BigTV English

Trump Target Zelenskyy: జెలెన్స్కీని ట్రంప్ ఎందుకు టార్గెట్ చేసాడంటే ?

Trump Target Zelenskyy: జెలెన్స్కీని ట్రంప్ ఎందుకు టార్గెట్ చేసాడంటే ?

యుద్ధానికి కారణమే ఉక్రెయిన్ అంటున్న ట్రంప్

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ నియంతా…? టీవీ షోలో కమెడియన్‌‌గా చేసిన జెలెన్స్కీలో ఇంత క్రూరత్వం దాగుందా..? అందుకే రష్యాతో యుద్ధం కావాలనుకున్నాడా..? ఏమో…! అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మాటలు వింటుంటే.. అలాగే, ఉన్నాయ్. నిన్నటి వరకూ అమెరికా ఆయుధాలిచ్చిన సపోర్ట్ చేసిన ఉక్రెయిన్‌నే ట్రంప్ ఇప్పుడు నిందిస్తున్నారు. అసలు యుద్ధానికి కారణమే ఉక్రెయిన్… అంటూ ట్రంప్ షాకింగ్ కామెంట్ చేశారు. జెలెన్స్కీని నియంతగా పేర్కొన్న ట్రంప్‌.. అనవసరంగా జెలెన్స్కీనే యుద్ధాన్ని తెచ్చాడని నిప్పులు చెరిగారు. ఉక్రెయిన్‌లో త్వరగా ఎన్నికలు పెట్టాలంటూ హుకుం కూడా జారీ చేశారు.


జెలెన్స్కీని ‘నియంత’ అనడాన్ని తప్పుబట్టిన జర్మనీ ఛాన్స్‌లర్

ఈ దెబ్బతో జెలెన్స్కీ కొన్ని రోజులుగా అనుమానిస్తున్నది నిజమేనని యూరప్ అంతా ఓ అంచనాకు వచ్చేసినట్లే కనిపిస్తోంది. జెలెన్స్కీని నియంత అనడాన్ని జర్మనీ ఛాన్స్‌లర్ తప్పుబట్టారు. ఇక, ట్రంప్‌ రష్యా చెబుతున్న అబద్ధాల వలలో చిక్కుకున్నారని జెలన్స్కీ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే, “మీరు ఏమన్నా అనుకోండీ.. నేనుంటే అసలు యుద్ధమే జరిగేది కాదు. ఇప్పుడు కూడా నేను చెప్పినట్లు వింటేనే మీకు బెటర్..” అన్నట్లు ట్రంప్ మాటలు జెలెన్స్కీ పుండు మీద కారం చల్లినట్లున్నాయి. అసలే, యుద్ధం తర్వాత యూరప్ అంతా రష్యా భయంతో బిక్కు బిక్కుమంటుంటే.. ఇప్పుడు ట్రంప్ ప్లేట్ ఫిరాయించడంతో జెలెన్స్కీతో సహా ఆయా యురోపియన్ నేతలు తలలుపట్టుకుంటున్నారు.

సౌదీ వేదికగా ట్రంప్ ఆధ్వర్యంలో రష్యాతో శాంతి చర్చలు

ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధాన్ని ఆపడానికి.. సౌదీ వేదికగా, ట్రంప్ ఆధ్వర్యంలో, రష్యాతో శాంతి చర్చలు మొదలుపెట్టింది అమెరికా. అయితే, ఈ చర్చలకు తమను ఆహ్వానించలేదనీ… ఇలాంటి చర్చలకు తాము అటెండ్ కామంటూ.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్స్కీ అనడంతో.. ట్రంప్ కోపం నషాళానికి ఎక్కినట్లుంది. యుద్ధవిరమణపై రష్యాతో అమెరికా చర్యలు జరిపింది కానీ ఉక్రెయిన్‌ను భాగస్వామ్యం చేయకపోవడంపై యూరోపియన్ దేశాలు ఆగమేఘాల మీద ఫ్రాన్స్‌లో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. జెలెన్స్కీకీ.. ట్రంప్‌కి మధ్య గ్యాప్ మరింత పెరగకముందే దిద్దుబాటు చర్యలు చేద్దామని అనుకున్నారు.

