అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌసుకు తిరిగి రావడంపై భారత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం ఏం జరుగుతుందో అని ఆసక్తిగా చూస్తోంది. యూఎస్ ఇమ్మిగ్రేషన్ చట్టాల్లో మార్పుల వస్తాయని ఆందోళనలు ఉన్నప్పటికీ, అమెరికాలో ఐటీకి మాత్రం ఢోకా ఉండదని ఆశిస్తున్నారు అక్కడి భారతీయ ఐటీ వీరులు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి పదవీ చేపట్టిన తర్వాత హెచ్-1బీ వర్కింగ్ వీసాలతో పాటు, ఇతర ఇమ్మిగ్రేషన్ చట్టాలకు సంబంధించి కఠినంగా వ్యవహరించవచ్చని ఇమ్మిగ్రేషన్ నిపుణులు, విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ట్రంప్ గత పదవీకాలంలో హెచ్1బీ ఉద్యోగులకు జీతాలు, వీసా రుసుములను పెంచారు. అయితే, ప్రస్తుతం సంవత్సరానికి 85 వేల హెచ్1బీ వర్క్ వీసాలకే పరిమితమైన కేటాయింపును ట్రంప్ మళ్ళీ పరిశీలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
గతంలో ట్రంప్ మొదటిసారి ప్రెసిడెంట్ అయినప్పుడు హెచ్1బీ వర్క్ వీసాల తిరస్కరణ రేటు ఆల్-టైమ్ హైగా 24%కి చేరుకుంది. అలాగే, ఈసారి కూడా H1B అప్లికేషన్‌లపై కఠినమైన పరిశీలన ఉంటుందనే ఆందోళనలు ఉన్నాయ్. అలాగే, అంతర్జాతీయ విద్యార్థుల కోసం ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్-OPT వ్యవధి, అర్హత కూడా ట్రంప్ కొత్త ప్రభుత్వం సమీక్షించవచ్చని అనుకుంటున్నారు. అయితే, ఇన్ని ఆందోళనలు ఉన్నప్పటికీ, భారతదేశపు బెంచ్‌మార్క్ స్టాక్ సూచీలపై టెక్ రంగం స్టాక్‌లు ర్యాలీ కొనసాగింది. దీనితో అమెరికాలోని భారతదేశ ఐటీ కంపెనీలు రిపబ్లికన్ పార్టీ విజయాన్ని నిండుగా ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది.
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతారని తెలిసిన వెంటనే బెంచ్‌మార్క్ సూచీలలో కనిపించిన ర్యాలీకి ఆజ్యం పోసిన ఐటీ షేర్లు భారీగా పెరిగాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ షేర్లు 4.21 శాతం, ఇన్ఫోసిస్ 4.02 శాతం, టెక్ మహీంద్రా 3.85 శాతం, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ 3.71 శాతం చొప్పున బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ఏమాత్రం తగ్గకుండా పెరుగుతూనే ఉన్నాయి. అలాగే, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ 5.86 శాతం చేరుకోగా, LTI మైండ్ ట్రీ 4.75 శాతం, విప్రో 3.75 శాతం పురోగమించాయి. కాబట్టి భారతీయ ఐటీ కంపెనీలకు అనుకూలంగా ట్రంప్ రిటర్న్ ఉంటుందని అందరూ భావిస్తున్నారు.
Also Read: గ్రీన్ కార్డులు, హెచ్-1 బీ వీసాల విషయంలో ట్రంప్ దూకుడు.. మనకు లాభమా.? నష్టమా.?
