BigTV English

Gadwal Seed Mafia: గద్వాల్ రైతులను ముంచేస్తున్న సీడ్ మాఫియా.. కాపాడాలంటే ఏం చేయాలి?

Gadwal Seed Mafia: గద్వాల్ రైతులను ముంచేస్తున్న సీడ్ మాఫియా.. కాపాడాలంటే ఏం చేయాలి?

Gadwal Seed Mafia: పాలమూరు జిల్లా వ్యవసాయానికి అనువైన ప్రాంతం. ఇక్కడ ఉత్పత్తి చేసిన విత్తనాలు దేశంలోని వివిధ రాష్ట్రాలకు సరఫరా అవుతాయి. ఇందులో ప్రధానమైన సీడ్- పత్తి. సీడ్ ఆర్గనైజర్లు ఇచ్చే విత్తనాలతో సాగించే సీడ్ క్రాప్… రైతులకు శాపంగా మారుతోంది. సీడ్ కాటన్ పేరుతో సాగే దందా చేసే ఆర్గనైజర్లు కోట్లకు పడగలెత్తుతుంటే, పండించిన రైతులు మాత్రం అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. గద్వాల జిల్లాలో సాగే సీడ్ పత్తి దందాపై బిగ్ టీవీ స్పెషల్ రిపోర్ట్.


గద్వాల జిల్లా, ఈర్లగొండ గ్రామం

గద్వాల జిల్లా, ఈర్లగొండ గ్రామానికి చెందిన రవి కుమార్ అనే ఈ యువ రైతు.. రెండు ఎకరాల్లో పత్తి విత్తనాలను వేశారు. 6 క్వింటాళ్ల 36 కేజీలు పండింది. అయితే ఈ విత్తనాలు ఫెయిలైనట్టు చెప్పాడు ఆర్గనైజర్. తిరిగి వీరు చెక్ చేస్తే తెలిసిందేంటంటే.. ఆ విత్తనాలు బాగానే ఉన్నాయని. ఫోన్ చేసి పిలిపిస్తే.. ఆ ఆర్గనైజర్ ఇంత వరకూ పత్తా లేడు. ఇది మరో రైతు గుండె గోస. ఇంత కష్టపడి 2 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టి.. పంట వేస్తే.. ఆ పంట పీకేస్కో మాకేం సంబంధం లేదంటాడా ఆర్గనైజర్. నాకేమీ అర్ధం కావడం లేదని వాపోవడం ఈ కౌలు రైతు వంతు అవుతోంది. గద్వాల జిల్లా విత్తనోత్పత్తికి అనువైన ప్రాంతం. సీడ్ ప్రొడక్షన్ అండ్ ప్రాసెసింగ్ జిల్లాలో.. పెద్ద ఎత్తున సాగుతోంది. విత్తనోత్పత్తికి అనువైన ప్రాంతం కావడం వల్ల.. వివిధ రకాల విత్తనాలను పండిస్తారు. ఇందులో పత్తి ఎక్కువ. పత్తి విత్తనాలే జీవనాధారంగా ఇక్కడి రైతులు కాలం వెళ్లదీస్తున్నారు.


ఫేక్ సీడ్‌తో నిండా మునుగుతూన్న రైతు

కానీ సీడ్ ఆర్గనైజర్లు ఇచ్చే ఫేక్ సీడ్ నమ్మి.. రైతులు నిండా మునిగిపోతున్నారు. విత్తనోత్పత్తి ప్రక్రియలో ఏటా నాణ్యత లేని సీడ్ బయట పడుతోంది. గద్వాల కేంద్రంగా కొనసాగుతోన్న కాటన్ సీడ్ జర్మినేషన్ లో.. ప్రతి సారి లాగానే.. ఈ సారి కూడా సీడ్ లో క్వాలిలీ లేదని ల్యాబుల్లో నిర్దారణ అయ్యింది. అనేక కంపెనీల నుంచి వచ్చిన సీడ్ లో వేల క్వింటాళ్లకు పైగా నాణ్యత లేని విత్తనాలను గుర్తించారు. ఇలాంటి సందర్భాలు అనేకం. ఆర్గనైజర్లు ఇచ్చే ఫేక్ సీడ్ విత్తనాన్ని నమ్మి.. రైతులు ఎలాంటి మోసాలకు లోనవుతున్నారు. ఈ ప్రాంతంలో అధిక శాతం మంది సీడ్ ఫార్మర్స్ ఆర్గనైజర్ల చేతిలో బలై పోతున్న దృశ్యం అడుగడుగునా కనిపిస్తోంది.

