Telangana News: గూడెం మహిపాల్ రెడ్డి.. ప్రస్తుతం అధికార కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ఎమ్మెల్యే. అయినాసరే.. అధికార పార్టీ నాయకులే ఆయనపై అప్పుడప్పుడు అగ్గిమీద గుగ్గిలం అవుతుంటారు. కానీ.. ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు మాత్రం ఆయన్ని ఒక్క మాట అనాలంటే.. అమ్మబాబోయ్ అంటున్నారట. అసలు.. అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేకి.. ప్రతిపక్ష పార్టీ నేతలతో కాకుండా అధికార పార్టీ వారితోనే తలనొప్పి ఎందుకు ఎక్కువైంది? పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పొలిటికల్‌గా సేఫ్ ఆడుతున్నారా? ఎవరైనా ఆడిస్తున్నారా?
బీఆర్ఎస్ తరపున 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపు
హ్యాట్రిక్ విక్టరీతో.. పటాన్‌చెరు నియోజకవర్గం గులాబీ పార్టీకి అడ్డాగా మారింది. గూడెం మహిపాల్ రెడ్డి.. బీఆర్ఎస్ తరఫున వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే.. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో.. ఆయన కారు దిగి కాంగ్రెస్ హస్తాన్ని అందుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పార్టీ మారడంతో.. హైకమాండ్ లోకల్ క్యాడర్‌కి భరోసానిచ్చే ప్రయత్నం చేసింది. ఎమ్మెల్యేతో ఆయన ముఖ్య అనుచరగణం కాంగ్రెస్‌లో చేరగా.. కట్టర్ బీఆర్ఎస్ కార్యకర్తలు మాత్రం పార్టీలోనే ఉన్నారు.
బీఆర్ఎస్ కో-ఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి నియామకం
అయితే.. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పార్టీ మారడంతో.. నియోజకవర్గంలో బీఆర్ఎస్‌కు పెద్ద దిక్కు లేకుండా పోయింది. దాంతో పటాన్‌చెరు బీఆర్ఎస్ కో-ఆర్డినేటర్ పోస్టు కోసం ద్వితీయ శ్రేణి నాయకులు పోటీ పడుతూ వచ్చారు. ఎట్టకేలకు.. బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశాల్లో.. ఆదర్శ్ రెడ్డిని కో-ఆర్డినేటర్‌గా నియమించారు గులాబీ దళపతి కేసీఆర్.
ఆదర్శ్ రెడ్డి నియామకంతో కొందరు నేతలు అసంతృప్తి
పటాన్‌చెరు బీఆర్ఎస్ కో-ఆర్డినేటర్‌గా ఆదర్శ్ రెడ్డిని నియమించడాన్ని కొందరు స్వాగతిస్తే.. ఆ పోస్టుపై ఆశపడ్డ ఇంకొందరు గులాబీ నేతలు అసంతృప్తికి లోనయ్యారు. ఇదంతా.. బీఆర్ఎస్‌లో జరుగుతున్న వ్యవహారం. కానీ.. ఇంటర్నల్ పాలిటిక్స్ మాత్రం మరోలా ఉన్నాయట. పార్టీ మారిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిపై.. లోకల్ బీఆర్ఎస్ లీడర్లు, క్యాడర్ ఆగ్రహంతో ఉన్నారట. ఇంతటి వ్యతిరేకత సమయంలోనూ కష్టపడి గెలిపిస్తే.. పార్టీ అధికారానికి దూరమవగానే.. మహిపాల్ రెడ్డి పార్టీ మారడమేంటని ఫైర్ అవుతున్నారు.
అధికార పార్టీ నేతలతో సఖ్యతగా లేని ఎమ్మెల్యే మహిపాల్
ఇప్పుడు.. ఈ ఫైర్ మీదే అధిష్టానం నీళ్లు చల్లుతోందట. ప్రస్తుతం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కానీ.. ఆయన అధికార పార్టీలో నేతలతో ఎవరితోనూ సఖ్యతగా ఉండటం లేదు. పైగా.. ఇటీవల సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో జరిగిన వాదనల్లోనూ.. గూడెం మహిపాల్ రెడ్డి తాను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని కాదనే వివరణ ఇచ్చుకున్నారట. దాంతో.. మహిపాల్ రెడ్డి చూపు మళ్లీ గులాబీ పార్టీ వైపు మళ్లిందనే సంకేతాలు.. బీఆర్ఎస్ హైకమాండ్‌కి చేరిందట.
మహిపాల్‌ను పల్లెత్తు మాట అనొద్దని అధిష్టానం ఆదేశాలు!
దాంతో.. మహిపాల్‌ను.. పల్లెత్తు మాట కూడా అనొద్దని.. స్థానిక బీఆర్ఎస్ నేతలకు.. అధిష్టానం ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. కావాలంటే.. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయండి గానీ.. మహిపాల్ రెడ్డిని మాత్రం ఏమీ అనకండి అని.. బీఆర్ఎస్ నాయకత్వం చెప్పిందనే ప్రచారం సాగుతోంది. అయితే.. హైకమాండ్ నిర్ణయంపై.. పటాన్‌చెరు బీఆర్ఎస్ క్యాడర్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయట. కొందరు సరే అంటే.. ఇంకొందరు సారీ అంటున్నారట.
Also Read: రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి అరెస్ట్?
ఆదర్శ్ రెడ్డి పాదయాత్ర ముగింపు సభకు హరీష్ రావు
ఆదర్శ్ రెడ్డి నియోజకవర్గ కో-ఆర్డినేటర్‌గా ఎన్నికైన తర్వాత.. పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్ర ముగింపు సభకు మాజీ మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. దీంతో.. అంతా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పిస్తారని అనుకుంటే.. హరీశ్ అసలు ఆయన ఊసే ఎత్తకపోవడంతో పార్టీ నాయకులు నిరాశకు లోనవుతున్నారట. ఇతర నియోజకవర్గాల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు..
బీఆర్ఎస్ హైకమాండ్‌కు.. మహిపాల్ రెడ్డిపై ఉన్న లెక్కేంటి?
లోకల్ బీఆర్ఎస్ క్యాడర్ తలనొప్పులు తెప్పిస్తుంటే.. ఇక్కడ మాత్రం పూలపాన్పు వేయడాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారట. అసలు.. బీఆర్ఎస్ హైకమాండ్‌కు.. మహిపాల్ రెడ్డిపై ఉన్న లెక్కేంటి? అన్నదే ఎవ్వరికీ అర్థం కావట్లేదు. ఈ సాఫ్ట్ కార్నర్ ఇంకెన్నాళ్లు ఉంటుంది? ఇదిలాగే కొనసాగుతుందా? లేక.. సమయం వచ్చినప్పుడు ఆయనపై స్వరం పెంచుతారా? అన్నది ఆసక్తి రేపుతోంది.