AP Politics: ప్రభుత్వానికి, పోలీసులకు సవాల్ విసురుతారు. ఓ కేసులో విచారణకు రమ్మని పిలిస్తే మాత్రం కనిపించకుండా పోతారు. అసలు.. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎటు వెళ్లిపోయారు? ఎక్కడున్నారు? ఇదిలా ఉంటే.. అజ్ఞాతంలో ఉన్న మాజీ మంత్రి ఆచూకీ తెలిపిన వారికి బంపర్ ఆఫర్ అంటూ మరో మాజీ మంత్రి మాట్లాడటం నెల్లూరు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అసలు.. కాకాణి అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్లారు?
మాజీ మంత్రి కాకాణిని అరెస్ట్ చేస్తారా? లేదా?
నెల్లూరు జిల్లాలో ఇప్పుడు ఏ ఇద్దరు కలుసుకున్నా.. మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి గురించే చర్చించుకుంటున్నారట. ఆయన్ని అరెస్ట్ చేస్తారా? లేదా? అన్నదే హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే.. ఏపీ లిక్కర్ కేసులో పోలీసులకు దొరకకుండా ఇన్నాళ్లూ తప్పించుకు తిరిగిన కేసిరెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులుని సైతం అదే ఏపీ పోలీసులు అరెస్ట్ చేయగలిగారు. అలాంటిది.. మాజీ మంత్రి కాకాణిని మాత్రం ఎందుకు అదుపులోకి తీసుకోలేకపోతున్నారనేదే.. ఇప్పుడు జిల్లాలో హాట్ డిబేట్‌గా మారింది. అసలు.. నిజంగానే కాకాణి ఆచూకీ పోలీసులకు చిక్కలేదా? లేక.. అధికార పార్టీ పెద్దలెవరైనా ఆయనకు సహకరిస్తున్నారా? అనే చర్చ జోరుగా సాగుతోందట.
అక్రమ మైనింగ్ కేసులో ఏ4 నిందితుడిగా కాకాణి
మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి.. అక్రమ మైనింగ్ కేసులో ఏ4 నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో విచారణకు హాజరవ్వాలని నోటీసులిచ్చేందుకు పోలీసులు నెల్లూరులోని కాకాణి నివాసానికి వెళ్లారు. ఆయన అక్కడ లేకపోవడంతో.. నోటీసులు గోడకు అంటించి బంధువులకు సమాచారం ఇచ్చి వచ్చారు. దాంతో.. కాకాణి ఇదే కేసుపై.. హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. దానిపై విచారణ వాయిదా పడటం, ముందస్తు బెయిల్ డిస్మిస్ కావడంతో.. ప్రయోజనం లేకుండా పోయింది. హైకోర్టులోనూ చుక్కెదురైంది.
హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో గాలింపు
ఈ కేసు విషయంలో ముందస్తు చర్యలు తీసుకోలేమని చెప్పడంతో.. కాకాణి ఆలస్యం చేయకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారట. అయితే.. ఆయన ఆచూకీ కనుగొనే విషయంలో.. పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో గాలించినా ప్రయోజనం లేకుండా పోయిందట. ఇదే సమయంలో.. జిల్లా పోలీస్ బాస్ ఆరోగ్య కారణాలతో లాంగ్ లీవ్ పెట్టేసి వెళ్లిపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది.
అజ్ఞాతంలో ఉంటూనే సుప్రీంకోర్టులో బెయిల్‌కు ప్రయత్నాలు
మరోవైపు.. కాకాణి మాత్రం ఎక్కడో అజ్ఞాతంలో ఉంటూనే.. సుప్రీంకోర్టులో బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కక్షసాధింపు చర్యల్లో భాగంగానే గోవర్ధన్ రెడ్డిని వేధిస్తున్నారంటూ.. నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. కాకాణి ఫ్యామిలీ హైదరాబాద్‌లో ఉన్నప్పుడు.. నెల్లూరులోని నివాసానికి వెళ్లి నోటీసులు అంటించి పోలీసులు హడావుడి చేయడంపైనా పెదవి విరుస్తున్నారు. ఆయన ఉన్నన్ని రోజులు పోలీసులు మౌనంగా ఉండి.. ఆయన లేనప్పుడు హడావుడి చేయడమేంటని.. రివర్స్‌లో వైసీపీ నేతలు పోలీసుల తీరుపై మండిపడుతున్నారు.
కాకాణి అరెస్ట్ ఖాయమని జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ
ఏదేమైనా.. కాకాణిపై చట్టపరమైన చర్యలు తప్పవని చెబుతుండటంతో.. ఆయన అరెస్ట్ ఖాయమని జిల్లా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. మరోవైపు.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే కాకాణిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని.. ఇలాంటి ఎదుర్కొనేందుకు వైసీపీ సిద్ధంగా ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కాకాణికి, ఎమ్మెల్యే సోమిరెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో విభేదాలుండటమే.. కాకాణి అరెస్టుకు మరో కారణమని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు.. ఏదోరకంగా ఈ కేసు నుంచి బయటపడేందుకు కాకాణి గోవర్దన్ రెడ్డి గట్టిగానే ప్రయత్నిస్తున్నారట.
విచారణకు రావాలంటూ పోలీసులు 3 సార్లు నోటీసులు
అక్రమ మైనింగ్ కేసులో.. కాకాణిని ఏ4 నిందితుడిగా చేర్చిన దగ్గర్నుంచి.. ఆయన పత్తా లేకుండా పోయారని సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయ్. విచారణకు రావాలంటూ పోలీసులు 3 సార్లు నోటీసులిచ్చేందుకు వెళ్లినా ఆయన కనిపించలేదట. ముందస్తు బెయిల్ కోసం ఆయన చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయ్. ఇలాంటి పరిస్థితుల్లో కాకాణి గోవర్దన్ రెడ్డి.. అజ్ఞాతం వీడి బయటకు వస్తారా? లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు.. పోలీసులు సైతం కాకాణి కోసం విస్తృతంగా గాలించేస్తున్నారట.
Also Read: రెడ్ బుక్ చాప్టర్-1!.. పిక్చర్ అబీ బాకీహై
కాకాణి జైలుకు వెళ్లడం తప్పదంటున్న సోమిరెడ్డి
అధికారంలో ఉన్నప్పుడు.. అరెస్టులకు భయపడేది లేదన్న నాయకుడు.. ఇప్పుడు పోలీసుల విచారణ తప్పించుకొని తిరుగుతున్నాడనే చర్చ కూడా జిల్లాలో సాగుతోంది. టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అయితే.. కాకాణి పాపాలన్నీ బయటకొస్తాయని.. ఎన్నాళ్లు తప్పించుకు తిరిగినా.. జైలుకు వెళ్లడం తప్పదని గట్టిగా చెప్పేస్తున్నారు. తనపై 17 అక్రమ కేసులు పెట్టించారని ఆరోపిస్తున్నారు. కాకాణి ఆచూకీ తెలిపిన వారికి.. బహుమతులు కూడా ఇస్తామని సోమిరెడ్డి బంపర్ ఆఫర్ ఇస్తున్నారట. దాంతో.. కాకాణిని అరెస్ట్ చేస్తారా? లేక ఈ వ్యవహారం సైలెంట్‌గా ముగిసిపోతుందా? అన్నది ఆసక్తిగా మారింది.