ఉన్నచోట ఉండరు. ఏదో అనబోతారు. అది మరేదో అయి కూర్చుంటుంది. ఫామ్‌హౌజ్‌లో పెద్దాయనకు ప్రశాంతత లేకుండానైతే చేస్తున్నారు కేటీఆర్ అంట్ టీమ్ కలిసి.
సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి సభ పెట్టడమేమో గానీ, దీనికి కౌంటర్ ఎటాక్ చేయబోయి.. తమకు తామే ఎన్‌కౌంటర్ అయిపోతున్నట్టే ఉంది వారి వైఖరి. మా కుటుంబానికి పెద్ద ఇల్లే లేదని ప్రత్యర్థికి అస్త్రమై విమర్శలెదుర్కుంటున్న సందర్భం మరవకముందే, స్టార్ హోటళ్ల ఆస్తులపై కేటీఆర్ క్లారిటీ ఇచ్చేసుకున్నాడు.
వ్యాపారం చేయొద్దా అని ప్రశ్నించాడు. రాజకీయాల్లోకి వచ్చి లాస్ అయిపోయా అన్నాడు. వందశాతం బిజినెస్‌మెన్‌గా ఉండి ఉంటే మరో పది హోటళ్లు పెట్టి ఉండేవాడినని .. ప్రజాసేవ కోసం తనెంతగా నష్టపోయాడో వివరించే ప్రయత్నం చేసి విమర్శలపాలయ్యాడు. మరోవైపు సిరిసిల్లలో బీఆరెస్ నేతలతోనే విమర్శలను, ఆరోపణలను తిప్పికొట్టేందుకు కేటీఆర్ చేసిన ప్రయత్నం మరింత కొంప ముంచేలా చేసింది.
రసమయి బాలకిషన్ .. ఏకంగా కేటీఆర్ కాబోయే సీఎం అని ప్రకటించేశాడు. సీఎం రేవంత్.. కాంగ్రెస్ ను సిరిసిల్ల నుంచి గెలిపిస్తే మంత్రివర్గంలో ఆ ఎమ్మెల్యేకు చోటు లభిస్తుందని ప్రకటించడంతో.. బాలకిషన్ దీనికి కౌంటర్ ఎటాక్ చేయబోయి కడుపులో ఉన్న విషయం బయటకు కక్కేశాడు.
సిరిసిల్ల నుంచే ముఖ్యమంత్రి రాబోతున్నాడని అత్యుత్సాహం ప్రదర్శించేశాడు. అంటే కాబోయే సీఎం కేటీయారేనని అధిష్టానం మదిలోని మాటను ఈ వేదికగా ఇలా డిక్లేర్ చేశాడన్నమాట. మరి ఇదే అంశాన్ని తీసుకుని బీఆర్‌ఎస్ పార్టీ రాబోయే ఎన్నికలకు వెళుతుందా? అని నిలదీయడం మొదలు పెట్టాయి అప్పుడే ప్రతిపక్షాలు.
కేటీఆర్ సైతం ఎక్కడా ఈ విషయం జనాల్లో నానొద్దని జాగ్రత్త పడుతూ.. జనం కేసీఆర్‌నే మళ్లీ సీఎం కావాలని కోరుకుంటున్నారని, ఆయన కోసం జనం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారనే వ్యూహాన్నే ప్రదర్శిస్తూ వస్తున్నాడు. కేసీఆర్ పేరు చెబితేనే జనంలో అంతో ఇంతో ఆసక్తి, గెలుపుపై ఆశలు ఉంటాయని పెద్దలందరికీ తెలుసు.
అందుకే కేటీఆర్‌ను సీఎం చేయాలనే కేసీఆర్ ఆలోచనను మదిలోనే ఉంచుకుంటున్నారు తప్ప… ఎక్కడా బయటపెట్టడం లేదు. కవితను పార్టీ నుంచి బయటకు పంపింది కూడా కేటీఆర్‌కు ఆటంకంగా మారొద్దనే. రెండో సారి అధికారంలోకి వచ్చిన సమయంలోనే కేటీఆర్‌ను సీఎం చేయాలని కేసీఆర్ భావించాడు. కానీ కుదరలేదు. పరిస్థితులు అనుకూలించలేదు. కేంద్రం సహకరించలేదు.
ఈసారి కచ్చితంగా అధికారంలోకి వస్తామనే ధీమాతో ఉన్న బీఆర్‌ఎస్ పార్టీ.. కేసీఆర్ పాలనను మళ్లీ జనం కోరుకుంటున్నారని, ఆయనను సీఎంగా మళ్లీ చూడాలనుకుంటున్నారనే నినాదాన్ని బాగా బలంగా తీసుకెళ్తున్నది. ఇప్పుడు రేవంత్ ట్రాప్‌లో పడిపోయి నోరుజారి, మాటతుళ్లి.. ఇలా తమకు తాము గొయ్యి తవ్వుకునే విధంగా నినాదాలు ఎత్తుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
సిరిసిల్ల నుంచి ముఖ్యమంత్రి, కేటీఆర్ సీఎం అనే నినాదాలను జనంలోకి ఇంకా విస్తృతంగా తీసుకుపోతే… బీఆర్‌ఎస్ పతనం స్టార్ట్ అయినట్టేనని ఆ పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు.