Putta Mahesh Drug Case: ఏలూరు పార్లమెంట్ పరిధిలో తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు పెను సవాల్ ఎదురవుతోంది. ఆ పార్టీ ఎంపీ పుట్టా మహేష్ చుట్టూ ముసురుకున్న డ్రగ్స్ వివాదం గోదావరి జిల్లా రాజకీయాల్లో పెను తుఫానును సృష్టిస్తోంది. ప్రత్యర్థుల విమర్శల కంటే, సొంత పార్టీ క్యాడర్ వ్యక్తం చేస్తున్న ఆవేదన ఇప్పుడు పార్టీ అధిష్టానాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోందంట. ఈ ‘డ్రగ్స్ మరక’ ఏలూరు టీడీపీని ఏ తీరానికి చేరుస్తుంది? తెలుగు తమ్ముళ్ల అంతర్మధనాన్ని టీడీపీ అధిష్టానం పరిగణలోకి తీసుకుంటుందా? ఒక్కసారిగా డిఫెన్స్‌లో పడిపోయిన తెలుగు తమ్ముళ్లు ఏం అంటున్నారు?
ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఏ నలుగురు కలిసినా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గురించే ప్రధానంగా చర్చ నడుస్తోంది. ఏలూరు జిల్లాతో ఏ విధంగా సంబంధంలేని పుట్ట మహేష్‌ను టీడీపీ అభ్యర్ధిగా ప్రకటించడంతో ఎన్నికల సమయంలోనే అందరూ అశ్చర్యం వ్యక్తం చేశారు. ఆర్థికంగా బలవంతుడు అనే కారణంతో టిడిపి అధిష్టానం రాయలసీమకు చెందిన అతన్ని ఎంపీ టికెట్ ఇచ్చి ఏలూరు బరిలోకి దింపింది. గతంలో ఏలూరు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన మాగంటి బాబును కాదని పుట్ట మహేష్ ను పోటీకి దింపేటప్పుడు చాలామంది నేతలు అధిష్టాన నిర్ణయాన్ని వ్యతిరేకించారు. అవేమి పట్టించుకోని టిడిపి అధిష్టానం పుట్ట మహేష్ కుటుంబ నేపథ్యం, సామాజికవర్గ కోణంతో పాటు సౌండ్ పార్టీ అవ్వడంతో అతన్ని పోటీకి దింపింది. ఎన్నికల సమయంలో తనకు ఎదురైన వ్యతిరేకతను ముందుగానే గ్రహించిన పుట్ట మహేష్‌తో పాటు ఆయన వర్గీయులు ప్రచారంలో స్థానిక నేతలకు ప్రాధాన్యత ఇస్తూ , అందర్నీ కలుపుకుని వెళ్లారు.. ఎన్నికల ప్రచారాన్ని సైతం సాఫ్ట్ వేర్ కంపెనీ వ్యవహారంలో చాలా స్మూత్ గా డీల్ చేసి, ప్రతి విషయాన్ని ముందుగానే అవగాహన చేసుకుంటూ దాని వల్ల వచ్చే పరిణామాలను అంచనాలు వేస్తూ పుట్టా మహేష్ ముందుకుసాగారు. 2024 ఎన్నికల్లో రాష్ట్రం అంతా కూటమి గాలివీయడంతో ఏలూరు పార్లమెంట్ సెగ్మెంట్లో ఆయన లక్షకు పైగా మెజార్టీతో విజయం సాధించారు.
ఇంత వరకూ బాగానే ఉన్నా… హైదరాబాదులోని మొయినాబాద్ ఫామ్ హౌస్ లో జరిగిన డ్రగ్స్ పార్టీలో ఎంపీ పుట్ట మహేష్ పోలీసులకు దొరకపోయారని వార్త దావణంలా వ్యాపించడంతో, టీడీపీ కార్యకర్తలతో పాటు అందరూ షాక్ తిన్నారు. తమ పార్టీ ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ తీసుకుని ఉండరని కేవలం పార్టీకి హాజరై ఉంటారని అందరూ భావించారు.. అప్పటికే ఎంపీ పుట్టా మహేష్ ఇష్యూని ఒక ప్రచారాస్త్రంగా తీసుకున్న వైసిపి సోషల్ మీడియాలో ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్న ఫొటోలతో ఎండగట్టడం మొదలుపెట్టింది. పార్టీకి హాజరైతేనే తప్పా? అంటూ ఆయన అనుచరులు ఎదురుదాడికి ప్రయత్నిస్తున్నప్పుడే.. తెలంగాణ ఈగల్ టీమ్ ఎస్పీతోపాటు మొయినాబాద్ డీసీపీ సైతం పుట్టా మహేష్‌కు డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందని మీడియాకు వెల్లడించడంతో పరిస్థితి చేజారిపోయిందని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు. అప్పటివరకు పుట్ట మహేష్ కార్యాలయం చుట్టూ లాబీయింగ్ కోసం ఇతర పనుల కోసం గేట్లు పట్టుకు వేలాడిన నేతలు సైతం ఇప్పుడు కనీసం అటువైపు కన్నెత్తి చూడటం లేదట.
