BigTV English

CM Revanth Reddy: సీఎం సీరియస్.. పరుగులు పెడుతున్న అధికారులు

CM Revanth Reddy: సీఎం సీరియస్.. పరుగులు పెడుతున్న అధికారులు

CM Revanth Reddy: ఈవారం ప్రజాప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు, కార్యక్రమాలను అమలు చేసింది. ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్న చోట కొత్త పథకాలకు తాత్కాలికంగా బ్రేకులు పడ్డా.. మిగితా చోట్ల స్పీడ్ పెంచింది. తాజాగా ఇందిరమ్మ ఇండ్లకు సీఎం రేవంత్ రెడ్డి నారాయణపేట్ జిల్లాలలో శంకుస్థాపన చేశారు. మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యమన్నారు. ఆ డిటైల్స్ ఏంటో చూద్దాం. LRS కు మోక్షం కల్పిస్తూ జీవో రిలీజ్ చేసింది.


22-02-2025 శనివారం ( బీసీలకు అండగా )

బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు దక్కాలని మొదటి నుంచి కట్టుబడి ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా మరో అడుగు ముందుకేస్తోంది. మార్చి మొదటి వారంలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తోంది. స్థానిక సంస్థల్లో 42% బీసీలకు రిజర్వేషన్లు, విద్యా, ఉపాధి రంగాల్లోనూ 42 శాతం కోటా కల్పించాలనుకుంటోంది ప్రభుత్వం. అసెంబ్లీ సమావేశంలో బీసీ బిల్లు పెట్టి ఆమోదం తర్వాత గవర్నర్ కు పంపనుంది. మార్చి 10 నుంచి పార్లమెంట్ బడ్జెట్ రెండో విడత సమావేశాలు జరగనున్నాయి. పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లును పెట్టించేలా ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. పార్లమెంట్లో బిల్లు పెట్టకపోతే పోరాటానికీ సిద్ధమవుతోంది.


21-02-2025 శుక్రవారం ( డబుల్ ధమాకా )

ఈనెల 21న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి వరాల జల్లు కురిపించారు. ఇందిరమ్మ ఇండ్ల భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా దుద్యాల్ మండలం పోలేపల్లి గ్రామంలో రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత సింగారం ఎక్స్ రోడ్స్ లో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పెట్రోల్ బంక్ ను ప్రారంభించారు సీఎం. అప్పక్ పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత నారాయణ పేట మెడికల్ కాలేజీలో అకడమిక్ బ్లాక్ తో పాటు, ఇతర భవనాల నిర్మాణాల శంకుస్థాపన చేసి మెడికల్ స్టూడెంట్స్ తో సీఎం ఇంటరాక్ట్ అయ్యారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని హామీ ఇచ్చారు.

రాష్ట్రవ్యాప్తంగా మహిళా సమాఖ్యలో మొత్తం 67లక్షల మంది సభ్యులు చేరగా.. వారికి ఏడాదికి రెండు మంచి చీరలు చొప్పున ఇస్తామన్నారు. అందుకు 1000 కోట్లు ఖర్చు చేస్తామన్నారు. ప్రతి జిల్లాలో ఒక చోట ప్రభుత్వ భూముల్లో పెట్రోల్ బంకులను ఏర్పాటు చేసి వాటి నిర్వహణ బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే ఆర్టీసీలో ప్రైవేటు బస్సుల నిర్వహణ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించడం వల్ల 600 మంది మహిళలు బస్సుల యజమానులుగా మారారన్నారు. మహిళా సంఘాలు ఉత్పత్తి చేసిన వస్తువులను విక్రయించేందుకు హైదరాబాద్ శిల్పారామంలో విలువైన స్థలంలో ఏర్పాట్లు చేశామన్నారు. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.

