BigTV English

CM Revanth Reddy: రాజీవ్ వికాసం గైడ్ లైన్స్.. కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవే..!

CM Revanth Reddy: రాజీవ్ వికాసం గైడ్ లైన్స్.. కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవే..!

CM Revanth Reddy: ఈవారం బడ్జెట్ సెషన్ లో కీలక బిల్లులు, తీర్మానాల విషయంలో ప్రభుత్వం సీరియస్ గా వర్కవుట్ చేసింది. స్థానిక సంస్థలతో పాటు విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం, అలాగే ఎస్సీ వర్గీకరణ బిల్లు సహా మొత్తం 12 బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. వచ్చేది వేసవి కావడంతో ప్రభుత్వం అధికారులను అలర్ట్ చేసింది. కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇండ్లపై బిగ్ అప్డేట్స్ ఇచ్చింది ప్రభుత్వం.


29-03-2025 శనివారం ( సీఎం రివ్యూ టైమ్ )

మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ విభాగంపై సీఎం రేవంత్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమీక్షించారు. ఇప్పటికే hmda ఏరియా విస్తరించడం, హైడ్రా పనితీరు, వసతుల కల్పనపై దిశానిర్దేశం చేశారు.


29-03-2025 శనివారం ( తెలంగాణకు హిమాచల్ పవర్ డీల్ )

అవసరాలకు తగ్గట్టు కరెంట్ కెపాసిటీ పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం రెడీ అవుతోంది. రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ హైడల్​ ప్రాజెక్టులు ఏర్పాటు చేసి.. అక్కడి నుంచి కరెంట్​ తెచ్చుకునేందుకు వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ విషయంలో ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో హైడల్ పవర్ ఒప్పందం కోసం హిమాచల్ సీఎంతో డిప్యూటీ సీఎం భట్టి చర్చలు జరిపారు. తాజాగా హిమాచల్ వెళ్లిన భట్టి బృందం ఈ ఒప్పందం చేసుకున్నారు. వంద మెగావాట్లకు పైగా హైడల్​ ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు ఇంట్రెస్ట్​ చూపుతూ తెలంగాణ ఇప్పటికీ లెటర్ రాసింది. బిల్డ్ ఓన్ ఆపరేట్ ట్రాన్స్ ​ఫర్ విధానంలో 22 హైడల్​ ఎలక్ట్రికల్ ప్రాజెక్టులపై ప్రతిపాదనలను హిమాచల్ ఆహ్వానించగా, తెలంగాణ సర్కార్ ఆసక్తి చూపింది. తాజాగా డీల్ కుదిరింది.

28-03-2025 శుక్రవారం ( తాగునీటి సమస్య లేకుండా.. )

వేసవి మొదలు కావడంతో గ్రామాలు సహా ఎక్కడా తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే పలుమార్లు మంత్రి సీతక్క మిషన్ భగీరథ అధికారులను అలర్ట్ చేశారు. తాజాగా శుక్రవారం రోజున ఎర్ర మంజిల్ లోని మిషన్ భగీరథ ఆఫీస్ లో మిషన్ భగీరథ బోర్డు మీటింగ్ లో పాల్గొన్నారు. జిల్లాల వారీగా తాగు నీటి సరఫరా పై సమీక్షించారు. వారంలో 4 రోజులు మిషన్ భగీరథ ఇంజనీర్లు క్షేత్రస్థాయిలోనే ఉండాలన్నారు. అంతే కాదు అత్యవసర పరిస్థితుల్లో వాడుకునేలా ప్రత్యేక బడ్జెట్ ను కలెక్టర్లకు అందుబాటులో ఉంచారు. గత పదేళ్లలో వేల సంఖ్యలో బోర్లను పట్టించుకోలేదు. ఇప్పుడు వాటికి రిపేర్లు చేసి రెడీగా ఉంచారు.

