BigTV English

TG Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం.. కేసీఆర్ మైండ్ గేమ్

TG Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం.. కేసీఆర్ మైండ్ గేమ్

TG Politics: బీసీలను మభ్యపెట్టడానికి గులాబీ పార్టీ మైండ్ గేమ్ స్టార్ట్ చేసిందా?.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై అందుకే వాయిస్ పెంచుతోందా? నిజంగానే రిజర్వేషన్లపై రాష్ట్రపతిని బీఆర్ఎస్ కలుస్తుందా? పార్టీ అధినేత కేసీఆర్ ఆ టీంలో ఉంటారా?.. నిజంగా గులాబీ బాస్ ఢిల్లీ వెళ్తే బీసీల్లో బీఆర్ఎస్‌కు మైలేజ్ పెరిగే అవకాశముందని… బీసీలు దగ్గరయ్యే ఛాన్స్ ఉందని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. లేకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ నిరాశే ఎదురవుతుందంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ పై పట్టుపడతామని పార్టీ నేతలు ప్రకటించిన నేపధ్యంలో కేసీఆర్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతోంది?


బీసీల రాగం అందుకున్న గులాబీ పార్టీ

బీఆర్ఎస్ పార్టీ మైండ్ గేమ్ స్టార్ట్ చేసింది. బీసీల రాగం అందుకోవడంతో పాటు రిజర్వేషన్ల సాధనే లక్ష్యమని ముందుకు సాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వారి ఓట్లే లక్ష్యంగా పావులు కదపాలని చూస్తోంది. ఆ క్రమంలో బీసీలకు రిజర్వేషన్ల కల్పనపై రాష్ట్రపతిని ఢిల్లీలో కలుస్తామని, పార్టీ అధినేత కేసీఆర్ సైతం వస్తారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ బీసీ రిజర్వేషన్ల పోరు బాటలోకి కేసీఆర్ ఎంట్రీ ఇస్తారా? రాష్ట్రపతిని కలుస్తారా? కేవలం బీసీ వర్గాలను ఆకర్షించేందుకు కేసీఆర్ ప్రకటనలు చేయిస్తున్నారా? అన్నది చర్చనీయాంశంగా మారింది


స్థానిక సంస్థల ఎన్నికల కోసం మైండ్ గేమ్ మొదలెట్టారా?

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిజంగా హస్తినలో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్దమైతే బీసీలో మైలేజ్ పెరుగుతుందని గులాబీశ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. రాజకీయంగా కాంగ్రెస్, బీజేపీలను ఇరుకున పెట్టి రెండు జాతీయ పార్టీలను బీసీల విషయంలో బూచిగా చూయించవచ్చని అంటున్నాయి. అయితే స్థానిక సంస్థల ఎన్నికలను టార్గెట్ చేసుకునే ఆయన మైండ్ గేమ్ మొదలెట్టారా? అన్న చర్చ కూడా జరుగుతోంది. ఇంతకు అసలు ఢిల్లీకి కేసీఆర్ వెళ్తారా లేకుంటే బీసీలను మభ్యపెట్టి విదిలేస్తారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

హాట్‌టాపిక్‌గా మారిన బీసీలకు 42% రిజర్వేషన్ల ప్రక్రియ

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం బీసీలకు 42% రిజర్వేషన్ల ప్రక్రియ హాట్ టాపిక్ గా మారింది. అత్యధిక జనాభా ఉన్న బీసీ వర్గాల ప్రజల ఓట్లే లక్ష్యంగా రాజకీయ పార్టీలు ఇప్పటికే తమతమ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. రాష్ట్రంలో సెప్టెంబర్ 30లోపు స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని హైకోర్టు డెడ్ లైన్ విధించింది. ఈ నేపథ్యంలోనే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చింది. అసెంబ్లీలో బీసీ బిల్లు ఆమోదించి కేంద్రానికి పంపించింది. పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లు పెట్టాలని, కేబినెట్ ఆర్డినెన్సుపై రాష్ట్రపతి సంతకం చేయడంతో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలనే లక్ష్యంతో హస్తినలో కాంగ్రెస్ పోరుబాట నిర్వహించింది.