యూరప్ సొంత సైన్యం ఏర్పాటు చేసుకోవడం బెటర్ -జెలెన్స్కీ

అయితే, ట్రంప్ మైండ్‌ని రీడ్ చేసినట్లు జెలెన్స్కీ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అమెరికాని నమ్ముకొని నాటో దేశాలు ఉండటం సరికాదనీ…ఇప్పటికైనా, యురోపియన్ యూనియన్ తన సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవడం రైట్ అని సలహా ఇచ్చారు. ఈ కామెంట్ల తర్వాత.. ట్రంప్ తనదైన శైలిలో చక్రం తిప్పుతున్నారు. తాజాగా జెలన్స్కీపై చేసిన వ్యాఖ్యలతో ఉక్రెయిన్ అధ్యక్ష పీఠం నుండి జెలెన్‌స్కీని తప్పించాలన్నదే ట్రంప్ ప్లానా.. అన్నట్లు ఘాటు కామెంట్లు చేస్తున్నారు. యుద్ధం ఆపడానికి అదే మార్గమన్న తీరులో ట్రంప్ వ్యవహరిస్తున్నారు.

అమెరికా నుండి $350 బిలియన్లు ఖర్చు

ట్రంప్ ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన తన ట్రూత్ పోస్ట్ కామెంట్లు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. ఇందులో.. “ఒక్కసారి ఆలోచించండి..” అంటూ ప్రపంచ ప్రజలను ఉద్దేశించి, చెప్పిన ట్రంప్, జెలెన్స్కీని ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. “నిరాడంబరంగా ఉండే ఈ సక్సెస్‌ఫుల్ హాస్యనటుడు వోలోడిమిర్ జెలెన్స్కీ.. అమెరికా నుండి $350 బిలియన్ డాలర్లు ఖర్చు చేసి, ఓడిపోయే ఓ యుద్ధాన్ని ప్రారంభించాడనీ.. అయితే, అమెరికా గానీ, “ట్రంప్” గానీ లేకుండా ఎప్పటికీ పరిష్కరం కానీ యుద్ధం చేయడం మూర్ఖత్వమని అన్నారు. ఈ యుద్ధంపైన యూరప్ కంటే అమెరికా $200 బిలియన్ డాలర్లు ఎక్కువ ఖర్చు చేసిందని అన్నారు.

శాంతి తీసుకురావడంలో యూరప్ విఫలమైందన్న ట్రంప్

అయితే, యూరప్ డబ్బుకు హామీ ఉంది కానీ… దీని నుండి అమెరికా పొందేదేమీ లేదని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఇక, నిద్రబోతు జో బైడెన్ ఈక్వలైజేషన్‌ను ఎందుకు డిమాండ్ చేయలేదని ప్రశ్నించారు. అమెరికా, పంపిన డబ్బులో సగం “మిస్” అయ్యిందని జెలెన్స్కీ అంగీకరించడం హాస్యస్పదమని అన్నారు. ఎన్నికలు లేకుండా జెలన్స్కీ నియంతలా మారాడనీ.. జెలెన్స్కీ వేంటనే గద్దె దిగడం మంచిదనీ… లేదంటే, అతనికి దేశం మిగిలదనీ.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈలోగా.. రష్యాతో యుద్ధాన్ని ముగించడానికి చర్చలు జరుపుతున్నామని అన్నారు. దీనిని ట్రంప్ మాత్రమే చేయగలడనీ.. బైడెన్ దీని కోసం ఎప్పుడూ ప్రయత్నించలేదనీ.. శాంతిని తీసుకురావడంలో యూరప్ కూడా విఫలమైందనీ మండిపడ్డారు. ఇదంతా జెలన్స్కీ మూర్ఖత్వం వల్లే జరిగిందన్న లెవల్లో ట్రంప్ విరుచుకుపడ్డారు.

