BigTV English

Donkey Route to USA: వీసా లేకుండా అమెరికా వెళ్లాలంటే అడ్డదారి ఇదే.. ఎంత భయంకరమంటే..

Donkey Route to USA: వీసా లేకుండా అమెరికా వెళ్లాలంటే అడ్డదారి ఇదే.. ఎంత భయంకరమంటే..

Donkey Route to USA: అమెరికాలోకి అక్రమ ప్రయాణ కథలు ఒకొక్కటిగా బయటపడుతున్నాయి. తీవ్ర ప్రమాదకర పరిస్థితులను దాటుకుంటూ వెళ్ళిన భారతీయులు ఇప్పుడు ఆ కష్టాల కలలను తలుచుకుంటున్నారు. అమెరికన్ డేంజర్ డ్రీమ్స్ ఎలా ఉంటాయో చెబుతున్నారు. వీటిలో అత్యంత ప్రమాదకరమైన “డెరీన్ గ్యాప్” ప్రయాణం ఎంత భయంకరంగా ఉంటుందో గుర్తుచేసుకుంటున్నారు. అక్రమంగా అమెరికాలోకి ప్రవేశిస్తూ.. ‘డాంకీ రూట్ల’లో వారు అనుభవించిన నరకాన్ని నెమరేసుకుంటున్నారు. ఇంతకీ, భారతదేశానికి తిరిగి వచ్చిన వారి టెస్టిమోనీస్ చెబుతున్నదేంటీ?


అమెరికాలోకి అక్రమ ప్రయాణంలో..

అగ్రరాజ్యంలో జీవితం అంటే అదృష్టం ఉన్నవారికే దక్కే అవకాశం. దీని కోసం, ప్రాణాలకు తెగించడానికి కూడా వెనకాడరు కొంతమంది. డాలర్లు సంపాదించి, పరువు, పరపతి.. ఆస్తి పాస్తులను కూడ బెట్టుకోడానికి అగ్రరాజ్యమే ది లాస్ట్ డెస్టినేషన్‌ అనుకుంటారు. ఇలా, తమ బతుకులను మార్చే డ్రీమ్స్ కోసం ఎంత ప్రమాదకర మార్గాన్నైనా ఎంచుకుంటారు. పుట్టిన గడ్డపై ఆస్తులు అమ్ముకునో.. అప్పులు చేసో.. ఎలాగైనా అమెరికాకి చేరుకోవాలనుకుంటారు.


రోడ్డులేని అడవి మార్గం ‘డేరియన్ గ్యాప్’

కొందరు.. చట్టప్రకారం నిబంధనలు అనుసరించి అమెరికా చేరుకుంటే.. ఈ మోజులో.. మరికొందరు మాత్రం డాంకీ రూట్ పట్టుకొని అక్రమమార్గాల్లో ముందుకెళ్తున్నారు. అయితే, ఈ మార్గాల్లో అమెరికా చేరుకుంటే ఎలా ఉంటుందో తాజాగా అమెరికా నుండి భారత్ చేరుకున్న బాధితులు చెబుతున్నారు. అమెరికాలోకి అక్రమ ప్రయాణంలో తరచుగా అనేక దేశాల గుండా ప్రమాదకరమైన క్రాసింగ్‌లు ఉంటాయి, వాటిలో కొలంబియా, పనామాలను కలిపే విశాలమైన, రోడ్డులేని అడవి మార్గం ‘డేరియన్ గ్యాప్’ కూడా ఉంటుంది.