ఎంపీ పుట్టా మహేష్‌తొ ఎన్నో పనులు చేయించుకుని ఆర్థికంగా లాభపడిన వారు సైతం ఆయన కార్యాలయం వైపు అడుగులు వేయటం లేదట. సామాన్య ప్రజలు సైతం.. ఎంపీకి డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందంట.. అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ.. వెటకారం ఆడుతుండటం తెలుగు తమ్ముళ్లను మరింత ఆవేదనకు గురిచేస్తోందంట. టీడీపీ ఎంపీ డ్రగ్స్‌లో పట్టుబడడంతో వైసీపీకి గట్టి అస్త్రంగా మారింది. వైసీపీ నేతల నుంచి వస్తున్న ఆరోపణలను, డిమాండ్‌లను ఎలా తిప్పుకొట్టాలో ఆర్ధంకాని స్థితిలో ఏలూరు టీడీపీ నేతలు కనిపిస్తున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో ఇదే పుట్టా మహేష్‌ను పక్కన ఉంచుకుని … గంజాయి, డ్రగ్స్‌ని నిర్మూలిస్తానంటూ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు చేసిన ప్రసంగాల వీడియోల్ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు వైసీపీ కార్యకర్తలు.
ఇదే సమయంలో టీడీపీ సీనియర్ లీడర్, ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబుకు మద్దతు పెరుగుతోంది. గతంలో రెండు సార్లు ఎంపీగా పనిచేసిన మాగంటికి మాట మాత్రమైనా చెప్పకుండా గత ఎన్నికల్లో పుట్టా మహేష్‌కు అవకాశం కల్పించడం ఎంతవరకు కరెక్ట్ అని సొంత పార్టీ నేతలే ఇప్పుడు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. నాడు సీనియర్లను కాదని.. పార్టీ అవసరాల పేరుతో ముందు వెనుక చూసుకోకుండా … తీసుకున్న నిర్ణయాలకు ఇప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారని ఏలూరు తమ్ముళ్లు మదనపడుతున్నారట. సీఎం చంద్రబాబు డ్రగ్స్ వద్దు బ్రో అని రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తుంటే, తమ సొంత పార్టీ నేత పార్టీ పరువు పోయేలా ప్రవర్తించడంతో, జనం ముందు తలెత్తుకోలేక పోతున్నామని వాపోతున్నాయి టీడీపీ శ్రేణులు.. గోదావరి జిల్లాలో కోడి పందాలు, పేకాటలు కామన్ అయినా ఒక ప్రజా ప్రతినిధి డ్రగ్స్ కేసులో ఇరుక్కోవటం మొదటిసారి కావటం, అది అతను తమ పార్టీకి చెందిన వాడు కావడంతో పసుపు సైన్యం తలలు పట్టుకోవాల్సి వస్తోందంట.
సోషల్ మీడియాలో అక్కడక్కడా పుట్టా మహేష్ కు మద్దతుగా పోస్ట్లు కనబడుతున్నా, బహిరంగంగా మద్దతు పలకడానికి తెలుగు తమ్ముళ్లకి ముందువెనుకా ఆలోచించాల్సి వస్తోందంట. ఏలూరులో పుట్టా మహేష్ కు మద్దతుగా గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా, వాటిపై పేరు ఊరు లేకపోవడం మరింత అవమానాన్ని మిగిల్చినట్లుగా తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు ఫీలవుతున్నారట. పోలీస్ కస్టడీ నుండి విడుదల అయ్యాక పుట్టా మహేశ్ ఒక వీడియో రిలీజ్ చేశారు. తాను ఏ తప్పు చేయలేదని ప్రమాణం చేసినంత పని చేశారు. ఎవరో రిక్వెస్ట్ చేస్తే ఫాం హౌస్‌కి వెళ్లానని చెప్పుకొచ్చారు. ఏలూరు ఎంపీ రిలీజ్ చేసిన వీడియోపై ప్రత్యర్ధులతో పాటు నెటిజన్లు మండి పడుతున్నారు. ఆ కామెంట్లు చూస్తూ ఏలూరు పార్లమెంటు నియోజకవర్గంలో ఆయన పై అభిమానం ఒక్కరోజులో అంత వ్యతిరేకతగా ఎలా మారిపోయిందో అర్థం కావడం లేదంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పుట్టా మమేష్ ఏలూరు నియోజకవర్గంలో పర్యటిస్తే.. అధికారులు, తెలుగు తమ్ముళ్లు కోపరేట్ చేస్తారా లేదా అనేది అంతుపట్టకుండా తయారైంది.
Story By Apparao, Big Tv