BigTV English

Donald Trump: ట్రంప్ కొత్త నిర్ణయం భారత్‌కు కలిసొస్తుందా?

Donald Trump: ట్రంప్ కొత్త నిర్ణయం భారత్‌కు కలిసొస్తుందా?

ఇప్పటి వరకూ కప్ప గంతులు వేసిన చైనా.. రాబోయే రోజుల్లో చప్పబడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇందులో మైక్ వాల్ట్స్ ప్రభావం భారీగా ఉంటుందనడంలో సందేహం లేదు. ట్రంప్ అసలు లక్ష్యం ‘అమెరికా ఫస్ట్’ అనే విధానమే అయినప్పటికీ.. అది భారత్‌‌కు కలిసొస్తుంది. అటు నాటో దేశాలను హెచ్చరించినా.. ఇటు చైనాకు చెక్ పెట్టినా.. అది అటూ ఇటూ తిరిగి భారత్ మేలు కోసమే అనేటట్లు ఉంది.


ఇండో ఫసిఫిక్‌‌ కారిడార్‌పై అమెరికా చాలా ఆశలు

అమెరికా భద్రతా సలహాదారుగా మైక్ వాల్ట్స్ నియామకంతో చైనాకు చిక్కొచ్చినట్లే. అయితే, ఇది అమెరికాకు కూడా కీలకమైన అడుగేనని చెప్పాలి. ఎందుకంటే, అమెరికాతో పాటు పాశ్చ్యాత్య దేశాలకు చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీతో ఎప్పటికైనా భారీ ముప్పు ఉంటుందనడంలో అనుమానం లేదు. అలాంటి పెద్ద ముప్పును పరిష్కరించడంలో రాబోయే ట్రంప్ ప్రభుత్వం నిబద్ధతతో ఉందన్నది వాల్ట్స్ ఎంపికతతో స్పష్టమవుతోంది. అంతేగాక, ఇటీవల కాలంలో ఇండో ఫసిఫిక్‌‌ కారిడార్‌పై అమెరికా చాలా ఆశలు పెట్టుకుంది.


ఎన్నికలకు ముందు నుండే దీనిపై ట్రంప్ కూడా సానుకూలంగానే ఉన్నారు. మైఖెల్ వాల్ట్స్‌తో పాటు మాజీ పెంటగాన్ వ్యూహకర్త మాథ్యూ క్రోనిగ్ కూడా అమెరికా తన వ్యూహాత్మక దృష్టిని యూరప్, మిడిల్ ఈస్ట్ నుండి ఇండో-పసిఫిక్‌కు మార్చాలని బలంగా వాదించారు. ఇందులో భాగంగా.. రాబోయే అమెరికా అధ్యక్షుడు, ఉక్రెయిన్, మిడిల్ ఈస్ట్‌లోని యుద్ధాలను త్వరగా ముగించేటట్లు చూడాలని.. దానికి అత్యవసర నిర్ణయాలు తీసుకోవలని వాల్ట్స్ వాదించారు. చివరకు అమెరికా వ్యూహాత్మక దృష్టిని చైనా కమ్యూనిస్ట్ పార్టీ నుండి వచ్చే పెద్ద ముప్పుపై కేంద్రీకరించాలని కూడా హెచ్చరించారు.

తైవాన్‌కు సంబంధించి యూఎస్ సైనిక పరంగా సిద్ధం

అలాగే, చైనా దూకుడును ఎదుర్కోవడానికి అమెరికా సిద్ధంగా ఉండాలని వాల్ట్స్ పదే పదే గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా తైవాన్‌కు సంబంధించి యూఎస్ సైనిక పరంగా సిద్ధంగా ఉండాలని వాదిస్తున్నారు. చైనా నుండి అమెరికా మిత్ర దేశాలకు వచ్చే ముప్పును నివారించడానికి అమెరికా సైన్యాన్ని మరింత బలోపేతం చేయాలని కూడా చెబుతున్నారు. అయితే, ఇటీవల వాల్ట్స్ రాసిన ఎకనామిస్ట్ ఆర్టికల్‌లో, “తైవాన్‌పై చైనా దాడి చేస్తుందని జాగ్రత్త పడుతూనో.. లేదంటే , అది తైవాన్‌పై దాడి చేయకుండా ఆపడానికో అమెరికా సాయుధ దళాలను నిర్మించడం లేదని” కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా నిజంగా రక్షణ వ్యయాన్ని తగ్గించిందని వెల్లడించారు. ఇది పవర్ బ్యాలెన్స్‌ కోసం చైనాకు అనుకూలంగా మార్చడంలో భాగంగా జరుగుతుందని అన్నారు.