జెలెన్స్కీని ‘నియంత’ అని పిలవడం తప్పన్న జర్మనీ

అయితే, ట్రంప్ వ్యాఖ్యలను యురోపియన్ యూనియన్‌లో కీలక దేశమైన జర్మనీ తప్పుబట్టింది. జర్మన్ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ మాట్లాడుతూ.. డొనాల్డ్ ట్రంప్… జెలెన్స్కీని ‘నియంత’ అని పిలవడం తప్పు మాత్రమే కాదు అది ప్రమాదకరమైనది అని అన్నారు. ‘జెలెన్స్కీ ఉక్రెయిన్ దేశ ప్రజలు ఎన్నుకున్న అధిపతి’ అని స్కోల్జ్ పేర్కొన్నారు. అయితే, ఉక్రెయిన్ అధ్యక్షుడిగా జెలెన్స్కీ ఐదేళ్ల పదవీకాలం గతేడాదితో ముగిసింది. కాని, ఉక్రేనియన్ చట్టం ప్రకారం యుద్ధ సమయంలో ఎన్నికలు అవసరం లేదు. అందుకే, జర్మనీ ఛాన్స్‌లర్.. జెలెన్స్కీ ప్రజాస్వామ్య చట్టబద్ధతను తిరస్కరించే ఏ ప్రయత్నం చేయరని అన్నారు.

ఐరోపాలో ఎవరు నియంతృత్వంగా ఉంటున్నారో ట్రంప్‌కు తెలుసు

ఇక, ఆ దేశ విదేశాంగ మంత్రి అన్నాలీనా బేర్‌బాక్ కూడా ట్రంప్ వ్యాఖ్యలను ఖండించారు. వాటిని ‘అసంబద్ధ ప్రేలాపన’గా పేర్కొన్నారు. ‘ట్రంప్ ఒక ట్వీట్‌ను పేల్చడానికి బదులుగా వాస్తవ ప్రపంచాన్ని చూడాలనీ.. ఐరోపాలో ఎవరు నియంతృత్వంగా ఉంటున్నారో ట్రంప్‌కు తెలుసుననీ.. రష్యాలోని ప్రజలు, బెలారస్‌లోని ప్రజలు కూడా దాన్ని అనుభవిస్తున్నారని పరోక్షంగా పుతిన్‌ను ప్రస్తావిస్తూ వ్యాఖ్యానించారు. యూరప్ నడిబొడ్డున ఈ యుద్ధాన్ని పుతిన్ తప్ప ఎవరూ ప్రారంభించలేదనీ.. ఎవరూ కోరుకోలేదని విదేశాంగ మంత్రి బేర్‌బాక్ మండిపడ్డారు. ‘ఉక్రెయిన్‌ను మరింత బలోపేతం చేయడానికి మేము మా శాయశక్తులా కలిసి పని చేస్తామని’ అన్నారు. ఇక, ‘ఏదైనా తప్పుడు శాంతి ఒప్పందం.. రష్యాలో కొత్త సైనిక ప్రచారాలకు విరామం ఇస్తుందని తప్ప దాని బుద్ది మారదు’ అనే లెవల్లో బేర్‌బాక్ మండిపడ్డారు.

యురోపియన్ దేశాలను గందరగోళానికి గురిచేసిన ట్రంప్ తీరు

ట్రంప్ అధ్యక్ష పీఠం ఎక్కిన తర్వాత నుండీ అమెరికా, యూరప్ మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్లు పరిణామాలు మారుతూ వస్తున్నాయి. యురోపియన్ దేశాలపై ట్రంప్ టారిఫ్‌లు వేస్తారనే అంశం నుండీ నాటో కూటమికి చేసే కేటాయింపులు పెంచాలనే డిమాండ్ వరకూ.. తీవ్రమైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు ట్రంప్. దీనికి తోడు.. ఉక్రెయిన్‌లో యుద్ధం ఆపడం కోసం.. రష్యాతో చర్చలకు పిలుపునిచ్చిన ట్రంప్.. అందులో యూరప్‌ను గానీ, యుద్ధంతో తీవ్రంగా నష్టపోయిన ఉక్రెయిన్‌ను గానీ ఆహ్వానించలేదు. సరికదా.. అవసరమైతే పిలుస్తాంలే అన్నట్లు ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. యూరప్‌లో ఈ యుద్ధాన్ని ముగించడం గురించి ట్రంప్ పుతిన్‌తో నేరుగా మాట్లాడినప్పటి నుండి వేగంగా కదిలిన పరిణామాలు.. యురోపియన్ దేశాలనూ గందరగోళానికి గురిచేశాయి.