పనామా, మెక్సికోలోని ప్రమాదకర భూభాగాలను దాటడానికి లక్షల ఖర్చు

ఈ డాంకీ రూట్ ద్వారా అమెరికాలోకి ప్రవేశించే ప్రయత్నంలో పనామా, మెక్సికోలోని ప్రమాదకరమైన భూభాగాలను దాటడానికి లక్షలు చెల్లించాల్సి వస్తుంది. దక్షిణ సరిహద్దు నుండి యూఎస్‌లోకి రెండు ప్రధాన అక్రమ ప్రవేశ మార్గాలు ఉన్నాయి. వాటిలో ఒకటి నేరుగా మెక్సికో ద్వారా ఉండగా.. మరొకటి అత్యంత ప్రమాదకరమైన డాంకీ రూట్ డెరీన్ గ్యాప్. ఇందులో అనేక దేశాలను దాటడం, దట్టమైన అడవులు, ఎత్తైన కొండలు సముద్రాలతో సహా ప్రమాదకరమైన భూభాగాలను దాటుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది.

నికరాగ్వా, మెక్సికోల నుండి కొనసాగే ప్రయాణం

ఈ మార్గంలో వలసదారులు అమెరికా చేరుకోవడానికి ముందు విమానాలు, టాక్సీలు, కంటైనర్ ట్రక్కులు, బస్సులు, పడవల ద్వారా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇందులో ఖతార్, బ్రెజిల్, పెరూ, కొలంబియా, పనామా, నికరాగ్వా, మెక్సికోల నుండీ కొనసాగుతుంది. ఇది ఎంత ప్రమాదకరమైనది అంటే.. మధ్యలో ఎప్పుడైనా ప్రాణాలు పోవచ్చు. ఇలా ఇప్పటికే వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, వారి శవాలు కూడా దొరకని విధంగా ఈ మార్గం డెడ్లీ రూట్‌‌గా పేరుపొందింది.

డాలర్ డ్రీమ్స్ కోసం రూ.42 లక్షలు వెచ్చించిన బాధితుడు

రీసెంట్‌గా భారత్ చేరుకున్న అక్రమ వలసదారుల్లో ఒకరు తన అనుభవాన్ని చెబుతూ.. పనామా జంగిల్‌లో ఒకరు చనిపోవడం, సముద్రంలో మునిగిపోవడం తాను చూశానని చెప్పారు. తన ట్రావెల్ ఏజెంట్ తనను మొదట యూరప్‌కు తీసుకెళ్తానని, ఆపై మెక్సికోకు తీసుకువెళతానని హామీ ఇవ్వగా.. తన డాలర్ డ్రీమ్స్ కోసం రూ.42 లక్షలు వెచ్చించినట్లు చెప్పారు. ఇక ఈ మార్గంలో అన్నం దొరకడం మహా పండుగలా ఉండేదంట. ఎప్పుడో ఒకసారి అన్నం దొరికేది.. ఒక్కోసారి తినడానికి ఏమీ దొరకదు. తెచ్చుకున్న బిస్కెట్ల వంటి తేలికపాటి ఆహారాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి.

వెనక్కి వెళ్లే ఛాన్సే లేదు.. ప్రాణం పోయినా ముందుకే వెళ్లాలి

15 గంటల సుదీర్ఘ పడవ ప్రయాణం, అత్యంత భయంకరమైన అడవిలో 40-45 కిలోమీటర్లు నడక ప్రయాణం నరకాన్ని చూపిస్తుందని వీళ్లు చెబుతున్నారు. ఇంకో వ్యక్తి చెప్పిన అనుభవంలో.. భయంకరమైన అనుభవాలు బయటకొచ్చాయి. ఈ వ్యక్తిని మొదట ఇటలీకి, ఆపై లాటిన్ అమెరికాకు తీసుకెళ్లారు. దారిలో ఆ వ్యక్తికి సంబంధించిన రూ.35 వేల రూపాయల విలువైన బట్టలు దొంగతనానికి గురయ్యాయి. అయినా, వెనక్కి వెళ్లే ఛాన్సే ఉండదు. ప్రాణం పోయినా ముందుకే వెళ్లాలి.

పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాకు చెందిన 36 ఏళ్ల జస్పాల్ సింగ్

ఇక, పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాకు చెందిన 36 ఏళ్ల జస్పాల్ సింగ్, జనవరి 24న తనను అమెరికా సరిహద్దు గస్తీ బృందం బంధించిందని చెప్పారు. “మాకు సంకెళ్లు వేసి, ప్రయాణం అంతా మా కాళ్ళను బంధించారని” అన్నారు. సంకెళ్లను అమృత్‌సర్ విమానాశ్రయంలో తెరిచినట్లు వెల్లడించారు. ఈ వ్యక్తి బ్రెజిల్‌లో ఆరు నెలలు గడిపిన తర్వాత, సరిహద్దు దాటి అమెరికాలోకి వెళ్లారు. అక్కడ అతన్ని అమెరికా సరిహద్దు గస్తీ బృందం అరెస్టు చేసింది.

డెరీన్ గ్యాప్ మధ్యలో 18 కొండలు దాటిన జస్పాల్

పనామా అడవిలో ఒకరు చనిపోవడాన్ని, మరొకరు సముద్రంలో మునిగిపోవడాన్ని గుర్తు చేసుకున్న ఇతడు.. మెక్సికో చేరుకునే ముందు తన ట్రావెల్ ఏజెంట్ యూరప్ గుండా తీసుకెళ్తానని అన్నట్లు తెలిపాడు. ఇక, ఈ మార్గంలో డెరీన్ గ్యాప్ మధ్యలో 18 కొండలు దాటాల్సి వచ్చింది. ఇక్కడ ఎవరైనా జారిపడితే, బతికే అవకాశం ఉండదు. ఇక, ప్రయాణంలో ఎవరైనా గాయపడితే, వారని వదిలి వెళ్లిపోవాల్సిందే. అలాంటి వారిని చావుకు వదిలేసి మిగిలిన వాళ్లు ముందుకు కదులుతారంతే!

డేరియన్ గ్యాప్ అనేది దట్టమైన రెయిన్ ఫారెస్ట్..

ఈ డేరియన్ గ్యాప్ అనేది దట్టమైన రెయిన్ ఫారెస్ట్, చిత్తడి నేలలు, కొండలతో కూడిన 97 కిలో మీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. అలాస్కా నుండి అర్జెంటీనా వరకు విస్తరించి ఉన్న ఒక ప్రయాణ వ్యవస్థలో ఇది పాన్-అమెరికన్ హైవేని బ్రేక్ చేసే ప్రదేశం. చాలా ప్రమాదకరంగా ఉండే ఈ ప్రాంతం దాని తీవ్రమైన భూభాగానికి, కఠినమైన వాతావరణానికి నిదర్శనం. ఇక్కడ మౌలిక సదుపాయాల లేకపోవడం వల్ల చాలా కాలంగా ఈ ప్రాంతాన్ని ఎవ్వరూ వాడట్లేదు. కానీ అమెరికాకు చేరుకోవాలనుకునే అక్రమ వలసదారులకు, ఇది ఒక అనివార్యమైన ద్వారంగా మారింది.

చిత్తడి నేలలు, కొండలతో కూడిన 97 కిలో మీటర్ల విస్తీర్ణం

ఈ డేరియన్ గ్యాప్‌ను దాటేవారు నిటారుగా ఉన్న పర్వతాలు, బురదతో కూడిన చిత్తడి నేలలు, వేగంగా ప్రవహించే నదులు, ప్రమాదకరమైన వన్యప్రాణులను దాటుకుంటూ వెళ్లాలి. ఈ అడవి విషపూరిత పాములు, జాగ్వార్‌లు, ప్రాణాంతక కీటకాలకు నిలయం. అయితే, అంతకంటే ప్రమాదకరమైన ముప్పు ఈ మార్గాన్ని నియంత్రించే క్రిమినల్ ఆర్గనైజేషన్స్ ఉంటుంది. స్మగ్లింగ్ నెట్‌వర్క్‌లు, మాదకద్రవ్యాల కార్టెల్‌లు, సాయుధ సమూహాలు ఈ మార్గంలో ప్రయాణించే వారిని దోచేస్తారు. వారిపై హింసకు దిగుతారు.