అమెరికా సమగ్ర సైనిక సామర్థ్యాన్ని బలోపేతం చేయాలన్న వాల్ట్స్

అయితే  ఇప్పుడు అమెరికా చైనాకు చెక్ పెట్టేటట్లు రక్షణ వ్యయాన్ని పెంచాల్సిన అవసరాన్ని వాల్ట్స్ సూచించారు. అమెరికా సమగ్ర సైనిక సామర్థ్యాన్ని బలోపేతం చేయాలని అన్నారు. అందుకే, రక్షణ వ్యయంలో గణనీయమైన పెరుగుదల అవసరమనీ.. యూఎస్ రక్షణ-పారిశ్రామిక పెట్టుబడులను పునరుద్ధరించాలని వాల్ట్స్ పిలుపునిచ్చారు. అయితే, యూఎస్-చైనా సంబంధాలు ఇప్పటికే దెబ్బతిన్నాయనడంలో సందేహం లేదు.

దీనితో పాటు, కొన్నేళ్లుగా ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధాలు..  సౌత్ చైనా సముద్రంలో సైనిక విన్యాసాలు.. వీటన్నిటితో పాటు ఇరు దేశాల మధ్య ఉన్న సైద్ధాంతిక ఘర్షణల మధ్య వాల్ట్స్ నియామకం జరిగింది. ఇది, చైనాకు ఒక విధంగా ట్రంప్ ఇచ్చిన షాక్ అనే చెప్పాలి. అదే సమయంలో ఇండో-ఫసిఫిక్‌లో అమెరికా బలాన్ని పెంచుకోవడం కూడా ఇందులో భాగంగానే చూడాలి. ఇక, భారత్‌తో సంబంధాల విషయంలో ట్రంప్‌తో పాటు వాల్ట్స్ కూడా తోడవ్వడం చైనాను అదుపులో పెట్టడానికి భారత్‌కు కలిసొస్తుందనే చెప్పాలి.

Also Read:  పుతిన్ ని హెచ్చరించే ధైర్యం ఎవరికీ లేదు.. ఆ వార్తలపై రష్యా క్లారిటీ.. ఏం జరిగిందంటే

చైనా దూకుడు తగ్గించడానికి భారత్‌కు అవకాశం

ఇక, ట్రంప్ పాలనలో వాల్ట్స్ కీలక బాధ్యతను తీసుకోవడం చైనా విషయంలో కఠినమైన విధానాన్ని సూచించడమే కాకుండా భారత్-అమెరికా సంబంధాలు మరింత బలంగా మారతాయనడానికి సూచనగా ఉన్నాయి. ట్రంప్ తీసుకున్న నిర్ణయం వెనుక ఎలాంటి కారణం ఉన్నప్పటికీ ఇది భారత్‌కు కలిసొచ్చే అంశం. ఇప్పటికే చైనాతో ఉన్న సంక్లిష్టమైన సంబంధాలు.. వివాదాస్పద అంశాల్లో చైనా దూకుడు తగ్గించడానికి భారత్‌కు అవకాశం దొరికినట్లు అవుతుంది. వాల్ట్స్ భద్రతా సలహాదారు అయినప్పటికీ.. వ్యాపారాల్లో, మిలటరీ వాణిజ్యంలో చైనాపై పడే భారం.. భారత్‌కు బలంగా మారుతుంది. ఇందులో వాల్ట్స్ సహకారం కీలకంగా ఉంటుంది.

అందుకే, వాల్ట్స్ నియామకం భారతదేశంపై సానుకూల ప్రభావాలను చూపిస్తుంది. అమెరికన్ కాంగ్రెస్‌లో ఇండియా కాకస్ కో-ఛైర్‌గా ఉన్నప్పుడు కూడా వాల్ట్స్ యూఎస్-భారత్ సంబంధాలకు మద్దతు ఇచ్చే విధానాలను సమర్థించాడు. కనుక, అటు చైనా వైఖరి పరంగా, ఇటు భారత్ విషయంలో వాల్ట్స్ ప్రమేయం భారత్‌కు బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా, చైనా వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి చేసే దుడుకు చర్యలపై ప్రభావం చూపిస్తుంది. ఇప్పటికే, అమెరికాతో బలమైన రక్షణ, వ్యూహాత్మక సహకారాన్ని కోరుతున్న భారత్.. ఇకపై ఇండో-పసిఫిక్ కూటమిలో వ్యూహాత్మక ప్రాముఖ్యతను గుర్తించే అమెరికా నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ సాయంతో తన భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

నాటో కూటమిపై ట్రంప్‌కి అభ్యంతరాలు

నిజానికి, వాల్ట్స్‌ను ఇలాంటి కీలక పదవిలోకి తీసుకోవాలనే ట్రంప్ నిర్ణయం ‘అమెరికా ఫస్ట్’ అనే ట్రంప్ వైఖరిలో భాగంగా ఉంది. అమెరికా ఫస్ట్ అనేది ప్రపంచ దేశాల బాగోగుల కోసం అమెరికా భారీగా పెడుతున్న ఖర్చులు, బలం, భద్రత, ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించింది. అందుకే, ఈ విధానం నాటో మిత్ర దేశాలను కూడా కలవరానికి గురిచేస్తోంది. నాటో కూటమి గురించి ట్రంప్ గతంలో వెల్లడించిన అభ్యంతరాలను కూడా నాటో దేశాలకు గుర్తున్నాయి. తన మొదటి పదవీకాలంలో, ట్రంప్ నాటో విలువను సైతం ప్రశ్నించారు. నాటో సభ్య దేశాలు రక్షణకు వ్యయ లక్ష్యాలను చేరుకోకపోతే అమెరికా నాటో కూటమిలో ఉండాలా వద్దా అనేది పునఃపరిశీలించాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు.

