Gudivada Amarnath: మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి లక్కీగా మినిస్టర్ పదవి కూడా నిర్వహించిన గుడివాడ అమర్‌నాథ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో హాట్‌టాపిక్‌గా మారారు. వాలంటీర్లను టార్గెట్ చేస్తూ అమర్‌నాథ్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. వాలంటీర్లే పార్టీకి పెట్టని కోటగా వైసీపీ అధ్యక్షుడు జగన్ భావిస్తుంటే.. ఆ వాలంటీర్ల వల్లే ఓడిపోయామని అమర్‌నాథ్ వ్యాఖ్యానించడం కలకలం రేపుతోంది. గత ఎన్నికల్లో గాజువాక నుంచి అత్యధిక ఓట్ల తేడాతో పరాజయం పాలై రికార్డు సృష్టించిన మాజీ మంత్రి తమ ఓటమికి కారణాల్ని వాలంటీర్లపైకి తోసేస్తున్నారు. పార్టీకి కార్యకర్తలను వాలంటీర్లు దూరం చేశారని.. వారి వల్లే వైసీపీ పరాజయం పాలైందని అమర్‌నాథ్ విశ్లేషిస్తుండటం తీవ్ర విమర్శలపాలవుతోంది
ఓటమికి రకరకాల కారణాలు వెతుక్కుంటున్న వైసీపీ నేతలు
తమ ఘోరపరాజయానికి వైసీపీ నేతలు కొత్తకొత్త కారణాలు వెతుక్కుంటున్నారు. తమ ఓటమికి పార్టీ విధానాలు, పాలనలో చేసిన తప్పిదాలు కారణం కాదని… తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నియమించిన వాలంటీర్ వ్యవస్ధ వల్ల ఓడిపోయామని విచిత్రమైన కామెంట్స్ చేస్తున్నారు. ఏ వ్యవస్ధ అయితే తమ బలం అని మాజీ ముఖ్యమంత్రి జగన్ నమ్మకం పెట్టుకున్నారో… అదే వ్యవస్ధ వల్ల ఘోర ఓటమిని చవిచూశామని నాయకులు మధనపడుతున్నారు. అందుకు నిదర్శనంగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తాజాగా చేసిన కామెంట్స్ నిలుస్తున్నాయి
వాలంటీర్ల కారణంగా పార్టీకి క్యాడర్ దూరమైందని విమర్శ
తాజాగా తమ ఓటమికి కారణాల్ని గుడివాడ అమర్‌నాథ్ సరికొత్తగా చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వంలో తీసుకొచ్చిన వలంటీర్ల వ్యవస్థే తమను దెబ్బ తీసిందని.. వారే ఎన్నికల్లో తమ పార్టీ ఓడేందుకు కారణమయ్యారని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వంలో ప్రజలకు.. వాలంటీర్లు.. సచివాలయ సిబ్బంది ద్వారా ఎన్నో సంక్షేమ పథకాల్ని అందించామని.. కానీ అదే వాలంటీర్లు పార్టీకి కార్యకర్తల్ని దూరం చేసి తాము ఓడిపోయేందుకు కారణమయ్యారని విమర్శించారు. ఎన్నికల్లో తమకు ఉపయోగపడతారనుకుంటే.. రాజీనామాలు చేయకుండా అటూఇటూ కాకుండా మిగిలిపోయారని జగన్ ఎంతో నమ్మకం పెట్టుకున్న వాలంటీర్ వ్యవస్థను తీవ్రస్థాయిలో టార్గెట్ చేశారు
అనకాపల్లి నుంచి తొలిసారి గెలిచి మంత్రి అయిన గుడివాడ
ఏపీలో ఎన్నికల ఫలితాలు వెలువడి దాదాపు ఏడాది పూర్తవుతోంది. 2019 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా పనిచేసిన గుడివాడ అమర్‌నాథ్‌ను గత ఎన్నికల్లో జగన్ గాజువాకకు షిఫ్ట్ చేశారు. చివరి నిముషం వరకు పోటీ చేసే సెగ్మెంట్ ఏదో తెలియక గందరగోళానికి గురైన అమర్‌నాథ్ గాజువాకలో 95 వేల పైచిలుకు ఓట్ల తేడాతో పరాజయం పాలై రాష్ట్రంలో రికార్టు సృష్టించారు. తర్వాత విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమితులైన ఆయన్ని జగన్ తిరిగి అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా షిఫ్ట్ చేశార. అలాంటాయన ఇప్పటికీ తమ ఓటమికి కారణాల్ని అన్వేషించే పనిలోనే ఉన్నారు. తమ ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాల్ని అమలు చేశామని, అయినా వాలంటీర్ల వ్యవస్థ కారణంగా ఓడిపోయామని నెపాన్ని వారిపైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
Also Read: ఆదిమూలంకు షాక్.. సత్యవేడులో టీడీపీకి కొత్త ఇంచార్జి?
తమది గెజిటెడ్ ఉద్యోగంలా వాలంటీర్లు వ్యవహరించారని సెటైర్లు
తాజాగా అనకాపల్లిలో వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన గుడివాడ అమర్‌నాథ్ .. ఎన్నికల సమయంలో వాలంటీర్లు రాజీనామా చేస్తే.. అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి తీసుకుంటామని చెప్పినా చాలామంది ముందుకు రాలేదన్నారు. కొంతమంది తమది గెజిటెడ్ ఉద్యోగం అన్నట్లుగా వ్యవహరించారన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే వాలంటీర్లను తీసేస్తారని చెప్పినా వినలేదన్న ఆయన.. మొత్తంగా వాలంటీర్ల వల్లే తాము అధికారాన్ని కోల్పోయామని తెగ ఫీలై పోతున్నారు. రానున్న రోజుల్లో పార్టీలో కార్యకర్తలకు పెద్దపీట వేస్తామంటున్న గుడివాడ అమర్‌నాథ్ మున్ముందు తమ ఓటమిపై ఇంకేం కారణాలు చెపుతారో చూడాలి.