ఉక్రెయిన్‌లో యూరప్ పాత్రను తక్కువ అంచనా వేయొద్దన్న జర్మనీ

దీనితో, ఏం చేయాలో పాలుపోని యూరోపియన్ యూనియన్ ఫ్రాన్స్ వేదికగా.. కీలక సమావేశాన్ని నిర్వహించాయి. ఇందులో.. ట్రంప్‌తో ఒకసారి మాట్లాడి… ఒక నిర్ణయానికి వద్దామని అంతా భావించారు. ఇంతలోనే.. ట్రంప్ తాజా వ్యాఖ్యలు యూరప్‌ను మరోసారి రెచ్చగొట్టినట్లు అయ్యింది. అయితే, ఉక్రెయిన్‌లో యూరప్ పాత్రను తక్కువ అంచనా వేయొద్దంటూ ఇప్పుడు యూరోపియన్ దేశాలు చెబుతున్నాయి. రష్యాకు అనుకూలంగా ఆటను మారుద్దామని ట్రంప్ ప్రయత్నిస్తున్నారన్నట్లు జర్మనీ నేతలు మాట్లాడుతున్నారు. ట్రంప్ నమ్మకంగా వ్యవహరిస్తే తప్ప అన్నీ చక్కబడతాయని అంటున్నారు.

రష్యా తప్పుడు బుడగలో చిక్కుకున్న ట్రంప్ -జెలెన్స్కీ

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న మాటల దాడులతో… ఇప్పుడు, యూఎస్-ఉక్రెయిన్ మధ్య సరిదిద్దలేని గ్యాప్ వచ్చినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, 2022లో రష్యా ఉక్రెయిన్‌పై చేసిన దండయాత్రకు జెలెన్స్కీ కారణమని ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన వాదనల.. రష్యా తప్పుడు బుడగలో ట్రంప్ చిక్కుకోవడమేనని జెలెన్స్కీ అభిప్రాయపడ్డారు. అంతకుముందు రోజు, ఉక్రెయిన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో జెలెన్స్కీ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ‘దురదృష్టవశాత్తు, రష్యా నుండి వస్తున్న చాలా తప్పుడు సమాచారాన్ని నమ్ముతున్నారు’ అని అన్నారు. ‘ఉక్రెయిన్ ఎంతో గౌరవించే దేశానికి నాయకుడిగా ప్రెసిడెంట్ ట్రంప్ పట్ల గౌరవం ఉందనీ.. అయితే, రష్యా తప్పుడు సమాచారం బుడగలో ఆయన చిక్కుకున్నారనీ జెలెన్స్కీ వెల్లడించారు.

యుఎస్ మద్దతు లేకుండా ఉక్రెయిన్‌కు మనుగడ తక్కువ -జెలెన్స్కీ

అయితే, రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అనుకూలంగా ఉండే శాంతి ఒప్పందం కోసం ప్రెసిడెంట్ ట్రంప్ ప్రయత్నిస్తున్నారేమో అనే భయం ఇప్పుడు ఉక్రెయిన్, యూరప్ దేశాధినేతలను భయపెడుతోంది. ఇక, ట్రంప్ తాజా వ్యాఖ్యలు ఉక్రెయిన్‌కు భవిష్యత్తులో అందనున్న అమెరికా సహాయంపై తీవ్రమైన సందేహాన్ని కలిగిస్తున్నాయి. కీలకమైన సైనిక భాగస్వామి అయిన యుఎస్ మద్దతు లేకుండా ఉక్రెయిన్‌కు మనుగడ అవకాశం తక్కువ ఉందని జెలెన్స్కీ గతంలో పలుమార్లు చెప్పారు. అయితే, తాజా పరిణామాలతో.. జెలెన్స్కీ గద్దె దిగితే తప్ప ఉక్రెయిన్ బాగుపడదన్న లెవల్లో ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య చీలక వచ్చిందనడానికి అద్దం పడుతున్నాయి.