21-02-2025 శుక్రవారం ( గ్రేటర్ కు కొత్త రూపు )

గ్రేటర్ హైదరాబాద్ కొత్త రూపురేఖల విషయంపై ప్రభుత్వం తీవ్రంగా సమాలోచనలు చేస్తోంది. ghmcని విస్తరించడమా.. కలపడమా.. ఏం చేద్దామన్న విషయాలపై సర్కార్ సీరియస్ గా ఫోకస్ పెట్టింది. ఓఆర్ఆర్ లోపల ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను గ్రేటర్ లో విలీనం చేసి హైదరాబాద్, సికింద్రాబాద్ రెండింటిని ప్రత్యే కార్పొరేషన్లుగా ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనే ప్రపోజల్ పై ప్రభుత్వం చర్చిస్తోంది.

గ్రేటర్ విస్తరిస్తున్న టైంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని పాలన ఎలా చేయాలనే దానిపై 2012లో ప్రసాద్ రావు కమిటీ నివేదిక ఇచ్చింది. ఆ ప్రకారం 200 దాకా వార్డుల సంఖ్య పెంచడంపై ఫోకస్ పెట్టినట్లు తెలిసింది. హైదరాబాద్, సికింద్రాబాద్ రెండు కార్పొరేషన్లు చేసే విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని, అడ్మినిస్ట్రేషన్ ​పరంగా ఇబ్బందులు ఏమైనా ఉంటాయా అన్న దానిపై స్టడీ చేసే బాధ్యతలను అడ్మినిస్ర్టేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాకి ప్రభుత్వం అప్పగించింది.

20-02-2025 గురువారం ( LRSకు మోక్షం )

పేదలు నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్న LRS దరఖాస్తుల పరిష్కారంపై ప్రభుత్వం కీలక అడుగు ముందుకేసింది. లే అవుట్ల రెగ్యులరైజేషన్ ప్రక్రియను స్పీడప్ చేసే విషయంపై కీలక నిర్ణయాలు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఈనెల 20న అందుకు సంబంధించి జీవో నెంబర్ 28 రిలీజ్ చేసింది. 28.65 లక్షల దరఖాస్తులు ఇప్పటికే వచ్చాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్‌బాబు జరిపిన సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అందులో పొందుపరిచారు.

లే-అవుట్‌ యజమాని 2020 ఆగస్టు 26కు ముందు.. తాను అభివృద్ధి చేసిన లే-అవుట్‌లో 10 శాతం ప్లాట్లను రిజిస్టర్డ్‌ సేల్‌ డీడ్‌ ద్వారా విక్రయించి ఉంటే, వారు ఎల్‌ఆర్‌ఎస్‌-2020 కింద దరఖాస్తు చేసుకున్నా, చేసుకోకపోయినా కూడా.. ఆ లే అవుట్‌లోని మిగతా 90 శాతం ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు అనుమతిస్తారు. సదరు లే-అవుట్‌లో భూమిని కొనుగోలు చేసినవారు సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్తే వారి వద్ద నిర్ణీత ఫార్మాట్‌లో వివరాలు సేకరించి.. ఎల్‌ఆర్‌ఎస్‌ పోర్టల్‌కు పంపుతారు. అక్కడ నిర్ణీత క్రమబద్ధీకరణ చార్జీలు, ప్రోరేటా ఓపెన్‌ స్పేస్‌ చార్జీలు వసూలు చేసి రిజిస్ట్రేషన్‌కు అనుమతిస్తారు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం నుంచి వచ్చే ఆ వివరాలను రూల్‌ నంబర్‌ 6 కింద LRS దరఖాస్తుగా పరిగణిస్తారు. మార్చి 22న LRS మార్గదర్శకాలను రిలీజ్ చేసింది ప్రభుత్వం.

