CM Revanth Reddy: డ్రాపౌట్స్ లేకుండా చర్యలు.. కార్పొరేట్ కు ధీటుగా సర్కారీ హాస్పిటల్స్‌ను తీర్చిదిద్దే విషయంపై ఫోకస్, రెండేళ్లు.. 2 లక్షల AI నిపుణులను తయారు చేయడం, స్పోర్ట్స్ పాలసీకి నిధుల సమీకరణపై ఫోకస్, మెడికోలకు ఖుషీ కబర్, అంగన్వాడీ కేంద్రాలకు సరికొత్త ఆలోచన, తెలంగాణ ప్రయోజనాల విషయంలో ఎక్కడివరకైనా న్యాయపోరాటం చేయాలని నిర్ణయం.. ఇలాంటి కీలక అంశాలు ఈ వారం హైలెట్‌గా నిలిచాయి.
29-06-2025 ఆదివారం ( స్పోర్ట్స్ పాలసీకి నిధుల ప్రణాళిక )
తెలంగాణలో తీసుకురానున్న కొత్త క్రీడా పాలసీలో భాగంగా ప్రభుత్వం తెలంగాణ క్రీడా అభివృద్ధి నిధిని ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా ఆర్థిక వనరులను సమీకరించుకోవాలని భావిస్తోంది. ప్రభుత్వ గ్రాంట్లు, ప్రవాస భారతీయులు, ఎంపీ-ఎమ్మెల్యే నియోజకవర్గాల అభివృద్ధి ఫండ్స్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ నుంచి నిధుల సేకరణ లక్ష్యంగా పెట్టుకుంది. టీఎస్‌డీఎఫ్‌ను పర్యవేక్షించడానికి సంబంధిత అధికారులు స్పోర్ట్స్ హబ్ పరిధిలో ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేస్తారు. జిల్లా స్థాయిలోనూ కలెక్టర్ల పరిధిలో ఉన్న ప్రత్యేక నిధుల్లో ఏటా 10 శాతం కేటాయించి జిల్లా స్థాయి క్రీడా నిధిని కూడా ఏర్పాటు చేయనున్నారు. వీటితో క్రీడాకారులకు మేలైన ట్రైనింగ్ ఇవ్వొచ్చంటున్నారు.
29-06-2025 ఆదివారం ( మెడికోలకు ఖుషీ కబర్ )
తెలంగాణలో మెడికల్ స్టూడెంట్స్ కు ప్రభుత్వం తీపి కబురు అందించింది. 15 శాతం స్టైఫండ్ పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మెడికల్, డెంటల్ విద్యార్థులకు ఈ పెంపు వర్తించనుంది. సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల గౌరవ వేతనం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజా పెంపుతో ఇంటర్న్‌లకు నెలకు 29,792 స్టైఫండ్ లభించనుంది. పీజీ డాక్టర్లకు ఫస్ట్ ఇయర్‌లో 67,032, సెకండ్ ఇయర్‌లో 70,757, ఫైనల్ ఇయర్‌లో 74,782 గౌరవ వేతనం ఇవ్వనున్నారు.
30-06-2025 సోమవారం ( ఇకపై కంటైనర్ అంగన్‌వాడీ కేంద్రాలు )
తెలంగాణ అంగన్‌వాడీలు దేశానికి రోల్‌మోడల్‌గా నిలిచేలా తీర్చిదిద్దాలని.. ఇందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి గారు జూన్ 30న అధికారులను ఆదేశించారు. పిల్లలకు పౌష్టికాహారం అందించడంతో పాటు అయిదేళ్ల వరకు వారికి పూర్వ ప్రాథమిక విద్యను అందించి నేరుగా ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లేలా చూడాలని సూచించారు. అంగన్‌వాడీలకు కొత్త భవనాలు నిర్మించే విషయంలో లేటెస్ట్ టెక్నాలజీ వాడుకోవాలని, పిల్లల అవసరాలకు తగినట్లు కంటైనర్లతో డిజైన్ చేయించే అంశాన్ని స్టడీ చేయాలన్నారు. సోలార్ ప్యానెల్స్, బ్యాటరీ బ్యాకప్‌తో కంటైనర్ అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటు చేస్తే తక్కువ ఖర్చు, ఎక్కువ సౌకర్యం ఉంటుందని సూచించారు. అటు నిర్లక్ష్యానికి గురవుతున్న తల్లిదండ్రులను లేదా కుటుంబ సభ్యులు పట్టించుకోలేని స్థితిలో ఉన్న వృద్ధులకు ప్రభుత్వం అండగా నిలవాల్సి ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. ఎవరైతే తల్లిదండ్రులను పట్టించుకోరో.. వారి జీతాల నుంచి నేరుగా వారి తల్లిదండ్రులకు ఖాతాలకు 10-15 శాతం జమ అయ్యే అంశాన్ని పరిశీలించాలన్నారు.
