ఆయన రీల్ హీరోగా ఫెయిలయ్యారు. రియల్ హీరోగా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకునే క్రమంలో సక్సెసవుతున్నారు. నాన్న నుంచి నాయకత్వాన్ని అందిపుచ్చుకుని రాజకీయాల్లో రాణిస్తున్నారు. రాజకీయాల్లో తండ్రికి తగ్గ తనయుడిగా ప్రజల మనస్సులు గెలిచే ప్రయత్నం చేస్తున్నాారాయన.
ఉన్నదున్నట్టు అంటే ఊరునాకు అచ్చిరాదంటారు. కానీ ఈయన మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. తనకు ఏది కరెక్టనిపిస్తే అది అనేస్తాడు. తను మంత్రినని, కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడినట్టవుతుందనే జంకు గొంకు లేకుండా మాట్లాడేస్తారు. జెన్‌జీ శక్తికి జై కొడతారు. ఢిల్లీని నిర్బంధించిన కేంద్రం వైఖరిని కూడా తప్పుబడతారు. ప్రపంచమే తలొగ్గాలి యువత ముందు.. మనమెంత అంటూ నర్మగర్బంగా కామెంట్ చేస్తారు.
డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్నా.. మహిళలకేదీ రక్షణ అని ప్రశ్నిస్తాడు. మైనర్ బాలికల భద్రత సర్కార్‌కు పట్టదా అని నిలదీస్తారు. ఇవన్నీ చేసేది ఎవరో ప్రతిపక్ష నేత అనుకుంటే పొరపాటే. ఆయన కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్. మోడీ కేబినెట్‌లో ఉన్నా… యువశక్తిని కీర్తించడంలో వెనక్కి రావడం లేదు. కేంద్రం నిర్భంధ ఆలోచనలను విమర్శించడంలో ఏమాత్రం జంకడం లేదు. అసలు ఈ పాశ్వాన్ నేపథ్యం ఏమిటీ? తెలుసుకుందాం.
చిరాగ్ పాశ్వాన్ బీహార్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు. లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) – LJP (RV) అధ్యక్షుడు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. ఎందుకు ఈయన ఈ మధ్య వార్తల్లోకొచ్చారు? తన బీహార్ రాష్ట్రంలో శాంతిభద్రతలపై ఆయనకు తీవ్ర అసంతృప్తి ఉంది. ప్రధానంగా మహిళలపై లైంగిక దాడులు, మైనర్ అమ్మాయిలపై వేధింపుల విషయంలో ఆయన ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు.
కేంద్రం ప్రభుత్వంలో తను భాగస్వామి అయినా, కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ పాలనా వైఫల్యాలను ఆయన ఎండగట్టే విషయంలో వెనక్కి రాలేదు. దీంతో బీజేపీ పెద్దలు చెబుతూ వచ్చే డబుల్ ఇంజన్ సర్కార్.. అనే పార్టీ ప్రచార నినాదాన్ని పాశ్వాన్ ఎండగట్టినట్టు మాట్లాడారనే విమర్శలు వచ్చాయి. స్వయానా కేంద్ర మంత్రి అయివుండీ.. బీజేపీ పాలిత ప్రభుత్వాన్ని విమర్శించడం.. డబుల్ ఇంజిన్ సర్కార్ ఫెయిలయిందని పరోక్షంగా ఒప్పుకున్నట్టే అవుతుందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
అంతే కాదు మొన్నటి కాక్రోచ్ పార్టీ ఢిల్లీ జంతర్‌మంతర్ పిలుపు నేపథ్యంలో.. కేంద్రం మొత్తం నిర్బంధకాండను ప్రదర్శించడాన్ని కూడా ఆయన తిప్పికొట్టారు. యువత శక్తిని తక్కువ అంచనా వేయొద్దని పరోక్షంగా మోడీకే హితబోధ చేసినట్టుగా ఆయన కామెంట్ చేయడం కూడా చర్చకు తెర తీసింది. నిర్బంధాలు యువశక్తిని ఆపలేవని అనడం.. అంతిమ విజయం వారిదే అవుతుందనే విధంగా అర్థం వచ్చేలా మాట్లాడి వార్తల్లో నిలిచారు పాశ్వాన్.
తొలిసారిగా మంత్రి అయినా.. తనదైన స్టైల్‌ను క్రియేట్ చేసుకుంటున్నారనే ప్రసంశలు అందుతున్నాయి. మంత్రిగా ఉండి కూడా .. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నందుకు బాధగా, సిగ్గుగా ఉందని అనడం.. ఆయన ధైర్యానికి, వాస్తవ పరిస్థితులపై ఉన్నదున్నట్టుగా మాట్లాడే వైఖరికి నిదర్శనంగా చూస్తున్నారు.
రీల్ హీరోగా ఫెయిలయ్యారు పాశ్వాన్. చిరాగ్ పాశ్వాన్ రాజకీయాల్లోకి రాకముందు బాలీవుడ్ సినిమాలో నటించారు. ఆయన 2011లో విడుదలైన “మిలే నా మిలే హమ్” (Miley Naa Miley Hum) అనే హిందీ చిత్రంలో హీరోగా నటించారు. ఈ సినిమాలో ఆయన సరసన ప్రముఖ నటి (ప్రస్తుతం ఎంపీ) కంగనా రనౌత్ కథానాయికగా నటించారు. అయితే, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.
ఆ తర్వాత ఆయన సినిమా రంగానికి స్వస్తి చెప్పి, తన తండ్రి దివంగత రామ్ విలాస్ పాశ్వాన్ అడుగుజాడల్లో నడుస్తూ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ప్రవేశించారు. చిరాగ్ పాశ్వాన్ తండ్రి దివంగత రామ్ విలాస్ పాశ్వాన్ భారతీయ రాజకీయాల్లో, ముఖ్యంగా బీహార్ , దళిత రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన ఐకానిక్ నాయకుడిగా పేరు పొందారు.