28-03-2025 శుక్రవారం ( పవర్ ఫుల్ లీడర్ )

పాలనలో తనదైన ముద్ర వేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి.. దేశంలోని వివిధ రంగాల్లో పవర్ ఫుల్ లీడర్స్ జాబితాలో 28వ స్థానంలో నిలిచారు. ఇండియ‌న్ ఎక్స్‌ప్రెస్‌ 2025 సంవ‌త్సరానికి సంబంధించి శ‌క్తిమంతులైన 100 మంది ప్రముఖుల‌తో లిస్ట్ రిలీజ్ చేసింది. ఈ జాబితాలో సీఎం రేవంత్ రెడ్డి 28వ స్థానం ద‌క్కించుకున్నారు. తెలంగాణలో తీసుకువచ్చిన మార్పులు, వ్యూహాత్మక రాజకీయ కార్యక‌లాపాలు, దేశ‌వ్యాప్తంగా ఇండియా కూట‌మిలో పోషిస్తున్న ప్రముఖ‌మైన పాత్రతో సీఎం రేవంత్ రెడ్డికి ఈ గుర్తింపు ల‌భించిందని ఇండియన్ ఎక్స్ ప్రెస్ పేర్కొంది. 21 వేల కోట్ల రైతు రుణమాఫీ, సన్న ధాన్యానికి 500 బోన‌స్, మహిళా స్వయం సహాయక సంఘాల‌కు సోలార్ పవర్ ప్లాంట్లు, పెట్రోల్ బంక్‌లు, యంగ్ ఇండియా స్కిల్ వ‌ర్సిటీ ఏర్పాటు వంటివి దేశవ్యాప్తంగా సీఎం రేవంత్ ప్రజాదరణ పెరగడానికి కారణమయ్యాయి.

28-03-2025 శుక్రవారం ( త్వరలో 30 లక్షల కొత్త రేషన్ కార్డులు )

పేదలకు సన్నబియ్యం, కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం బిగ్ అప్డేట్ ఇచ్చింది. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక స్కీంపై కీలక ప్రకటన చేశారు. ఉగాది నుంచి రేషన్ షాపుల్లో ఒక్కో వ్యక్తికి 6 కిలోల సన్నబియ్యం సప్లై చేస్తామన్నారు. ఇలా సన్నబియ్యం ఇవ్వడం దేశంలోనే తొలిసారి. ఇదో రికార్డ్ బ్రేక్ స్కీం. ప్రస్తుతం తెలంగాణలో 90 లక్షల రేషన్ కార్డులు ఉంటే టోటల్ గా 2.85 కోట్ల మంది లబ్దిదారులు ఉన్నారు. వారందరికీ సన్నబియ్యంతో చాలా బెనిఫిట్ జరగబోతోంది.

బియ్యం పంపిణీకి 10,665 కోట్ల నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఖర్చు చేస్తున్నాయి. త్వరలోనే బియ్యంతో పాటు పప్పు, ఉప్పు లాంటివి కూడా ఇస్తామంటోంది ప్రభుత్వం. లబ్దిదారులు ఏ ఊరిలో ఉన్నా.. అక్కడే సన్నబియ్యం ఇచ్చేలా సిస్టమ్ తీసుకురాబోతున్నారు. ఇక రేషన్ కార్డుల మంజూరు కూడా నిరంతర ప్రక్రియ అని, అర్హులైన వారందరికీ ఇస్తామన్నారు మంత్రి ఉత్తమ్. మొత్తం 30 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నారు. కొత్తగా వచ్చే కార్డుపై క్యూఆర్ కోడ్ ఉండబోతోంది.

28-03-2025 శుక్రవారం ( ఇందిరమ్మ ఇండ్లకు తొలివిడత లక్ష )

ఇందిరమ్మ ఇండ్లపై తెలంగాణ రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కలెక్టర్లకు ఈనెల 28న కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇంటిస్థలం లేని అర్హులకు ఇళ్లు కేటాయించాలన్నారు. అంతేకాకుండా అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టాలన్నారు. కాంట్రాక్టర్లు ముందుకు రాకపోతే లబ్దిదారులే పూర్తి చేసుకునేలా ఆర్థికసాయం అందించబోతున్నారు. పైలట్‌ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. బేస్‌మెంట్‌ పూర్తి చేసిన లబ్దిదారులకు తొలి విడతగా లక్ష చెల్లించాలని కలెక్టర్లను మంత్రి ఆదేశించారు.

