భరోసా, భూమి లేని పేదలకు నగదు బదిలీపై ప్రధానంగా చర్చిస్తారని తెలిసింది. అందులో నిర్ణయం తీసుకుంటే సంక్రాంతికి పేదలకు వైట్ రేషన్ కార్డుల విషయంలో స్పష్టత రావడంతో పాటే ఇవ్వడం కూడా మొదలవబోతోంది. అంటే ఏళ్లకేళ్లు రేషన్ కార్డుల కోసం నిరీక్షించిన కుటుంబాలకు కొత్త ఏడాదిలో బిగ్ రిలీఫ్ అందించబోతోంది రేవంత్ ప్రభుత్వం. మొన్నటికి మొన్న అసెంబ్లీలోనూ రేషన్ కార్డుల విషయంపై తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. సంక్రాంతి తర్వాత కొత్త తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేస్తామన్నది ప్రభుత్వం. కొత్తగా 10 లక్షల కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసేందుకు రెడీ అవుతోంది. అయితే ఈసారి రేషన్ కార్డుల స్థానంలో స్మార్ట్ కార్డులు జారీ చేయనున్నట్లు తెలిపింది. త్వరలోనే ఆ ప్రక్రియ పూర్తి చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. సో ఎన్ని గండాలు వచ్చినా రేషన్ కార్డులు ఇవ్వడం ఖాయమైపోయింది. దీన్ని ఇక వాయిదాలు వేయకూడదని ప్రభుత్వం డిసైడ్ అయింది. అందుకే అర్హులకే వైట్ కార్డులు ఇవ్వబోతున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో 2016 నుంచి అప్లికేషన్లు తీసుకోగా 2019లో కొన్ని కార్డులు అందించి ఆ వెబ్‌సైట్ మూసివేసింది. దీంతో ప్రజాగ్రహం తప్పలేదు. అందుకే ఇప్పుడు రేషన్ కార్డుల విషయంపై కదలిక వేగంగా నడుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఉత్తర్వుల ప్రకారం జిల్లాల్లోని సివిల్ సప్లై శాఖ కొత్త రేషన్ కార్డులు జారీకి రెడీ అవుతోంది. గత కొన్ని రోజులుగా అధికారులు అర్హుల జాబితాలను పరిశీలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన కొత్త నిబంధనల ప్రకారంగా అర్హుల ఎంపికను చేపట్టనుంది. గుజరాత్, ఏపీ, కేరళ, మహారాష్ట్ర, పంజాబ్ సహా మరికొన్ని రాష్ట్రాల్లో వైట్ కార్డుల కోసం ఏ విధంగా లబ్ధిదారులను ఎంపిక చేశారో వాటిని పరిశీలించి నిబంధనలు మార్చనున్నారు. ఆ ప్రకారమే కొత్త రేషన్ కార్డులు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి.
రేవంత్ సర్కార్ ఇచ్చిన హామీల్లో కీలకమైంది ఇందిరమ్మ ఇండ్లు. వీటిని కూడా సంక్రాంతి పండుగకు పేదలకు బహుమతి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. తాజాగా ఇందిరమ్మ ఇళ్లపై అధికారులు లబ్ధిదారులను గుర్తించేందుకు సర్వే చేపట్టారు. ఇందులోనే భాగంగా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా అసలైన లబ్ధిదారులను గుర్తించేందుకు ప్రభుత్వ అధికారులు ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే దరఖాస్తు చేసుకున్న వారిలో ఇప్పటివరకు 40 లక్షల కుటుంబాల సర్వే పూర్తి చేసి మొబైల్ యాప్‌లో నమోదు చేశారు. త్వరలోనే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన వెబ్‌సైట్, టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులోకి తీసుకురానున్నారు. జిల్లాకు ఒక ప్రాజెక్టు డైరెక్టర్‌ను ఇప్పటికే నియమించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోయినప్పటికీ నాలుగేళ్లలో 20 లక్షల ఇళ్లు నిర్మించి తీరుతామన్న కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉంది. ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన 80 లక్షల దరఖాస్తుల పరిశీలన ఈనెల తొలి వారానికి పూర్తి చేయబోతున్నారు. లబ్దిదారుల ఎంపిక పూర్తిచేసి సంక్రాంతి నాటికి ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మొదటి విడతలో నియోజకవర్గానికి 3,500 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా గరిష్ఠంగా 4.50 లక్షల ఇళ్లను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో ఇంటి నిర్మాణానికి లబ్ధిదారుకి ప్రభుత్వం 5 లక్షలు ఇస్తుంది. మొదటి విడతలో స్థలం ఉన్నవారికి ఇళ్లు మంజూరు చేయనున్నారు. తొలి విడతలో మంజూరు చేసే ఇందిరమ్మ ఇళ్లకు 7,740 కోట్లు వెచ్చించనున్నారు. సో అన్నీ పకడ్బందీగా సెట్ అయ్యాయి. ఇందిరమ్మ ఇండ్లతో పేదల సొంతింటి కలను ఈ సంక్రాంతి నుంచే నెరవేర్చే బాధ్యతను రేవంత్ ప్రభుత్వం భుజానికెత్తుకుంది.
