Heavy Rains: నైరుతి రుతుపవనాలు చురుకుగా ముందుకు కదులుతున్నాయి. వచ్చే 4నుంచి5 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు.. దక్షిణ, మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో విస్తరించే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశముందని, ఆ తర్వాత అల్పపీడనంగా మారవచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉత్తరకోస్తా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడా వర్ష సూచనలు ఉన్నాయని తెలిపారు వాతావరణశాఖ అధికారులు.
రాష్ట్రంలో ప్రస్తుతం భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఉదయం అంతా ఎండగా ఉంటూ.. సాయంత్రం ఈదురుగాలులతో వర్షాలు పడుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు చేరింది. కుండపోత వర్షానికి వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ప్రధాన కూడళ్లలో స్వల్పంగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. మరో నాలుగు రోజులు ఇదే పరిస్థితి కొనసాగనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర-దక్షిణ ద్రోణి కారణంతో వర్షాలు కురవనున్నాయి. ఈరోజు తేలిక పాటి నుంచి మోస్తరుగా.. కొన్ని జిల్లాలలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
రాబోయే మూడు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదు అయ్యే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. రేపు ఎల్లుండి ఈదురు గాలులతో పాటు వర్ష తీవ్రత పెరిగే ఛాన్స్‌తో పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్స్ జారీ చేశారు.
దేశంలో ఎల్‌నినో పరిస్థితులు తొలిగాయని.. భారత వాతావరణ శాఖ తెలిపింది. ఎల్‌నినో కారణంగా ప్రతి సీజన్‌లు లేటుగా వస్తాయి. సాధారణ రోజుల్లోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఎల్‌నినో పరిస్థితులు లేవని ఐఎండీ ప్రకటించింది. ఈ ఏడాది నాలుగు రోజులు ముందుగానే.. నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నాయి. ఈ నెల 27న కేరళలోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. గతేడాది ఐఎండీ అంచనాకంటే ముందుగానే.. రుతుపవనాలు దేశంలోకి ఎంటర్ అయ్యాయి. గతేడాది మే 31న రుతుపవనాలు తాకుతాయని ఐఎండీ అంచనా వేయగా.. ఒకరోజు ముందుగానే ఎంట్రీ ఇచ్చాయి. మొదటగా ఈ నెల 13వ తేదీన అండమాన్‌ను తాకనున్నాయి.
Also Read: గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం.. మొత్తం ఎన్ని కిలోలు దొరికిందంటే..
ఈ ఏడాది సాధారణ వర్షపాతం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు దాదాపు 105 శాతం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా హైదరాబాద్‌కి ఈ ఏడాది అధిక వర్షపాత సూచన ఉన్నట్లుగా తెలుస్తోంది. సిటీలో వరదలు వచ్చేంత తీవ్రతతో.. వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.