27-03-2025 గురువారం ( డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా తీర్మానం )

డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. జనాభాను కంట్రోల్ చేసిన రాష్ట్రాలు నష్టపోకూడదని ఈ సందర్భంగా సీఎం రేవంత్ ప్రస్తావించారు. ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాలనే కొనసాగించాలని, అసెంబ్లీ నియోజకవర్గాలను 153కు పెంచాలన్నారు. జనాభా నియంత్రణపై కేంద్రం ఆదేశాలను దక్షిణాది రాష్ట్రాలు పాటించాయని, ఉత్తరాది రాష్ట్రాలు జనాభాను నియంత్రించలేదని గుర్తు చేశారు. డీలిమిటేషన్‌ జరిగితే లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిథ్యం 19 శాతానికి పడిపోతుందన్నారు సీఎం.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కీలక బిల్లులకు ఆమోదముద్ర వేయగా.. కీలక తీర్మానాలకు వేదికైంది. స్థానిక సంస్థలతో పాటు విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. ఎస్సీ వర్గీకరణ బిల్లు సహా మొత్తం 12 బిల్లులకు సభ ఆమోదించింది. డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీ తీర్మానం ఆమోదించడంపై తమిళనాడు సీఎం స్టాలిన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న చొరవను ప్రశంసించారు. జేఏసీ రెండో సమావేశం హైదరాబాద్ లోనే ఉంటుందన్నారు.

27-03-2025 గురువారం ( గీత కార్మికులకు అండగా )

తాటి, ఈత చెట్ల నుంచి వచ్చే కల్లుతో వైన్, అరక్ వంటి అనుబంధ పదార్థాల తయారీ పరిశ్రమను రాష్ట్రంలో ఏర్పాటు చేస్తామని జర్మన్ ప్రతినిధి స్టీఫెన్ తెలిపారు. ఇందుకు తగిన సౌకర్యాలు కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టిని కోరారు. ఈనెల 27న అసెంబ్లీలో సీఎం, డిప్యూటీ సీఎంను స్టీఫెన్ కలిశారు. గతంలో మంత్రి పొన్నం, పీసీసీ చీఫ్, ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య కాంబోడియా స్టడీ టూర్ ​వెళ్లినపుడు అక్కడ ఈ తరహా పరిశ్రమ ఎంతోమందికి ఆర్థికంగా ఉపాధి కల్పిస్తున్న అంశాన్ని అబ్జర్వ్ చేశారు. తెలంగాణలో ఇలాంటి పరిశ్రమ ఏర్పాటుకు సహకరించాలని స్టీఫెన్ ను కోరారు. ఈ పరిశ్రమ తెలంగాణాలో ఏర్పాటు చేయడం వల్ల గీత కార్మికుల ఆర్థికాభివృద్ధికి తోడ్పడనుంది. తెలంగాణ కల్లు యూరప్​ కు ఎగుమతి చేసే అవకాశం లభిస్తుంది.

27-03-2025 గురువారం ( కొత్త కొలువులకు లైన్ క్లియర్ )

పదవీ విరమణ తర్వాత కూడా కాంట్రాక్టుపై కొనసాగుతున్న ఉద్యోగులను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 27న ఉత్తర్వులు జారీ చేసింది. రేవంత్ సర్కార్ నిర్ణయంతో నిరుద్యోగులకు గ్రూప్‌1 నుంచి గ్రూప్‌4 వరకు ఉద్యోగ అవకాశాలు రానుండగా.. మరోవైపు సీనియర్‌ ఉద్యోగులకు ప్రమోషన్లు దక్కబోతున్నాయి. ఈ చర్యతో అటు నిరుద్యోగులు, ఇటు ఉద్యోగుల్లో హర్షం వ్యక్తమైంది. రిటైర్ అయిన తర్వాత కూడా కాంట్రాక్టుపై కొనసాగుతున్న 6,729 మంది ఉద్యోగులను తొలగించింది. ఈ ఉత్తర్వుల ఎఫెక్ట్ అటెండర్ స్థాయి నుంచి ఐఏఎస్ అధికారుల దాకా ఉండనుంది. మార్చి నెలాఖరుకల్లా తొలగింపు ప్రక్రియ పూర్తి కావాలని.. అవసరమైతే కొత్త నోటిఫికేషన్ జారీ చేసి మళ్లీ నియామకాల అవకాశాన్ని పరిశీలించవచ్చని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులలో పేర్కొంది.