అటు రైతుభరోసా అమలుకు ముహూర్తం ఖరారైంది. కొత్త సంవత్సరంలో సంక్రాంతి కానుకగా ఈ పథకాన్ని అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. జనవరి 4న జరగబోయే క్యాబినెట్ సమావేశం చాలా ప్రశ్నలకు క్లారిటీ ఇవ్వబోతోంది. రైతు భరోసా విధి విధానాలపై ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ ను ఆమోదించే అవకాశాలున్నాయి. ఈ సబ్ కమిటీ ఇప్పటికే తుది కసరత్తు పూర్తి చేసింది కూడా. వానాకాలం, యాసంగి సీజన్లలో రైతు ఎంత మేర భూమి సాగు చేస్తే అంత విస్తీర్ణానికే లెక్కగట్టి రైతు భరోసా ఇవ్వాలన్న ఆలోచనతో ఉన్నారు. అందరూ ఎదురుచూస్తున్న రైతు భరోసా, భూమి లేని పేదలకు నగదు బదిలీపై మంత్రివర్గ సమావేశంలో పూర్తి క్లారిటీ రాబోతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎకరానికి 7500 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ పెట్టుబడి పథకంలో వృధా లేకుండా సాగుచేసిన భూములకే రైతు భరోసా ఇవ్వబోతున్నారు. అంటే రాళ్లు రప్పలు, కొండలు గుట్టలు, రోడ్లు వంటి వాటికి కట్ చేస్తారు. సాగు చేస్తున్న భూములను మాత్రమే గుర్తించేందుకు ఫీల్డ్ వెరిఫికేషన్, శాటిలైట్ సర్వేలను ఉపయోగించనున్నారు. సో నిజమైన రైతులకు బెనిఫిట్ చేసేలా సంక్రాంతి తర్వాత రైతు భరోసా రాబోతోంది. రైతులు అకౌంట్లలో నిధులు జమకానున్నాయి.
Also Read: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. రైతు భరోసా దరఖాస్తుకు సిద్దం కండి
మరోవైపు భూమి లేని పేదలకు 12 వేల ఆర్థిక సాయం అందిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీన్ని డిసెంబర్ నెలలోనే అమలు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించినప్పటికీ అది అమలు కాలేదు. అయితే జనవరిలో మాత్రం దీన్ని కచ్చితంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గట్టి పట్టుదలతో కనిపిస్తోంది. ఎందుకంటే భూమి ఉన్న వారు సాగు చేసుకుంటారు. ఆదాయం వస్తుంది. కానీ భూమి లేని వారు వ్యవసాయ కూలీలుగా ఉంటున్నారు. వారికి తగినంత ఆదాయం లేకుండా పోయింది. సో వారిని కూడా ఆదుకునేందుకు కాంగ్రెస్ గతంలోనే ఆలోచన చేసింది. అందులో భాగంగానే ఏడాదికి 12 వేల రూపాయలు రెండు విడతలుగా అందించనున్నారు. తెలంగాణలో మొత్తం 1.16 కోట్ల కుటుంబాలు ఉన్నట్లు ఇటీవల ఇంటింటి సర్వేలో వెల్లడైంది. వీరిలో 70 లక్షల మంది రైతులకు భూములు ఉన్నాయి. మిగిలిన 46 లక్షల కుటుంబాలకు భూమి లేదని గుర్తించారు. అయితే వీరిలో పేదలను గుర్తించేందుకు జాతీయ ఉపాధి హామీ చట్టం కార్మిక గుర్తింపు కార్డును ప్రాతిపదికగా తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. సో అన్నీ కుదిరితే సంక్రాంతికి నిధులు విడుదలవడం ఖాయమే.