ల్యాబ్ రిపోర్ట్ దాచేస్తోన్న ఆర్గనైజర్లు

ఇక్కడ సమస్య ఏంటంటే.. ల్యాబ్ లో టెస్టింగ్ పూర్తయ్యి.. సీడ్ లో ఎంత ఫెయిల్యూర్ ఉందో.. లేదో స్పష్టంగా చెప్పకుండా దాచడం.. ఇక్కడి సీడ్ మాఫియా ఫాలో అవుతున్న విధానం. 90 శాతం కన్నా తక్కువ మొలకెత్తే విత్తనాలను ఫెయిల్యూర్ సీడ్ గా పరిగణిస్తాయి ల్యాబులు. వీటిని ఉపయోగిస్తే సరైన దిగుబడి రాక రైతులు, పెట్టుబడి తోపాటు ఆదాయాన్ని సైతం కోల్పోతారు. అందువల్ల ఈ సీడ్ ను ఉపయోగించరాదన్నది ఒక రూల్. కాని ఫెయిల్యూర్ సీడ్ నే రంగు మార్చి, బ్రాండ్ పేరు, బార్ కోడింగ్ ను తగిలించి.. మార్కెట్ లోకి వదులుతుంది సీడ్ మాఫియా. నాణ్యత, గుర్తింపు లేని సీడ్ ను రైతులకు కట్టబెట్టి మోసాలకు పాల్పడుతున్నారు సీడ్ వ్యాపారులు. ప్రతి ఏటా సీజన్ ముగిసే సమయంలో అడపాదడపా దాడులు చేయటం తప్ప… అధికారులు ఫోకస్ పెట్టటం లేదన్న మాట వినిపిస్తోంది.

గద్వాలలో మూడు లక్షల ఎకరాల్లో సాగు

ఉమ్మడి పాలమూరు జిల్లాలో 13 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో మూడున్నర లక్షల ఎకరాల్లో పంట సాగవుతుంది. ఇక వానాకాలంలో మూడు లక్షల ఎకరాల్లో సాగు చేస్తారు. వీటిలో ఎక్కువగా పండించేది పత్తి, కంది, వరి. వీటిలో అధిక మొత్తంలో పండించేది పత్తి. ఈ సీడ్ వ్యాపారుల టార్గెట్ మొత్తం ఈ కాటన్ క్రాప్ మీదే ఉంటుంది. సీడ్ షేర్ లో కాటన్ రోల్ ఎక్కువ. ఈ పంటలు వేసి రైతులు తీవ్ర స్థాయిలో నష్టపోతున్నారు. సీజన్ మొదలైందంటే చాలు విత్తనాలే కాదు.. ఆలంపూర్, గద్వాల నియోజకవర్గాల్లో.. కాలం చెల్లిన ఎరువులు, పురుగు మందులు అమ్ముతున్నట్టు తేలింది. గద్వాల, మల్దకల్, ధరూర్, గట్టు మండలాల్లో నకిలీ విత్తనాలు బయట పడుతున్నాయి. ఏటా వరుస కేసులు నమోదు అవుతున్నా.. పీడీ యాక్టులు ఇప్పటి వరకూ నమోదు కావడం లేదు. ఇంత పెద్ద ఎత్తున ఫెయిల్యూర్ విత్తనాల దందా జరుగుతున్నా.. వ్యవసాయ శాఖది ప్రేక్షక పాత్రే అవుతోంది.

ఆర్గనైజర్లకు లాభం, రైతుకు నిలువెల్లా నష్టం

అక్రమ దందా సాగించే సీడ్ ఆర్గనైజర్లు, సబ్ ఆర్గనైజర్లపై ఒక నియంత్రణ అంటూ ఉండటం లేదు. నకిలీ సీడ్స్ గుర్తించినా, కేసు నమోదైనా.. ఆ కంపెనీ పేరు ఎత్తాలంటేనే భయపడి పోతుంటారు. ఎందుకో అర్ధం కాదు. ఈ మొత్తం వ్యవహారంలో దళారులు ఆర్గనైజర్లు లబ్ధి పొందుతుండగా.. పేద రైతు నిలువెల్లా నష్టపోతున్న దృశ్యం కనిపిస్తోంది. ఇంత జరుగుతుంటే గద్వాల వ్యవసాయ శాఖ నిమ్మకు నీరెత్తినట్టు కనిపిస్తోంది. మరి దీనిపై ప్రభుత్వ చర్యలేవీ? అని ప్రశ్నిస్తున్నారు రైతు సంఘాల వారు. రైతు పంట మాత్రమే కాదు.. పొలం కూడా లాగేసుకునే దందా నడుస్తోంది. దీనంతటికీ కారణమేంటి? రైతు ప్రభుత్వం పాలనలో ఒక ప్రాంత రైతాంగం ఇంతగా నష్టపోతుంటే.. అధికారులు ఏం చేస్తున్నట్టు? వీరు ఎవరికి కొమ్ము కాస్తున్నారు? ఈ ఆర్గనైజర్ వ్యవస్థ నుంచి రైతును కాపాడాలంటే ఏం చేయాలి? ఇప్పుడు చూద్దాం.