VO: 26-03-2025 బుధవారం ( BYD ఈవీ ప్లాంట్ బీ రెడీ..! )

తెలంగాణకు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు రాబోతోంది. చైనా ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజ సంస్థ బీవైడీ, హైదరాబాద్‌ సమీపంలో ఈవీ యూనిట్‌ స్థాపించేందుకు రెడీ అవుతోంది. ఈ సంస్థ కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. ఇటీవలే తుది నిర్ణయాన్ని తెలిపిందంటున్నారు. ఈవీ పాలసీ ప్రకటించడం, ప్రతిష్ఠాత్మక సంస్థలను ఆహ్వానిస్తుండడంతో ప్రభుత్వ చర్యలు ఫలిస్తున్నాయి. BYD తెలంగాణకు వస్తున్నట్లు అధికారంగా ప్రకటిస్తే.. ఈవీ రంగంలో భారీ పెట్టుబడి రికార్డ్ ఇదే అవుతుంది.

దీంతో పాటు ఈవీ కార్ల విడిభాగాలు ఉత్పత్తి చేసే అనుబంధ యూనిట్లూ దీనికి సమీపంలో ఏర్పాటయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దీంతో ఎలక్ట్రిక్ వెహికిల్స్ క్లస్టర్స్ కు హైదరాబాద్‌ హబ్ గా మారుతుంది. ఈవీ తయారీ ప్లాంటే కాదు.. 20 గిగావాట్ల బ్యాటరీ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలనేది బీవైడీ ప్రణాళికగా ఉంది. అయిదు నుంచి ఏడేళ్లలో ఏటా 6 లక్షల ఈవీ కార్ల ఉత్పత్తి కెపాసిటీ సాధించే ప్రణాళికతో ఉంది. నిజానికి టెస్లా కంటే ప్రపంచవ్యాప్తంగా BYD కార్లకే డిమాండ్ ఎక్కువుంది.

26-03-2025 బుధవారం ( మహిళా సంఘాలకు మరిన్ని వరాలు )

మహిళా సంఘాలకు ప్రతి అడుగులో తెలంగాణ ప్రభుత్వం వెన్నంటే ఉంటోంది. తాజాగా వారికి మరిన్ని వరాలను ప్రజాప్రభుత్వం ప్రకటించింది. గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా ఆడిటోరియంలో ఈనెల 26న జరిగిన స్త్రీ నిధి 12వ సర్వసభ్య సమావేశంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. మహిళా సంఘాలు పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగాయని ప్రశంసించారు. ప్రస్తుతం స్త్రీనిధి బ్యాంకు లో 800 కోట్ల సేవింగ్స్‌ ఉన్నాయని, 5,200 కోట్ల మూల నిధి ఉందన్నారు.

త్వరలోనే గోదాములు, మిల్లులను మహిళా సంఘాలకు అప్పగిస్తామని చెప్పడం కీలకంగా మారింది. ఆహారశుద్ధి యూనిట్ల ఏర్పాటు కోసం ఇక్రిసాట్‌తో ఒప్పందాలు చేసుకుంటున్నామని కూడా చెప్పారు. ప్రజాప్రభుత్వంలో మహిళా సంఘాలకు చాలా ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పటికే వారికి బస్సులు, సోలార్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు ఇలా చాలా రకాల ఉపాధి కార్యక్రమాలకు అవకాశాలు కల్పిస్తోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం.

