ప్రధాన ప్రతిపక్ష నేత ఎవరైనా, ఎక్కడైనా ప్రజల కోసం పాదయాత్ర చేస్తారు. లేదా వారిని కలిసేందుకు కార్యక్రమాలు పెట్టుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం రివర్స్‌గా ఉంది పరిస్థితి. కేసీఆర్ ఫామ్‌హౌజ్ నుంచి బయటకు వచ్చేలా లేరని తెలుసుకుని, ఆయనే మళ్లీ సీఎం కావాలని కోరుతూ ఏకంగా దాదాపు 300 కిలో మీటర్ల మేర పాదయాత్ర చేస్తూ వచ్చారు. కేసీఆర్‌ను కలిసి ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నారు.ఇది చిన్న వార్తే కానీ, కొంచెం విభిన్నమైన వార్తగా కనిపించింది. అసలు కేసీఆర్ ఎవరికీ అవకాశం ఇవ్వడు కలిసేందుకు.
ఆయన చెప్పిన వారు మాత్రమే లోపలికి అడుగు పెడతారు. ఇక పాదయాత్ర చేసి వచ్చిన వారిద్దరితో కేసీఆర్ ఫోటోలు దిగడమే కాదు.. దీనికి సంబంధించిన ఓ ప్రెస్‌నోట్‌ను మీడియాకు రిలీజ్ చేయడం ఇంకొంచెం ఆశ్చర్యం కలిగించే అంశమనే చెప్పాలి. ముందు వార్తలోకి పోదాం..
ఆసిఫాబాద్ జిల్లా నుంచి ఎర్రవల్లి నివాసం వరకు సుమారు 300 కిలోమీటర్ల మేర పాదయాత్రగా వచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు ఇద్దరు సామాన్య అభిమానులు. కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలానికి చెందిన జాడే తిరుపతి (ఆటో డ్రైవర్) దుర్గం శంకర్ (హోటల్ కార్మికుడు) అనే ఇద్దరు గిరిజన ఆదివాసీ బిడ్డలు, కేసీఆర్ గారిపై ఉన్న అపరిమితమైన అభిమానంతో ఈ పాదయాత్ర చేపట్టారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి గారి సహకారంతో వారికి కేసీఆర్ అపాయింట్‌మెంట్ లభించింది. 11 రోజులుగా రోజుకు సగటున 25 కిలోమీటర్ల చొప్పున కాలినడకన ప్రయాణించి, గురువారం ఎర్రవల్లిలోని కేసీఆర్ గారి నివాసానికి చేరుకున్నారు.
ఇది సంక్షిప్తంగా కేసీఆర్ పీఆర్‌వో నుంచి వచ్చిన వార్త. ఎలాగూ సారు బయటకు వచ్చేలా లేడు. మనమే ఆయన వద్దకు పోదామనే అభిమానం ఓ వైపు. జనం మీద అలక వహించి ఉంటాడు.. ఇలా పాదయాత్రగా పోతే కనీసం కొంచెం కోపం పోతుందేమోననే భావన కూడా కావొచ్చు. మొత్తానికి ఓ ఇద్దరు పాదయాత్రగా వచ్చారని తెలిసీ కలిశారంటే.. నిజంగా వార్తే కదా! అంతే కాదు.. ఇంకా ఉంది…
ఎలాంటి స్వార్థం లేదా వినతిపత్రాలు లేకుండా, కేవలం “కేసీఆర్ గారు మళ్లీ ముఖ్యమంత్రి కావాలి” అనే అంకితభావంతోనే ఈ సుదీర్ఘ ప్రయాణం చేసినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ గారు వారిద్దరినీ ఆప్యాయంగా పలకరించి, వారి శ్రమను, అభిమానాన్ని ప్రశంసించారు. వారిని అభినందిస్తూ, వారి క్షేమసమాచారాలను అడిగి తెలుసుకున్నారు.
“మళ్ళా మన ప్రభుత్వం వస్తున్నది. అప్పుడు తప్పకుండా నన్ను వచ్చి కలవండి” అంటూ వారి భుజం తట్టారు.
ఇది ఫినిషింగ్ టచ్ సందేశం ఆ ప్రకటనలో. వాళ్ల అవసరాల కోసం రాలేదు అని నొక్కిచెబుతున్నాడీ పీఆర్‌వో. అది నిస్వార్ధమైన పాదయాత్రేనని క్లారిటీ ఇచ్చాడు కూడా. కేసీఆర్ మాట్లాడిన మాటలు కూడా క్రోడీకరించాడు. మళ్లీ మనమే వస్తున్నాం.. అప్పుడు వచ్చి నన్ను కలవండని ఇప్పుడే అపాయింట్ ఇచ్చేశాడు వాళ్లకు. పాదయాత్ర చేసి మరీ వచ్చారని చెప్పుకోవడం ఒక విశేషమైతే, వారితో తమ ప్రభుత్వమే వస్తుందని చెప్పి .. మళ్లీ రావాలని కూడా కోరడం మరో వార్త. చివరగా వారికి ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసి సొంత ఊరికి పంపడం కొసమెరుపు.
పాదయాత్రగా వచ్చింది ఇద్దరు. కలిశాడు. ఫోటో దిగాడు. వారితో మట్లాడాడు. మళ్లీ మనమే అన్నాడు. అప్పుడు మళ్లీ రండి అన్నాడు. సొంత వాహనం ఏర్పాటు చేసి పంపాడు. మొత్తంగా ఈ వార్త కేసీఆర్ మారిన వైఖరికి నిదర్శనంగా చూడాలా? ఓ చిన్న పాదయాత్ర ఘటనను బయటకు చెప్పుకునేంతగా కేసీఆర్ ఉత్సాహం చూపారనుకోవాలా? మేమే వస్తున్నామనే కేసీఆర్ కామెంట్స్ ప్రజలకు వెళ్లాలనే కోణమా.. ? సరే, కారణాలేమైనా.. ఇకపై ఫామ్‌హౌజ్‌కు పాదయాత్రలు స్టార్ట్ అయ్యేలా ఉన్నాయని మాత్రం అనిపిస్తోంది ఈ సంఘటన తరువాత.