అక్కడ పంట సాగు చేసే రైతుకు.. పంపిణీ

కంపెనీలు నేరుగా ఒప్పందాలు చేసుకోవాలి- రైతులుఆర్గనైజర్లకు చెలగాటం.. రైతులకు ప్రాణ సంకటంగా మారింది పరిస్థితి. ఇక్కడ విత్తనాలను పండించి.. ఆ సీడ్ ద్వారా పంట పండించే రైతులకు ఇస్తారు. బేసిగ్గా ఆర్గనైజర్ డ్యూటీ ఇదే. అయితే ఇక్కడ లాభపడేవారు కొందరైతే.. నష్టపోయేది మాత్రం చాలా మందే. గద్వాల జిల్లాలో ఏటా 30 వేల ఎకరాల్లో పత్తి విత్తన సాగు జరుగుతోంది. దేశంలో ఎక్కువగా ఈ ప్రాంతంలోనే పత్తి విత్తన సాగు జరుగుతోంది. సీడ్ బౌల్ గా పేరున్న ఈ ప్రాంత పత్తి రైతులు ప్రస్తుతం తీవ్ర నిరాశా నిస్పృహలకు లోనవుతున్నారు.

గతంలో రైతులకు అప్పులిచ్చిన ఆర్గనైజర్లు

కంపెనీలు రాత పూర్వకంగా నేరుగా రైతులతో అగ్రిమెంట్ చేసుకోరు. మధ్యవర్తులతో మాట మాత్రంగా ఒప్పందం చేసుకుంటారు. ఇదంతా పర్యవేక్షించాల్సిన వ్యవసాయ శాఖ నిర్లక్ష్యంతో.. నష్టపోతున్నది మాత్రం రైతులే అవుతున్నారు. మాములుగా అయితే సీడ్ ఇచ్చిన ఆర్గనైజరే రైతులకు అప్పులు ఇచ్చేవాళ్లు. పంట అప్పగించిన తర్వాత అసలు, వడ్డీ పట్టుకుని మిగిలిన డబ్బు ఇచ్చేవారు. ఈసారి పంట సాగు చేశాక మధ్యలో అప్పు ఇవ్వలేమని చేతులెత్తేస్తున్నారు. దీంతో రైతు పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. ఎకరా విత్తన పత్తి సాగుకు 2 లక్షల నుంచి 3 లక్షల వరకూ ఖర్చవుతుంది. ఒక్క పంట సాగుకే ఎకరాకు యాభై వేల నుంచి లక్ష వరకూ పెట్టుబడి పెడతారు. కొందరు ఆర్గనైజర్లు రైతులకు ఇచ్చిన పత్తి విత్తన ప్యాకెట్లపై కంపెనీకి సంబంధించి పేర్లు, బార్ కోడ్ లు కనిపించవు. వారిచ్చిన విత్తనాలనే వేస్తున్నారు రైతులు. అయితే ఈ విత్తనాలు ఎలా ఫెయిలవుతున్నాయో అర్ధంకాని దుస్థితి కనిపిస్తోంది.

నకిలీ విత్తనాల మూలాలు గద్వాలలోనే

గద్వాల సీడ్ మాఫియా మూడు పువ్వులు- ఆరుకాయలుగా విస్తరిస్తోంది. నియంత్రించాల్సిన ప్రభుత్వ అధికారుల కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ఎక్కడ నకిలీ విత్తనాలు పట్టుబడ్డా.. దాని మూలాలు.. గద్వాల జిల్లాలోనే తేలుతున్నాయి. వర్షాకాలంలో వందలాది మంది సీడ్ ఆర్గనైజర్లు, వేలాది మంది సబ్ ఆర్గనైజర్లు ఇతర జిల్లాలలతో పాటు రాష్ట్రాలకు సైతం విత్తనాలు సరఫరా చేసి కోట్లు సంపాదిస్తున్నారు. జిన్నింగ్ మిల్లులు, ప్రాసెసింగ్ యూనిట్లు, సీడ్ షాపులే కేంద్రంగా ఎక్స్ పైరీ విత్తనాలు, నాసిరకం విత్తనాలు, డుప్లికేట్ ప్యాకింగ్ గల విత్తనాలు, అనుమతుల్లేని విత్తనాలు లభ్యమవుతున్నాయి. నవంబర్ నుంచి జూన్ వరకూ సాగే ఈ వ్యాపారంలో టన్నుల కొద్దీ విత్తన వ్యాపారం సాగుతుంది. ఈ అక్రమ వ్యాపారానికి ఇటు అధికారులే కాదు అటు ప్రజాప్రతినిథులు సైతం కొమ్ము కాస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో వీరి దందాకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. బడా వ్యాపారులను వదిలేసే అధికారులు చిరు వ్యాపారులపై ప్రతాపం చూపిస్తారు.

