తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ (ప్రివెన్షన్) బిల్లు, 2026 ..పై బీఆర్‌ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. విద్వేష పూరిత ప్రసంగాలు, మాటలు, అసౌకర్యం కలిగించే కామెంట్స్, హేట్ స్పీచులన్నీ ఈ బిల్లు పరిధిలోకి వస్తాయి. వీటిని నాన్‌బెయిలబుల్ నేరంగా పరిగణించి.. పదేండ్ల పాటు కఠిన కారాగార శిక్ష వేసే విధంగా చట్టం రూపొందించబడింది.
దీన్ని బీఆర్‌ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఓ వైపు సీఎం రేవంత్‌రెడ్డి మాట తీరు బాగాలేదు.. ఇవేం మాటలు..? అని కేటీఆర్, కేసీఆర్ సహా బీఆరెస్ నేతలంతా విమర్శిస్తూనే.. కాంగ్రెస్ సర్కార్ తేవాలనుకుంటున్న ఈ చట్టాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ చట్టం పట్ల కేటీఆర్‌కు ఉన్న ప్రధాన భయం.. తన బీఆరెస్ సోషల్ మీడియానే సర్కార్ టార్గెట్ చేస్తుందని.
ఆయన తరుచూ .. వేదికల మీదే చెబుతూ వస్తున్నాడు. ‘ఈ రోజుల్లో మెయిన్ మీడియాను ఎవడు చదువుతున్నాడు? టీవీలను ఎవరు చూస్తున్నారు? అంతా సోషల్ మీడియానే..! అందుకే నేను గత కొన్నేండ్లుగా పేపరే చదవడం లేద’ని చెబుతూ వస్తున్నాడు. అంతే కాదు.. ‘అనవసరంగా మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశాం.. అదే యూట్యూబు చానెళ్లు పెట్టుకుని ఉంటే.. గెలిచేవారమేమో..!’ అనే వెటకారపు మాటలు మాట్లాడటే కాదు… సోషల్ మీడియాను పెంచి పోషిస్తున్నాడాయన.
నెలకు కోట్లు ఖర్చు పెడుతున్నారనే అంశం బహిరంగ రహస్యమే. ఈ మీడియా ద్వారా , జర్నలిజం ముసుగులో సర్కార్‌ను ఇష్టమొచ్చినట్టు తిట్టొచ్చనేది బీఆర్‌ఎస్ పార్టీ డిసైడ్ అయినట్టుంది. అందుకే రానున్న సాధారణ ఎన్నికలకు దీన్నే ప్రధాన అస్త్రంగా వదలాలని కూడా కేటీఆర్ వ్యూహంగా ఉంది. దీన్ని గ్రహించిన రేవంత్ సర్కార్.. ఈ తెలంగాణ హేట్ స్పీచ్ బిల్లును తేవాలని భావిస్తోంది.
ఇదింకా పెండింగ్ దశలోనే ఉన్నా.. తాజాగా దీనిపై బీఆరెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో మళ్లీ ఇది చర్చకు వచ్చింది. కేటీఆర్ సైతం తన సభల్లో సీఎంను ‘అరేయ్.. హౌలా..! నువ్వు మగాడివేనా?’ అనే పరుష పదాలు వాడుతున్నాడు. ఇలాంటి స్పీచులపైనా ఈ చట్టం కింద కేసులు పెట్టే అవకాశం ఉంది. అంటే ప్రతిపక్షాల ప్రసంగాలు కూడా హద్దుల్లోనే ఉండాలన్నమాట.
మరోవైపు పేరుకు సోషల్ మీడియా.. ముసుగు జర్నలిజం.. కానీ అవన్నీ వన్‌సైడ్ తీర్పులిచ్చే రాజకీయ వేదికలు. అవతలి పక్షాన్ని తిట్టేందుకు, ఆరోపణలతో బట్టకాల్చి మీదేసేందుకు వాడుకునే మీడియా హౌజులన్న మాట. వీటిని బీఆర్‌ఎస్ ఇబ్బడిముబ్బడిగా మెయింటేన్ చేస్తున్నది. కాంగ్రెసేమీ తక్కువ తినలేదన్నట్టుగా.. తను కూడా అంత కాకున్నా కొంత ఖర్చు పెడుతోంది.. బీఆరెస్‌ను తిట్టేందుకు.
ఏపీలో ఈ సంస్కృతి మరీ విపరీతంగా ఉండే. అప్పుడు వైఎస్‌ఆర్ సీపీ సోషల్ మీడియా .. టీడీపీ, జనసేనపై విరుచుకుపడింది. అధికారంలోకి రాగానే కూటమి సోషల్ మీడియా కూడా బాగా బలపడింది. దీంతో పాటు కూటమి సర్కార్.. జగన్ టీంపై దాడులు..కేసులు పెట్టించి జైలుకు పంపడం ద్వారా ఇది కొంత కంట్రోల్‌లోకి వచ్చింది. ఇప్పుడు తెలంగాణలో ఈ సంస్కృతి పెరిగింది.
కేటీఆర్ దీనికి ఆద్యుడిగా నిలిచాడని చెప్పాలి. ఏకంగా ఇప్పుడు రేవంత్ సర్కార్ ఈ సోషల్ మీడియాను తొక్కి పెట్టేందుకు ఓ చట్టాన్నే తీసుకురావాలనుకోవడం.. తమ ఆయువుపట్టుమీద కొట్టడం లాంటిదేనని కేటీఆర్ భావిస్తున్నాడు. అందుకే ఈ చట్టం తేకుండా అడ్డుకుంటున్నాడు. కర్ణాటకలో కూడా ఇలాంటి చట్టం తేవాలని చూసినా.. అక్కడ గవర్నర్ దీన్ని పెండింగ్‌లో పెట్టేశారు. దేశంలో మరెక్కడా ఇలాంటి చట్టాలు లేవు. తెలంగాణలో ఈ బిల్లు పాసైతే.. ఎడాపెడా కేసులు, అరెస్టులే ఉంటాయి. రానున్న ఎన్నికల కాలమంతా ఇదే తంతు ప్రధానంగా జరిగే అవకాశాలున్నాయి.