BSNL Free Insurance: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) తన ఖాతాదారులకు అదిరిపోయే ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎంపిక చేసిన కొన్ని ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లపై ఉచితంగా ఇన్సూరెన్స్ సదుపాయాన్ని ప్రారంభించింది. దీనికోసం యూజర్లు రూపాయి కూడా అదనంగా ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ ప్లాన్ల ద్వారా రూ. 1 లక్ష ప్రమాద బీమాతో పాటు, రూ. 10,000 వరకు సైబర్ ఫ్రాడ్ (ఆన్‌లైన్ మోసాల) రక్షణ లభిస్తుంది.
బీఎస్ఎన్ఎల్ తన ఆవిర్భావ దినోత్సవ వేడుకల (ఫౌండేషన్ డే) సందర్భంగా ప్రముఖ ఇన్సూరెన్స్ సంస్థ ‘ది ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్’ (OICL)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా ఎంపిక చేసిన రీఛార్జ్ ప్లాన్లపై ఫ్రీ ఇన్సూరెన్స్ ఆఫర్ ను ప్రకటించింది. దీంతో పాటు బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారుల కోసం ఒక కొత్త ఓటీటీ సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తీసుకురావడం విశేషం.
ప్రస్తుతానికి ఈ ఇన్సూరెన్స్ ప్రయోజనం కేవలం రెండు ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్యాక్‌లపై మాత్రమే అందుబాటులో ఉంది. STV 202, STV 2449 ప్యాక్‌లు రీఛార్జ్ చేసుకోవడం ద్వారా ఈ ఫ్రీ ఇన్సూరెన్స్ ను పొందొచ్చు. ఈ ప్లాన్లకు సంబంధించిన వ్యాలిడిటీ, డేటా, కాలింగ్ బెనిఫిట్స్ వివరాలను యూజర్లు బీఎస్‌ఎన్‌ఎల్ ‘సెల్ఫ్‌కేర్’ (BSNL Selfcare) యాప్ లేదా అధికారిక వెబ్‌సైట్‌లో రీఛార్జ్ చేసుకునే ముందు సరిచూసుకోవచ్చని టెలికాం వర్గాలు పేర్కొన్నాయి.
ఈ ప్లాన్ల ద్వారా రూ. 1 లక్ష వరకూ ప్రమాద బీమా లభించనుంది. రోడ్డు ప్రమాదాలు, విద్యుదాఘాతం, నాగుపాము లేదా ఇతర విషపూరిత పాము కాటులు, పిడుగుపాటు, తీవ్రమైన అగ్ని ప్రమాదాల వల్ల జరిగే అనూహ్య మరణాలకు క్లెయిమ్ వర్తిస్తుంది.
రూ. 10,000 వరకు లభించే సైబర్ ఫ్రాడ్ రక్షణ పొందడానికి బీఎస్ఎన్ఎల్ కీలకమైన షరతు విధించింది. ఇందుకోసం వినియోగదారుడి బీఎస్‌ఎన్‌ఎల్ మొబైల్ నంబర్ తప్పనిసరిగా వారి బ్యాంక్ ఖాతాతో అనుసంధానమై (లింక్) ఉండాలి. ఏదైనా ఆన్‌లైన్ లేదా సైబర్ మోసం జరిగితే ఘటన జరిగిన 7 రోజుల్లోపు రిపోర్ట్ చేస్తేనే ఇన్సూరెన్స్ క్లెయిమ్‌కు అర్హత లభిస్తుంది.
ఈ ఇన్సూరెన్స్ కోసం వినియోగదారులు ప్రత్యేకంగా ఎలాంటి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. రీఛార్జ్ విజయవంతమైన 24 గంటల తర్వాత ఈ బీమా ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతుంది. సదరు రీఛార్జ్ ప్లాన్ వ్యాలిడిటీ ఎంతకాలం ఉంటే అంతకాలం ఈ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. ప్లాన్ గడువు ముగిసి మళ్లీ రీఛార్జ్ చేయకపోతే బీమా రక్షణ ఆటోమేటిగ్గా నిలిచిపోతుంది.
ప్రీపెయిడ్ వినియోగదారులకే కాకుండా భారత్ ఫైబర్ (BSNL Bharat Fibre) బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లకు కూడా బిఎస్‌ఎన్‌ఎల్ తీపి కబురు చెప్పింది. వినియోగదారులు డిస్నీ+ హాట్‌స్టార్, సోనీ లివ్, జీ5 తో పాటు పలు ప్రాంతీయ వినోద యాప్‌లతో కలిపి దాదాపు 25కి పైగా ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి తమకు నచ్చిన వాటిని ఎంచుకోవచ్చు. బీఎస్‌ఎన్‌ఎల్ ‘సినిమాప్లస్’ (CinemaPlus) పోర్టల్ ద్వారా ఈ ఎంపిక చేసుకోవచ్చు. అంతేకాకుండా ప్రతి నెలా తమకు కావలసిన ఓటీటీ యాప్‌లను మార్చుకునే వెసులుబాటు కూడా కల్పించారు.
Also Read: యాపిల్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రోజు వచ్చేసింది.. iPhone Duo సేల్ డేట్ ఇదే!
బీఎస్ఎన్ఎల్ కల్పిస్తున్న ఈ ఇన్సూరెన్స్ అనేది రీఛార్జ్ ప్లాన్‌తో వచ్చే ఒక అదనపు ప్రయోజనం మాత్రమే. ఇది పూర్తి స్థాయి లైఫ్ లేదా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీకి ప్రత్యామ్నాయం కాదు. బీమా కవర్ నిరంతరాయంగా పొందడానికి రీఛార్జ్ వ్యాలిడిటీ ముగియకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. సైబర్ రక్షణ కావాలనుకునే వారు బీఎస్‌ఎన్‌ఎల్ నంబర్‌ను బ్యాంక్ అకౌంట్‌కు లింక్ చేయడం తప్పనిసరి. ఏదైనా ఫ్రాడ్ జరిగితే 7 రోజుల్లోగా ఫిర్యాదు అస్సలు మర్చిపోకూడదు.
Also Read: Podarillu Serial Today Episode October 2nd ‘పొదరిల్లు’ సీరియల్: గోపిక మనసును మహా మారుస్తుందా..?