20-02-2025 గురువారం ( వ్యవసాయంలో AI )

వ్యవసాయం గురించి, రైతుల గురించి ప్రతి సందర్భంలో ప్రయారిటీగా తీసుకున్న ప్రజా ప్రభుత్వం.. అగ్రికల్చర్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చేలా ప్రయత్నాలు చేస్తోంది. వ్యవసాయరంగంలో కొత్త టెక్నాలజీని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఈనెల 20న సచివాలయంలో ఇజ్రాయెల్‌ బేస్డ్ కంపెనీ MDHAI ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు స్మార్ట్‌ అగ్రికల్చర్‌, ఏఐ సెన్సార్‌, ఆటోమెషిన్‌ పద్ధతులు, డిజిటల్‌ రేయిన్‌ హార్వెస్టింగ్‌, గ్రే వాటర్‌ ట్రీట్‌మెంట్‌ వంటి వాటి గురించి వివరించారు. తెలంగాణలో వీటిని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. దీనిపై రియాక్ట్ అయిన తుమ్మల పూర్తిస్థాయి రిపోర్ట్ అధికారులుకు ఇవ్వాలన్నారు.

హైదరాబాద్ లో నాలాలు, ఫ్లైఓవర్లు, రోడ్ల విస్తరణ పనులపై ప్రభుత్వం వేగం పెంచుతోంది. ఇప్పటికే హై సిటీ పేరుతో చేపట్టిన పనులకు తోడు కొత్తగా మరిన్ని పనులు చేసేందుకు సిద్ధమవుతోంది. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన ఈనెల 20న స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ మీటింగ్ లో 15 అంశాలతో పాటు 6 టేబుల్ ఐటమ్స్ కు కమిటీ ఆమోదం తెలిపింది.

ప్రధానంగా HY సిటీ పనుల్లో భాగంగా కేబీఆర్ పార్కు, క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ వద్ద మూడు చోట్ల రోడ్డు విస్తరణ, మల్టీ లెవల్ ఫ్లైఓవర్ నిర్మాణాల కోసం 18 ఆస్తుల సేకరణకు, కేబీఆర్ పార్కు, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ జంక్షన్ వద్ద రోడ్డు విస్తరణ, మల్టీ లెవల్ ఫ్లై ఓవర్ నిర్మాణానికి 47 ఆస్తుల సేకరణ, కేబీఆర్ పార్కు ముగ్దా జంక్షన్ వద్ద రోడ్డు విస్తరణ, మల్టీ లెవల్ ఫ్లై ఓవర్ నిర్మాణాల కోసం 40 ఆస్తుల సేకరణకు ప్రభుత్వ అనుమతి కోసం సిఫార్సు చేసింది. ట్రిపుల్ ​ఐటీ జంక్షన్ లో మల్టీ లెవల్ ఫ్లై ఓవర్ల నిర్మాణానికి 21 ఆస్తులు, ఖాజాగూడ జంక్షన్ వద్ద మల్టీ లెవల్ ఫ్లైఓవర్ నిర్మాణానికి 10 ఆస్తులు, రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ లో భాగంగా రోడ్ 82 నుండి ఫిల్మ్ నగర్ మీదుగా 24 మీటర్ల రోడ్డు వెడల్పు చేసేందుకు 13 ఆస్తుల్ని సేకరించాలన్న నిర్ణయానికి ఆమోదం తెలిపారు.

19-02-2025 బుధవారం ( వస్తోంది సరికొత్త భూభారతి )

రాష్ట్రంలో భూ సమస్యలు తీర్చేందుకు తీసుకొచ్చిన భూభారతిపై అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే ఈ చట్టం అసెంబ్లీలో ఆమోదం పొందింది. దీన్ని సాధ్యమైనంత త్వరగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈనెల 19న MCHRDలో భూభారతి చట్టం అమలు, విధివిధానాల రూపకల్పనపై నిర్వహించిన సదస్సుకు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. వీలైనంత త్వరగా భూభారతి చట్టాన్ని అమలులోకి తీసుకువస్తామన్నారు.