అమెరికాపై ఉన్న తన అభిప్రాయం మారిందన్న పుతిన్

అయితే, ట్రంప్ వ్యాఖ్యల తర్వాత.. రష్యాతో చర్చల్లో ట్రంప్ బృందం మరింత నిజాయితీగా ఉండాలని జెలెన్స్కీ కోరారు. అయితే, అదే రోజు రష్యా అధ్యక్షుడు పుతిన్ మాట్లాడుతూ.. ‘అమెరికా అధ్యక్షుడు, ఉక్రెయిన్ యుద్ధం గురించి ‘ఆబ్జెక్టివ్ సమాచారం’ పొందడం ప్రారంభించారనీ.. అది ఇంత వరకూ అమెరికాపై ఉన్న తన అభిప్రాయాన్ని మార్చడానికి దారితీసిందని’ అన్నారు. రియాద్‌లో జరిగిన రష్యా-యుఎస్ శిఖరాగ్ర సమావేశ ఫలితాలను తాను అధికంగా రేట్ చేశానని పుతిన్ చెప్పారు. ఇక, రష్యా-యుఎస్ ఆర్థిక సమస్యలు, ఇంధన మార్కెట్లు, భూమి, ఇతర అంశాలపై సహకరిస్తున్నాయని పుతిన్ పేర్కొన్నారు. అలాగే, త్వరలో ట్రంప్‌ను కలవడం సంతోషంగా ఉందనీ.. అయితే, దానికి సంబంధించి మర్నిన్ని సన్నాహాలు అవసరమని అన్నారు.

త్వరలో ట్రంప్‌ను కలవడం సంతోషంగా ఉందన్న పుతిన్

నిజానికి, ట్రంప్‌కి ముందు జో బైడెన్ పాలనలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను అరెస్ట్ చేయడానికి అంతర్జాతీయ కోర్టు అనుమతులు కూడా ఇచ్చింది. తీవ్రమైన యుద్ధ నేరాలకు పాల్పడ్డారంటూ పుతిన్‌పై ఆరోపణలు చేశారు. దీనితో, పుతిన్‌కు అత్యతం సన్నిహిత మిత్రులను కలవడం తప్ప మరే దేశానికీ వెళ్లలేదు. ఇన్నాళ్ల తర్వాత ట్రంప్‌తో సమావేశం కోసం వేదికను సిద్ధం చేస్తున్నారు. అందులోనూ, అమెరికా ఎన్నికలకు ముందు రష్యాలో ట్రంప్ వ్యాపారాలు, ఆస్తులపై వాదోపవాదాలు జరిగాయి. అయితే, అక్కడ ట్రంప్ ఎలాంటి బిజినెస్ చేయట్లేదని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ నేపధ్యంలో… ఇప్పుడు ట్రంప్, పుతిన్ మధ్య సానుకూల వాతావరణంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఉక్రెయిన్‌పై రష్యా ఆరోపణలకు దగ్గరగా ట్రంప్ వ్యాఖ్యలు

ఇక, తాజా ట్రంప్ వ్యాఖ్యానాలు కూడా ఉక్రెయిన్‌పై రష్యా ఆరోపణలకు దగ్గరగా ఉండటంతో అమెరికాలోని మాజీ లీడర్లు కూడా దీనిపై స్పందిస్తున్నారు. ట్రంప్ మాజీ వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్.. సోషల్ మీడియా పోస్ట్‌ ట్రంప్ వ్యాఖ్యలను వ్యతిరేకించారు. “మిస్టర్ ప్రెసిడెంట్… ఈ యుద్ధాన్ని ఉక్రెయిన్ ప్రారంభించలేదు అని అన్నారు. రష్యా వందల, వేల మంది ప్రాణాలను తీసిందనీ.. ఎవ్వరూ ప్రేరేపించకుండా.. క్రూరమైన దండయాత్రను ప్రారంభించిందనీ.. అలాంటి చోట, శాంతికి మార్గం సత్యంపై నిర్మించాలని ట్రంప్‌కు సూచించారు.