పనామా, కోస్టారికా, ఎల్ సాల్వడార్, గ్వాటెమాల

అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నించే చాలా మంది భారతీయులు ‘డాంకీ మార్గం’ అని పిలిచే డేరియన్ గ్యాప్ మార్గంగుండానే వెళతారు. ఇందులో పనామా, కోస్టారికా, ఎల్ సాల్వడార్, గ్వాటెమాల వంటి మధ్య అమెరికా దేశాలకు ప్రయాణిస్తారు. ఇక్కడ వీసాలు సులభంగా లభిస్తాయి. అక్కడి నుండి, వాళ్లు మెక్సికోకు వెళ్లి, ఆపై అమెరికాలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తారు. అయితే ఇంతటి ప్రమాదకరమైన క్రాసింగ్ కోసం వేల డాలర్లు వసూలు చేసే కొయోట్‌లు.. అంటే మానవ స్మగ్లర్లు సహాయం చేస్తారు.

స్మగ్లర్లు, మాఫియా ముఠాలు, వ్యవస్థీకృత నేర సిండికేట్‌లు..

కఠినమైన వీసా నిబంధనల కారణంగా అమెరికాకు డైరెక్ట్ విమాన మార్గాలు కష్టతరం కావడంతో ఈ పద్ధతి బాగా పాపులర్ అయ్యింది. స్మగ్లర్లు, మాఫియా ముఠాలు, వ్యవస్థీకృత నేర సిండికేట్‌లు ఈ వలసదారులను సద్వినియోగం చేసుకుంటున్నాయి. ముందు వారికి సురక్షితమైన మార్గం నుండే తీసుకెళ్తామని హామీ ఇచ్చినా.. చివరికి, ప్రాణాంతక పరిస్థితుల్లోకే నెడతారు.

2023లో, 5.2 లక్షలకు పైగా వలసదారులు ఈ ప్రయాణం

ఇటీవలి సంవత్సరాల్లో, డేరియన్ గ్యాప్‌ను దాటే వారి సంఖ్య విపరీతంగా పెరిగినట్లు లెక్కలు కూడా చెబుతున్నాయి. 2023లో, 5.2 లక్షలకు పైగా వలసదారులు ఈ ప్రయాణాన్ని చేశారు. దానికి ముందు సంవత్సరం కంటే ఇది రెండింతలు ఎక్కువ. ఇక, 2024 నాటికి, 3 లక్షలకు పైగా ఈ మార్గాన్ని దాటారు. అయితే, ఇటీవల పెరిగిన అరెస్టుల కారణంగా సంఖ్యలు కొద్దిగా తగ్గాయని మీడియా నివేదికలు చెబుతున్నాయి. అయితే, దశాబ్దం క్రితం, ఏటా కొన్ని వేల మంది మాత్రమే ఈ మార్గాన్ని దాటడానికి ప్రయత్నించారు.

ఈ ప్రయాణం 7 నుండి 15 రోజుల వరకు పట్టొచ్చు

అదే ఇప్పుడైతే.. లక్షలు దాటుతోంది. అత్యంత ప్రమాదకర వలస రహదారిగా మారినప్పటికీ డాలర్ డ్రీమ్స్ ఈ డేంజర్‌ను కూడా లెక్కచేయకుండా కదులుతోంది. వెనిజులా, హైతీ, ఈక్వెడార్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, భారతదేశం నుండి ప్రజలు ఈ ప్రమాదకరమైన మార్గం గుండా ట్రెక్కింగ్ చేస్తున్నారు. ఈ ప్రయాణం 7 నుండి 15 రోజుల వరకు పట్టొచ్చు. ఇలా ప్రయాణించే వలసదారులు ఆహారం, నీటి కొరత, వ్యాధుల బారిన పడటమే కాకుండా నేరాలకు బలౌతున్నారు.