26-03-2025 బుధవారం ( బెట్టింగ్ యాప్స్ పై సిట్ )

ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ తో తీవ్రంగా నష్టపోయిన జనానికి రిలీఫ్ ఇచ్చేలా.. వీటిని ప్రమోట్ చేసిన వారిపై, యాప్స్ రన్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకునేలా తెలంగాణ ప్రభుత్వం ఈనెల 26న సిట్ ఏర్పాటు చేసింది. ఇందులో అంతిమంగా లబ్ది పొందుతున్న వారిని కూడా గుర్తించి, కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. సైబర్ నేరాల పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు.

26-03-2025 బుధవారం ( ఫిలిప్పీన్స్ కు తెలంగాణ బియ్యం )

ఫిలిప్పీన్స్‌కు 8 లక్షల టన్నుల తెలంగాణ బియ్యం ఎగుమతి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించగా అందులో తొలి విడతగా దాదాపు 12,500 టన్నులను కాకినాడ పోర్టు నుంచి పంపించారు. MTU 1010 రకం ముడి బియ్యాన్ని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఎగుమతి చేస్తోంది. బియ్యం అక్కడకు చేరిన 60 రోజుల్లోగా డబ్బులు చెల్లించాలని ఒప్పందం చేసుకుంది సర్కారు. కొద్దినెలల క్రితం హైదరాబాద్‌లో జరిగిన సదస్సుకు వచ్చిన ఫిలిప్పీన్స్‌ అధికారులు ఇక్కడి బియ్యం క్వాలిటీ పరిశీలించి ఒప్పందం కుదుర్చుకున్నారు. మరో రెండు దేశాలకు కూడా తెలంగాణ బియ్యం ఎగుమతిపై పౌరసరఫరాల సంస్థ ఫోకస్ పెట్టింది.

26-03-2025 బుధవారం ( పంద్రాగస్టు నుంచే ఉచిత చీరలు )

తెలంగాణలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు ఉచిత చీరల పంపిణీ కార్యక్రమాన్ని పంద్రాగస్టు నుంచి ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏర్పాట్లు చేయాలని చేనేత శాఖను ఆదేశించింది. తెలంగాణలో బతుకమ్మ చీరల స్కీం రద్దు చేసి దాని స్థానంలో స్వయం సహాయక సంఘాల్లోని మహిళా సభ్యులకు ఏటా రెండేసి క్వాలిటీ చీరలను ఫ్రీగా ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి గతేడాది సెప్టెంబర్ 9న ప్రకటించారు. సెర్ప్‌ ఇందుకు అవసరమైన 311 కోట్లను కేటాయించింది. రాష్ట్రంలో 63.86 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులు ఉన్నారు. వారికి ఏటా రెండేసి చీరల చొప్పున మొత్తం ఒక కోటీ 27 లక్షల 72 వేల పాలిస్టర్‌ చీరలను మరమగ్గాల ద్వారా ఉత్పత్తి చేయించాలని చేనేత, జౌళి శాఖ ఇప్పటికే నిర్ణయించింది. సిరిసిల్ల, తదితర ప్రాంతాల్లోని కార్మికులకు తయారీ ఆర్డర్లను కూడా ఇచ్చారు.

26-03-2025 బుధవారం ( స్కిల్స్ పెంచేలా కొత్త ఒప్పందం )

తెలంగాణలోని యువతకు స్కిల్స్ పెంచడమే లక్ష్యంగా సిస్కో నెట్‌వర్కింగ్‌ అకాడమీ, తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌ – టాస్క్ పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. దావోస్‌లో జరిగిన సమావేశాలకు కొనసాగింపుగా.. రాష్ట్రంలో డిజిటల్‌ స్కిల్స్ డెవలప్ మెంట్, ఏఐ బేస్డ్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ కోఆపరేషన్ పై సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో ఈనెల 26న ఒప్పందం జరిగింది. రాష్ట్రంలో నెలకొల్పిన స్కిల్స్‌ యూనివర్సిటీలో యువతకు సిస్కో నెట్‌ వర్కింగ్‌ అకాడమీ ట్రైనింగ్ అందించబోతోంది.