01-07-2025 మంగళవారం ( బనకచర్లకు బ్రేకులు )
గోదావరి, కృష్ణా జలాలపై తెలంగాణకు నీటి కేటాయింపులు, హక్కుల సాధన కోసం స్పష్టమైన విధానంతో ముందుకు వెళతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టులకు పక్కాగా నీటి కేటాయింపులు జరిపిన తర్వాతే మిగులు, వరద జలాలకు పరిష్కారం లభిస్తుందని అన్నారు. మిగులు, వరద జలాల్లోనూ రెండు రాష్ట్రాల మధ్య నిష్పత్తి ప్రకారం కేటాయింపులు జరగాలన్నారు. ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రయోజనాలపై వెనక్కు తగ్గబోమన్నారు. గోదావరి – కృష్ణా బేసిన్‌లో తెలంగాణ నీటి వాటా అన్న అంశంపై ప్రజాభవన్ లో ప్రజా ప్రతినిధులకు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జులై 1న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి సీఎం, డిప్యూటీ సీఎం సహా ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
01-07-2025 మంగళవారం ( పాశమైలారం బాధితులకు భరోసా )
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలోని రసాయన పరిశ్రమలో జరిగిన దుర్ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సమగ్రమైన దర్యాప్తునకు ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా ప్రభుత్వం సమగ్రమైన కార్యాచరణను రూపొందిస్తుందని చెప్పారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని మంత్రులతో కలిసి సీఎం పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు తక్షణ సహాయంగా ఒక లక్ష రూపాయలు, గాయపడిన వారికి 50 వేల చొప్పున అందించాలని కలెక్టర్ ను ఆదేశించారు.
02-07-2025 బుధవారం ( డ్రాపౌట్స్ లేకుండా చర్యలు )
విద్యార్థులు, యువత, వారి చదువులు, భవిష్యత్ పై ప్రతిక్షణం సీఎం రేవంత్ ఆలోచిస్తున్నారు. చదువుకుంటే భవిష్యత్ ఎలా ఉంటుందో చెబుతున్నారు. డ్రగ్స్ కు దూరంగా ఉంచడం, స్పోర్ట్స్ వైపు వారి దృష్టి మళ్లించడం వంటి విషయాలను ప్రతి సందర్భంలో ప్రతి వేదికపై చెబుతూ వస్తున్నారు. తాజాగా ఈనెల 2న పిల్లల చదువుల విషయాలపై సీఎం రివ్యూ నిర్వహించారు. పదో తరగతి పాసైన ప్రతి విద్యార్థి తప్పనిసరిగా ఇంటర్మీడియట్ పూర్తి చేసేలా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు సీఎం. ఇంత సూక్ష్మ దృష్టితో పిల్లల భవిష్యత్ పై సీఎం స్థాయి నేత ఫోకస్ పెట్టడం ఇదే తొలిసారి. పదో తరగతిలో ఉత్తీర్ణత కనిపిస్తున్నా ఇంటర్ లో ఆ సంఖ్య ఎందుకు పడిపోతోందో గుర్తించి పరిష్కరించాలన్నారు. ప్రతి విద్యార్థికి ఇంటర్మీడియట్ కీలకమని, ఆ దశలో పిల్లలకు గైడెన్స్ ఇవ్వడం ముఖ్యమన్నారు. ఇంటర్ కు బదులు ఇతర రాష్ట్రాల్లో 12వ తరగతి వరకు ఉంటోందని, అలాంటిది కొత్త పాలసీలు తీసుకురావాలన్నారు.