2015-2022 నుండి 312 వలస మరణాలు, అదృశ్యాలు నమోదు

ఇక, డేరియన్ గ్యాప్ ఒక మానవతా విపత్తుగా మిగిలిపోయిందనేది నిపుణుల అభిప్రాయం. 2015-2022 నుండి 312 వలస మరణాలు, అదృశ్యాలు నమోదవగా.. 2021-2023 మధ్య 229 నమోదైనట్లు తెలుస్తోంది. 2023లోనే, 676 మంది లైంగిక వేధింపుల బాధితులుగా మారారు. దీనికి సంబంధించి, 2024 ప్రారంభంలో 233 కేసులు నమోదయ్యాయి రద్దీగా ఉండే ఆశ్రయాల్లో ఆహారం, నీరు, వైద్య సహాయం వంటి అవసరమైన వస్తువులు లేకపోవడం వల్ల చాలా మంది వలసదారులు చిక్కుకుపోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇక, ఈ మార్గాన్ని ఉపయోగించే వలసదారుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో, స్థానిక సమాజాలు, పర్యావరణంపై కూడా దీని ప్రభావం ఉంటుందని పర్యావరణ సంఘాలు వాపోతున్నాయి.

2023 మొదటి 10 నెలల్లోనే వలసదారుల క్రాసింగ్‌ల నుండి..

ఈ మార్గంలో ఉన్న స్థానిక గ్రామాలు ప్రజలతో నిండిపోయాయి. అయితే, పెళుసైన అటవి పర్యావరణ వ్యవస్థలో అటవీ నిర్మూలనతో పాటు కాలుష్యం కూడా తీవ్రమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం, ఈ ప్రాంతం మానవ అక్రమ రవాణా, కార్టెల్ కార్యకలాపాలకు కూడా ప్రధాన కేంద్రంగా ఉంది. అత్యంత శక్తివంతమైన మాదకద్రవ్యాల కార్టెల్‌లలో ఒకటైన కొలంబియా గల్ఫ్ క్లాన్, అక్రమ రవాణా కార్యకలాపాలను నియంత్రిస్తుంది. వీళ్లు, 2023 మొదటి 10 నెలల్లోనే వలసదారుల క్రాసింగ్‌ల నుండి $57 మిలియన్ డాలర్లు సంపాదించినట్లు సమాచారం. ఇప్పుడు, ప్రెసిడెంట్ ట్రంప్ అమెరికా నుండి పలు దేశాలకు చెందిన వారితో పాటు భారత అక్రమ వలసదారులను కూడా వెనక్కి పంపించేస్తున్న తరుణంలో ఇకపై ఈ మార్గానికి రద్దీ తగ్గే అవకాశం ఉంది.

మొదటి విడతగా భారతదేశానికి చెందిన 104 మంది రిటర్న్

ఇక, ఇప్పటికే అమెరికా నుంచి మొదటి విడతగా భారతదేశానికి చెందిన 104 మంది అక్రమ వలసదారులు స్వదేశానికి చేరుకున్నారు. ఫిబ్రవరి 4 తెల్లవారుజామున టెక్సాస్‌లోని శాన్ ఆంటానియో నుంచి బయలుదేరిన అమెరికా సైనిక విమానం సీ 17.. పంజాబ్‌ అమృత్‌సర్‌‌లోని శ్రీగురు రామదాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫిబ్రవరి 5 మధ్యాహ్నం 2 గంటలకు కట్టుదిట్టమైన భద్రత మధ్య దిగింది. ఈ విమానంలో వచ్చినవారిలో గుజరాత్, హర్యానాకు చెందినవారే అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. గుజరాత్, హర్యానాలకు చెందిన వారు 33 మంది చొప్పున ఉండగా.. పంజాబ్‌ రాష్ట్రానికి చెందిన 30 మంది, ముగ్గురు మహారాష్ట్ర, ఇద్దరేసి ఛండీగఢ్, ఉత్తర్ ప్రదేశ్‌లకు చెందినవారు ఉన్నట్లు సమాచారం.