బీజేపీ కూడా బీసీలను పట్టించుకోవట్లేదని విమర్శలు

కాంగ్రెస్ తీరుపై గులాబీ పార్టీ మండిపడుతోంది. 20 నెలలుగా జాప్యం చేస్తూ ఇప్పుడు పోరుబాట చేయడమేంటనీ బీఆర్ఎస్ విమర్శలు ఎక్కుపెట్టింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా బీసీలను పట్టించుకోవట్లేదని.. ఆ క్రమంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలే టార్గెట్ గా కేసీఆర్ తో యాక్షన్ ప్లాన్ చేశారని గులాబీ నేతలు పేర్కొంటున్నారు. బీసీ రిజర్వేషన్ల సాధనకై హస్తినకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పాటు ముఖ్య నేతలంతా పోరుబాట పట్టేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం ఊపందుకుంది. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పై ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నాలను ఇప్పటికే ముమ్మరం చేసింది. ఇప్పటికే కాంగ్రెస్ తెచ్చిన ఆర్డినెన్సు ద్వారా కాకుండా చట్టబద్దంగా రిజర్వేషన్ల సాధనకై ఇందిరా పార్క్ వద్ద బీసీ ధర్నా నిర్వహించింది. ఆ ధర్నాతో కాంగ్రెస్ పై ఒత్తిడి తీసుకురావడంలో సక్సెస్ అయ్యామని బీఆర్ఎస్ భావిస్తోంది. దీంతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ మద్దతుదారుల గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ అయినా బీఆర్ఎస్ బీసీ రిజర్వేషన్ల అంశాన్ని రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం ముమ్మరం చేస్తోంది.

ఆర్డినెన్స్ పేరుతో కాంగ్రెస్ బీసీలోను మోసం చేస్తుందని విమర్శలు

ఒకవైపు బీసీ రిజర్వేషన్ల బిల్లు, ఆర్డినెన్సులను మతకోణంలో ఫోకస్ చేస్తూ ముస్లింలకు బీసీ రిజర్వేషన్లలో వాటా ఎందుకని బీజేపీ ప్రశ్నిస్తూ అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ సయితం ఆర్డినెన్సు పేరుతో ఢిల్లీలో డ్రామాలు చేస్తూ బీసీలను మోసం చేస్తుందని, దీంతో రెండు పార్టీల నిజస్వరూపాన్ని బయటపెట్టాలని గులాబీ పార్టీ స్కెచ్ గీస్తోందంటున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలే టార్గెట్ గా కేసీఆర్ ను హస్తినకు తీసుకెళ్ళాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. ఫాంహౌస్ లో కేసీఆర్ తో ఈ మధ్యకాలంలో కేటీఆర్, హరీష్‌తో పాటు బీసీ సీనియర్ నేతలు బేటీ అయి చేసిన విజ్ఞప్తికి ఆయన సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.

కేసీఆర్‌తో కలిసి రాష్ట్రపతిని కలిస్తేమైలేజ్ వస్తుందనా?

కేసీఆర్‌తో కలిసి రాష్ట్రపతిని కలిస్తే పార్టీకి మైలేజ్ వస్తుందని, రాబోయే ఉప ఎన్నికలు , స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గ ప్రజలకు పార్టీ మరింత దగ్గరయ్యే సువర్ణావకాశం ఉంటుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. మెజార్టీ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఆ క్రమంలో కేసీఆర్ హస్తిన టూర్ ఇటు పార్టీలో అటు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మరోవైపు అసలు కేసీఆర్ హస్తిన టూర్ కు వెళ్తారా? లేదా? అనేది కూడా చర్చకు దారితీసింది. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైన దగ్గర నుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తినకు వెళ్లలేదు. ఆఖరికి కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కాంలో తీహార్ జైల్లో నెలల తరబడి ఉన్నా పరామర్శించడానికి ఫ్లైట్ ఎక్కలేదు. ఢిల్లీ పెద్దలు ఎవరిని కలిసిన దాఖలాలు లేవు. ప్రజాసమస్యలపై ఉద్యమబాట పట్టిన సందర్భాలు లేవు. కేవలం అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో ప్రచార సభల్లో పాల్గొన్న కేసీఆర్.. ఆ తర్వాత వరంగల్ సభలో పాల్గొన్నారు. శాసనసభకు కూడా హాజరు కోసం వచ్చి వెళ్లిపోయారు. తన ఫాంహౌస్‌లో పార్టీ నేతలతో భేటీలకే పరిమితం అయ్యారు.