02-07-2025 బుధవారం ( కార్పొరేట్ కు ధీటుగా సర్కారీ హాస్పిటల్స్ )
కార్పొరేట్ హాస్పిటల్స్ పనిచేస్తున్న డాక్టర్లు ఏడాదిలో కనీసం ఒక నెల రోజుల పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిరుపేదలకు సేవలు అందించే ఆలోచన చేయాలన్నారు సీఎం రేవంత్. సామాజిక బాధ్యతగా సామాన్య ప్రజలకు సేవలు అందించడం వల్ల వైద్య వృత్తిలో గొప్ప అనుభూతి, ఆత్మ సంతృప్తి కలిగిస్తాయన్నారు. ఈనెల 2న బంజారాహిల్స్‌లో ఏఐజీ కొత్త హాస్పిటల్ ను సీఎం ప్రారంభించారు. కార్పొరేట్ రంగంలో ఉన్న డాక్టర్లు, విదేశాల్లో ఉన్న NRI డాక్టర్లు ప్రభుత్వ సేవలు అందించాలంటే లింక్ చేయడానికి వీలుగా ఇప్పటివరకు సరైన వేదిక లేదని, అలాంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. పెరిగిన వైద్య ఖర్చులను దృష్టిలో పెట్టుకుని అధికారం చేపట్టగానే రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని 2 లక్షల నుంచి 10 లక్షలకు పెంచామన్నారు. CMRF కింద ఇప్పటివరకు 14 వందల కోట్లు ఖర్చు చేశామని సీఎం గుర్తు చేశారు. బడ్జెట్‌లో వైద్య రంగానికి 11,500 కోట్లు, విద్యకు 21 వేల కోట్లు కేటాయించామని చెప్పారు.
02-07-2025 బుధవారం ( రెండేళ్లు.. 2 లక్షల AI నిపుణులు)
రెండేళ్లలో 2 లక్షల మంది తెలంగాణ యువతను ఏఐ రంగంలో నిపుణులుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. త్వరలోనే ఏఐ యూనివర్సిటీని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈనెల 2న టీ-హబ్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దేశంలో తొలి ఏఐ అనుసంధానిత తెలంగాణ డేటా ఎక్స్చేంజ్ ను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ప్రస్తుతం ఏఐ అంటే కేవలం ఎమర్జింగ్ టెక్నాలజీ మాత్రమే కాదు మానవ జీవితాలను ప్రభావితం చేసే శక్తి అన్నారు. తెలంగాణను గ్లోబల్ క్యాపిటల్ ఆఫ్ ఏఐగా తీర్చి దిద్దేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇప్పటికే తెలంగాణ ఏఐ స్ట్రాటజీ, రోడ్ మ్యాప్‌ను రూపొందించుకుని అడుగులు వేస్తోందన్నారు మంత్రి. ఏఐను ప్రజలందరూ సమర్థవంతంగా వినియోగించుకుని అనేక సమస్యలకు పరిష్కారం చూపేలా టీజీడెక్స్ పేరిట డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను జైకా సహకారంతో అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు.
03-07-2025 గురువారం ( అంగన్వాడీ హెల్పర్లకు గుడ్ న్యూస్ )
తెలంగాణలో అంగన్వాడీ హెల్పర్లకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈనెల 3న గుడ్‌న్యూస్ చెప్పింది. అంగన్వాడీ టీచర్లుగా పదోన్నతి కోసం గరిష్ఠ వయోపరిమితిని పెంచింది. హెల్పర్‌కు ప్రమోషన్ వయసును 45 నుంచి 50 ఏళ్లకు పెంచుతూ మహిళా శిశుసంక్షేమశాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్రంలోని 4,322 మందికి బెనిఫిట్ జరగనుంది. ఈ విషయానికి సంబంధించిన ఫైల్ పై మంత్రి సీతక్క సంతకం చేశారు.