మొత్తం 104 మందిలో 25 మహిళలు, 12 మంది చిన్నారులు

ఇక, ఈ మొత్తం 104 మందిలో 25 మహిళలు, 12 మంది చిన్నారులు ఉండగా.. వీరిలో ఒకరి వయసు నాలుగేళ్లుగా తెలుస్తోంది. అలాగే, వీరిలో 48 మంది 25 ఏళ్లలోపువారే కావడం విశేషం. ఇక, ఈ 104 మందిలో కొందరు అక్రమంగా అమెరికాలో ప్రవేశించిన వారు, మరికొందరు గడువు ముగిసినా అక్కడే ఉన్నవాళ్లు ఉన్నారు. ఇక, అక్రమ వలసదారులను వెనక్కి పంపడాన్ని భారత్ ఇప్పటికే స్వాగతించింది. తాము ట్రంప్ చర్యలకు మద్దతు ఇస్తున్నామని, అక్రమ వలసలు దేశ భద్రతకు ప్రమాదకరమని స్పష్టం చేసింది.

అమెరికాకి వాళ్లు అక్రమంగా ఎలా తరలి వెళ్లారు? ఏజెంట్లు ఎవరు?

అమెరికా నుంచి భారత్‌కు తిరిగొచ్చిన అక్రమ వలసదారులపై కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ దీన్ని వెల్లడించారు. అమెరికాకి వాళ్లు అక్రమంగా ఎలా తరలి వెళ్లారు? ఏజెంట్లు ఎవరు? అనే విషయాలపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని అన్నారు. విదేశాల్లో తమ పౌరులు చట్టవిరుద్ధంగా నివసిస్తోన్నట్లు తేలితే- వారిని స్వదేశానికి రప్పించుకోవాల్సిన బాధ్యత ఆయా దేశాలపైనే ఉంటుందని కూడా జైశంకర్ అన్నారు. స్వదేశానికి వచ్చిన అక్రమ వలసదారులు అమెరికాకు ఎలా వెళ్లగలిగారనే విషయంపై ఆరా తీయడానికి అమెరికాతో కలిసి పనిచేస్తున్నామని, అక్కడి నుంచి సమగ్ర వివరాలను తెప్పించుకుంటున్నామని చెప్పారు.

వీరిలో 17,094 మందిని వెనక్కి పంపుతున్నట్టు వెల్లడి

చట్టబద్ధంగా ఏ దేశానికైనా వెళ్లే హక్కు అందరికీ ఉందనీ, అక్రమంగా వలస వెళ్లాలనుకోవడం సరికాదని వ్యాఖ్యానించారు. ఎలాంటి డాక్యుమెంట్లు, అధికారిక పత్రాలు, వీసాలు.. లేకుండా అసలు వాళ్లు అమెరికాకు ఎలా వెళ్లారనే విషయంపై ఆరా తీయాలంటూ ఆదేశాలను జారీ చేసినట్లు జైశంకర్ తెలిపారు. ఇక, అమెరికాలో మొత్తం భారతీయ అక్రమ వలసదారులు 7.25 లక్షల మంది ఉంటారని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకూ 18 వేల మందిని గుర్తించిన అమెరికా యంత్రాంగం.. వీరిలో 17,094 మందిని వెనక్కి పంపుతున్నట్టు తెలిపింది. ఇందులో 104 మంది మాత్రమే ఇప్పుడు వచ్చారు. ఇక మిగిలిన వారి అనుభవాలు ఇంకెంత దారుణంగా ఉంటాయో మరి!

 

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×