అయితే, ట్రంప్ హయాంలో ఐటీకి ఇబ్బంది లేకపోవడానికి ప్రధాన కారణాలు కొన్ని ఉన్నాయి. ఇందులో ముఖ్యమైంది డాలర్ బలోపేతం కావడం. దీనితో, ఐటి కంపెనీలు వడ్డీ రేట్లు, ఇన్‌ఫ్లేషన్ మొదలైన అంశల పరంగా ఐటీ కంపెనీలకు సులభమైన ఫైనాన్స్ విధానాలు ఉంటాయని ఆశిస్తున్నారు. ఇది అమెరికా కంపెనీల ఐటీ బడ్జెట్‌లను సడలించడంలో సహాయపడే అవకాశం ఉంది. ఇక, బలమైన డాలర్ భారతీయ ఔట్‌సోర్సింగ్ పరిశ్రమకు ప్రయోజనకరంగా ఉంటుంది. మెజారిటీ ఐటీ సర్వీసెస్ కంపెనీలు అమెరికాను కీలక వ్యాపార మార్కెట్‌గా చూస్తున్నాయి. దీని వల్ల, ఐటీ పరిశ్రమ నిర్వహణ ఖర్చులు భారతీయ రూపాయిలలో ఉన్నప్పటికీ యూఎస్ కరెన్సీలో వారి ఆదాయంలో అధిక భాగాన్ని పొందుతున్నారు. దీనివల్ల అమెరికాలోని ఐటీ ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందీ ఉండదనే అభిప్రాయాలు వస్తున్నాయి.
ఇక ట్రంప్ ప్రభుత్వం విధాన రూపకల్పనలో స్థిరత్వంగా ఉంటుందని అందరూ ఆశిస్తున్నారు. అమెరికన్ ప్రభుత్వం, సెనేట్, కాంగ్రెస్‌లను రిపబ్లికన్లే నియంత్రిస్తున్న కారణంగా, రాబోయే పాలసీ మేకింగ్‌లో మార్పు ఉండబోదనీ.. ఇది ఇలాగే కొనసాగడం వల్ల భారతీయ ఐటీ కంపెనీలకు లాభం ఉంటుందని భావిస్తున్నారు. ఇక, కార్పొరేషన్‌లకు మెరుగైన పన్ను విధానాలు కూడా ఐటీకి దెబ్బ లేకుండా చేస్తాయనే అభిప్రాయం ఉంది. కార్పొరేట్ పన్ను రేటును 21% నుండి 15%కి తగ్గించాలన్న డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదన బడ్జెట్ ఒత్తిళ్లను తగ్గించడానికి.. యూఎస్ కంపెనీల విచక్షణతో కూడిన టెక్ ఖర్చులను విస్తరించడానికి ఉపయోగపడే అవకాశం ఉంది. దీని వల్ల, యూఎస్‌లో రిజిస్టర్డ్ ఇండియన్ స్టార్టప్‌లకు, టెక్నాలజీ కంపెనీలకు ప్రయోజనం చేకూరుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇక, ట్రంప్ ప్రభుత్వం చైనాకు ప్రత్యామ్నాయంగా పాలసీలను రూపొందించడం కూడా భారత్ కంపెనీలకు కలిసొచ్చే అవకాశం ఉంది. చైనా విషయంలో ట్రంప్ చూపించే కఠిన వైఖరితో భారతదేశానికి అమెరికా నిధుల ప్రవాహం ఇప్పటికే పెరిగింది. ట్రంప్ గత పదవీ కాలంలో చూసినట్లుగా చైనాతో హార్డ్ బాల్ గేమ్ కొనసాగించాలనే ప్లాన్‌లో ఉన్నారు. దానితో అధికంగా వచ్చే నిధుల ప్రవాహం వల్ల భారతీయ ఐటీ కంపెనీలకు ప్రయోజనం చేకూరుతుందని ఆశిస్తున్నారు. అలాగే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్ల వంటి అధునాతన టెక్నాలజీల్లో కూడా అమెరికా భారీగా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ పరిణామం, భారతీయ అమెరికన్లు, అమెరికాలో భారతీయుల ఐటీ కంపెనీలకు కలిసొస్తుందని భావిస్తున్నారు.