చిన్న పొరపాట్లకూ ఆస్కారం ఇవ్వకుండా పకడ్బందీగా భూభారతి చట్టం రూపొందించామన్నారు పొంగులేటి. రాష్ట్రవ్యాప్తంగా భూములకు సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయని, గత ప్రభుత్వం నిర్వాకం వల్ల వాటికి సరైన పరిష్కారం లభించలేదన్నారు. ధరణి పోర్టల్‌ వల్ల సమస్యలు మరింత ఎక్కువయ్యాయని గుర్తు చేశారు. కొత్త చట్టంతో రైతుల భూములకు భద్రత కల్పిస్తామంటోంది ప్రభుత్వం. భూరికార్డులను కచ్చితంగా పరిరక్షిస్తామని, సామాన్యులకు రెవెన్యూ సేవలను అందుబాటులోకి తెస్తామన్నారు.

19-02-2025 బుధవారం ( కోటి రేషన్ కార్డులొస్తున్నాయి )

రాష్ట్రంలో కొత్తవి పాతవి కలిపి కోటి రేషన్​ కార్డులను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పుడు వస్తున్న రేషన్​ దరఖాస్తులకు కొత్త కార్డులను ఇవ్వడమే కాకుండా.. మార్పులు, చేర్పులు అవుతున్న పాత కార్డుల స్థానంలోనూ కొత్తవి ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో వచ్చే నెలలో కొత్తవి, పాతవి కలిపి దాదాపు కోటి రేషన్​ కార్డులను పంపిణీ చేసేలా ప్లాన్​ చేస్తోంది రేవంత్ రెడ్డి సర్కారు. గత పాత రేషన్​ కార్డుకు కొంచెం తక్కువలో పోస్ట్​ కార్డు సైజులో కొత్త రేషన్​ కార్డు డిజైన్​ ఉండేలా చూస్తున్నారు.

ముందుగా ఎన్నికల కోడ్​ లేని ఉమ్మడి మహబూబ్ ​నగర్, రంగారెడ్డి, హైదరాబాద్​ జిల్లాల్లో పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 89.96 లక్షల రేషన్‌‌‌‌‌‌‌‌కార్డులు ఉన్నాయి. కొత్తగా ఇచ్చే కార్డులను కలుపుకొంటే.. ఇవి కోటికి చేరుతాయని అధికారులు అంటున్నారు. కొత్త రేషన్​ కార్డులకు సంబంధించి పలు డిజైన్లను సీఎం రేవంత్ రెడ్డికి సివిల్​ సప్లయిస్ అధికారులు ఇప్పటికే చూపించారు.

19-02-2025 బుధవారం ( బడికి బాసట )

బడి షెడ్డులో సగం.. గుడిలో సగం అంటూ వచ్చిన కథనాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఆదిలాబాద్ జిల్లా మావల మండలం బట్టిసావర్గాం పంచాయతీ దుబ్బగూడలో దాజీనగర్ ప్రభుత్వ పాఠశాల పరిస్థితిపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. కనీస వసతులు లేని చోట తరగతి గదుల నిర్వహణపై సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా వెంటనే స్థానికంగా అందుబాటులో ఉన్న తాత్కాలిక భవనంలో పాఠశాల నిర్వహణకు ఏర్పాటు చేయాలని విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. ఎలక్షన్ కోడ్ ముగిశాక శాశ్వత చర్యలు తీసుకోవాలన్నారు.

18-02-2025 మంగళవారం ( సైబర్ సేఫ్టీ ఫస్ట్ )

సైబర్‌ నేరాల నియంత్రణలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రాబోయే రోజుల్లో సైబర్‌ భద్రతలో రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలపాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో, సైబరాబాద్‌ పోలీస్, సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో ఈనెల 18న షీల్డ్‌-2025 సదస్సును సీఎం ప్రారంభించారు.

గతేడాది సైబర్‌ నేరగాళ్లు దేశవ్యాప్తంగా 22 వేల 812 కోట్లు దోచుకున్నారని ఒక అంచనా ఉందని, ఇది మన ఆర్థిక వ్యవస్థతోపాటు జనానికీ ముప్పే అన్నారు. సైబర్‌ సెక్యూరిటీ బ్యూరోతో పాటు హెల్ప్‌లైన్‌ ఉన్న అతికొద్ది రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని గుర్తు చేశారు. సైబర్ హెల్ప్‌లైన్‌ నంబర్ 1930 గురించి అందరికీ అవగాహన కల్పించేలా షేర్‌ చేయాలన్నారు. గతేడాది తమ ప్రభుత్వం కొత్తగా 7 సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లను ప్రారంభించిందన్నారు. డిజిటల్‌ భద్రతను మెరుగుపర్చేందుకు ఏఐ, బ్లాక్‌చైన్, క్లౌడ్‌ సెక్యూరిటీ పరిజ్ఞానం వినియోగించాలని సీఎం సూచించారు.

17-02-2025 సోమవారం ( ఇసుక అక్రమరవాణాకు చెక్ )

ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని సీఎం రేవంత్‌ రెడ్డి చేసిన సూచన సత్ఫలితాలిస్తోంది. ఇసుక రీచ్‌లను తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించడం, ఓవర్‌ లోడ్‌, అక్రమ రవాణాపై విజిలెన్స్‌ దాడులు చేపట్టాలన్నారు. అక్రమార్కులు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇసుక బ్లాక్ మార్కెట్‌ను అరికట్టి పేదలకు ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఇసుక అక్రమ రవాణకు అడ్డుకట్ట వేసే బాధ్యత జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలకు హైదరాబాద్ పరిసరాల్లో హైడ్రాకు అప్పగించారు. ఇసుక రీచ్‌ల వద్ద 360 డిగ్రీల కెమెరాలు, సోలార్ లైట్స్ ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించడంతో గ్రౌండ్ లెవెల్ లో అధికారులు స్పీడ్ పెంచారు. ఇసుక అక్రమ రవాణాపై రాచకొండ పోలీసుల ప్రత్యేక డ్రైవ్ నిర్వహించగా, ఇప్పటివరకూ 107 మందిపై 71 కేసులు నమోదయ్యాయి. 44 ఇసుక డంపులలోని 58.72 లక్షల విలువైన 3762 టన్నుల ఇసుకను సీజ్ చేసి, 9 లారీలు, 5 టిప్పర్లు, ఒక మినీ వ్యాన్, 8 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు.

16-02-2025 ఆదివారం ( కలెక్టర్లూ.. కదలండి )

ప్రభుత్వ పథకాలను, కార్యక్రమాలను జనంలోకి తీసుకెళ్లడం, అక్కడ పాజిటివ్ టాక్ రావడంలో కలెక్టర్లదే కీలక పాత్ర ఉంటుంది. సో అలాంటి కలెక్టర్లు ఏసీ రూములు దాటడం లేదని సీఎం రేవంత్ చెప్పారు. అధికారులు మారుతారన్న ఉద్దేశంతోనే తాను ఈ కామెంట్లు చేస్తున్నానన్నారు. ఈనెల 16న బేగంపేటలోని ఐఏఎస్ ఆఫీసర్స్ ఇన్‌స్టిట్యూట్‌లో ‘లైఫ్ ఆఫ్ ఏ కర్మ యోగి – ఏ మెమొరీ ఆఫ్ సివిల్ సర్వెంట్’ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. శంకరన్, శేషన్, మన్మోహన్ సింగ్ లాంటి ఆఫీసర్లను ఐఏఎస్ లు గుర్తు చేసుకుంటూ ఉండాలన్నారు. అధికారులు నిబద్ధతతో పని చేస్తేనే ప్రజలకు మంచి జరుగుతుందన్న విషయాన్ని సీఎం ప్రత్యేకంగా గుర్తు చేశారు.

 

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×