ఎప్పుడొచ్చాడు అని కాదు.. బుల్లెట్ దిగిందా లేదా? అనేది పాపులర్ సినీ డైలాగ్. కానీ దీన్ని కేసీఆర్ కొద్దిగా మార్చాడు. తనకు అనుకూలంగా మలుచుకున్నాడు. అదును చూసి బుల్లెట్ దింపే ప్రయత్నం చేశాడు. నేటి సందర్భాన్ని కరెక్టుగా వినియోగించుకున్నాడు. ఎవడు కొడితే దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో.. అనే డైలాగును కరెక్టుగా ఫాలో అయ్యాడు. గాంధీ జయంతి రోజును చూసుకుని శాంతి వచనాలు పలుకుతూనే ప్రజాస్వామిక పోరాటాలను గుర్తు చేస్తూనే .. సీఎం రేవంత్‌రెడ్డికి తన మాటల తూటాలు ఎక్కుపెట్టాడు. గాంధీని జాతిపితగా పిలిచినట్టే.. కేసీఆర్‌నూ తెలంగాణ జాతిపితగా పిలవాలనే బలమైన ఆకాంక్ష ఉన్నవాడు కాబట్టి… ఆ జాతిపిత జయంతి రోజున.. తన పోరాట నేపథ్యాన్ని జోడించి.. ప్రస్తుత రేవంత్ పరిపాలనను దునుమాడుతూ.. హితోక్తులను వదిలారు.
‘ సహనంతో కూడిన ప్రజాస్వామిక పోరాటాల ద్వారా సామాజిక మార్పు సాధించడమే గాంధీజీ ఆశయం – విద్వేషపూరిత పాలనా పద్దతులను విడనాడి శాంతి సౌభ్రాతృత్వాలను నెలకొల్పడమే గాంధీజీకి మనమందించే ఘన నివాళి’ అంటూ తెలంగాణ ఉద్యమ నేపథ్యం.. స్వరాష్ట్రం సాధించిన వైనాన్ని వివరిస్తూనే నేటి పరిపాలన విద్వేషపూరితంగా ఉందనే విషయాన్ని చెప్పడం ఈ మాటల వెనుక ఉన్న కేసీఆర్ భావనగా చూడాలి.
‘మహాత్మాగాంధీ అనుసరించిన ప్రజాస్వామిక శాంతియుత పోరాట కార్యాచరణ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తనకు స్పూర్తిగా నిలిచింది.. ప్రజాస్వామిక హక్కుల సాధనకోసం గాంధీజీ అనుసరించిన సత్యాగ్రహ పంథా నేటి యువతరానికీ ఆచరణీయం’ అని అన్నారు కేసీఆర్. ఇక్కడా తెలంగాణను తాను సాధించిన తీరును పరోక్షంగా గుర్తు చేస్తూనే, గాంధీని స్పూర్తిగా తీసకుని, జాతి కోసం పోరాడి లక్ష్యాన్ని సాధించిన జాతిపితతో తనను తాను పోల్చుకునే ప్రయత్నం చేశాడాయన. యువతకు స్పూర్తి అంటూనే .. ఇప్పటి యువత నాటి గాంధీ పోరాటాన్నే కాదు.. తెలంగాణ సాధించిన తీరును కూడా తెలుసుకోవాలనే సూచన కనిపించింది ఆ మాటల్లో.
‘న్యాయమైన ప్రజల ఆకాంక్షల కోసం, నిరంకుశ ప్రభుత్వాల మీద పోరాడే నాయకత్వం, విశాల దృక్పథంతో తమ పోరాట కార్యాచరణను రూపొందించుకోవాలనే తాత్వికతను గాంధీజీ జీవితం నుంచి నేర్చుకోవాల్సి వున్నదన్నారు’ – ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన విషయాన్ని గుర్తు చేయడమే కాదు.. నిరంకుశ ప్రభుత్వాల మీద పోరాడాలని ప్రజలకు ఈ విధంగా పిలుపును కూడా ఇచ్చారు కేసీఆర్ పరోక్షంగా. తాము ఓడిన విధానం కూడా నిరంకుశ పాలన వల్లేననేది ఇక్కడ అప్రస్తుతం. ఆయన ఇప్పుడు జాతిపిత హోదాలో ఉపదేశమిస్తున్నాడు కాబట్టి.. ఇది కచ్చితంగా రేవంత్ పాలన గురించేననే విషయం మనమిక్కడ తెలుసుకోవాల్సిన అంశమన్నమాట.
‘ పీడితులందరినీ సమన్వయం చేసుకుంటూ, భావజాల వ్యాప్తిని చేస్తూ, శాంతియుత పోరాటంలో భిన్న వర్గాలను ఐక్యసంఘటన శక్తిగా తీర్చిదిద్దుకోవాలనే గాంధీజీ ఆశయాలను ప్రతీవొక్కరు అనుసరించాలన్నారు’- ఇదీ తెలంగాణ పోరాటం.. తన నేపథ్యాన్ని గుర్తు చేసేందుకు పడ్డ తండ్లాటగానే చూడాల్సి ఉంటుంది.
‘తెలంగాణ సాధన కోసం తాను వొంటరిగా ముందడుగు వేసిన నాటినుంచి నేటి వరకు ఎన్ని కష్టాలొచ్చినా తాను స్థిత ప్రజ్జతతో అనుసరిస్తున్న కార్యాచరణలో గాంధీజీ స్పూర్తి ఇమిడి వున్నదని కేసీఆర్ స్పష్టం చేశారు’- ఇది తన పార్టీ ఏర్పాటును కూడా తీసుకొచ్చి.. నాటి పరిస్థితులను ఓసారి ప్రజల ముందుంచడం ద్వారా ఓ పోరాట యోథుడి చరిత్రను మరవురాదని ఆయన తనకు తానుగా తెలంగాణ జాతికి ఇలా గుర్తు చేశాడని అనుకోవచ్చు.
‘విద్వేష పూరిత ప్రసంగాలను, కక్షపూరిత వైఖరులను విడనాడి, ప్రజల నడుమ శాంతి సౌభ్రాతృత్వం పరిఢవిల్లేలా పాలనను కొనసాగించడం ద్వారా మాత్రమే జాతిపిత మహాత్మాగాంధీ కి మనం నిజమైన నివాళులు అర్పించిన వారమౌతామని కేసీఆర్ పునరుద్ఘాటించారు’- ఇది కచ్చితంగా పనిగట్టుకుని మరీ రేవంత్‌ను గట్టిగానే అర్సుకునే క్రమంలో కేసీఆర్ నుంచి వచ్చిన చివరి పంచులుగా చూడాల్సే ఉంటుంది. తన పాలన ఎలా ఉండే .. ఇప్పుడెలా ఉండే.. తాను జాతిపితను నిదర్శనంగా తీసుకుని పాలించి.. జాతిపితగా కీర్తించబడాలనుకున్నాను.. కానీ పరిస్థితులు తారుమరయ్యాయనే ఆవేదన కూడా ఇందులో ఇమిడి ఉన్నట్టుగా తోస్తుంది. కాదంటారా?