జెలెన్స్కీతో ఫోన్‌లో మాట్లాడిన బ్రిటన్ ప్రధాని స్టార్మర్

ఇక, ట్రంప్ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న యూరోపియన్ యూనియన్ కీలక మెంబర్ బ్రిటన్ ప్రధాని కైర్ స్టార్మర్.. దీనికి సంబంధించి జెలెన్స్కీతో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా.. ‘ఉక్రెయిన్ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకున్న నాయకుడిగా… జెలెన్స్కీకి తన మద్దతును వ్యక్తం చేశారు. రెండవ ప్రపంచ యుద్ధంలో యూకే చేసినట్లుగా యుద్ధం సమయంలో ఎన్నికలను నిలిపివేయడం కరెక్టేనని చెప్పినట్లు తెలుస్తోంది. దీనితో, ఉక్రెయిన్ చట్టబద్ధతను హేళన చేయడం తప్పు అని జర్మన్ ఛాన్సలర్ చెప్పిన మాటలను బ్రిటన్ ప్రధాని సమర్థించినట్లు అయ్యింది.

ఉక్రెయిన్‌లో జెలెన్స్కీకి 4% ఆమోదమే ఉందన్న ట్రంప్

అయితే, ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలో.. ఉక్రెయిన్‌లో జెలెన్స్కీకి 4% ఓట్ల ఆమోదం మాత్రమే ఉందని ట్రంప్ పేర్కొన్నారు. అందుకే, కొత్త ఎన్నికలకు పిలుపునిచ్చారు. అయితే, దీనిపైన కూడా జెలెన్స్కీ మండిపడ్డారు. మీరు చెబుతున్న 4 శాతమనే తప్పుడు సమాచారం రష్యా నుండి వచ్చిందని మాకు తెలుసు అన్నారు. అయితే, నా సొంతగా చేసిన… లేదంటే నాకు మద్దతిచ్చే ఇతర నాయకులు చేసిన రేటింగ్‌లపై తాను ఎప్పుడూ వ్యాఖ్యానించలేదనీ.. కానీ, తాజా పోల్ ప్రకారం చూస్తే.. ఉక్రేనియన్లలో ఎక్కువమంది తనను విశ్వసించినట్లు తెలుస్తుందని అన్నారు.

జెలెన్స్కీ రేటింగ్స్ ట్రంప్ కంటే 4-5% అధికం

ఇటీవలి నెలల్లో ప్రెసిడెంట్ జెలెన్స్కీకి కాస్త ప్రజాదరణ తగ్గినప్పటికీ.. కైవ్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషియాలజీ నిర్వహించిన ఫిబ్రవరిలో పోల్‌లో.. 57% మంది ఉక్రేనియన్లు జెలెన్స్కీని విశ్వసిస్తున్నట్లు చెప్పారనీ.. ఇది ఒక నెల ముందు.. అంటే, జనవరిలో వచ్చిన 52% పోల్ కంటే ఎక్కువనీ అన్నారు. అలాగే, ఉక్రెయిన్ డిజిటల్ వ్యవహారాల మంత్రి మైఖైలో ఫెడోరోవ్ మాట్లాడుతూ.. ప్రెసిడెంట్ జెలెన్స్కీ రేటింగ్స్… ట్రంప్ కంటే 4-5% అధికంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. కాబట్టీ, యుద్ధం సమయంలో జెలన్స్కీని భర్తీ చేసే ప్రయత్నంలో ఫెయిల్ అవ్వాల్సి ఉంటుందేమో ఆలోచించండి అంటూ ప్రెసిడెంట్ ట్రంప్‌కు చురకలంటించారు.