03-07-2025 గురువారం ( టీచర్లకు విదేశాల్లో ట్రైనింగ్ )
సీఎం రేవంత్ దగ్గర ఉన్న విద్యాశాఖలో ఎప్పటికప్పుడు సమూల మార్పులకు, విద్యాప్రమాణాలు పెంచే విషయంపై ఫోకస్ పెంచుతూనే ఉన్నారు. గతంలో మాదిరిగా కాకుండా పూర్తి అడ్వాన్స్ డ్ విధానంలో విద్యార్థులకు బెనిఫిట్ జరిగే నిర్ణయాలు తీసుకుంటున్నారు. పిల్లలకు మంచి క్వాలిటీ విద్య అందించాలన్న టార్గెట్ తో ప్రభుత్వ టీచర్లను విదేశాలకు పంపి ట్రైనింగ్ ఇప్పించి.. మన దగ్గర బోధనలో క్వాలిటీ పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. సీఎం రేవంత్ సూచనలతో ఈ విషయంపై విద్యాశాఖ కసరత్తులో వేగం పెంచింది. పాఠశాల విద్యలో ఇప్పటికే ఫిన్లాండ్, జపాన్, సింగపూర్, స్కాండినేవియా దేశాలకు మంచి పేరు ఉంది. అందుకే ఆగస్ట్ లేదా సెప్టెంబర్ లో సింగపూర్ కు తొలి విడతలో 30 మంది టీచర్లను పంపనుంది. టీచర్లకు విదేశీ శిక్షణ పూర్తయితే ఇక్కడి పిల్లలకు బెనిఫిట్ జరుగుతుందన్న ఉద్దేశంతో ఉంది. పాఠశాల విద్యాశాఖ పరిధిలో సుమారు 1.12 లక్షల మంది టీచర్లు పనిచేస్తున్నారు. బ్యాచ్‌కు 30 మంది చొప్పున విదేశాలకు పంపి, నెల నుంచి 45 రోజులపాటు ట్రైనింగ్ ఇప్పించాలనుకుంటున్నారు.
03-07-2025 గురువారం ( పైరసీకి చెక్ పెట్టేలా అడుగులు )
పైరసీతో సినిమా రంగానికి చాలా నష్టం జరుగుతోంది. తాజాగా ఇలాంటి కేసు ఒకటి వెలుగు చూడడంతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. పైరసీకి చెక్ పెట్టేలా నిర్ణయాలు తీసుకుంటోంది. TFDC ఛైర్మన్, నిర్మాత దిల్‌రాజు పైరసీని అరికట్టేందుకు ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. నోడల్ ఏజెన్సీగా, చలన చిత్ర వాణిజ్య మండలికి చెందిన సైబర్ సెల్, పోలీసు శాఖ ప్రతినిధులతో కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు నిర్మాత దిల్‌రాజు చెప్పారు. పైరసీని అరికట్టేందుకు.. అవసరమైతే మరికొన్ని కొత్త నిబంధనలను తీసుకొస్తామన్నారు దిల్‌రాజు.
03-07-2025 గురువారం ( పరిశ్రమలకు రోడ్ మ్యాప్ )
తెలంగాణలో పారిశ్రామిక రంగం అభివృద్ది చెందడానికి ఆయా పరిశ్రమలకు అవసరమైన ప్రోత్సాహకాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులకు రక్షణ కల్పించడమే కాకుండా లాభదాయకంగా ఉండేందుకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని పారిశ్రామిక వేత్తలను ఉద్దేశించి అన్నారు. మహేశ్వరం జనరల్ పార్క్‌లో మలబార్ గ్రూప్ స్థాపించిన జెమ్స్ అండ్ జ్యువెల్లరీ యూనిట్‌ను సీఎం రేవంత్ ఈనెల 3న ప్రారంభించారు. హైదరాబాద్‌ను ఒక వ్యాపార నగరంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో పనిచేస్తున్నామన్నారు. మహేశ్వరం ప్రాంతంలో రాబోతున్న భారత్ ఫ్యూచర్ సిటీ 30 వేల ఎకరాల్లో ప్రపంచంలోనే ఆధునిక నగరంగా ఉండబోతోందన్నారు. ఐటీ, ఫార్మా రంగాల్లో తెలంగాణ దేశంలోనే లెజెండ్‌గా నిలిచిందని, ఇప్పుడు మలబార్ బంగారం యూనిట్ ప్రారంభించడంతో ఇక బంగారంలోనూ తెలంగాణ ప్రసిద్ధి చెందుతుందన్నారు.