బడా వ్యాపారులపై నమోదు కాని కేసులు

విత్తన చట్టాన్ని ఉల్లంఘించి కల్తీ విత్తనాలను అమ్మి సొమ్ము చేసుకుంటున్న బడా సీడ్ వ్యాపారుల జోలికి ఎవరూ పోవడం లేదు. కొందరిపై నామ మాత్రపు కేసులు పెట్టి వదిలేస్తారు. దీన్నిబట్టీ ఇక్కడ సీడ్ మాఫియా జోరు ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. నకిలీ విత్తనాలు గ్రామ గ్రామాలకు విస్తరించాయి. అడపాదడపా టాస్క్ ఫోర్స్ దాడులు జరుగుతున్నా.. బడా వ్యాపారులపై ఎంత మాత్రం కేసులు నమోదు కావడం లేదు. ఇప్పటి వరకూ ఎన్ని సార్లు పట్టుబడ్డా కంపెనీలపై కనీసం చర్యలు తీసుకోవడం లేదు. రాజకీయ పలుకుబడితో నకిలీ విత్తన దందా చేస్తున్న వీరివైపు చూడాలంటేనే హడలెత్తిపోతున్నారు అధికారులు.

పొలాల అప్పు కింద రాయించుకుంటోన్న కొందరు

రైతు ఎప్పుడూ తన పంట నాశనం కావాలని కోరుకుడు. కానీ దిగుబడి లేక పంట తగలబెట్టుకుంటున్న ఘటనలు అనేకం. ఈ విషయం బయట పడకుండా జాగ్రత్త పడుతుంటారు ఆర్గనైజర్లు. విత్తనాలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? ఇందుకు కారణమెవరు? ఈ విషయంలో తగిన న్యాయం జరగాలని వాపోతున్నారు రైతన్నలు. అయితే ఈ విత్తన మాఫియా రైతులపై బెదిరింపులకు పాల్పడుతున్నట్టు కనిపిస్తోంది. ఒక వేళ వినకుంటే కేసులు పెట్టి వేధిస్తున్నారు. తమ దగ్గర పొలాలను అప్పు కింద రాయించుకుని.. రైతులను వేధింపులకు లోను చేస్తున్నట్టు తెలుస్తోంది.

Also Read: ఉత్కంఠ రేపుతోన్న గులాబీ నేతల సైలెంట్

చూశారుగా ఈ రైతులు ఎంత దీనంగా కన్నీటి పర్యంతమవుతున్నారో. అంతగా ఇక్కడి రైతులు ఆగమాగం అవుతున్నారు. తమ ఆక్రందన ఇకనైనా ప్రభుత్వం పట్టించుకోవాలని.. వేడుకుంటున్నారు వీరు. అంతే కాదు రైతు పై జరుగుతోన్న ఈ దౌర్జన్య కాండ పూర్తిగా సమసిపోవాలంటే ఆర్గనైజర్ వ్యవస్థ పోవాలని.. నేరుగా కంపెనీలే మాతో ఒప్పందం చేసుకునేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు ఇక్కడి పత్తి రైతులు.

Related News

Yellandu Politics: ఇల్లందులో మాజీ ఎమ్మెల్యే హరిప్రియ పెత్తనంపై వ్యతిరేకత..

Congress: కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య గ్యాప్ వచ్చిందా..?

Srikakulam Politics: దువ్వాడ కుల రాజకీయం

KCR: కేటీఆర్ కామెంట్స్.. బీఆర్ఎస్ ఫ్యూచర్ ఏంటో?

BC Reservations: స్థానిక సంస్థల ఎన్నికలు.. కాంగ్రెస్‌లో కొత్త టెన్షన్..

Bigg Boss AgniPariksha E3 Promo1: ఎమోషన్స్ తో చంపేస్తున్న సామాన్యులు.. వర్కౌట్ అవుతుందా?

Big Stories

×