అమెరికా చేసిన సైనిక, ఆర్థిక సహాయం కోసం…

ఇక, ఉక్రెయిన్‌కు ఇప్పటి వరకూ అందిన మద్దతు చాలావరకు యుఎస్ నుండి వచ్చిందని ట్రంప్ చేసిన వ్యాఖ్యలను కూడా జెలెన్స్కీ తోసిపుచ్చారు. అమెరికా మద్దతుకు తాను ఎప్పుడూ కృతజ్ఞుడిగా ఉంటాననీ.. కానీ, ట్రంప్ టీమ్ అన్ని వాస్తవాలను తెలుసుకోవడం మంచిదని అన్నారు. అమెరికా చేసిన సైనిక, ఆర్థిక సహాయం కోసం తాను ఉక్రెయిన్‌ను విక్రయించలేనని చెప్పారు. ఏవైనా, భద్రతా హామీలు ఉంటే ఒప్పందాలతో పని చేయడానికి ఉక్రెయిన్ సిద్ధంగా ఉంటుందని అన్నారు.

ఉక్రెయిన్‌ ఖనిజాల్లో 50% ఓనర్‌షిప్‌ని అడుగుతున్న యూఎస్

అయితే, అమెరికా కొంత కాలంగా.. ఉక్రెయిన్‌లో దొరికే కీలకమైన ఖనిజాల్లో 50% ఓనర్‌షిప్‌ని అడుగుతోంది. అయితే, ఈ ప్రతిపాదనలో.. ఉక్రెయిన్‌లో యుఎస్ దళాలను మోహరించడం వంటి భద్రతా హామీలు లేవని జెలెన్స్కీ చెబుతున్నారు. అయితే, ఒకవేళ, శాంతి ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత రష్యా కొత్తగా మరో దండయాత్రను ప్రారంభించకుండా రష్యాను అరికట్టే హామీ యూఎస్ నుండి రావాల్సిన అవసరాన్ని జెలెన్స్కీ డిమాండ్ చేస్తున్నారు. దీనిపై, ట్రంప్ రాయబారి ఇప్పటికే ఉక్రెయిన్ అధ్యక్షుడితో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

జెలెన్స్కీని విమర్శించినందుకు ట్రంప్‌ను ప్రశంసించిన రష్యా

అయితే, ఈ గ్యాప్‌లోనే… మరో పరిణామం చోటు చేసుకుంది. సౌదీ అరేబియాలో రష్యా ప్రతినిధి బృందంలో భాగమైన రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్.. జెలెన్స్కీని విమర్శించినందుకు ట్రంప్‌ను ప్రశంసించారు. ఉక్రెయిన్ నాటోలో చేరాలనే ఆశయాలకు గత అమెరికా ప్రభుత్వం మద్దతు పలకడమే.. ఈ యుద్ధానికి కారణమని ట్రంప్ చేసిన వాదనను స్వాగతించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడిగా జెలెన్స్కీ చట్టబద్ధతను ప్రశ్నించిన ట్రంప్ తాజా వ్యాఖ్యలపై రష్యా అధికారులు హర్షం వ్యక్తం చేశారు.

ఇక, ఈ పరిణామాలన్నీ చూస్తుంటే.. ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ముగించాడానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నారా.. లేదంటే, ఉక్రెయిన్-రష్యా యుద్ధం మరింత పెరిగి.. రష్యాతో యురోపియన్ కూటమి యుద్ధం చేసే దిశగా ఉసిగొల్పుతున్నారా అనేది అర్థం కావట్లేదు. ఇక, ట్రంప్ ప్లాన్‌ పట్ల ఎవరెవరు ఏమేమీ అనుకుంటున్నారో తెలుసుకోడానికి ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపధ్యంలో… ట్రంప్ పెట్టిన మంట ఎక్కడి దాకా వ్యాపిస్తుందో అనే ఆందోళన అందరిలోనూ ఉంది.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×