25-03-2025 మంగళవారం ( యువ వికాసం గైడ్ లైన్స్ ఇవే )

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొస్తున్న రాజీవ్‌ యువ వికాసం పథకం గైడ్ లైన్స్ ను ఈనెల 25న రిలీజ్ చేసింది. ఈ స్కీం కుటుంబంలో ఒక్కరికే మాత్రమే వర్తించనుంది. ఎంపికైన అర్హుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో 1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షలకు మించకూడదు. ఆధార్‌ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలి. దరఖాస్తుతో పాటు రేషన్‌ కార్డు వివరాలు కచ్చితంగా నమోదు చేయాల్సి ఉంటుంది. రేషన్‌కార్డు లేకుంటే మీ-సేవ ద్వారా జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రం ఉండాలి. దరఖాస్తు సమయంలో పాస్‌పోర్టు సైజు ఫొటోను అప్‌లోడ్‌ చేయాలి. వ్యవసాయ అనుబంధ యూనిట్లు కావాలంటే పట్టాదార్ పాస్ బుక్ తప్పనిసరి. దివ్యాంగులు అయితే సదరం సర్టిఫికెట్‌ను సమర్పించాలి. వ్యవసాయేతర స్కీమ్‌కు జులై 1, 2025 నాటికి 21-55 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. వ్యవసాయ, దాని ఆధారిత పథకాలకు 21-60 ఏళ్లు ఉండాలి. ఈ స్కీంలో అగ్రవర్ణ పేదలకూ ఇందులో అవకాశం కల్పించారు. మహిళలకు 25 శాతం రిజర్వ్ చేశారు.

24-03-2025 సోమవారం ( పంట నష్టంపై రిపోర్ట్ రెడీ )

మార్చి 21 నుంచి 23 వరకు వడగళ్ల వానలతో పంట నష్టం జరిగింది. పంట నష్టంపై తెలంగాణ ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందింది. దీనికి సంబంధించి ఫైనల్ రిపోర్ట్ ను రూపొందించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. 13 జిల్లాల్లోని 64 మండలాల్లో 11,298 ఎకరాల్లో నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. 6,670 ఎకరాల్లో వరి, 4,100 ఎకరాల్లో మొక్కజొన్న పంటలకు నష్టం జరిగిందని గుర్తించారు. 309 ఎకరాల్లో మామిడి, ఇతర పంటలకు నష్టం జరిగిందని ఐడెంటిఫై చేశారు. పూర్తి నివేదిక వచ్చాక నష్టపరిహారం చెల్లించనున్నారు.

24-03-2025 సోమవారం ( పెట్టుబడుల వేట కంటిన్యూ )

తెలంగాణలో పెట్టుబడులకు ముందుకు రావాలని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు పిలుపునిచ్చారు. ఈనెల 24న అసెంబ్లీ కమిటీ హాల్‌లో యూఎస్‌-ఇండియానా రాష్ట్ర కార్యదర్శి డియెగో మోరాలెస్‌ నేతృత్వంలో ప్రతినిధుల బృందం ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిసింది. తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన చర్యలు, పెట్టుబడులకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకు అందిస్తున్న ప్రోత్సాహకాలను మంత్రి వివరించారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ట్రిలియన్‌ డాలర్లకు చేర్చేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తుందన్నారు.

23-03-2025 ఆదివారం ( వెంకన్న దర్శనానికి రూట్ క్లియర్ )

తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు ఆమోదముద్ర పడింది. ఈనెల 23 నుంచి టీటీడీ సిఫార్సు లేఖలను స్వీకరించింది. మొదటి రోజు 90 మంది లేఖలను అదనపు ఈవో కార్యాలయం అధికారులు తీసుకోగా.. వారికి ఈనెల 24న తిరుమల శ్రీవారి దర్శనం కల్పించారు. దీంతో ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్లే వారికి వారి సిఫార్సు లేఖలతో దర్శనాలు ఈజీగా మారాయి.

 

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×