ఈ మాటలతో, నాటో ఒప్పందంలోని ఆర్టికల్ 5 బలహీనపడుతుందని కొన్ని యూరప్ దేశాలు భావిస్తున్నాయి. ఒక విధంగా, ట్రంప్ మాటలు ఐరోపాలో ఘర్షణను సృష్టించిందనే చెప్పాలి. ఇవి ఎంత స్థాయికి వెళ్లాయంటే.. యూరోపియన్ దేశాలతో ఉన్న సాంప్రదాయ భాగస్వామ్యానికి దూరంగా అమెరికా చైనాకు తన వనరులను కేంద్రీకరిస్తుందేమో అనేంత ప్రభావం చూపించాయి. నిజానికి, ఇది ట్రంప్ నుండి వచ్చిన ఆలోచన కాదు. గతంలో వాల్ట్స్ సూచనలతోనే ట్రంప్ ఇలా మాట్లాడారని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. అంత కీలకంగా ఉన్న వాల్ట్స్ ఇప్పుడు మరింత ప్రభావం చూపిస్తారని అంతా అనుకుంటున్నారు.

వాల్ట్స్ సూచనలతో అమెరికా వ్యూహాత్మక పోటీ

విదేశాంగ విధానంలో చాలా అనుభవం ఉన్న సైనిక అధికారిగా వాల్ట్స్ తీసుకునే నిర్ణయాలు అమెరికా దౌత్య విధానాలను మరింత కఠినంగా మారుస్తాయని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా, వాల్ట్స్ సూచనలతో అమెరికా వ్యూహాత్మక పోటీకి ప్రాధాన్యతనిస్తుందని చెబుతున్నారు. ఇందులో మొదటిగా ప్రభావితమయ్యే దేశం కూడా చైనా. అందులోనూ, అమెరికాతో రాజీపడని బలమైన దేశం చైనా. అందుకే, భారతదేశం అమెరికాతో భాగస్వామ్యాన్ని పెంచుకోవాలన్నా.. చైనాతో ఉన్న బెదిరింపులను తిప్పికొట్టాలన్నా.. అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పటిష్టం చేసుకోవడానికి ఇది ఒక అవకాశంగా భారత్ భావించాలి. దక్షిణ చైనా సముద్రంలో బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్ట్ అయినా.. చైనా సైనిక విన్యాసాలైనా.. చైనా తన ప్రాంతీయ కార్యక్రమాలను రెట్టింపు చేయాలని ప్రయత్నించినప్పటికీ.. వాల్ట్స్ భద్రతా సలహాదారుగా ఉన్న సమయంలో.. ఇండో-ఫసిఫిక్ కేంద్రంగా, భారత్-యుఎస్ భాగస్వామ్యం చైనాకు చెక్ పెడుతుంది.

భారత్-అమెరికాల మధ్య దౌత్యపరంగా మెరుగైన స్థితి

ఇప్పుడిక, ఇండో-పసిఫిక్‌లో సైనిక సామర్థ్యాలను బలోపేతం చేసే వ్యూహాలను రూపొందించడంపై వాల్ట్స్ సూచనలతో ట్రంప్ దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తోంది. అలాగే, రాబోయే రోజుల్లో యూఎస్ విదేశాంగ విధానంలో కూడా కీలక మార్పులు చోటు చేసుకుంటాయనడంలో సందేహం లేదు. ఈ క్రమంలో.. భారత్-అమెరికాల మధ్య దౌత్యపరంగా మరింత మెరుగైన పరిస్థితి ఏర్పడటంతో పాటు ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాలు కూడా మెరుగుపడతాయి. దీనితో, కొత్త ద్వైపాక్షిక ఒప్పందాలు, ఉమ్మడి సైనిక కార్యకలాపాలు, క్వాడ్ వంటి అంతర్జాతీయ వేదికలపై యూఎస్-భారత్ సమన్వయంతో పాలసీల రూపకల్పన వంటి వాటికి అవకాశం ఉంది. ఇది ప్రాంతీయంగా భారత్ బలాన్ని పెంచడంతో పాటు అంతర్జాతీయంగా భారత్ పరపతి పెరగడానికి దోహదపడుతుంది.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×