04-07-2025 శుక్రవారం ( అభివృద్ధి-సంక్షేమమే అజెండా )
రానున్న ఎన్నికల్లో 15 మంది ఎంపీలను, 100 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుంటామన్నారు సీఎం రేవంత్. తమ 18 నెలల పాలనలో ఎన్నో విజయాలున్నాయని గుర్తు చేశారు. శుక్రవారం ఎల్బీ స్టేడియం వేదికగా కాంగ్రెస్ గ్రామ కార్యకర్తల సభలో మాట్లాడారు సీఎం. పనిలో పడి ప్రచారం చేసుకోవడం మర్చిపోయామని, ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వంపై విషప్రచారం చేస్తున్నాయన్నారు. 18 నెలల్లో తెలంగాణ మోడల్‌ను ఆవిష్కరించామని, ఎల్బీ స్టేడియం సాక్షిగా 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని సీఎం రేవంత్ గుర్తు చేశారు. అటు తెలంగాణలో 70 శాతం మంది రైతులే అని, వారి కోసం 18 నెలల్లో రైతుభరోసా, రైతుబీమా, గిట్టుబాటు ధర, పంట రుణమాఫీ, సన్నవడ్లకు 500 బోనస్ వంటి పథకాల ద్వారా 1.04 లక్షల కోట్లు ఖర్చుపెట్టామన్నారు. రైతులు ఆత్మగౌరవంతో నిలబడేలా చేశామని గుర్తు చేశారు సీఎం.
04-07-2025 శుక్రవారం ( కొత్తగా 157 ప్రభుత్వ స్కూళ్లు )
ప్రభుత్వ స్కూళ్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రైవేట్ నుంచి ప్రభుత్వ స్కూళ్లకు అడ్మిషన్లు పెరగడంతో అవసరం ఉన్న చోట ప్రభుత్వ బడులను ఏర్పాటు చేయించింది. తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 157 ప్రభుత్వ పాఠశాలలను ఏర్పాటు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఈనెల 4న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ స్కూళ్లు లేని కాలనీలు, కనీసం 20 మంది విద్యార్థులు.. అంతకుమించి ఉన్న చోట బడులను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో 63, పట్టణ-నగర ప్రాంతాల్లో 94 స్కూళ్లను వెంటనే ఏర్పాటు చేయాలని డీఈఓలకు ఆదేశాలు వెళ్లాయి. అందుకు అవసరమైన ఫర్నిచర్, విద్యా సామగ్రి వంటి వాటికి బడ్జెట్‌ను ఆయా కలెక్టర్ల ద్వారా పాఠశాల విద్యాశాఖ సమకూర్చనుంది.
05-07-2025 శనివారం ( పరిశ్రమల్లో భద్రత కోసం )
పాశమైలారంలో సిగాచి పరిశ్రమ ప్రమాదంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇకపై పరిశ్రమల్లో రెగ్యులర్ గా ఇంటర్నల్, ఎక్స్ టర్నల్ తనిఖీలు చేయాల్సిందే అని ఆదేశించింది. భవిష్యత్ లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఇండస్ట్రీ కచ్చితంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకునేలా రోడ్ మ్యాప్ కు రెడీ అవుతోంది. లేటెస్ట్ టెక్నాలజీ అడాప్ట్ చేసుకునేలా గైడ్ చేయనుంది ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డి సిగాచి పరిశ్రమ ప్రమాదం నేపథ్యంలో పరిశ్రమలపై రివ్యూ చేసి కీలక ఆదేశాలు జారీ చేశారు.
05-07-2025 శనివారం ( మహిళా శక్తికి వందనం )
మహిళల అభివృద్ధికి ప్రతి విషయంలో పూర్తి సహకారాలు అందించేందుకు ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉంటోంది. ఇప్పటికే వారికి పెట్రోల్ బంకులు, సోలార్ పవర్ యూనిట్లు, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, మహిళా సమాఖ్యలకు కీలక బిజినెస్ అవకాశాలు కల్పించడం వంటివి చేస్తున్నారు. వీటితో పాటే ఇటీవలే ఆర్టీసీలో అద్దె బస్సులు నడిపించే అవకాశాన్ని కల్పించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ క్రమంలోనే జ్యోతిరావ్ ఫూలే ప్రజా భవన్‌లో ఇందిరా మహిళా శక్తి సంబరాలు జరిగాయి. ఆర్టీసీకి అద్దె బస్సులు అందించిన సంఘాలకు తొలి నెల అద్దెకు సంబంధించిన చెక్ ను మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ అందించారు. మహిళా సంఘాల అభివృద్ధిలో ఇదొక ఉదాహరణ మాత్రమే.
Story By Vidya Sagar, Bigtv Live