కేసీఆర్ ఎంట్రీతో బీసీ రిజర్వేషన్ల ప్రక్రియలో కదలిక వస్తుందా?

ప్రభుత్వంపై పెద్దగా విమర్శలు గుప్పించిన దాఖలాలు లేవు. పోరాట బాటపట్టిన దాఖలాలు లేవు. అయితే ఇప్పుడు బీసీ రిజర్వేషన్లపై కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతిని కలుస్తారా? లేదా? అనేది హాట్ టాపిక్ అయింది. అధినేత వెళ్తే పార్టీ కేడర్ లో మరింత జోష్ పెరగడంతో పాటు రాబోయే ఉప ఎన్నిక , స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి లాభం చేకూరుతుందని పలువురు నేతలు బహిరంగంగానే పేర్కొంటున్నారు. ఈ తరుణంలో బీసీ రిజర్వేషన్లపై పోరాటం చేసి సాధిస్తారా? కేసీఆర్ ఎంట్రీతో బీసీ రిజర్వేషన్ల ప్రక్రియలో కదలిక వస్తుందా?..లేదా అనేది వేచి చూడాలి.

Also Read: నాగార్జున సాగర్‌కు పోటెత్తిన వరద.. 22 గేట్లు ఎత్తివేత

అదలా ఉంటే రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ తిరిగి బీఆర్ఎస్ ను ఇరకాటంలో పెట్టే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇప్పటికే విమర్శలకు పదును పెట్టింది. పదేళ్లుగా కుటుంబ , ఫాంహౌస్ పాలనలో బీసీ రిజర్వేషన్లు గుర్తుకు రాలేదా కనీసం బీసీలను గౌరవించి చట్టసభలకు పంపించాలనే సోయి లేదా? అంటూ కాంగ్రెస్ ఎదురుదాడి చేస్తోంది.. దానికి బీఆర్ఎస్ గత పదేళ్లలో అనేకమంది బీసీ బిడ్డలకు సముచిత స్థానం ఇచ్చాం, బీసీ కులాలను, కులవృత్తులను ప్రోత్సహించేందుకు అనేక కార్యక్రమాలు చేశాం అంటూ కాంగ్రెస్ కు కౌంటర్ ఇస్తోంది. హస్తినాలో రిజర్వేషన్లపై 3 రోజుల పాటు ధర్నా సైతం చేపట్టామంటోంది. కేంద్రం నాన్చుడు ధోరణి అవలంభిస్తుందని విమర్శలు గుప్పిస్తుంది. మరి చూడాలి బీసీ అంశం ఏ పార్టీకి మైలేజ్ ఇస్తుందో?

Story By Rami Reddy, Bigtv

Related News

BJP Leaders Fights: డీకే అరుణ Vs శాంతి కుమార్.. పాలమూరు బీజేపీలో పంచాయితీ

Tirupati TDP: తిరుపతిలో టీడీపీకి దిక్కెవరు?

India-China Thaw: భారత్‌‌‌‌తో చైనా దోస్తీకి సై.. రెండు దేశాల మధ్య ఏం జరుగుతోంది?

Giddalur Politics: గిద్దలూరు వైసీపీలో అయోమయం.. నాగార్జున ఫ్యూచర్ ఏంటి?

Pakistan Army: పాక్ పరేషాన్ ఫోర్స్..! చైనా సపోర్ట్‌‌తో మునీర్ కొత్త ప్లాన్..?

Big Stories

×